Kothagudem constituency
-
బీఆర్ఎస్లో బిగ్ ట్విస్ట్.. వనమా సంచలన కామెంట్స్
సూపర్‌బజార్ (కొత్తగూడెం): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలోనూ తానే పోటీ చేస్తానని, ఇక్కడి ప్రజల నుంచి తనను ఎవరూ విడదీయలేరని వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కాగా, ఆయన పదవి విషయంలో సుప్రీంకోర్టు నుంచి స్టే లభించిన అనంతరం తొలిసారి గురువారం ఆయన కొత్తగూడెంకు రాగా, జూలూరుపాడు వద్ద ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్తగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ, దేవుడి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో పాటు కార్యకర్తలు, ప్రజల అండతో తనకు అంతా మంచే జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల కోసం నేటి నుంచే కార్యాచరణకు దిగుతానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారని, జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటానని అన్నారు. ర్యాలీగా సందడి.. ఇక, కొత్తగూడెం వచ్చిన వనామా.. మొదట జూలూరుపాడు సాయిబాబా ఆలయంలో, ఆ తర్వాత సుజాతనగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి ప్రధాన సెంటర్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యానగర్ కాలనీ, పోస్టాఫీస్ సెంటర్లో వనమాకు క్రేన్‌తో భారీ గజమాల వేశారు. ప్రదర్శనకు ముందు గిిరిజన సంప్రదాయనృత్యాలు, కోలాటాలు అలరించాయి. వనమాకు స్వాగతం పలుకుతూ పలు సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా చాలా చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గణేష్ టెంపుల్ ఏరియాలో అంబులెన్స్ ర్యాలీ మధ్యలో ఇరుక్కోగా పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి ఆ వాహనాన్ని పంపించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి జేవీఎస్ చౌదరి, వనమా తనయులు రాఘవేందర్రావు, రామకృష్ణతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నిజామాబాద్ ఎంపీగా గెలుస్తా -
ఇలా చేస్తే ఎమ్మెల్యే అవ్వొచ్చనే ప్లాన్
-
ఒక్క సీటుకు టీఆర్ఎస్ నుంచి ముగ్గురి పోటీ? పార్టీ అలా చేస్తే మాత్రం ట్విస్టే!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. అక్కడున్న జనరల్ సీట్లు కేవలం మూడే కావడంతో పోటీపడేవారు ఎక్కువయ్యారు. పార్టీలోని పోటీ తట్టకోవడమే కష్టంగా ఉంటే... ఇప్పుడు సీపీఐ నుంచి మరో ప్రమాదం ముంచుకొస్తోందని ఆందోళన పడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇంటా, బయటా జరిగే పోటీలో తమకు సీటు దక్కుతుందా లేదా అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఆ సీటులో నేనే పోటీ చేస్తా.! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెరో ఐదు సీట్లు వచ్చాయి. వీటిలో కేవలం మూడే జనరల్ సీట్లు ఉండగా... కొత్తగూడెం జిల్లాలో అయితే ఒక్క కొత్తగూడెం మినహా మిగిలిన నాలుగు గిరిజనులకు రిజర్వ్ అయ్యాయి. దీంతో కొత్తగూడెం సీటు కోసం టీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే... ఇతర నాయకుల మధ్య పోటీ మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జలగం వెంకట్రావు పరాజయం చెందారు. గెలిచిన కొంతకాలానికే వనమా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారులో ప్రయాణం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే కొత్తగూడెం సీటు ఇస్తారని వనమా వెంకటేశ్వరరావు చెప్పుకుంటున్నారు. (చదవండి: తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నది నిజమే: మధుయాష్కీ గౌడ్) సర్వేల్లో నా పేరే చెబుతున్నారు గత ఎన్నికల్లో వనమా మీద ఓడిన, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం టిఆర్ఎస్ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉండటంతో గులాబీ బాస్ టికెట్ తనకే ఇస్తారన్న ధీమాతో ఉన్నారు. వీరిద్దరితోపాటు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్న గడల శ్రీనివాసరావు టీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల ఆయన కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. వారానికి రెండు రోజులు కొత్తగూడానికి కేటాయిస్తున్నారు. మరో రెండు నెలల తర్వాత కొత్తగూడెంలో ఇంకొన్ని కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. గడల శ్రీనివాసరావుకు సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందని ఆయన వర్గీయులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారట. దీంతో కొత్తగూడెం టిఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోందన్న గందరగోళంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీరుస్తుందా? ఇదిలా ఉంటే అసలు కొత్తగూడెం టికెట్ పొత్తుల్లో భాగంగా సిపిఐ కి వెళ్తుందన్న ప్రచారం స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ కోసం ఇప్పటినుంచే అన్ని ప్రయత్నాలు ప్రారంభించేశారట. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తో సిపిఐ పొత్తు దాదాపు ఖరారు అయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఖచ్చితంగా కొత్తగూడెం టికెట్ సిపిఐకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు పరిస్థితి ఏంటన్న చర్చ సైతం ఆసక్తికరంగా సాగుతోంది. టికెట్ ఇవ్వకపోతే జంప్ జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న కొత్తగూడెం గులాబీ నేతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ముగ్గురు నాయకులు కాంగ్రెస్, బిజేపి పార్టీలతో టచ్‌లో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ సమయంలోనైనా లెక్కలు తేడా కొట్టినట్లు తెలిస్తే గోడ దూకడానికి సిద్దంగా ఉన్నారట. ఒకవైపు గులాబీ పార్టీలో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తూనే... రాకపోతే అన్న అనుమానంతో పక్క పార్టీలవైపు చూస్తున్నారు. (చదవండి: ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన) -
గుండెల్లో రైళ్లు.. ఎవరికి వాళ్లు ఫిక్స్ అయిపోయారు..!
కొత్తగూడెం రాజకీయాల్లో మునుగోడు ఎఫెక్ట్ కనిపిస్తోందా? ఈ ఉపఎన్నిక తెలంగాణలో పొత్తు రాజకీయాల్ని సమూలంగా మార్చబోతోందా? జరుగుతున్న పరిణామాలు కొత్తగూడెం గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అయితే అక్కడి పాలిటిక్స్ ఎందుకు అంతలా హీటెక్కాయో పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యునిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి టికెట్ తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతుంటే.. తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈ సారి ఏడాదిముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా కుదిరితే సీపీఐ వాళ్లు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేదని టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. చదవండి: (అది సక్సెస్ చేస్తే.. వారిరువురికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌కు గ్రీన్‌సిగ్నల్!) ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా. ఈమేరకు ఆయన శపథం కూడా చేశారు. టికెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని కథలు చెప్పినా అంతిమంగా పోటీచేసేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదంటూ కొందరు సోషల్ మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జలగం వెంగళరావు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెబుతున్నా, సీపీఐ ఎంత డిమాండ్ చేసినా చివరి నిమిషంలో టికెట్ తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరుకావడం లేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా పాల్గొనే కార్యక్రమాలవైపు అయితే కన్నెత్తి కూడా చూడటం లేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నుకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే ఈ ఎపిసోడ్‌లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్-3లో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇంకా మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్ఎస్తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడు సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీపడుతూ శపథాలు చేస్తుంటే.. నేనున్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడు హీటెక్కాయి. -
నేనే గెలుస్తా: వనమా
సాక్షి, కొత్తగూడెంరూరల్: కొత్తగూడెం నియోజకవర్గంలో తనకు ప్రజల ఆదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తానని ప్రజాకూటమి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో తనకు ప్రజలందరూ ఓటు రూపంలో సహకరిస్తున్నారన్నారు. తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తారన్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారయణ, (చిన్ని), లాయర్ లక్కినేని సత్యనారయణ తదితరులు ఉన్నారు. -
కొత్తగూడెం: పోలింగ్ ప్రశాంతం
సాక్షి, కొత్తగూడెం: శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కలిపి 79.5 శాతం ఓట్లు పోలయ్యాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలో 88.61 శాతం, భద్రాచలంలో 78.5 శాతం, కొత్తగూడెంలో 80.18 శాతం, పినపాకలో 82 శాతం, ఇల్లెందులో 68 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా, జిల్లాలోని ఐదు నియోజకవర్గాలూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే కావడంతో గంట ముందుగానే పోలింగ్ ముగించేలా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ సాయంత్రం ఓటర్లు ఎక్కువగా రావడంతో 4 గంటలలోగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలో నిల్చున్నవారికి అవకాశం కల్పించారు. పలు కేంద్రాల్లో మొదట్లో ఈవీఎంలు మొరాయించడం, కొన్ని చోట్ల మధ్యమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ని కొన్ని కేంద్రాల్లో రాత్రి 8 గంటల వరకు, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో రాత్రి 9.30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మొదట్లో మందకొడిగా ప్రారంభమైనప్పటికీ చివర్లో ఓటర్లు పోటెత్తడం గమనార్హం. పలు కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యం అయిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలోని ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న చర్ల మండలంలోని కొన్ని బూత్‌ల్లో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ నిర్వహించాల్సి రావడంతో మరింతగా జాగ్రత్తలు పాటించారు. ఎన్నికల నేపథ్యంలో ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నా యి. అయితే భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. ఈ క్రమంలో వాజేడు మండలంలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రితో వాజేడు నుంచి భద్రాచలం మీదుగా పాల్వంచలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. అయితే సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు వెంకటాపురం చేరుకున్న తరువాత చర్ల, భద్రాచలం మార్గంలో వెళ్లడం శ్రేయస్కరం కాదని పోలీసులు సూచించడంతో వెంకటాపురం నుంచి తిరిగి వాజేడు వెళ్లారు. అక్కడి నుంచి ఏటూరునాగారం, మంగపేట, మణుగూరు మీదుగా పాల్వంచకు చేరుకున్నారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలో ప్రధాన రహదారి కాకుండా అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రోత్సవాలు శనివారం వరకు ఉండడంతో పోలింగ్ భద్రతతో పాటు సమాంతరంగా సరిహద్దులో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో చర్ల మండలం పెదమిడిసిలేరు వద్ద సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సిబ్బంది మావోయిస్టు యాక్షన్ టీం సభ్యు డిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి డైరెక్షనర్ మైన్స్(పేలుడు పదార్థాలు) స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంచనాల్లో పార్టీలు, అభ్యర్థులు.. నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తయినప్పటి నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం హోరాహోరీ ప్రచారం చేశారు. అనేక రకాల వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులతో ఎన్నికల రణక్షేత్రంలో ముందుకెళ్లారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎప్పటికప్పుడు కేడర్‌ను సమాయత్తం చేసుకుంటూ పోలింగ్ ముగిసేవరకు రేయింబవళ్లు పనిచేశారు. ఎట్టకేలకు ఎన్నికలు ముగియడంతో ఆయా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. మరో మూడు రోజుల్లో తమ భవితవ్యం తేలనుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే పలు రకాల అంచనాలు, లెక్కలు వేసుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి మధ్యే పోటీ ఉంది. అన్ని చోట్లా పోటీ నువ్వా.. నేనా.. అనే స్థాయిలో పోలింగ్ జరిగినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
కూటమిని తరిమికొట్టాలి : కేసీఆర్
సాక్షి, కొత్తగూడెం: ‘పాలనాపరంగా వ్యవస్థలను దెబ్బతీసిన కాంగ్రెస్, టీడీపీలు అనైతిక పొత్తు పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నాయి. చైతన్యం ఎక్కువ కలిగిన జిల్లా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఆ కూటమిని తరిమికొట్టాలి.’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరులలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. గత 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనలో రాష్ట్రంలో పూర్తిగా జీవన విధ్వంసం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకసార్లు ఈ ప్రాంతానికి వచ్చానని, రాజకీయంగా చైతన్యవంతమైన ఆలోచనా శక్తి ఉన్న ఇక్కడి ప్రజలతో అనేక విషయాలు పంచుకున్నానని గుర్తుచేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ల పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. దీంతో అందరి సహకారంతో 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించామన్నారు. గత నాలుగున్నరేళ్లలో ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలనాపరంగా అద్భుతమైన విధానాలు చేపట్టామన్నారు. ప్రజలు పరిణితితో ఆలోచించి ప్రజా ఎంజెండా అమలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. కమీషన్లు దండుకున్న చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే.. ఆరు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీలు కమీషన్లు భారీగా దండుకున్నాయని కేసీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో రైతుల మేలు కోసం సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తే కమీషన్ల కోసమే చేసినట్లు రాహుల్‌గాంధీ ఆరోపణలు చేసి జోకర్ అయ్యారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశామని, సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతీ అంగుళానికి నీరిచ్చేందుకు రీడిజైన్ చేస్తే కమీషన్ల కోసమని ఆరోపించడం ఏమిటన్నారు. రాహుల్‌కు దమ్ముంటే ఇక్కడకు వస్తే చూపిస్తానన్నారు. దేశంలో అనేక ప్రాజెక్టులకు రాహుల్ కుటుంబ సభ్యుల పేర్లే పెట్టడం ఏమిటన్నారు. మేము మాత్రం దేవుళ్ల పేర్లు పెట్టామన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రజాజీవితాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయి హిమాలయాలకు వెళ్లి ఆకుపరస తాగి వచ్చి పవిత్రమైనారా లేక చంద్రమండలం నుంచి దిగివచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్ నిధులు మింగిన చరిత్ర ఉన్న రాహుల్‌కు కమీషన్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాహుల్‌కు స్క్రిప్టు ఎవరు రాసిస్తారో కానీ సొల్లు విమర్శలు చేస్తున్నారన్నారు. స్థానికంగా స్వయంపాలన తెచ్చాం రాష్ట్రవ్యాప్తంగా 3,500 గిరిజన గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి స్థానికంగా స్వయంపాలన సాగించేలా చేశామన్నారు. జనవరిలో కొత్త పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇంతకు ముందు కొత్త జిల్లాలతో పాలన మరింత చేరువ చేశామన్నారు.రాష్ట్రంలో కంటివెలుగు పథకం ద్వారా 90లక్షల మందికి కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు ఇస్తున్నామన్నారు. తరువాత దశల్లో చెవి, ముక్కు, గొంతు, దంత, శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ప్రతీ ఒక్కరి రక్తనమూనాలు సేకరించి బీపీ, షుగర్ తదితర వివరాలన్నింటినీ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసి తగినవిధంగా వైద్యసేవలు, అత్యవసర వైద్యం సైతం అందిస్తామన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబంధు, రైతుబీమా రైతులకు ఎంతో మేలు చేశాయన్నారు. గొర్రెల పెంపకం పథకం కింద 4వేల కోట్లతో 70లక్షల గొర్రెలను ఇచ్చి సంతతి పెంచామన్నారు. మహారాష్ట్ర నుంచి మాంసం దిగుమతి చేసుకునే స్థితి నుంచి దుబాయ్‌కు మాంసం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బలమైన అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆదాయం పెంచి రైతులకు, వివిధ వర్గాలకు పంచుతున్నామన్నారు. తమ హయాంలో ఇసుక ద్వారా ఆదాయం పెంచామని అన్నారు. విద్య విషయంలో ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ, ఏరోడ్రోమ్ ఏర్పాటు చేస్తాం.. సింగరేణి ప్రధాన కార్యాలయం కలిగి కొత్తగా జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగూడెంలో విమానాల రాకపోకలకు వీలుగా ఏరోడ్రోమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇల్లెందులో సింగరేణి భూగర్భగని కొత్తగా ప్రారంభిస్తామన్నారు. బయ్యారంలో సింగరేణి ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పోడు భూముల సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో మంచి నాయకులు.. జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు మంచి నాయకులు ఉన్నారని కేసీఆర్ అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం ప్రసాదరావు, జలగం వెంకట్రావులు అభివృద్ధికాముకులన్నారు. జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు అయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కొత్తగూడేనికి చెందిన మహిళ నాగమణిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నీ తమ్ముడిలాంటివాడు. నీ విషయం నేను చూసుకుంటాను’ అని అన్నారు.కొత్తగూడెంలో జలగం వెంకట్రావు, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందులో కోరం కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సభల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పోడు భూములకు పట్టాలిప్పిస్తాం పోడు భూముల సమస్య కొంత ఉందని, ఈసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వారందరికీ పోడు భూములకు హక్కును కల్పిస్తూ పట్టాలు ఇప్పిస్తామని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. వయసు అయిపోయింది, ఆఖరుసారి అని ఓట్లను అర్జించే నాయకులను నమ్మవద్దని, వయసు అయిపోతే ఓటెందుకని ఆయన వ్యాఖ్యానించారు. జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు నీచమైన పాలన చేశాయని విమర్శించారు. మరిన్ని వార్తాలు... -
టీ అమ్ముకుంటాను.. కానీ ఓటమ్ముకోను
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఎన్నికల అధికారులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ప్రత్యేక దృష్టి పెట్టి విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై మారుమూల గ్రామాల్లో కూడా అవగాహన కల్పించారు. పోస్టర్లు, ఆకాశవాణి ద్వారా కూడా ప్రచారం చేపట్టారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో, వాహనాలు సైతం వెళ్లడానికి అవకాశం లేని ప్రాంతాలకు ప్రత్యేకంగా పోలీస్ అధికారితో కలిసి మోటారుసైకిల్‌పై 21 కిలోమీటర్లు ప్రయాణించి ఆయా గ్రామాలకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఓటు హక్కు విలువను తెలియజేసే విధంగా కూరగాయల, పండ్ల వ్యాపారులకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటాం.. ప్రలోభాలకు గురికాం అనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మండల సమాఖ్య, డ్వాక్రాసంఘ సమావేశాల్లో మహిళలకు, కళాశాలల్లో యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులకు కల్పిస్తున్న రవాణా సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో విలువిద్యలో జిల్లా కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన గొంది మారెప్పను ఐకాన్‌గా నియమించారు. జిల్లాలో గత ఎన్నికల్లో నమోదైన 70 శాతం ఓటింగ్‌ను ఈసారి మరింత పెంచాలని కలెక్టర్, ఇతర అధికారులు కృషి చేస్తున్నారు. -
నారీమణులే అధికం
సాక్షి, సుపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న నేతల తలరాతలు మార్చడంలో మహిళలు కూడా కీలకపాత్ర పోషించనున్నారు. జిల్లాలో అత్యధికంగా కొత్తగూడెంలో, భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు కొత్తగూడెం 2,11,279 1,03,527 1,07,713 39 ఓటర్ల సంఖ్యలో జిల్లాలోమొదటి స్థానంలో ఉంది, పురుషుల కంటే మహిళా ఓటర్లు 4186 మంది ఎక్కువగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుషులు మహిళా ఓటర్లు ఇతరులు ఇల్లెందు 1,96,793 97,552 99,230 16 ఓటర్ల సంఖ్యలో జిల్లాలో ద్వితీయస్థానంలో ఉంది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 1,670 మంది అధికంగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు, ఇతరులు పినపాక 1,75,469 87,537 87,923 8 ఓటర్ల సంఖ్యలో జిల్లాలో మూడవ స్థానంలో ఉంది. ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 386 మంది మాత్రమే అధికంగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు అశ్వారావుపేట 1,43,617 70,463 73,142 12 ఓటర్ల సంఖ్యలో నాల్గవ స్థానంలో ఉంది. పురుష ఓటర్ల కంటే 2,679 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు భద్రాచలం 1,36,726 66,321 70,381 24 ఓటర్ల సంఖ్యలో చివరిస్థానంలో ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 4060 అధికంగా ఉండటం గమనార్హం. 5 నియోజకవర్గాలు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు 4,25,400 4,38,389 పురుష ఓటర్ల కంటే జిల్లాలో 12,989 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో వీరి ఓట్లు అభ్యర్థుల జయాపజయాలలో కీలకంగా మారనున్నాయి. -
ప్రశాంతంగా రీపోలింగ్
లక్ష్మీదేవిపల్లి(కొత్తగూడెం), న్యూస్‌లైన్: కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం పాత కొత్తగూడెంలో మంగళవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు కొనసాగింది. 81.35శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1008 మంది ఓటర్లకుగాను 820 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 188 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఈ బూత్‌లో 785 ఓట్లు మాత్రమే పోల్ కాగా ఈసారి 820కి పెరిగాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటర్లు భారీ సంఖ్యలో బారులు తీరి ఓటేశారు. అనంతరం ఎండ పెరుగుతుండడంతో మందకొడిగా పోలింగ్ నమోదైంది. తిరిగి సాయంత్రం సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. పోలీసులు పహారా నడుమ ఈ రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూశారు. పోలింగ్ కేంద్రం సమీపంలో అభ్యర్ధుల పాట్లు... పోలింగ్ కేంద్రం సమీపంలో ఉదయం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో అభ్యర్ధులు, పోలింగ్ ఏజెంట్లు ప్రచారం చేసుకోవాల్సి ఉండగా నిబంధనలు అతిక్రమించారని ఒకరిపై మరొకరు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసుల సూచనలు పాటిస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. జల్లివారిగూడెంలో ప్రశాంతంగా.. వీఆర్‌పురం : మండలంలోని జల్లివారిగూడెంలో మంగళవారం నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 488 మంది ఓటర్లకు 423 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 86 శాతం పోలింగ్ నమోదైనట్లు తహశీల్దార్ మారుతీరావు తెలిపారు. గత నెల 30వ తేదీన స్థానిక పోలింగ్ కేంద్రంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లోని ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రీపోలింగ్‌కు ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే స్థానిక పోలింగ్ కేద్రంలో రీపోలింగ్ నిర్వహించారు. ఈ కేంద్రంలో మొదటిసారి నిర్వహించిన ఎన్నికల్లో 488 మంది ఓటర్లు ఉండగా 217 మంది పురుషులు, 209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తొలిసారి 87 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి 86 శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రానికి అభ్యర్థుల తాకిడి జల్లివారిగూడెం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రీపోలింగ్‌కు బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులందరూ వచ్చారు. ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రంలో సుమారు 488 ఓట్లు ఉండటంతో అవి తమ మెజార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించి ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ఉదయాన్నే ఈ గ్రామానికి చేరుకున్నారు. సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య, టీడీపీ అభ్యర్థిని ఫణీశ్వరమ్మ, కాంగ్రెస్ అభ్యర్థిని కుంజా సత్యవతి, టీఆర్ఎస్ అభ్యర్ధి మానె రామకృష్ణ, స్వతంత్ర అభ్యర్థి సున్నం వెంకట రమణ తదితరులు ఈ ఎన్నికల కేంద్రాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. -
టికె ట్ ఇవ్వకుంటే తీర్థయాత్రలకే....!
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘తుమ్మల నాగేశ్వరరావు కోసం పాలేరు నియోజకవర్గం.. బాలసాని, నాగప్రసాద్ కోసం ఖమ్మం.. కోనేరు చిన్ని కోసం కొత్తగూడెం నియోజకవర్గాలు వదులుకుంటే మన పార్టీకి ఇంకేమి మిగులుతాయి.. టీడీపీతో పొత్తు కుదిరే పక్షంలో జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే జిల్లా పార్టీ అంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు’ అని జిల్లా బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకత్వం ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పొత్తుల నేపథ్యంలో తమకు కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం అయినా దక్కేలా టీడీపీతో చర్చించాలని జిల్లా నాయకులు కోరుతున్నారు. అయితే తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లాలోనే తమ పార్టీ బలంగా ఉందని, ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా కమలనాథులకు ఇవ్వబోమని టీడీపీ నేతలు అంటుండడంతో జిల్లా బీజేపీ కేడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు స్థానాలు కావాలని అధిష్టానంపై ఒత్తిడి... ‘జిల్లాలో అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యాం. గతంతో పోలిస్తే పార్టీని మారుమూల ప్రాంతాల్లోకి కూడా తీసుకెళ్లి శాఖలు ఏర్పాటు చేశాం. దీనిని సద్వినియోగం చేసుకోవాలంటే పార్టీ అభ్యర్థులను పోటీలో దింపాల్సిందే’ అని జిల్లా బీజేపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని, సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయను ఇటీవల కలిసి విన్నవించారు. పాలేరు లేదా కొత్తగూడెం జనరల్ స్థానంతో పాటు పినపాక, మధిర సీట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు ఇప్పటికే పార్టీ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారని, కార్యకర్తల్లో కూడా మంచి స్పందన ఉందని వివరించినట్లు సమాచారం. తెలంగాణలోని ఇతర జిల్లాల మాదిరిగానే ఖమ్మంలోనూ పార్టీ బలపడిందని, మిగిలిన జిల్లాల్లో ఇచ్చే ప్రాధాన్యతనే ఇక్కడ కూడా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్ని కోరినట్టు తెలిసింది. పోటీలో లేకుంటే ప్రజల్లోకి వెళ్లలేం.. ఇంతకాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, విద్యుత్ చార్జీల పెంపు, రైతులు, ఇతర వర్గాల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడంతో జిల్లాలో కొంతమేర బలపడ్డామనే ఆలోచనలో బీజేపీ జిల్లా నాయకత్వం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలలోనే పోటీచేయకుంటే ఇక భవిష్యత్తు ఏముంటుందనే ప్రశ్న వారిని వేధిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పలుచోట్ల బరిలోకి దిగారని, గతంతో పోలిస్తే ఓటు బ్యాంకు పెరిగిందని, ఇప్పుడు అసెంబ్లీ బరిలో లేకుంటే ప్రజల్లోకి ఎలా వెళ్లాలని జిల్లా నాయకులు అధిష్టానం ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీట్లు కేటాయిస్తే జిల్లాకు వెళ్తామని, లేదంటే ఇటునుంచి ఇటే తీర్థయాత్రలకు వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేదని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గత రెండు రోజులుగా జిల్లా నాయకులు భీష్మించారు. ఈ పరిస్థితిలో జిల్లాలో మొత్తం స్థానాల్లో టీడీపీ పోటీలో ఉంటుందా.. బీజేపీకి ఒకటి రెండు సీట్లు ఇస్తారా.. అనేది చర్చనీయాంశమైంది.