ఖమ్మం, న్యూస్‌లైన్: ‘తుమ్మల నాగేశ్వరరావు కోసం పాలేరు నియోజకవర్గం.. బాలసాని, నాగప్రసాద్ కోసం ఖమ్మం.. కోనేరు చిన్ని కోసం కొత్తగూడెం నియోజకవర్గాలు వదులుకుంటే మన పార్టీకి ఇంకేమి మిగులుతాయి.. టీడీపీతో పొత్తు కుదిరే పక్షంలో జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే జిల్లా పార్టీ అంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు’ అని జిల్లా బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకత్వం ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పొత్తుల నేపథ్యంలో తమకు కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం అయినా దక్కేలా టీడీపీతో చర్చించాలని జిల్లా నాయకులు కోరుతున్నారు. అయితే తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లాలోనే తమ పార్టీ బలంగా ఉందని, ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా కమలనాథులకు ఇవ్వబోమని టీడీపీ నేతలు అంటుండడంతో జిల్లా బీజేపీ కేడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మూడు స్థానాలు కావాలని అధిష్టానంపై ఒత్తిడి...
‘జిల్లాలో అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యాం. గతంతో పోలిస్తే పార్టీని మారుమూల ప్రాంతాల్లోకి కూడా తీసుకెళ్లి శాఖలు ఏర్పాటు చేశాం. దీనిని సద్వినియోగం చేసుకోవాలంటే పార్టీ అభ్యర్థులను పోటీలో దింపాల్సిందే’ అని జిల్లా బీజేపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని, సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయను ఇటీవల కలిసి విన్నవించారు. పాలేరు లేదా కొత్తగూడెం జనరల్ స్థానంతో పాటు పినపాక, మధిర సీట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు ఇప్పటికే పార్టీ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారని, కార్యకర్తల్లో కూడా మంచి స్పందన ఉందని వివరించినట్లు సమాచారం. తెలంగాణలోని ఇతర జిల్లాల మాదిరిగానే ఖమ్మంలోనూ పార్టీ బలపడిందని, మిగిలిన జిల్లాల్లో ఇచ్చే ప్రాధాన్యతనే ఇక్కడ కూడా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్ని కోరినట్టు తెలిసింది.
పోటీలో లేకుంటే ప్రజల్లోకి వెళ్లలేం..
ఇంతకాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, విద్యుత్ చార్జీల పెంపు, రైతులు, ఇతర వర్గాల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడంతో జిల్లాలో కొంతమేర బలపడ్డామనే ఆలోచనలో బీజేపీ జిల్లా నాయకత్వం ఉంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలలోనే పోటీచేయకుంటే ఇక భవిష్యత్తు ఏముంటుందనే ప్రశ్న వారిని వేధిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పలుచోట్ల బరిలోకి దిగారని, గతంతో పోలిస్తే ఓటు బ్యాంకు పెరిగిందని, ఇప్పుడు అసెంబ్లీ బరిలో లేకుంటే ప్రజల్లోకి ఎలా వెళ్లాలని జిల్లా నాయకులు అధిష్టానం ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీట్లు కేటాయిస్తే జిల్లాకు వెళ్తామని, లేదంటే ఇటునుంచి ఇటే తీర్థయాత్రలకు వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేదని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గత రెండు రోజులుగా జిల్లా నాయకులు భీష్మించారు. ఈ పరిస్థితిలో జిల్లాలో మొత్తం స్థానాల్లో టీడీపీ పోటీలో ఉంటుందా.. బీజేపీకి ఒకటి రెండు సీట్లు ఇస్తారా.. అనేది చర్చనీయాంశమైంది.
టికె ట్ ఇవ్వకుంటే తీర్థయాత్రలకే....!
Published Wed, Apr 2 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement
Advertisement