Tummala Nageswara Rao
-
సాగు భూమికే రైతుభరోసా
సాక్షి, హైదరాబాద్: పంటలు సాగుచేసిన భూమికే రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. ఇందుకోసం శాటిలైట్ సర్వే ద్వారా రిమోట్ సెన్సింగ్ డేటాను వినియోగించనున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లవారీగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణంతోపాటు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను రిమోట్ సెన్సింగ్ డేటాతో పొందవచ్చని చెప్పారు. ఇదే విషయాన్ని ఈ నెల 26వ తేదీన ‘సాగు రైతుకే భరోసా’శీర్షికతో ప్రచురితమైన కథనంలో ‘సాక్షి’వెల్లడించింది. ఈ సంక్రాంతి నుంచి ‘రైతుభరోసా’ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం సచివాలయంలో రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే వివిధ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమావేశమయ్యారు. రిమోట్ సెన్సింగ్ డేటానే కీలకం సాగు చేసిన భూముల వివరాలను వ్యవసాయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నమోదుచేస్తామని మంత్రి వెల్లడించారు. పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటాలో గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా సాగుభూమి, పంటల వివరాలను సేకరిస్తామని చెప్పారు. సాగు భూముల విస్తీర్ణం, సాగుకు అనువుగా లేని భూముల విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను పక్కాగా నమోదు చేస్తామని తెలిపారు. ఈ వివరాలను రైతుభరోసా పథకంతోపాటు, పంటల బీమా పథకానికి కూడా వినియోగిస్తామని పేర్కొన్నారు. పంటల ఆరోగ్య స్థితి, పంటల ఎదుగుదల, చీడపీడలను ఆరంభంలోనే గుర్తించడం, వరదలు, తుఫాన్ల వల్ల జరిగే పంటనష్టాన్ని అంచనా వేయడంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా ఇంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టుల గురించి వివరించారు. నమూనా సర్వే కింద రెండు మండలాల్లో పంటలు, గ్రామాల వారీగా సాగైన వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సాగుకు అనువుగా లేని ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా చూపించారు. పంటలను సోకే చీడపీడలను ఆరంభంలోనే గుర్తించే విధంగా ఆయా కంపెనీలు ఏఐ పరిజ్ఞానంలో తయారు చేసిన మోడల్స్‌ను వివరించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ వీటన్నిటిని పరిశీలించి మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు, కేబినెట్ ఆమోదానికి పంపించడం జరుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. -
రైతన్నలూ.. ఆయిల్‌పాం సాగు చేయండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రైతులంతా ఆయిల్‌పాం సాగుపై దృష్టి పెట్టాలి. మొదటి మూడే ళ్లు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది. అంతర పంటలు వేస్తే బోనస్ ఇచ్చే బాధ్యత కూడా మాదే. మీ పంటను ఇంటి వద్దే కొనిపించే బాధ్యత తీసు కుంటాం. వెంటనే మీ ఖాతాలో డబ్బులు వేస్తాం. పామాయిల్ పంట వేయండి.. మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖపరంగా మీరు ఏ శిక్ష విధించినా దానికి సిద్ధంగా ఉంటాం. రైతులకు నష్టం రాకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో మూడు రోజుల రైతు పండుగ సదస్సును పద్మశ్రీ అవార్డుగ్రహీత, రైతు వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఆహార పదార్థాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించేలా మైదానంలో ఏర్పాటు చేసిన 117 స్టాళ్లు, ఎగ్జిబిట్లను తిలకించిన అనంతరం సదస్సులో మంత్రి తుమ్మల మాట్లాడారు. రాష్ట్రానికి అప్పులు, కష్టాలు ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నట్లు తెలిపారు.అనుకున్నవన్నీ నాలుగేళ్లలో చేస్తాం..రైతులు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, వచ్చే నాలుగేళ్లలో అనుకున్న వ న్నీ చేసి అన్నదాతల చేత శెభాష్ అనిపించుకుంటా మని మంత్రి తుమ్మల చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు వ్యవసాయాన్ని ఎలా ఆగం చేశారో, ఈ పది నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో ఈ నెల 30న జరి గే సభలో సీఎం రేవంత్‌రెడ్డి చెబుతారని తుమ్మల తెలిపారు. రైతులను సమీకరించి సంక్రాంతికి ముందే రైతు పండుగను నిర్వహించుకుంటామన్నారు.సాగు దండగ కాదు.. పండగని వైఎస్ నిరూపించారు: దామోదరఉమ్మడి ఏపీలో 2003–04లో వ్యవసాయం దండగ అని ప్రచారం జరిగితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టు లను చేపట్టి కొంత వరకు పూర్తి చేశారని.. వ్యవసాయం దండగ కాదు.. పండగని నిరూ పించారని మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొ న్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వ్యవసా య రంగాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రస్తుత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకొన వాటిని సాకారం చేసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయన్నా రు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెలేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహించాలి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పంటల సాగువైపు రైతాం గాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రధా నంగా పంటల మార్పిడిపైన విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారులకు శనివారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రానున్న ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ని లబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోం దని అన్నారు. ప్రభుత్వ సంకల్పంలో వ్యవసాయాధికారులంతా భాగస్వామ్యం కావాలన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పుల ను, పద్ధతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్డేట్ కావా లన్నారు. నూతన విషయాలు తెలుసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, కోర్సు కోఆర్డినేటర్ ఉషారాణి, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ శశాంక్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన అధికారులు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం రూ.51 వేల చెక్కును మంత్రి తుమ్మలకు అందచేశారు. -
రాష్ట్రంలో సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తాం: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని, అందుకు తగిన అవకాశాలను పరిశీలిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల సీడ్ గార్డెన్ ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఎఫ్‌జీవీ కంపెనీ సీడ్ గార్డెన్, నర్సరీలు, అధునాతన సాంకేతిక పద్ధతులతో నడుపుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించారు.అక్కడ ఎఫ్‌జీవీ కంపెనీ రిఫైనరీ మొక్కలను సందర్శించి అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ...ఎఫ్‌జీవీ కంపెనీ నుంచి ఇప్పటికే రాష్ట్రానికి సీడ్స్‌ను చాలావరకు తెప్పించుకున్నామన్నారు. రాష్ట్రంలో సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహాయ సహకారాలు అందజేయాలని కోరగా వారు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలిపారు. వివిధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి అక్కడ కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. -
ఖరీఫ్ ‘భరోసా’ బోల్తా
‘ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేం’.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం చేసిన ప్రకటన రైతులకు శరాఘాతమైంది. ఈ వానాకాలం సీజన్‌కు రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. – సాక్షి, హైదరాబాద్ ఆర్భాటంగా కేబినెట్ సబ్ కమిటీకాగా, జూలై 2వ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబులను సభ్యులుగా నియమించారు. అప్పటినుంచి 15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీచేసి రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది. సమావేశాలు పెట్టి.. అభిప్రాయాలు సేకరించి..జూలై 15వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనూ అభిప్రాయాలు తీసుకున్నారు. జూలై 23వ తేదీ నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా ఊసే ఎత్తలేదు. దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదు. ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం స్పష్టం చేయడంతో రైతులు కంగుతిన్నారు. రైతు భరోసాకు బదులుగా సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు రూ.500 బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. కాగా, వరదలు, భారీ వర్షాలతో అన్నదాత కుదేలయ్యాడు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఖరీఫ్ ముగిసినా రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తారన్న నమ్మకంతో రైతులున్నారు. చివరికి ఇలా జరగడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక పథకానికి తొలి ఆటంకం..వాస్తవానికి సీజన్‌కు ముందే రైతు భరోసా ఇవ్వాలనేది పథకం ఉద్దేశం. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చును పెట్టుబడి సాయం ద్వారా అందించాలన్నది దీని లక్ష్యం. 2018 నుంచి ఏటా రెండు సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం ఈ వానాకాలం సీజన్లో మాత్రం తొలిసారిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పథకం ఆగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత యాసంగిలో రైతుబంధు పథకం కింద పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం చేశారు. కనీసం అలాగైనా ఈ వానాకాలం సీజన్‌కు ఇచ్చినా బాగుండేదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా మొత్తాన్ని సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిబంధనలు పునఃసమీక్ష తర్వాత అర్హులకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది. మార్గదర్శకాలు ఎలా ఉంటాయో..?ప్రభుత్వం ముఖ్యంగా రైతుభరోసాకు సీలింగ్ విధించాలన్న ఆలోచనలో ఉందని అంటున్నారు. అందరికీ కాకుండా ఐదు లేదా పదెకరాలకు దీనిని పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాగు చేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలనేది ఉద్దేశం. గత యాసంగి సీజన్లో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుబంధు అందుకున్న వారిలో ఐదెకరాల్లోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం.కాగా ఐదెకరాలకు పరిమితం చేస్తే 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇక ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల్లోపున్న వారు 10.89 లక్షల మంది, మూడెకరాల నుంచి నాలుగెకరాల్లోపున్న వారు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల్లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 5.72 లక్షల మంది కాగా.. వారి చేతిలో 31.04 లక్షల ఎకరాల భూమి ఉంది. పదెకరాల వరకు ఇస్తే, రైతు భరోసాకు వీరు కూడా తోడవుతారు. పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే అనేక మందికి కోత పడుతుంది. భూములున్న ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు.. ఇలా చాలామందికి కోతపడే అవకాశాలున్నాయి. చివరికేం జరుగుతుందో చూడాలి. -
ఖరీఫ్ సీజన్ రైతు భరోసా లేదు!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసిందని, పంట దిగుబడులు కూడా వచ్చేశాయన్నారు. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందన్నారు.కమిటీ నివేదికకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రబీ సీజన్ నుంచి రైతుభరోసా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్‌లోని రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా అమలు చేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత డిసెంబర్ నుంచి ఈ పథకం అమలవుతుందన్నారు. గత ప్రభుత్వం పంటలు సాగు చేయని, పంట యోగ్యత లేని భూములకు రైతుబంధు కింద డబ్బులు ఇచ్చిందని, దాదాపు రూ.25 వేల కోట్లు ఇలాంటి భూములకు ఇచ్చినట్లు తుమ్మల వ్యాఖ్యానించారు. చిన్న పొరపాట్లతో..: దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతురుణ మాఫీ చేయలేదని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏకంగా రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. సాంకేతిక కారణాలు, చిన్నపాటి పొరపాట్లతో దాదాపు 3 లక్షల మందికి మాఫీ కాలేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించారని, వారికి డిసెంబర్‌లోగా రూ.2,500 కోట్ల మేర రుణమాఫీ చేయనున్నట్లు వివరించారు. రెండు లక్షల రూపాయలకు మించి రుణాలు తీసుకున్న వారికీ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా రూ.2 లక్షలకు మించి ఉన్న బకాయిని చెల్లించిన రైతులకు మాఫీ చేసేందుకు విడతల వారీగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. రాష్ట్రంలో పంటబీమా అమలు లేదని, త్వరలో ప్రతి రైతుకూ ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుందని, త్వరలో బీమా కంపెనీలను టెండర్లకు పిలుస్తామన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కానీ కేంద్రం మాత్రం 25 శాతానికి మించి కోటా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగానికి లబ్ధి కలిగించే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందని, రెండేళ్లపాటు ఈ కమిషన్‌కు అవకాశం ఉందన్నారు. మెరుగైన అంశాలతో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పామాయిల్ సాగు చేయండి.. దర్జాగా బతకండి
నల్లగొండ: రైతులు పామాయిల్ సాగు చేస్తే.. మీసం మీద చేయి వేసుకుని దర్జాగా బతకొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బుధవా రం నల్లగొండలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కె ట్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పామాయిల్ పంట తక్కువ నీటితో సాగవుతుందని చెప్పారు. తాను వంద ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నానని.. మీరు మంత్రి కోమటిరెడ్డిని వెంటబెట్టుకుని వచ్చి చూడవచ్చని రైతులకు సూచించారు. నల్లగొండ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తే.. ఇక్కడే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని.. మిగిలిన రుణమాఫీని కూడా చేయా లని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఎటు పోయిందో.. ఎవరు తిన్నారో కూడా తెలియదని.. రూ.50 వేల కోట్ల అప్పులయితే ఉన్నాయని చెప్పా రు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినవారే ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నా మని.. ఆ ధాన్యం కొనుగోలు చేసి రేషన్ కార్డు దారులకు, హాస్టళ్లకు బియ్యం సరఫరా చేస్తామ న్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ మంత్రిగా రావడంతోనే సొరంగ మార్గం పనులు మొద లయ్యాయని, ఆయన హయాంలోనే సొరంగ మార్గం పూర్తవుతుందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోయిందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. -
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఒకే డిజైన్ చీరలు
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) సభ్యులుగా ఉన్న మహిళలకు ఒకే డిజైన్‌తో ఉండే చీరలు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా విధి విధానాలు ఖరారు చేయా లని నిర్ణయించింది. చీరల పంపిణీ పథకాన్ని ఏ తరహాలో అమలు చేయాలనే అంశానికి సంబంధించి చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారు. మరో వారం రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో జరిగే భేటీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత, చీరల పంపిణీ పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డులో పేర్లు కలిగిన 18 ఏళ్లు పైబడిన యువతులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే రాష్ట్రంలో గ్రామీణ పేదరి క నిర్మూలన సంస్థ (సెర్ప్), మెప్మా పరిధిలోని 63 లక్షల మంది మహిళా సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే స్వయం సహాయక సంఘా ల మహిళలకు పంపిణీ చేసేది బతుకమ్మ చీరలు కాదని, రాష్ట్రమంతటా ఒకే డిజైన్ కలిగిన చీరలను పంపిణీ చేస్తామని చేనేతశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని, సరఫరాలో కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా స్థానికంగా ఉండే నేత కారి్మకులను భాగస్వాములను చేస్తూ నాణ్యత కలిగిన చీరలను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మహిళకు ఒకటా.. రెండా..? స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్కరికీ ఏటా ఎన్ని చీరలు పంపిణీ చేయాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్‌హెచ్‌జీల్లో పెరిగే సభ్యు ల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఏటా రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తే 1.3 కోట్ల చీరలు అవసరమవుతాయని ప్రాథమికంగా లెక్కలు వేశా రు. ఒక్కో చీర తయారీకి అయ్యే ఖర్చు, ఏటా కేటాయించాల్సిన బడ్జెట్ తదితరాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ చీరలను పండుగ సమయా ల్లో ఇవ్వాలా, ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇవ్వా లా అకోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు. 2017లో బతుకమ్మ చీరల పథకం ప్రారంభంకాగా సగటున రూ.325 కోట్ల బడ్జెట్‌తో కోటి చీరలు పంపిణీ చేస్తూ వచ్చారు. గత ఏడాది 30 రకాల డిజైన్లు, 20 విభిన్న రంగుల్లో 240 వెరైటీల్లో చీరలను తయారు చేయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) డిజైనర్లతో బతుకమ్మ చీరలు డిజైన్ చేయించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు పంపిణీ చేసే చీరల డిజైన్లను కూడా నిఫ్ట్ డిజైనర్ల సూచనలు, సలహాల ఆధారంగా ఖరారు చేస్తారు. ప్రస్తుతం సొంతంగా ఎస్‌హెచ్‌జీల కొనుగోలు ప్రస్తుతం రాష్ట్రంలోని ఎస్‌హెచ్‌జీల మహిళలకు ప్రత్యేక యూనిఫారం లేకున్నా స్థానికంగా గ్రామ, మండల సమాఖ్యలు మూకుమ్మడిగా నిర్ణయించుకొని తమకు నచ్చిన డిజైన్ చీరలను యూనిఫారాలుగా ఎంచుకుంటున్నాయి. ఎస్‌హెచ్‌జీల సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఒకే డిజైన్ చీరలు ధరించి హాజరవుతున్నారు. గ్రామ, మండల సమాఖ్య నిధుల నుంచి లేదా సొంతంగా తలాకొంత మొత్తం పోగు చేసి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే పంపిణీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఒకటి లేదా రెండు డిజైన్లను ఎంపిక చేసి చీరల తయారీకి ఆర్డర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా పది డిజైన్లను సిద్ధం చేసిన చేనేత విభాగం త్వరలో సీఎంతో జరిగే భేటీలో ఒకటి రెండు డిజైన్లను ఖరారు చేసే అవకాశముంది. -
భద్రాద్రిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, రాష్ట్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శివరాజ్‌సింగ్ చౌహాన్‌లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ పర్యటనలో భాగంగా తుమ్మల కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు అంశాలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రా లు అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రామ్మోహన్ నాయుడును కోరినట్లు తెలిపారు. తెలంగాణలో నూతన కోకోనట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరానన్నారు. ఆయిల్‌పామ్ మీద 28% దిగుమతి సుంకం విధించి, దేశీయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నందుకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్‌పామ్‌కు కేంద్రం కనీస మద్దతు ధర కలి్పంచాలని కోరారు. అలాగే ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా విన్నవించారు. ఇటీవలి వరదల్లో నష్టపోయిన ఖమ్మం జిల్లాకు తగిన మొత్తంలో సహాయం అందజేయాలని కోరారు. నష్టంపై నివేదిక రాగానే సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిసి, తెలంగాణలో ఎక్కువగా పండే పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అలాగే.. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొని.. తెలంగాణలోని అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని ఆహా్వనించానన్నారు. సాగు చేసేవారికే రైతుబంధువ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కౌలు రైతు, భూమి యజమాని చర్చించుకొని రైతుబంధు ఎవరు తీసుకోవాలన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు. ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో కౌలు రైతు ఒప్పందాలు లేవని గుర్తుచేశారు. ఐదేళ్లలో కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, ఒకేసారి రూ.18,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అవసరమైతే ఇంకా నిధులు సమకూరుస్తామని తెలిపారు. ప్రతి పంట, ప్రతి రైతుకు వర్తించేలా రూ.3,000 కోట్లతో బీమా చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. -
సోషల్ మీడియాలో బతికేస్తున్న కేటీఆర్, హరీశ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రతిపక్షాలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పనికిమాలినవని.. వాళ్లు చేసిన పాపాలపై నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయంగా బతికేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అనుకోని విధంగా వచి్చన ఈ విపత్తును ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచాక డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలకు పని లేదని.. వారు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని, ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగిపోయాయని, కానీ ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ నేడు సురక్షితంగా ఉందంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమేనని భట్టి తెలిపారు. భారీ వర్షాలు, వరదతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. -
ఎన్నో అవమానాలు.. మంత్రి తుమ్మల కంటతడి
సాక్షి, ఖమ్మం: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవేదన... అవమానాలు చెప్పాలనుకుంటున్నా.. వాస్తవాలు ప్రజలకు అవసరం అంటూ మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. పేరు కోసం, ఫ్లెక్సీ కోసం రాజకీయం చేయలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతోనే పనిచేశానన్నారు.శ్రీరామచంద్రుడు దయ, ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి లో భాగస్వామ్యం కల్పించారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేసిన గోదావరి తల్లిని వాడుకోలేక పోతున్నాం. నాకు అవకాశం వచ్చినప్పుడుల్లా... నాటి బడ్జెట్ తక్కువగా ఉండేది.. ఇరిగేషన్కి కూడా తక్కువ బడ్జెట్ ఉండేది. కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు నీరు ఇవ్వాలనేది నా సంకల్పం’’ అని తుమ్మల పేర్కొన్నారు.‘‘ఏ ప్రభుత్వంలో ఉన్నా దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించా.. నాడు బడ్జెట్లో దేవదులను పూర్తి చేశాం. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ గా విడదీశారు. ఇందిరా సాగర్ వద్ద బ్యాక్ వాటర్‌కు ఆనాటి సీఎం వైఎస్సార్ టెండర్లు పిలిచారు.. దురదృష్టవశాత్తు వైఎస్సార్ మృతి ఆ ప్రాజెక్టుకి శాపం అయింది.’’ అని తమ్మల వివరించారు.తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్రం ఏర్పాటయ్యింది. ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఆనాటి సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్లాను. కేసీఆర్‌తో శంకుస్థాపన చేశారు... పనులు ప్రారంభం అయ్యాయి... మళ్ళీ జరిగిన ఎన్నికల తరవాత పనులు ఆగిపోయాయి. రోళ్లపాడు ఆలైన్మెంట్ జూలూరుపాడుకి మార్చారు. బిజి కొత్తూరు 150 చెక్ డ్యాంలు నిర్మించాలి. జూలూరుపాడు టన్నెల్ ప్రాతిపదిన లేదు.. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. ఇప్పటికే 8వేల కోట్లు ఖర్చు చేశారు. పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరాను’’ అని తుమ్మల చెప్పారు. -
‘సుంకిశాల’ నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తాడు
సాక్షి, హైదరాబాద్/పెద్దవూర: జంటనగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల వద్ద చేపడుతున్న ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన సంఘటన చిన్నదని, నష్టం తక్కువైనా చాలా దురదృష్టకరమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. పనులు పూర్తి కావడానికి రెండు నెలలు ఆలస్యమవుతుందని, ఎంతటి నష్టమైనా కాంట్రాక్టరే భరిస్తాడని, ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును కాంట్రాక్టర్ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. నీట మునిగిన సుంకిశాల పంప్‌హౌస్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కలిసి పరిశీలించారు.అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. సుంకిశాల ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిజైన్ చేసింది, కాంట్రాక్ట్ ఇచ్చింది. నిర్మాణం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు మొత్తుకుంటున్నారో అర్థం కావడం లేదని, ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఈ పనులను ప్రారంభించటంలో మతలబు ఏమిటో వారే చెప్పాలన్నారు. శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందేదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి తీరుతామని చెప్పారు. సీఎంపై ఆరోపణలు సరికావు : గుత్తా సుంకిశాల ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యుడని రాజకీయ ఆరోపణలు కేటీఆర్ చేయడం సరికాదని, ప్రస్తుతం మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నంత మాత్రాన ఈ ఘటనకు సీఎం బాధ్యుడని అంటే ఎలా అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లోనే ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో, ఎవరి కోసం చేపట్టాల్సి వచ్చిందో కేసీఆర్, కేటీఆర్‌లలో ఎవరి మానసపుత్రికనో వారికే తెలియాలన్నారు. గ్రావిటీ ద్వారా తాగునీరు అందిస్తాం : తుమ్మలప్రభుత్వంపై ఎత్తిపోతల భారం లేకుండా మిగిలి పోయిన 9.5 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి నల్లగొండజిల్లాకు సాగునీటితో పాటు జంట నగరాలకు గ్రావిటీ ద్వారా తాగునీరు ఇవ్వ టానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వరద ఉధృతి ని ఏజెన్సీ ఊహించకపోవడం, త్వరగా పూర్తి చేయా లన్న తపనో, త్వరగా నీరు ఇవ్వాలన్న తాపత్ర యమో దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందన్నారు. రిపోర్టు రాగానే ఏంచర్యలు తీసుకో వాలి.. బాధ్యులు ఎవరనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. సుంకిశాలను సందర్శించిన వారిలో జలమండలి ఎండీ ఆశోక్‌రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీర్ల బృందం కూడా ఉంది.పునర్నిర్మాణ వ్యయం రూ.20 కోట్లపైనేరిటైనింగ్ వాల్ నిర్మాణ ఖర్చు భరించేందుకు కాంట్రాక్టర్ సంస్థ అంగీకరించనట్టు తెలి సింది. అయితే ఈ పనులకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం తగ్గిన తర్వాతనే దెబ్బతిన్న భాగాన్ని తిరిగి నిర్మించే అవకాశాలున్నాయి. సుంకిశాల ‘ఘటన’. రిటైనింగ్ వాల్ కూలిన వ్యవహారంలో గోప్యత ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పనుల నాణ్యతపై కూడా ఆరా తీస్తోంది. -
పాస్‌బుక్ ఆధారంగా.. ప్రతి రైతుకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీపై రాజకీయం చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకముందే దానిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌బుక్ ఆధారంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని, రైతుకు రుణ విముక్తి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 30 వేల మంది రైతులకు రుణమాఫీ కానట్లుగా లెక్కలు చెబుతున్నాయని మంత్రి చెప్పారు. ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక సమస్య, పేర్లు, ఆధార్, ఇతర డేటా తప్పుడు నమోదుతో రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతుల పేర్ల నమోదుకు అధికారులను నియమిస్తామని, ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వారు గతంలో ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేయాలని హితవు పలికారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.15న వైరా సభలో రూ.2 లక్షల రుణమాఫీ!ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని చెప్పి చేతులెత్తేసిన వాళ్లు ఈ రోజు రుణమాఫీపై మాట్లాడడం ఏమిటని తుమ్మల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేసేలా వ్యవసాయ శాఖ ఆలోచిస్తోందని తెలిపారు. రైతు భరోసా, పంటల బీమా పథకాలు కూడా అమలు చేస్తామన్నారు.సకాలంలో ప్రాజెక్టులు ఫుల్..ఈ ఏడాది సకాలంలో అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయంటూ మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు కేంద్రం సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పెదవాగు ప్రాజెక్టు రీడిజైన్ చేస్తాం
అశ్వారావుపేట రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టును రీడిజైన్ చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన గుమ్మడవల్లి, కొత్తూరు, నారాయణపురంలో పర్యటించి వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధిక వర్షాలు, వరద పోటుతో పెదవాగు ప్రాజెక్టుకు పడిన గండ్లను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ, పెదవాగు ప్రాజెక్ట్‌కు గండ్లు పడి భారీగా ఆస్తి, పంట నష్టపోవడం బాధాకరమని, ఇందులో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పెదవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసినా ప్రయోజనం ఉండదని, తిరిగి నిర్మించడమే మంచిదని అన్నారు.గోదావరి నదీ యాజమాన్య బోర్డు, ఏపీ రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా, అదనంగా మరో మూడు గేట్లు ఏర్పాటుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వానాకాలం సీజన్ నాటికే ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల వెంట భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజ్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.దెబ్బతిన్న పార్వతీ బరాజ్ కరకట్టమరమ్మతు చేపట్టిన నీటిపారుదల శాఖ అధికారులుమంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపు రం గ్రామ సమీపంలోని పా ర్వతీ బరాజ్ కరకట్ట కోతకు గురైంది. అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికా రులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టారు. ఏడాదిన్నర క్రితం బరాజ్ డెలివరీ సిస్టం వైపు ఉన్న కరకట్ట దెబ్బతినగా మట్టి పోశారు. కానీ, భారీ వర్షాలకు మరోసారి కరకట్ట కోతకు గురైంది. అప్పటినుంచి మరమ్మతు చేపట్టలేదు. జాతీయ భద్రత ప్రాధికార సంస్థ ఆదేశాలకనుగుణంగా ప్రస్తుతం బరాజ్ మరమ్మతు కొనసాగుతోంది. ఈ క్రమంలో దిగువ గేట్లవైపు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 74 గేట్లను ఎత్తడంతో బరాజ్‌లోని నీరు పూర్తిగా ఖాళీ అయింది. పనిలోపనిగా గతంలో దెబ్బతిన్న కరకట్ట మరమ్మతు కూడా చేస్తున్నారు. కరకట్ట కోతకు గురికాకుండా పకడ్బందీగా పనులు..నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోనే కరకట్ట కోతకు గురైనట్లు పలువురు భావించారు. కానీ, బరాజ్‌లోకి పూర్తిస్థాయి నీరు చేరినా...కరకట్ట కోతకు గురికాకుండా పనులు పకడ్బందీగా చేస్తున్నామని డీఈఈ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. కోతకు గురైన ప్రాంతంలో మట్టి తొలగించి కంకర, సిమెంట్, కాంక్రీట్తోపాటు దిగువకు జారకుండా సిమెంట్ బిళ్లలు అమర్చుతామని ఆయన వివరించారు.ఏవైనా అనూహ్య పరిస్థితులేర్పడి కరకట్ట ప్రమాదానికి గురైనా దిగువన 130 మీటర్ల లోతు ఉంటుందని, సమీప గ్రామాలకు వరద చేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. కాగా బరాజ్‌లోకి 5,429 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతేమొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నామని ఆయన వివరించారు. -
తప్పుడు వివరాలిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: పంటరుణాలకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల వారీగా క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పిస్తున్నామని, ఒక సొసైటీ పరిధిలో ఒకే రోజు ఐదువందల మందికి రుణాలు ఇచ్చినట్లు సమాచారం వచి్చందని, ఇదే తరహాలో 7 బ్యాంకులు సమాచారం ఇచ్చాయన్నారు.వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో రుణ మంజూరుకు కారణాలను పరిశీలించి నిర్ధారించుకుంటామన్నారు. తప్పుడు సమాచా రం ఇచ్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి తుమ్మల మీడియాతో మాట్లాడారు.రుణమాఫీకి 25 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తా యని ప్రాథమికంగా భావించామని, అయితే, రాష్ట్రవ్యాప్తంగా 32 బ్యాంకుల ద్వారా రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు ఉందన్నారు. కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని, ఈ కా ర్డు లేని వారిని పాస్‌బుక్ ఆధారంగా గుర్తిస్తామన్నారు.రుణమాఫీ చేయకుంటే ఉరితీయండి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పంటరుణ మాఫీ చారిత్రక నిర్ణయమని తుమ్మల చెప్పారు. అన్నదాతకు లబ్ధి చేకూరే ఈ పథకంపై రాజకీయ నేతలు తప్పుగా మాట్లాడొద్దని, అర్హత ఉన్న ప్రతి రైతుకూ పంటరుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏవైనా అనుమానాలు ఉంటే రైతు వేదికల వద్ద వ్యవసాయాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఇంకా నాలుగున్నరేళ్లపాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని, రుణమాఫీ చేయకుంటే తమను ఉరితీయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రూ.లక్షలోపు రుణమాఫీ చేశామని, త్వరలో రూ.1.5 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని, ఆ తర్వాత రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ.1.50 లక్షలు, రూ.2 లక్షల రుణమాఫీ లబి్ధదారులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చెప్పలేమని, నిధులు విడుదల సమయంలో వెల్లడిస్తామని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.మొత్తంగా రూ.31 వేల కోట్ల మేర రుణమాఫీ జరుగుతుందని, ఇప్పటివరకు చేసిన రూ.లక్ష లోపు మాఫీ ద్వారా 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. రుణమాఫీ పొందని రైతులు సంబంధిత కలెక్టరేట్లో లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి కారణాలు తెలుసుకోవచ్చన్నారు. -
విత్తన సహకార సంస్థ ఏర్పాటు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా విత్తన ఉత్పత్తి, సేంద్రియ ఉత్పత్తుల సహకార సంస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం, విత్తన ఉత్పత్తుల్లో నిమగ్నమైన రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహకార సంఘాలకు గురువారం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. రైతులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో సహకార ఉద్యమం దాదాపు 125 సంవత్సరాల నుంచి ఉందని, కానీ సకాలంలో మార్పులు చేయకపోవడం వల్ల అది కాలం చెల్లినట్లు కనిపిస్తోందని అన్నారు. సహకార రంగం ఈ కాలపు అవసరాలకు అనుగుణంగా బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. సహకార రంగం పటిష్టతకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని, ఇందు కోసం ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్య క్రమంలో ఐదు సహకార సంఘాలకు అవార్డు లతో పాటు రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. టీజీకాబ్ చైర్మన్ ఎం.రవీందర్రావు, ఎండీ గోపి, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వండివ్యవసాయ శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఉద్యోగుల హాజరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ సంచాలకుడిని ఆదేశించారు. గురువారం మంత్రి బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు సమయానికి రాని విషయాన్ని గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు తీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్‌ను ఆదేశించారు. -
నాలుగు పథకాలకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న 3 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలకు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇది ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని, ఇప్పటికే మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోకి తెచ్చి భూసార పరీక్షలు ప్రారంభించిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. రైతుబీమాలో 1,222 క్లెయిమ్స్ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే ఆసరా సకాలంలో అందుతుందా? లేదా? అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. పంటల నమోదులో కచ్చితత్వం ఉండాలని, ఇది అన్నింటికీ ప్రాతిపదిక అన్నారు. ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ చేపట్టి మూడేళ్లయినా ఇంకా రెండు శాఖల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదని తుమ్మల అసంతృప్తి వ్యక్తంచేశారు. 2023–24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి ఉందన్నారు. హెచ్‌ఈవోలు లేనిచోట ఏఈవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రైతును ఎంపిక చేయడం నుంచి డ్రిప్ ఇన్స్టాల్ చేయించడం, మొక్కలు నాటించడం వరకు అన్నింటిపై ఏఈవో, ఏవో బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై ఇతర పంటలు సాగుచేసే రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్, డైరెక్టర్ గోపి, ఉద్యాన డైరెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ ధరలు స్థిరీకరించండి
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ధరలను స్థిరీకరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శనివారం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆయిల్‌పామ్ గెలలకు టన్ను ధర రూ.15 వేలుగా నిర్ణయించాలని, అదేవిధంగా పామాయిల్ ధర కనీసం టన్నుకు రూ.లక్ష వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 1992 నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమైన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్ పామ్ ద్వారా అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులిచ్చామని, ఆయిల్ పామ్ మొక్కలు పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 44 నర్సరీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.13,438గా ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి పామాయిల్ ధరలు, వంట నూనెల దిగుమతి సుంకంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రైతులను నిరాశపరచడమే కాకుండా కొత్తగా ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందన్నారు.ముడి పామాయిల్ దిగుమతులపై ఉన్న సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేయడంతో ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ కారణంగా ఖమ్మం జిల్లాలో చాలామంది ఆయిల్ పామ్ రైతులు తమ తోటలను తొలగించి వాటి స్థానంలో వేరే పంటల సాగుకు మారారని మంత్రి లేఖలో పేర్కొన్నారు. -
17 లక్షల ఎకరాల్లో సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19 వరకు 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి 15.60 లక్షల ఎకరాలు, కంది 76 వేల ఎకరాల్లో సాగయిందని చెప్పారు. రానున్న రోజుల్లో వరినాట్లు, ఆరుతడి పంటల సాగు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో వానాకాలం పంటల సాగు, ఎరువుల నిల్వ, సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని, అదే విధంగా విక్రయాలను పరిశీలించాలని సూచించారు. 10.40 ఎల్ఎంటీల యూరియా కేటాయింపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా, 2.40 ఎల్ఎంటీల డీఏపీ, 10.00 ఎల్ఎంటీల కాంప్లెక్స్ , 0.60 ఎల్ఎంటీల ఎంవోపీ ఎరువులు కేటాయించిందని మంత్రి తెలిపారు. జూలై చివరి నాటికి 5.65 ఎల్ఎంటీల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 ఎల్ఎంటీల యూరియా, అలాగే 1.57 ఎల్ఎంటీల డీఏపీ, 1.30 ఎల్ఎంటీల కాంప్లెక్స్, 0.38 ఎల్ఎంటీల ఎంవోపీ అందుబాటులో తెచ్చామన్నారు. 1.07 ఎల్ఎంటీల యూరియా, 0.54 ఎల్ఎంటీల డీఏపీ, 1.06 ఎల్ఎంటీల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని మంత్రికి అధికారులు వివరించారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువుల కోసం కేంద్ర మంత్రికి లేఖఆగస్టు నెల వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి లేఖ రాశారు. వానాకాలం పంటలు తెలంగాణలో ముందుగా ప్రారంభమవుతాయని, దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్ర కేటాయింపుల ప్రకారం ఆగస్టు నెల వరకు కేటాయించిన డీఏపీ, ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. -
విత్తన కంపెనీల టార్గెట్‌పై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని విత్తన కంపెనీలు విత్తనాలను సరఫరా చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తన కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి చాంబర్లో వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన ప్యాకెట్లు కంపెనీ నుంచి రైతులకు చేరే వరకు నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు.పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వివరిస్తూ రూ.61.15 కోట్లు విలువగల 1,09,937 క్వింటాళ్ళ విత్తనాలను రైతులకు అందచేశామని వివరించారు. గతేడాది జూన్15 నాటికి 64,34,215 పత్తి ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచగా, ఈసారి 1,02,45,888 ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, రైతులు ఇప్పటికే 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో 7,97,194 మెట్రిక్ టన్నుల యూరియా, 75,278 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4,27,057 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,396 మెట్రిక్ టన్నుల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. పంటల నమోదు పారదర్శకంగా ఉండాలి రాష్ట్రంలో పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా జరపాలని మంత్రి తుమ్మల సంబంధింత అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని ఆయిల్ పామ్ కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పామ్ పంటలకే కాకుండా ఇతర పంటలకూ వర్తింపజేయాలని సూచించారు. -
75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం
సాక్షి, హైదరాబాద్: విత్తనాల సరఫరాను పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్లు విస్తృతంగా పర్యటించా లని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. గత ఏడాది పచ్చిరొట్ట విత్తన విక్ర యాలు 26,997 క్వింటాళ్లు ఉండగా.. ఈ ఏడాది 58,565 క్వింటాళ్లు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందు బాటులో ఉంచామని స్పష్టం చేశారు.శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ల కలెక్టర్లతో మంత్రి మాట్లాడి విత్తన పంపిణీపై ఆరా తీశారు. గతేడాది 1,000 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు పంపిణీ అయితే.. ఈ ఏడాది 1,800 క్వింటాళ్ల విత్తనాలు అందు బాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. రైతులు కోరుతున్న ఓ కంపెనీ పత్తి విత్తనాల విషయంలో 30 వేల ప్యాకెట్లు అదనంగా ఇవ్వడానికి ఆ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో విత్తనాలు అందేలా చూస్తామని మంత్రికి వివరించారు. -
పత్తి విత్తనాల కొరత ?..మంత్రి తుమ్మల రియాక్షన్
-
పత్తి విత్తనాల కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 2023–24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా, ఈ వానాకాలం సీజన్లో 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసి 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని వెల్లడించారు. దీనికనుగుణంగా బుధవారం వరకు 51,40,405 పత్తి ప్యాకెట్లను వివిధ జిల్లాలలో రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన 10,39,040 పత్తి ప్యాకెట్లను ఇప్పటికే రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ మేరకు మంత్రి తుమ్మల బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.క్యూల్లో ప్యాకెట్ల పంపిణీ ఎక్కడ.. ఎందుకంటే..కొన్ని జిల్లాల్లోని రైతులు ఒకే కంపెనీకి చెందిన, ఒకే రకం పత్తి విత్తనాల కోసం డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. అయితే ఆ రకం విత్తనాలు డిమాండ్ మేరకు లేకపోవడం వల్ల ఉన్న వాటిని రైతులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒక్కొక్కరినీ వరుసలో నిల్చోబెట్టి ఆ రకానికి చెందిన పత్తి విత్తన ప్యాకెట్లు రెండేసి చొప్పున ఇచ్చామని ఆయన వివరించారు. అంతేతప్ప ఆ మార్కెట్లలోగానీ, ఆ జిల్లాల్లో గానీ పత్తి విత్తన ప్యాకెట్లలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. రైతులు ఒకటే కంపెనీ కోసం పోటీ పడొద్దురైతులు కేవలం ఒకటే కంపెనీ, ఒకటే రకానికి చెందిన విత్తనాల కోసమే పోటీ పడకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న, గతంలో మంచి దిగుబడులు ఇచ్చిన రకాలను కూడా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. విత్తన చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.2.49 కోట్ల విలువైన 188.29 క్వింటాళ్ళ నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకొని 33 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేస్తాంఈ వానాకాలంలో 109.15 కోట్ల సబ్సిడీ విలువతో 1.95 లక్షల క్వింటాళ్ళ పచ్చి రొట్ట విత్తనాన్ని పంపిణీ చేయాలని ప్రతిపాదించి, ఇప్పటివరకు 79,261 క్వింటాళ్ళు పంపిణీ చేశామని, అందులో 54,162 క్వింటాళ్ళు రైతులు కొనుగోలు చేశారని మంత్రి తుమ్మల తెలిపారు. ఎరువులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులను 12.28 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తన దుకాణం వద్ద మండుటెండను సైతం లెక్కచేయకుండా విత్తనాలను కొనుగోలు చేసేందుకు గంటల తరబడి బారులు తీరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో బుధవారం విత్తన దుకాణాల తనిఖీకి వచ్చిన కలెక్టర్ రాజర్షి షా రైతుల ఇబ్బందులను చూసి.. టెంట్లు ఏర్పాటు చేయాలని షాపు యజమానిని ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు టెంట్లు ఏర్పాటు చేయడంతో రైతులు కాస్త సేద తీరారు.–సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఎరువులు, విత్తనాల సరఫరాలో సమస్య రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎక్కడా కూడా రైతులకు ఆటంకం రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు దీనిపై సమాచారం సేకరించాలని అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వానాకాలంలో ఇప్పటికే 6.26 లక్షల టన్నుల యూరియా, 0.76 లక్షల టన్నుల డీఏపీ, 3.84 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.29 లక్షల టన్నుల ఎంవోపీ ఎరువులను అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 50,942 క్వింటాళ్ల జీలుగు, 11,616 క్వింటాళ్ల జనుము, 236 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో తెచ్చామన్నారు.మరో 30, 400 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న పచి్చరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ, మార్కెట్లలో అందుబాటులో ఉంచిన పత్తి ప్యాకెట్లు, అమ్మకాలు, సన్నరకాల లభ్యతపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకేసారి పచి్చరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడిందని, అయినా సకాలంలో అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయా కంపెనీల గతేడాది బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేడు వ్యవసాయ వర్సిటీలో విత్తనమేళా 13.32 లక్షల క్వింటాళ్ల సన్న రకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దీనిపై శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో విత్తన మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సన్నసాగును ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ఉద్దేశమని, దానికనుగుణంగా తొలివిడతగా వీటికి రూ. 500 బోనస్ ప్రకటించామని, అధికారులు దీనిపై రైతుల్లో అవగాహన కలి్పంచాలని ఆదేశించారు. త్వరలో రైతు సంఘాలతో సమావేశం త్వరలోనే రాష్ట్రస్థాయిలో వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. సచివాలయంలో శుక్రవారం తుమ్మలతో అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే‹Ùరెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వానాకాలం రైతు భరోసా, పంటల బీమా విధివిధానాలపై మంత్రితో చర్చించారు. -
బోనస్ అంటే తెలియనోళ్లు మొరుగుతున్నారు
ఖమ్మం వన్‌టౌన్: కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని, అందుకే సన్నాలు పండించే రైతులకు రూ.500 బోనస్ ప్రకటించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బోనస్ అంటే అర్థం తెలియని వారు కాంగ్రెస్‌పై మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రాజీవ్‌గాంధీ వర్థంతి వేడుకల్లో పాల్గొని మంత్రి మాట్లాడారు. మా ప్రభుత్వం మూడు రోజుల్లోనే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు భావించారని, అది సాధ్యం కాకపోవడంతో పొద్దున లేచింది మొదలు కాంగ్రెస్ పార్టీపై పడి ఏడుస్తున్నారన్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏడవాలో తెలియని సన్నాసులు బీఆర్ఎస్ వాళ్లని పేర్కొన్నారు. పదేళ్ల పాటు వ్యవస్థలను నాశనం చేసిన వారు నీతులు చెబుతున్నారని విమర్శించారు. కాగా, ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపిస్తున్నారని.. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టిన నేత రాజీవ్‌గాంధీ అని, ప్రపంచంలో అనేక సంస్థలకు భారతీయులే సీఈఓలుగా ఉండడానికి రాజీవ్ ఇచ్చిన స్ఫూర్తే కారణమని తెలిపారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.