విప్లవ వీడ్కోలు | Revolutionary farewell for royala subhash chandra bose | Sakshi
Sakshi News home page

విప్లవ వీడ్కోలు

Published Fri, Mar 11 2016 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

విప్లవ వీడ్కోలు

విప్లవ వీడ్కోలు

పిండిప్రోలులో ‘రాయల’ అంత్యక్రియలు
రాయల సుభాష్‌చంద్రబోస్ సంతాప సభలో
మంత్రి తుమ్మల, కేంద్ర నాయకుడు యతేంద్రకుమార్

 ఖమ్మం మయూరిసెంటర్, తిరుమలాయ పాలెం:‘‘రాయల సుభాష్‌చంద్ర బోస్ విప్లవ జ్యోతి. ఆయనను కోల్పోవడం బాధాకరం’’ అని, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో మృతిచెందిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ భౌతికకాయాన్ని గురువారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజల దర్శనార్థం ఉంచారు. నాయకులు, ప్రజలు నివాళులర్పించారు.  అనంతరం, ఎన్‌డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. మంత్రి మాట్లాడుతూ..  న్యూడెమోక్రసీ(ఎన్‌డీ) నేతగా పేదలు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాయల సుభాష్ చంద్రబోస్ ఎన్నో పోరాటాలు సాగించారని నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసమస్యలపై సాగే పోరాటాలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు.

 రెడ్ సెల్యూట్: న్యూడెమోక్రసీ కేంద్ర ప్రధాన కార్యదర్శి యతేంద్రకుమార్ మాట్లాడుతూ.. విప్లవోద్యమ శిఖరాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. 47 సంవత్సరాలపాటు రహస్య జీవితం గడిపి, నిబద్ధతతో.. క్రమశిక్షణతో పేదల పక్షాన పోరాడిన రాయలకు రెడ్ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.

 భర్త కాదు.. రాజకీయ గురువు: పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, సుభాష్ చంద్రబోస్ సతీమణి రమాదేవి మాట్లాడుతూ.. ‘‘ఆయన నాకు భర్త మాత్రమే కాదు. రాజకీయ గురువు కూడా. నన్ను ఆయన వెనుక ఉండి నడిపించారు. ఆయన లక్ష్యాన్ని సాధించడమే మనమిచ్చే నిజమైన నివాళి’’ అని అన్నారు.

ఆదర్శ కమ్యూనిస్టు: న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వై.సాంబశివరావు మాట్లాడుతూ.. ఆదర్శ కమ్యూనిస్టును కోల్పోయామని అన్నారు.

కమ్యూనిస్టు ఉద్యమానికి లోటు: పిండిప్రోలులో జరిగిన సంతాప సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రాయల సుభాష్‌చంద్రబోస్ మృతితో కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు ఏర్పడిందన్నారు. రానున్న కాలంలో కమ్యూని స్టులు ఐక్య ఉద్యమాలకు సిద్ధపడడమే అమరులకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు.

నాన్న శ్వాస, ఊపిరి..కమ్యూనిజం : రాయ ల సుభాష్‌చంద్రబోస్ కుమార్తె స్పందన మాట్లాడుతూ.. ‘‘నాన్న ప్రతి శ్వాస, ఊపిరి.. కమ్యూనిజం. పేదల కష్టాలను తొలగించేందుకు పోరాటాలు నిర్వహించి వారి గుండెల్లో ‘నాన్న’గా నిలిచారు. నా ఊపిరి ఉన్నంత వరకు.. ఆయన ఆశయ సాధనే నా లక్ష్యం’’ అని అన్నారు.

నాయకుల నివాళి: ఖమ్మంలో భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ; సీపీఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్; జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య, ఎన్‌డీ(చంద్రన్న) నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ తదితరులు ఉన్నారు.

కన్నీటి వీడ్కోలు
రాయల సుభాష్‌చంద్రబోస్(రవన్న)కు ఆయన స్వగ్రామమైన తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయం నుంచి భౌతికకాయాన్ని గురువారం సాయంత్రం పిండిప్రోలుకు తరలించి, రాయల వెంకటనారాయణ భవనంలో కొద్దిసేపు ఉంచారు. చివరి చూపు కోసం న్యూడెమోక్రసీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఊర చెరువు ప్రాంతంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. న్యూడెమోక్రసీ కేంద్ర కార్యదర్శి డాక్టర్ యతీంద్రకుమార్ , కేంద్ర కమిటీ సభ్యులు సాంబశివరావు, డి.వి.కృష్ణ, వేములపల్లి వెంకట్రామయ్య, పి.ప్రసాద్, కె.జి.రామచంద్రన్, ఏపీ కార్యదర్శి గాదె దివాకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాల సంఘం చైర్మన్ మువ్వా శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement