Royal Subhash Chandra Bose
-
రవన్నకు నివాళి
పిండిప్రోలు (తిరుమలాయపాలెం): తన యావజ్జీవితాన్ని పేద ప్రజలకు అంకిత ం చేసిన రాయల సుభాష్‌చంద్రబోస్ (రవన్న) ధన్య జీవి అని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీవీ కృష్ణ ఘనంగా నివాళులర్పించారు. పిండిప్రోలు గ్రామంలో ఆదివారం రవన్న సంతాప సభలో ఆయన మాట్లాడారు. నూతన ప్రజా స్వామిక విప్లవం, సమసమాజ స్థాపన కోసం రవన్న 48 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపారని, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారని అన్నారు. నిరుపేదల గుండెల్లో సజీవుడు బోస్ భార్య, పార్టీ నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ.. బోస్ ఎప్పటికీ అమరుడేనని, నిరుపేదల గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారని అన్నారు. నిజమైన కమ్యునిస్టు ఎలా ఉండాలో ఆయనను చూసి నేర్చుకున్నానని అన్నారు. బోసే తన గురువని అన్నారు. సమసమాజ స్థాపన కోసం ముందుకు సాగడమే ఆయనకు అర్పించగల నివాళియని అన్నారు. కమ్యూనిజం అజేయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కమ్యూనిజం ఎప్పటికీ అజేయంగా ఉంటుందని అన్నారు. దోపిడీ వ్యవస్థను అంతమొందించాలన్న ఆయన ఆలోచన విధానంతో తాము ఏకీభవిస్తున్నామని అన్నారు. సమ సమజ స్థాపనకు, దోపిడీ వ్యవస్థ అంతానికి కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ‘‘నాకు బోస్ రాజకీయ గురువు, అభిమాన నాయకుడు’’ అని అన్నారు. కమ్యూనిస్టులతోనే దోపిడీ వ్యవస్థ అంతం సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ నారాయణ మాట్లాడుతూ.. దోపిడీ వ్యవస్థను అంతం చేసే శక్తి కమ్యునిస్టులకు మాత్రమే ఉందని అన్నారు. బోస్ ఆశయ సాధనకు పాటుపడతామని, కమ్యూనిస్టులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల విముక్తే ధ్యాస, శ్వాస న్యూడెమోక్రసీ ఏపీ కార్యదర్శి గాదె దివాకర్ మాట్లాడుతూ.. రవన్న అనారోగ్యంపాలు కావడానికి కొన్ని గంటల ముందు కూడా.. దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘోపన్యాసం చేశారని చెప్పారు. ఇండియన్ చేగువేరా ప్రజాకవి జయరాజు మాట్లాడుతూ.. ‘‘నా అభిమాన నాయకుడు బోస్. ఆయన ఇండియన్ చేగువేరా. నేను చావుబతుకుల్లో ఉన్నప్పుడు వెన్నుతట్టి, కోలుకుంటావని ధైర్యం చెప్పారు. ఆయన నాలాంటి ఎందరికో ఆప్తుడు, స్ఫూర్తిప్రదాత’’ అని అన్నారు. ఎర్ర జెండా ఉండాల్సింది పేదల ఇళ్లల్లో అని గట్టిగా నమ్మారని నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు రాయల చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, నాయకులు పోటు ప్రసాద్, కెచ్చల రంగయ్య, పరకాల నాగన్న, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, పుసులూరి నరేందర్, కందాళ నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, ఉద్యోగ సంఘం నాయకుడు ఏలూరి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకులు స్వర్ణకుమారి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ , టీ న్యూస్ చీఫ్ ఎడిటర్ పి.వి. శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, బోస్ మాతృమూర్తి రాంబాయమ్మ, సోదరుడు రాయల నాగేశ్వరరావు తదితరులు కూడా మాట్లాడారు. -
విప్లవ వీడ్కోలు
♦ పిండిప్రోలులో ‘రాయల’ అంత్యక్రియలు ♦ రాయల సుభాష్‌చంద్రబోస్ సంతాప సభలో ♦ మంత్రి తుమ్మల, కేంద్ర నాయకుడు యతేంద్రకుమార్ ఖమ్మం మయూరిసెంటర్, తిరుమలాయ పాలెం:‘‘రాయల సుభాష్‌చంద్ర బోస్ విప్లవ జ్యోతి. ఆయనను కోల్పోవడం బాధాకరం’’ అని, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో మృతిచెందిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ భౌతికకాయాన్ని గురువారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజల దర్శనార్థం ఉంచారు. నాయకులు, ప్రజలు నివాళులర్పించారు. అనంతరం, ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. న్యూడెమోక్రసీ(ఎన్డీ) నేతగా పేదలు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాయల సుభాష్ చంద్రబోస్ ఎన్నో పోరాటాలు సాగించారని నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసమస్యలపై సాగే పోరాటాలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. రెడ్ సెల్యూట్: న్యూడెమోక్రసీ కేంద్ర ప్రధాన కార్యదర్శి యతేంద్రకుమార్ మాట్లాడుతూ.. విప్లవోద్యమ శిఖరాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. 47 సంవత్సరాలపాటు రహస్య జీవితం గడిపి, నిబద్ధతతో.. క్రమశిక్షణతో పేదల పక్షాన పోరాడిన రాయలకు రెడ్ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. భర్త కాదు.. రాజకీయ గురువు: పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, సుభాష్ చంద్రబోస్ సతీమణి రమాదేవి మాట్లాడుతూ.. ‘‘ఆయన నాకు భర్త మాత్రమే కాదు. రాజకీయ గురువు కూడా. నన్ను ఆయన వెనుక ఉండి నడిపించారు. ఆయన లక్ష్యాన్ని సాధించడమే మనమిచ్చే నిజమైన నివాళి’’ అని అన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు: న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వై.సాంబశివరావు మాట్లాడుతూ.. ఆదర్శ కమ్యూనిస్టును కోల్పోయామని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి లోటు: పిండిప్రోలులో జరిగిన సంతాప సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రాయల సుభాష్‌చంద్రబోస్ మృతితో కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు ఏర్పడిందన్నారు. రానున్న కాలంలో కమ్యూని స్టులు ఐక్య ఉద్యమాలకు సిద్ధపడడమే అమరులకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు. నాన్న శ్వాస, ఊపిరి..కమ్యూనిజం : రాయ ల సుభాష్‌చంద్రబోస్ కుమార్తె స్పందన మాట్లాడుతూ.. ‘‘నాన్న ప్రతి శ్వాస, ఊపిరి.. కమ్యూనిజం. పేదల కష్టాలను తొలగించేందుకు పోరాటాలు నిర్వహించి వారి గుండెల్లో ‘నాన్న’గా నిలిచారు. నా ఊపిరి ఉన్నంత వరకు.. ఆయన ఆశయ సాధనే నా లక్ష్యం’’ అని అన్నారు. నాయకుల నివాళి: ఖమ్మంలో భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ; సీపీఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్; జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య, ఎన్డీ(చంద్రన్న) నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ తదితరులు ఉన్నారు. కన్నీటి వీడ్కోలు రాయల సుభాష్‌చంద్రబోస్(రవన్న)కు ఆయన స్వగ్రామమైన తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయం నుంచి భౌతికకాయాన్ని గురువారం సాయంత్రం పిండిప్రోలుకు తరలించి, రాయల వెంకటనారాయణ భవనంలో కొద్దిసేపు ఉంచారు. చివరి చూపు కోసం న్యూడెమోక్రసీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఊర చెరువు ప్రాంతంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. న్యూడెమోక్రసీ కేంద్ర కార్యదర్శి డాక్టర్ యతీంద్రకుమార్ , కేంద్ర కమిటీ సభ్యులు సాంబశివరావు, డి.వి.కృష్ణ, వేములపల్లి వెంకట్రామయ్య, పి.ప్రసాద్, కె.జి.రామచంద్రన్, ఏపీ కార్యదర్శి గాదె దివాకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాల సంఘం చైర్మన్ మువ్వా శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు. -
జస్టిస్ కృష్ణయ్యర్‌కు న్యూడెమోక్రసీ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తన జీవితమంతా ప్రజల పక్షం వహించి, ప్రజల ప్రయోజనాల కోసమే నిలబడి, దేశంలో సామ్యవాద సమాజ స్వప్నాన్ని సాకారం చేయాలని గాఢంగా కోరుకున్న జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్‌కు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ నివాళులర్పించారు. కేరళ హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన ఆయన, 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో కేరళలో ఏర్పడిన మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారన్నారు. భూసంస్కరణల అమలుకు, ఇంకా అనేక ప్రజా అనుకూల చర్యల అమలుకు కృషి చేశారన్నారు. మొదట హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రజలకు అనుకూలంగా వ్యాఖ్యానించి, వారికి అనుకూలంగా తీర్పునిచ్చేందుకు కృషిచేశారని పేర్కొన్నారు.