
రవన్నకు నివాళి
పిండిప్రోలు (తిరుమలాయపాలెం): తన యావజ్జీవితాన్ని పేద ప్రజలకు అంకిత ం చేసిన రాయల సుభాష్‌చంద్రబోస్ (రవన్న) ధన్య జీవి అని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీవీ కృష్ణ ఘనంగా నివాళులర్పించారు. పిండిప్రోలు గ్రామంలో ఆదివారం రవన్న సంతాప సభలో ఆయన మాట్లాడారు. నూతన ప్రజా స్వామిక విప్లవం, సమసమాజ స్థాపన కోసం రవన్న 48 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపారని, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారని అన్నారు.
నిరుపేదల గుండెల్లో సజీవుడు
బోస్ భార్య, పార్టీ నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ.. బోస్ ఎప్పటికీ అమరుడేనని, నిరుపేదల గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారని అన్నారు. నిజమైన కమ్యునిస్టు ఎలా ఉండాలో ఆయనను చూసి నేర్చుకున్నానని అన్నారు. బోసే తన గురువని అన్నారు. సమసమాజ స్థాపన కోసం ముందుకు సాగడమే ఆయనకు అర్పించగల నివాళియని అన్నారు.
కమ్యూనిజం అజేయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కమ్యూనిజం ఎప్పటికీ అజేయంగా ఉంటుందని అన్నారు. దోపిడీ వ్యవస్థను అంతమొందించాలన్న ఆయన ఆలోచన విధానంతో తాము ఏకీభవిస్తున్నామని అన్నారు. సమ సమజ స్థాపనకు, దోపిడీ వ్యవస్థ అంతానికి కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ‘‘నాకు బోస్ రాజకీయ గురువు, అభిమాన నాయకుడు’’ అని అన్నారు.
కమ్యూనిస్టులతోనే దోపిడీ వ్యవస్థ అంతం
సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ నారాయణ మాట్లాడుతూ.. దోపిడీ వ్యవస్థను అంతం చేసే శక్తి కమ్యునిస్టులకు మాత్రమే ఉందని అన్నారు. బోస్ ఆశయ సాధనకు పాటుపడతామని, కమ్యూనిస్టులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రజల విముక్తే ధ్యాస, శ్వాస
న్యూడెమోక్రసీ ఏపీ కార్యదర్శి గాదె దివాకర్ మాట్లాడుతూ.. రవన్న అనారోగ్యంపాలు కావడానికి కొన్ని గంటల ముందు కూడా.. దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘోపన్యాసం చేశారని చెప్పారు.
ఇండియన్ చేగువేరా
ప్రజాకవి జయరాజు మాట్లాడుతూ.. ‘‘నా అభిమాన నాయకుడు బోస్. ఆయన ఇండియన్ చేగువేరా. నేను చావుబతుకుల్లో ఉన్నప్పుడు వెన్నుతట్టి, కోలుకుంటావని ధైర్యం చెప్పారు. ఆయన నాలాంటి ఎందరికో ఆప్తుడు, స్ఫూర్తిప్రదాత’’ అని అన్నారు. ఎర్ర జెండా ఉండాల్సింది పేదల ఇళ్లల్లో అని గట్టిగా నమ్మారని నివాళులర్పించారు.
పార్టీ రాష్ట్ర నాయకుడు రాయల చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎన్‌డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, నాయకులు పోటు ప్రసాద్, కెచ్చల రంగయ్య, పరకాల నాగన్న, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, పుసులూరి నరేందర్, కందాళ నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, ఉద్యోగ సంఘం నాయకుడు ఏలూరి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకులు స్వర్ణకుమారి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ , టీ న్యూస్ చీఫ్ ఎడిటర్ పి.వి. శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, బోస్ మాతృమూర్తి రాంబాయమ్మ, సోదరుడు రాయల నాగేశ్వరరావు తదితరులు కూడా మాట్లాడారు.