హైదరాబాద్, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మందా జగన్నాథంకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. చంపాపేటలోని మందా ఇంటికి వెళ్లిన కేటీఆర్.. మంధా పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.
‘‘మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి ఆయన. రాజకీయాల్లో వివాదరహితుడు ,సౌమ్యుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. నాలుగు సార్లు ఎంపీ గా అయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని కేటీఆర్ మీడియాతో అన్నారు.
అధికారిక లాంఛనాలతో..
మందా జగన్నాథం అంత్యక్రియల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖుల సంతాపం
మందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్‌ఎస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మందా ప్రస్థానం
నాగర్‌కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా నెగ్గారు. 1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్‌పీలో చేరారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించి కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment