నివాళి: ఉస్తాద్ జాకిర్ హుసేన్
పుట్టిన వెంటనే చెవిలో ‘కల్మా’ కాకుండా తబలా జతులు విన్నవాడు... మూడేళ్లకే తబలాను పసి వేళ్లతో మీటిన వాడు... ఏడేళ్లకు ప్రదర్శనలు ఇచ్చినవాడు...
పన్నెండేళ్లకు ప్రపంచ యాత్రకు బయల్దేరినవాడు... మహా మహా విద్వాంసులకు సహ వాద్యగాడు... తనే స్వయంగా అద్వితీయ వాద్యకారుడు... తబలా ప్రపంచానికి ఈశ్వరుడు... దేవుడు... ఉస్తాద్ జాకీర్ హుసేన్.
టీషర్ట్, జీన్స్ వేసుకుని ఆధునిక యువకుడిగా ఉంటూ సంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్ని కుర్రకారుకు చేరువ చేసిన ఈ నవ యువ వాద్య మాంత్రికుడు కన్నుమూశాడు. అతను లేడు. అతనిలాంటి వాడు మరి రాడు. ఒక్కడే జాకిర్ హుసేన్.
జాకిర్ హుసేన్ ప్రదర్శనలో ఎవరైనా ఇది చూడాలి. ఆయన తబలా మీద డమరుకాన్ని, శంఖాన్ని వినిపిస్తాడు. ‘ఎడమ’ మీద డమరుకం వినిపిస్తూ ‘కుడి’ని మీటి శంఖనాదాన్ని సృష్టిస్తాడు. ఆ శంఖనాద సమయంలో జాకిర్ హుసేన్ వేళ్లు ఎంత వేగంగా కదులుతాయంటే అవి కనపడవు. పైగా తబలాని తాకినట్టుగా కూడా ఉండవు. ఇలా వాయించడం అసాధ్యం. ‘ఇది ఎలా సాధించారు’ అని అనడిగితే ‘సాధన చేయాలి. తబలాతో స్నేహం చేయాలి. దాని మాటకు చెవి ఒగ్గాలి’ అంటాడు జాకిర్ హుసేన్. అంత వినమ్రంగా ఉండటం వల్లే ఆయన తన తబలాకు ప్రపంచమే చెవి ఒగ్గేలా చేయగలిగాడు. ‘ఉస్తాద్’ కాగలిగాడు. ‘మేస్ట్రో’ అనిపించుకున్నాడు.
‘మీరు తబలా ఏ వయసులో నేర్చుకోవడం మొదలెట్టారు’ అని అడిగితే జాకిర్ హుసేన్ ఆశ్చర్యపోతాడు. ‘అదేం ప్రశ్న’ అంటాడు. నిజమే. అతను పుట్టిందే తబలా ఉన్న ఇంట్లో. జాకిర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా జగమెరిగిన తబలా విద్వాంసుడు. మన దేశంలో తబలాకు ఔన్నత్యం తీసుకు వచ్చిన తొలి విద్వాంసుడు. ఆయనకు పెద్ద కొడుకుగా 1951లో ముంబైలో జన్మించాడు జాకిర్ హుసేన్. నర్సింగ్ హోమ్ నుంచి మరుసటిరోజు ఇంటికి తీసుకొస్తే ముస్లిం సంప్రదాయం ప్రకారం తండ్రి తన కొడుకు చెవిలో ‘కల్మా’ చదివి, పేరు పలికి లోపలికి తీసుకెళ్లాలి.
కాని అల్లా రఖా జాకిర్‌ని తన చేతుల్లో తీసుకుని ‘ధాధా ధినా.. థాథా తునా’ అని తబలా జతులు వినిపించాడు. భార్య ‘ఇదేమిటండీ చోద్యం.. దైవ స్తోత్రం వినిపించక’ అనంటే ‘నా దైవం తబలాయే’ అని బదులిచ్చాడాయన. అలా జాకిర్‌కు పుట్టిన వెంటనే తబలా తెలిసింది. జాకిర్‌ను పడుకోబెట్టడానికి తండ్రి రోజూ ఒడిలోకి తీసుకుని తబలా జతులు వినిపిస్తూనే వెళ్లాడు. ఇలా మూడేళ్లు ఆ పసికందు మెదడులోకి తబలా మాత్రమే వెళ్లింది. మూడేళ్లు వచ్చేసరికి జాకిర్ తబలా వరకూ బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లి అత్యంత సహజంగా దానిని మీటాడు.
జాకిర్ హుసేన్ తబలా యాత్ర మొదలైంది.
మన దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ శాస్త్రీయ సంగీతం ఆస్థానాల్లో, దర్బారుల్లో, శ్రీమంతుల మహళ్లలో ఉండిపోయింది. స్వతంత్రం వచ్చాక అవన్నీ వెళ్లి సంగీత కచ్చేరీలు మొదలయ్యాయి. అయితే వాటికి ఆదరణ అంతంత మాత్రమే ఉండేది. ఆ సమయంలో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, సరోద్ వాద్యకారుడు అలి అక్బర్ ఖాన్‌లాంటి వారు అమెరికాకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తూ మన దేశం తిరిగి వచ్చి అటెన్షన్ సంపాదించారు. ఆ తర్వాతి రోజుల్లో సంతూర్ పండిట్ శివకుమార్, వేణువు హరిప్రసాద్ చౌరాసియా కూడా పశ్చిమ దేశాలలోకి మన సంగీతాన్ని తీసుకెళ్లాడు.
పండిట్ రవిశంకర్‌కు శాశ్వతంగా అల్లారఖా తబలాజోడిగా ఉండేవారు. అయితే అల్లా రఖాకు అనారోగ్యం వల్ల జాకిర్‌కు 19ఏళ్లు ఉండగా మొదటిసారి అమెరికా వెళ్లి రవి శంకర్‌కు సహ వాయిద్యం అందించే వీలు జాకిర్‌కు దక్కింది. మొదటిసారి అలా అమెరికాలో అడుగు పెట్టిన జాకిర్ జీవితంలో అత్యధిక కాలం అమెరికాలో ఉంటూ అక్కడినుంచే దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ తబలా వాదనలో ఉండే ఉత్కృష్ట ధ్వనిని ప్రపంచానికి వినిపించాడు. చివరకు అక్కడే– డిసెంబర్ 16 (సోమవారం) అంతిమ శ్వాస వదిలాడు.
‘తబలాకు ఎప్పుడూ కాలు తగలనివ్వకు బాబూ. అది మన సరస్వతి’ అనేవారట ఉస్తాద్ అల్లారఖా. అందువల్ల జాకిర్ హడావిడి ప్రయాణాల్లో రైళ్లలో సీటు దొరక్కపోతే కింద కూచుని తబలాను ఒళ్లో జాగ్రత్తగా పెట్టుకునేవారు. ‘నేను తబలా నేర్చుకుంటాను’ అని ఏడేళ్ల వయసులో మొదటిసారి జాకిర్ తన తండ్రితో చెప్పినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి 3 గంట లకు నిద్ర లేపి సాధన మొదలేయించేవారట అల్లారఖా.
రోజూ రాత్రి మూడు నుంచి ఉదయం 6 వరకు వారి సాధన సాగేది. ఆ తర్వాత స్కూల్ వెళ్లి సాయంత్రం మళ్లీ సాధన కొనసాగించేవాడు. ‘పండితులకు జన్మించే పిల్లలకు పోలిక ఉంటుంది. అల్లా రఖా కొడుకై ఉండి ఇంత సామాన్యంగా వాయిస్తున్నాడా అనంటే మా నాన్న పరువేంగాను. అందుకే నేను మరింత కష్టపడేవాణ్ణి’ అంటాడు జాకిర్. అంతేకాదు అన్ని మతాల సంగీతం నుంచి కూడా నేర్చుకోవడానికి చూశాడు. ‘నేను స్కూల్‌కు వెళ్లే దారిలో చర్చిలో సంగీతం వినేవాణ్ణి. గుడిలో వినిపించే భక్తి గీతాలు ఆలకించేవాణ్ణి. ప్రపంచంలో ఏ మతమూ ఇంకో మతంపైన జబర్దస్తీ చేయదు. ఏ మతమైనా చెప్పేది నీ పొరుగువారిని ప్రేమించమనే’ అంటాడు జాకిర్ హుసేన్.
అందుకే జాకిర్ అన్ని మతాల, అన్ని ధోరణుల విద్వాంసులతో అతి సులువుగా కలిసిపోయి తన తబలాను వారి సంగీతానికి జత చేయగలిగారు. ముఖ్యంగా సంతూర్ శివకుమార్‌తో ఆయనకు సుదీర్ఘ స్నేహం సాగింది. కొన్నాళ్ల క్రితం శివకుమార్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలకు హాజరైన జాకిర్ హుసేన్ దహన వాటిక నుంచి అందరూ వెళ్లిపోయినా తనొక్కడే మండుతున్న చితి పక్కన చాలా సేపు నిలబడిపోయి ఆ స్నేహితునికి అంతిమ వీడ్కోలు పలికాడు. ఈ భారతీయ హిందూ ముస్లిం శాస్త్రీయ సంగీత భాగస్వామ్యాన్ని జాకిర్ స్థిరంగా ప్రచారం చేశాడు. కొనసాగాలని కోరుకున్నాడు.
బీటెల్స్ గ్రూప్ ద్వారా ఖ్యాతి గాంచిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్ ‘లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్’ అనే ఆల్బమ్‌లో జాకిర్ భాగస్వామ్యాన్ని కోరడంతో 1973 నుంచి ఫ్యూజన్ సంగీతానికి ప్రచారం కల్పించసాగాడు జాకిర్ హుసేన్. అమెరికన్ జాజ్ మ్యుజీషియన్ జాన్ హ్యాండీ, ఐరిష్ గాయకుడు వాన్ మారిసన్, అమెరికన్ డ్రమ్మర్ మికీ హర్ట్‌లాంటి ప్రసిద్ధులతో యాభై ఏళ్ల క్రితమే పని చేయడం వల్ల జాకిర్ హుసేన్‌కి హద్దులు లేని ప్రచారం, ప్రశంస లభించాయి. గాత్ర సంగీతమైనా, వాద్య సంగీతమైనా, జుగల్‌బందీ అయినా, వ్యక్తిగత ప్రదర్శన అయినా, ఫ్యూజన్ అయినా జాకిర్ నీరు పాత్ర రూపు దాల్చినంత సులభంగా ఇమిడిపోయి కచ్చేరికి అందం, ఆనందం తెచ్చేవాడు. పొడవైన తన గుబురు జుత్తు గాలిలో ఊగేలా ఆయన సాగించే తబలా వాదనను చూడటానికి జనం విరగబడేవారు. ముచ్చటపడేవారు.
జాకిర్ హుసేన్ మన దేశంలో ‘పద్మశ్రీ’తో గౌరవించబడ్డ (1988) అత్యంత పిన్న వయస్కుడు (అవార్డు ప్రకటించే సమయానికి). ఆ తర్వాత ఆయనకు ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ వచ్చాయి. నాలుగుసార్లు ‘గ్రామీ’ గెలుచుకున్న ఏకైక భారతీయ సంగీతకారుడు. అంతేనా? అమెరికా ప్రభుత్వం కళ, సాంస్కృతిక రంగాల్లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ‘నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్’ జాకిర్‌ను వరించింది. జాకిర్ సినిమాలకు పని చేశాడు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘వానప్రస్థం’ సినిమాకు పాటలు కంపోజ్ చేశాడు. లతా మంగేశ్కర్, ఆశా భోంస్లేల జీవితం ఆధారంగా తీసిన ‘సాజ్’ (1998)లో ఆశా భోంస్లే భర్త ఆర్.డి.బర్మన్ పాత్రలో కనిపించాడు. మంచి మాటగాడు, హాస్యప్రియుడు, భోజన ప్రియుడైన జాకిర్ హుసేన్ ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. నవ్వులు ఉంటాయి.
తబలా ఎలాగూ ఉంటుంది.
గొప్ప సంగీతమయ ప్రపంచాన్ని సృష్టించి, శుభ నాదాలను జగత్తులోకి వదిలి సంగీతం ద్వారా శాంతము పొందమని కోరుతూ వీడ్కోలు తీసుకున్నాడు ఉస్తాద్ జాకిర్ హుసేన్. ప్రపంచ సంగీత ప్రియులు అతణ్ణి తలచుకుని కన్నీరు కారుస్తున్నారు. జాకిర్ ఆత్మ విశ్వ సంగీతంలో డోలలూగాలి.
– కె
Comments
Please login to add a commentAdd a comment