Ustad Zakir Hussain
-
జాకీర్ హుస్సేన్ అందుకున్న అవార్డ్స్, ఆసక్తికరమైన విషయాలు
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) మరణం ఆయన అభిమానులకు తీరని లోటు అని చెప్పవచ్చు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు మిస్ యూ మ్యూజిక్ లెజండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు జాకీర్ జీవితంలో ప్రత్యేకమైన విషయాల గురించి చర్చించుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన జాకీర్ హుస్సేన్.. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, ఫ్యూజన్ సంగీత రంగంలో గణనీయమైన కృషి చేశారు. జాజ్, రాక్ వంటి సంగీతంలో నైపుణ్యం సాధించి ఆపై వాటికి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని మిళితం చేయడంలో జాకీర్ హుస్సేన్ ఒక మార్గదర్శకుడిగా నిలిచారు. శక్తి బ్యాండ్‌లోని జాన్ మెక్లాఫ్లిన్ వంటి కళాకారులతో పాటు అమెరికన్ వాద్యకారుడు మిక్కీ హార్ట్‌తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ కోసం ఆయన పనిచేశారు. ఆ ప్రదర్శనలు అన్నీ సంచలనం రేపాయి. చిత్ర పరిశ్రమలో జాకీర్ హుస్సేన్ పాత్రజాకీర్ హుస్సేన్ అనేక చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చి తనదైన ముద్ర వేశారు. ఆయన సంగీతం అందించిన సాజ్, కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి చిత్రాలకు మంచి ఆదరణ వచ్చింది. ఆపై పలు సినిమాల్లో కూడా నటించారు కూడా. చివరగా మంకీ మ్యాన్ (2024) చిత్రంలో ఆయన కనిపించారు. జాకీర్ హుస్సేన్ సినిమాకి చేసిన కృషి చెరగని ముద్ర వేసింది. తబలాలో అతని నైపుణ్యాన్ని ప్రపంచ చలనచిత్రాలతో మిళితం చేసింది. భారత చిత్ర పరిశ్రమకు జాకీర్ హుస్సేన్ అందించిన గణనీయమైన సహకారం మరువలేనిదని చెప్పవచ్చు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ఆయన ప్రదర్శనలిచ్చారు. ఈ క్రమంలో విమర్శకుల నుంచి కూడా ఆయన ప్రశంసలు అందుకున్నారు.జాకీర్ హుస్సేన్ గురించి ఆసక్తికరమైన విషయాలుజాకీర్ హుస్సేన్ తన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా మార్గదర్శకత్వంలో మూడు సంవత్సరాల వయస్సులోనే తబలా వాయించడం ప్రారంభించారు. ఆపై ఏడేళ్ల వయస్సులోనే తన మొదటి బహిరంగ సంగీత ప్రదర్శన ఇచ్చారు.ఆయన కేవలం 12 సంవత్సరాల వయస్సులో తన మొదటి అంతర్జాతీయ సంగీత కచేరీ పర్యటనను ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించారు.సంగీతంలో రాణించడంతో పాటు, అతను ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.జాకీర్ హుస్సేన్ మిక్కీ హార్ట్‌తో కలిసి "ప్లానెట్ డ్రమ్" ఆల్బమ్‌లో తన సహకారానికి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని సాధించిన కొద్దిమంది భారతీయ సంగీతకారులలో ఒకరిగా రికార్డ్ క్రియేట్ చేశారు.భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే కాకుండా.. జాకీర్ జార్జ్ హారిసన్, జాన్ మెక్లాఫ్లిన్ (శక్తి), యో-యో మా వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి.. తూర్పు. పాశ్చాత్య సంగీత సంప్రదాయాల మధ్య అంతరాన్ని తగ్గించారు.జాకీర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో వర్క్‌షాప్‌ల ద్వారా తదుపరి తరం తబలా ప్లేయర్లను పెంపొందించడంలో తనవంతుగా పనిచేశారు.అతను భారతదేశంలో 'నేషనల్ ట్రెజర్' బిరుదుతో గౌరవించబడ్డారు. ఆపై భారతీయ సంగీతానికి సాంస్కృతిక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. -
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. దాంతో రెండు వారాల క్రితం అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన ఆయన చిన్నప్పటి నుంచే తండ్రి బాటలోనే నడిచారు. అలా ఏడేళ్ల చిరుప్రాయంలోనే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయునిగా పేరు తెచ్చుకున్నారు. గొప్ప కళాకారుడిగా అంతర్జాతీయంగా పేరు గడించారు. దేశ విదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చారు. జాకిర్ హుస్సేన్ అందుకున్న జాతీయ, అంతర్జాతీయ బహుమతులకు, పురస్కారాలకూ లెక్కే లేదు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. పదేళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. తొలుత ఆదివారం రాత్రే జాకీర్ హుస్సేన్ చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయన చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన అభిమానుల్లో కాస్త తికమక ఏర్పడింది. కానీ, ఆయన ఈ మరణించారని కొంత సమయం క్రితం కుటుంబం సభ్యులు ప్రకటించారు.సంగీత దర్శకునిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇన్ కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి సినిమాలకు సంగీతం అందించారు. పలు సినిమాల్లో నటించారు కూడా. అలా జాకీర్ హుస్సేన్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని అందుకున్నారు. -
పిల్లలే పెద్ద కొనుగోలుదారులు
సర్వే అవి టీవీలు వచ్చిన తొలిరోజులు... ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా వాయించడం ఆపి గాజు కప్పులో టీ సిప్ చేసి ‘వాహ్ తాజ్’ అంటారు. బ్యాక్‌డ్రాప్‌లో తాజ్‌మహల్ కనిపిస్తుంటుంది. ఈ ప్రకటన చూసిన పిల్లల మెదళ్లలో తాజ్‌మహల్ అంటే టీ అనే ముద్ర పడిపోయింది. తాజ్‌మహల్ అనే నిర్మాణం ఒకటుందని, ఆ పేరుతో ఒక కంపెనీ తేయాకు పొడిని తయారు చేసిందని తల్లిదండ్రులు పనిగట్టుకుని తెలియచేయాల్సి వచ్చింది. టీ తాగాలనే కోరిక లేకపోయినా ఉస్తాద్ జాకీర్ హుస్సేన్‌లా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికే టీ కావాలని మారాం చేసిన పిల్లలు ఎక్కువే అప్పట్లో. అంటే పిల్లల మీద ప్రకటనల ప్రభావం అంతగా ఉంటుందన్న మాట. ఇదే విషయాన్ని ఒక అధ్యయన బృందం కూడా నిర్ధారిస్తోంది. ఆర్కైవ్స్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ అడాలసెంట్ మెడిసిన్ అనే మ్యాగజైన్ ఒక అధ్యయన నివేదికను ప్రచురించింది పిల్లలు టీవీ చూసే సమయం పెరిగే కొద్దీ వాళ్లు తల్లిదండ్రులను ‘అది కొనివ్వు... ఇది కొనివ్వు’ అని అడగడం పెరుగుతుందట. స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, పకార్డ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మార్కెట్లోకి కొత్త మోడల్ వీడియో గేమ్స్ వస్తే ఇక అప్పటి వరకు తాను ఆడుకుంటున్న వీడియో గేమ్స్ నచ్చవు. వాటితో ఆడుకోవడం అంటే బోర్, చిరాకు, కొత్తది కొనివ్వలేదన్న అలక. పది నుంచి పధ్నాలుగు ఏళ్ల వయసు పిల్లలున్న ఇళ్లలో ఇదో ప్రహసనం. ఇక సాధారణంగా ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, బొమ్మలు అయితే ఎన్ని ఉన్నా, ఎన్ని కొన్నా ఆ తృప్తి కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చే వరకే. ఒక బొమ్మ కొనిస్తే దాంతో ఆడుకునేది ఒక వారమో లేదా రెండు వారాలే, మూడో వారానికి కొత్త బొమ్మ గురించిన డిమాండ్ ఉండనే ఉంటుంది. తిండి విషయానికొస్తే వాణిజ్య ప్రకటనల్లో వచ్చే వాటిలో ఎక్కువ భాగం కేలరీలు ఎక్కువగా ఉండి పోషకవిలువలు తక్కువగా ఉండేవే ఉంటున్నాయి. అమెరికాలో సగటున పిల్లలు ఏడాదికి నలభై వేల వాణిజ్య ప్రకటనలను చూస్తున్నారని ఒక అధ్యయనం. ఒక వస్తువును అమ్మాలంటే దాని గుణగణాలను తెలియచేయడానికి సులువైన మార్గం అడ్వర్టైజ్మెంట్. అది తినే వస్తువు అయినా, రాసే పెన్నయినా సరే ఆ వస్తువు ఒకటి మార్కెట్లో ఉంది అని తెలియచెప్పే సాధనమే యాడ్. యాడ్ ఎంత ఆకర్షణీయంగా ఉంటే ఆ వస్తువు అంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుందనేది కాదనలేని సత్యం. కొత్త ప్రొడక్ట్ ప్రజల్లోకి వెళ్లడానికి ఒకప్పుడు చాలా పెద్ద నెట్వర్క్ అవసరమయ్యేది. ఇప్పుడు టీవీలు చాలా ఈజీగా మారుమూల పల్లెలకు చేరవేస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీ తయారు చేసిన ఆలూ చిప్స్ గురించి బస్సు వెళ్లడానికి రోడ్డు లేని ఊళ్లో ఉన్న పిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు 5-15 ఏళ్ల పిల్లలు ఆయా కంపెనీలకు ప్రధానమైన మార్కెట్.