ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. దాంతో రెండు వారాల క్రితం అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన ఆయన చిన్నప్పటి నుంచే తండ్రి బాటలోనే నడిచారు. అలా ఏడేళ్ల చిరుప్రాయంలోనే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయునిగా పేరు తెచ్చుకున్నారు. గొప్ప కళాకారుడిగా అంతర్జాతీయంగా పేరు గడించారు. దేశ విదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చారు. జాకిర్ హుస్సేన్ అందుకున్న జాతీయ, అంతర్జాతీయ బహుమతులకు, పురస్కారాలకూ లెక్కే లేదు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. పదేళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.
తొలుత ఆదివారం రాత్రే జాకీర్ హుస్సేన్ చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయన చనిపోలేదని, పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన అభిమానుల్లో కాస్త తికమక ఏర్పడింది. కానీ, ఆయన ఈ మరణించారని కొంత సమయం క్రితం కుటుంబం సభ్యులు ప్రకటించారు.
సంగీత దర్శకునిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇన్ కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి సినిమాలకు సంగీతం అందించారు. పలు సినిమాల్లో నటించారు కూడా. అలా జాకీర్ హుస్సేన్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment