tabla musicians
-
వాహ్ ఉస్తాద్ వాహ్
పుట్టిన వెంటనే చెవిలో ‘కల్మా’ కాకుండా తబలా జతులు విన్నవాడు... మూడేళ్లకే తబలాను పసి వేళ్లతో మీటిన వాడు... ఏడేళ్లకు ప్రదర్శనలు ఇచ్చినవాడు...పన్నెండేళ్లకు ప్రపంచ యాత్రకు బయల్దేరినవాడు... మహా మహా విద్వాంసులకు సహ వాద్యగాడు... తనే స్వయంగా అద్వితీయ వాద్యకారుడు... తబలా ప్రపంచానికి ఈశ్వరుడు... దేవుడు... ఉస్తాద్ జాకీర్ హుసేన్.టీషర్ట్, జీన్స్ వేసుకుని ఆధునిక యువకుడిగా ఉంటూ సంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్ని కుర్రకారుకు చేరువ చేసిన ఈ నవ యువ వాద్య మాంత్రికుడు కన్నుమూశాడు. అతను లేడు. అతనిలాంటి వాడు మరి రాడు. ఒక్కడే జాకిర్ హుసేన్.జాకిర్ హుసేన్ ప్రదర్శనలో ఎవరైనా ఇది చూడాలి. ఆయన తబలా మీద డమరుకాన్ని, శంఖాన్ని వినిపిస్తాడు. ‘ఎడమ’ మీద డమరుకం వినిపిస్తూ ‘కుడి’ని మీటి శంఖనాదాన్ని సృష్టిస్తాడు. ఆ శంఖనాద సమయంలో జాకిర్ హుసేన్ వేళ్లు ఎంత వేగంగా కదులుతాయంటే అవి కనపడవు. పైగా తబలాని తాకినట్టుగా కూడా ఉండవు. ఇలా వాయించడం అసాధ్యం. ‘ఇది ఎలా సాధించారు’ అని అనడిగితే ‘సాధన చేయాలి. తబలాతో స్నేహం చేయాలి. దాని మాటకు చెవి ఒగ్గాలి’ అంటాడు జాకిర్ హుసేన్. అంత వినమ్రంగా ఉండటం వల్లే ఆయన తన తబలాకు ప్రపంచమే చెవి ఒగ్గేలా చేయగలిగాడు. ‘ఉస్తాద్’ కాగలిగాడు. ‘మేస్ట్రో’ అనిపించుకున్నాడు.‘మీరు తబలా ఏ వయసులో నేర్చుకోవడం మొదలెట్టారు’ అని అడిగితే జాకిర్ హుసేన్ ఆశ్చర్యపోతాడు. ‘అదేం ప్రశ్న’ అంటాడు. నిజమే. అతను పుట్టిందే తబలా ఉన్న ఇంట్లో. జాకిర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా జగమెరిగిన తబలా విద్వాంసుడు. మన దేశంలో తబలాకు ఔన్నత్యం తీసుకు వచ్చిన తొలి విద్వాంసుడు. ఆయనకు పెద్ద కొడుకుగా 1951లో ముంబైలో జన్మించాడు జాకిర్ హుసేన్. నర్సింగ్ హోమ్ నుంచి మరుసటిరోజు ఇంటికి తీసుకొస్తే ముస్లిం సంప్రదాయం ప్రకారం తండ్రి తన కొడుకు చెవిలో ‘కల్మా’ చదివి, పేరు పలికి లోపలికి తీసుకెళ్లాలి. కాని అల్లా రఖా జాకిర్ని తన చేతుల్లో తీసుకుని ‘ధాధా ధినా.. థాథా తునా’ అని తబలా జతులు వినిపించాడు. భార్య ‘ఇదేమిటండీ చోద్యం.. దైవ స్తోత్రం వినిపించక’ అనంటే ‘నా దైవం తబలాయే’ అని బదులిచ్చాడాయన. అలా జాకిర్‌కు పుట్టిన వెంటనే తబలా తెలిసింది. జాకిర్‌ను పడుకోబెట్టడానికి తండ్రి రోజూ ఒడిలోకి తీసుకుని తబలా జతులు వినిపిస్తూనే వెళ్లాడు. ఇలా మూడేళ్లు ఆ పసికందు మెదడులోకి తబలా మాత్రమే వెళ్లింది. మూడేళ్లు వచ్చేసరికి జాకిర్ తబలా వరకూ బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లి అత్యంత సహజంగా దానిని మీటాడు.జాకిర్ హుసేన్ తబలా యాత్ర మొదలైంది.మన దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ శాస్త్రీయ సంగీతం ఆస్థానాల్లో, దర్బారుల్లో, శ్రీమంతుల మహళ్లలో ఉండిపోయింది. స్వతంత్రం వచ్చాక అవన్నీ వెళ్లి సంగీత కచ్చేరీలు మొదలయ్యాయి. అయితే వాటికి ఆదరణ అంతంత మాత్రమే ఉండేది. ఆ సమయంలో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, సరోద్ వాద్యకారుడు అలి అక్బర్ ఖాన్‌లాంటి వారు అమెరికాకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తూ మన దేశం తిరిగి వచ్చి అటెన్షన్ సంపాదించారు. ఆ తర్వాతి రోజుల్లో సంతూర్ పండిట్ శివకుమార్, వేణువు హరిప్రసాద్ చౌరాసియా కూడా పశ్చిమ దేశాలలోకి మన సంగీతాన్ని తీసుకెళ్లాడు. పండిట్ రవిశంకర్‌కు శాశ్వతంగా అల్లారఖా తబలాజోడిగా ఉండేవారు. అయితే అల్లా రఖాకు అనారోగ్యం వల్ల జాకిర్‌కు 19ఏళ్లు ఉండగా మొదటిసారి అమెరికా వెళ్లి రవి శంకర్‌కు సహ వాయిద్యం అందించే వీలు జాకిర్‌కు దక్కింది. మొదటిసారి అలా అమెరికాలో అడుగు పెట్టిన జాకిర్ జీవితంలో అత్యధిక కాలం అమెరికాలో ఉంటూ అక్కడినుంచే దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ తబలా వాదనలో ఉండే ఉత్కృష్ట ధ్వనిని ప్రపంచానికి వినిపించాడు. చివరకు అక్కడే– డిసెంబర్ 16 (సోమవారం) అంతిమ శ్వాస వదిలాడు.‘తబలాకు ఎప్పుడూ కాలు తగలనివ్వకు బాబూ. అది మన సరస్వతి’ అనేవారట ఉస్తాద్ అల్లారఖా. అందువల్ల జాకిర్ హడావిడి ప్రయాణాల్లో రైళ్లలో సీటు దొరక్కపోతే కింద కూచుని తబలాను ఒళ్లో జాగ్రత్తగా పెట్టుకునేవారు. ‘నేను తబలా నేర్చుకుంటాను’ అని ఏడేళ్ల వయసులో మొదటిసారి జాకిర్ తన తండ్రితో చెప్పినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి 3 గంట లకు నిద్ర లేపి సాధన మొదలేయించేవారట అల్లారఖా. రోజూ రాత్రి మూడు నుంచి ఉదయం 6 వరకు వారి సాధన సాగేది. ఆ తర్వాత స్కూల్ వెళ్లి సాయంత్రం మళ్లీ సాధన కొనసాగించేవాడు. ‘పండితులకు జన్మించే పిల్లలకు పోలిక ఉంటుంది. అల్లా రఖా కొడుకై ఉండి ఇంత సామాన్యంగా వాయిస్తున్నాడా అనంటే మా నాన్న పరువేంగాను. అందుకే నేను మరింత కష్టపడేవాణ్ణి’ అంటాడు జాకిర్. అంతేకాదు అన్ని మతాల సంగీతం నుంచి కూడా నేర్చుకోవడానికి చూశాడు. ‘నేను స్కూల్‌కు వెళ్లే దారిలో చర్చిలో సంగీతం వినేవాణ్ణి. గుడిలో వినిపించే భక్తి గీతాలు ఆలకించేవాణ్ణి. ప్రపంచంలో ఏ మతమూ ఇంకో మతంపైన జబర్దస్తీ చేయదు. ఏ మతమైనా చెప్పేది నీ పొరుగువారిని ప్రేమించమనే’ అంటాడు జాకిర్ హుసేన్. అందుకే జాకిర్ అన్ని మతాల, అన్ని ధోరణుల విద్వాంసులతో అతి సులువుగా కలిసిపోయి తన తబలాను వారి సంగీతానికి జత చేయగలిగారు. ముఖ్యంగా సంతూర్ శివకుమార్‌తో ఆయనకు సుదీర్ఘ స్నేహం సాగింది. కొన్నాళ్ల క్రితం శివకుమార్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలకు హాజరైన జాకిర్ హుసేన్ దహన వాటిక నుంచి అందరూ వెళ్లిపోయినా తనొక్కడే మండుతున్న చితి పక్కన చాలా సేపు నిలబడిపోయి ఆ స్నేహితునికి అంతిమ వీడ్కోలు పలికాడు. ఈ భారతీయ హిందూ ముస్లిం శాస్త్రీయ సంగీత భాగస్వామ్యాన్ని జాకిర్ స్థిరంగా ప్రచారం చేశాడు. కొనసాగాలని కోరుకున్నాడు.బీటెల్స్ గ్రూప్ ద్వారా ఖ్యాతి గాంచిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్ ‘లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్’ అనే ఆల్బమ్‌లో జాకిర్ భాగస్వామ్యాన్ని కోరడంతో 1973 నుంచి ఫ్యూజన్ సంగీతానికి ప్రచారం కల్పించసాగాడు జాకిర్ హుసేన్. అమెరికన్ జాజ్ మ్యుజీషియన్ జాన్ హ్యాండీ, ఐరిష్ గాయకుడు వాన్ మారిసన్, అమెరికన్ డ్రమ్మర్ మికీ హర్ట్లాంటి ప్రసిద్ధులతో యాభై ఏళ్ల క్రితమే పని చేయడం వల్ల జాకిర్ హుసేన్‌కి హద్దులు లేని ప్రచారం, ప్రశంస లభించాయి. గాత్ర సంగీతమైనా, వాద్య సంగీతమైనా, జుగల్బందీ అయినా, వ్యక్తిగత ప్రదర్శన అయినా, ఫ్యూజన్ అయినా జాకిర్ నీరు పాత్ర రూపు దాల్చినంత సులభంగా ఇమిడిపోయి కచ్చేరికి అందం, ఆనందం తెచ్చేవాడు. పొడవైన తన గుబురు జుత్తు గాలిలో ఊగేలా ఆయన సాగించే తబలా వాదనను చూడటానికి జనం విరగబడేవారు. ముచ్చటపడేవారు.జాకిర్ హుసేన్ మన దేశంలో ‘పద్మశ్రీ’తో గౌరవించబడ్డ (1988) అత్యంత పిన్న వయస్కుడు (అవార్డు ప్రకటించే సమయానికి). ఆ తర్వాత ఆయనకు ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ వచ్చాయి. నాలుగుసార్లు ‘గ్రామీ’ గెలుచుకున్న ఏకైక భారతీయ సంగీతకారుడు. అంతేనా? అమెరికా ప్రభుత్వం కళ, సాంస్కృతిక రంగాల్లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ‘నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్’ జాకిర్‌ను వరించింది. జాకిర్ సినిమాలకు పని చేశాడు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘వానప్రస్థం’ సినిమాకు పాటలు కంపోజ్ చేశాడు. లతా మంగేశ్కర్, ఆశా భోంస్లేల జీవితం ఆధారంగా తీసిన ‘సాజ్’ (1998)లో ఆశా భోంస్లే భర్త ఆర్.డి.బర్మన్ పాత్రలో కనిపించాడు. మంచి మాటగాడు, హాస్యప్రియుడు, భోజన ప్రియుడైన జాకిర్ హుసేన్ ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. నవ్వులు ఉంటాయి. తబలా ఎలాగూ ఉంటుంది.గొప్ప సంగీతమయ ప్రపంచాన్ని సృష్టించి, శుభ నాదాలను జగత్తులోకి వదిలి సంగీతం ద్వారా శాంతము పొందమని కోరుతూ వీడ్కోలు తీసుకున్నాడు ఉస్తాద్ జాకిర్ హుసేన్. ప్రపంచ సంగీత ప్రియులు అతణ్ణి తలచుకుని కన్నీరు కారుస్తున్నారు. జాకిర్ ఆత్మ విశ్వ సంగీతంలో డోలలూగాలి.– కె -
తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ కన్నుమూత
-
జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమం
న్యూఢిల్లీ: ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. 73 ఏళ్ల హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి కొద్ది రోజులుగా బాగా విషమించింది. దాంతో రెండు వారాల క్రితం అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మరణించినట్టు వార్తలొచ్చాయి. జాకీర్ హుస్సేన్ సన్నిహితుడు, ప్రముఖ వేణువాద కళాకారుడు రాకేశ్ చౌరాసియా కూడా తొలుత దాన్ని ధ్రువీకరించారు. కాసేపటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘దేశం సంగీత ధ్రువతారను కోల్పోయింది. సంగీత ప్రపంచానికి ఆయన సేవలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. విపక్ష నేత రాహుల్ గాం«దీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ తదితరులు సంతాపం తెలిపారు. కానీ జాకీర్ హుస్సేన్ మృతి వార్తలను ఆయన సోదరి ఖుర్షీద్ ఖండించారు. ‘‘నా సోదరుని పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్న మాట నిజమే. కానీ ప్రస్తుతానికి ఆయన ప్రాణాలతోనే ఉన్నారు’’ అని తెలిపారు. ‘‘జాకీర్ హుస్సేన్ మరణించారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వార్తలు మమ్మల్నెంతో బాధిస్తున్నాయి. వాటిని నమ్మొద్దని మీడియాకు, ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కోలుకోవాలని అంతా ప్రారి్థంచాల్సిందిగా కోరుతున్నాం’’ అని పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు మార్చినట్టు ఆయన మేనేజర్ నిర్మలా బచానీ కూడా పేర్కొన్నారు. కాసేపటికే ఐ అండ్ బీ శాఖ కూడా ఎక్స్‌లో చేసిన సంతాప పోస్ట్‌ను తొలగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి: బహుముఖ సంగీత ప్రజ్ఞకు జాకీర్ హుస్సేన్ నిలువెత్తు నిదర్శనం. హిందూస్తానీ క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు జాజ్ ఫ్యూజన్లోనూ తిరుగులేని నైపుణ్యం సాధించారు. గ్రేటెస్ట్ తబలా ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్‌లో ఒకరిగా నిలిచారు. సంగీత దర్శకునిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇన్ కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి సినిమాలకు సంగీతం అందించారు. పలు సినిమాల్లో నటించారు కూడా. ఆయన ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడు. 1951 మార్చి 9న ముంబైలో జని్మంచిన ఆయన అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. తండ్రి బాటలో నడుస్తూ ఏడేళ్ల చిరుప్రాయంలోనే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయునిగా పేరు తెచ్చుకున్నారు. గొప్ప కళాకారుడిగా అంతర్జాతీయంగా పేరు గడించారు. దేశ విదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చారు. జాకిర్ హుస్సేన్ అందుకున్న జాతీయ, అంతర్జాతీయ బహుమతులకు, పురస్కారాలకూ లెక్కే లేదు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. పదేళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. -
ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత..
Tabla Musician Tabla Prasad Passed Away: ప్రముఖ సంగీత విద్వాంసుడు 'తబలా ప్రసాద్' శుక్రవారం (మార్చి 18) ఉదయం కన్నుమూశారు. తబలా ప్రసాద్ 70 సంవత్సరాలకుపైగా తమిళం, హిందీ, తెలుగులో 4 తరాల స్వరకర్తలతో పనిచేశారు. ఆయన తబలా సంగీతం ఇచ్చిన ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. ఉత్తర భారదేశంలో ఆర్డి బర్మన్, సి. రామచంద్ర, లక్ష్మీకాంత్ ప్యారీలాల్, నవ్‌షత్, పప్పిలహరితోపాటు సౌత్ ఇండియాలో స్క్రీన్ మ్యుజిషియన్ తిలక్ కెవిఎం, మెలోడీ కింగ్ ఎమ్ఎస్వి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వంటి చాలా మందికి తబలా వాయించారు. అంతేకాకుండా ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా, జివి ప్రకాష్‌తో కలిసి ఐదుకుపైగా భాషల్లో సుమారు 2500 చిత్రాలకు పనిచేశారు. వీటన్నింటితో కలిపి దాదాపు 60000 పాటలకు ఆయన తబలా వాయించారు. 79 ఏళ్ల తబలా ప్రసాద్‌కు భార్య కృష్ణవేణి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారులైన రమణ, కుమార్‌లు కూడా సంగీత విద్వాంసులుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తబలా ప్రసాద్ భౌతికకాయానికి శనివారం చెన్నైలోని వడపళనిలో ఉన్న ఏవీఎం స్డూడియో సమీపంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
పండిత అనురాధా పాల్.. తబలా మాంత్రికురాలు
ఉస్తాద్ అల్లారఖా పెద్ద తబలా మాస్టర్. ఉస్తాద్ జాకిర్ హుసేన్ కూడా. శంకర్ ఘోష్, ఉదయ్ మజుందార్... ఎందరో పురుష ఉస్తాద్‌లు.. పండిత్‌లు. కాని వీరితో సరిసాటిగా కాదు కాదు తనే ఒక విలక్షణ మాస్టర్‌గా అనురాధా పాల్ తబలా వాదనలో ఖ్యాతి గడించింది. స్త్రీలు ఈ రంగంలో రాణించడం సామాన్యం కాదు. ఎన్నో అడ్డంకులను అపధ్వనులను దాటి ఆమె ఈ స్థితికి చేరుకుంది. ఆమె పరిచయం... ముంబైలో అనురాధా పాల్ తబలా కచ్చేరీ జరుగుతోంది. దానికి హాజరైన చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ ఆసాంతం ఆ కచ్చేరి చూసి, ఆమెను కలిసి, ‘రేపు మీ ఇంటికి వస్తున్నాను’ అని వెళ్లిపోయాడు. ఎందుకు వస్తున్నట్టు? మరుసటి రోజు హుసేన్ ఆమె ఇంటికి వచ్చాడు. ఆయనతోపాటు రఫ్ కట్ చేసిన ‘గజ్గామిని’ సినిమా ఉంది. మాధురి దీక్షిత్‌తో ఎం.ఎఫ్.హుసేన్ తీసిన సినిమా అది. త్వరలో విడుదల కావాల్సి ఉంది. ‘దీనికి నువ్వు నేపథ్య సంగీతం అందించాలి’ అన్నాడు హుసేన్. అనురాధా పాల్ ఆశ్చర్యపోయింది. ‘నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఏమిటి? మీరు తలుచుకుంటే ప్రపంచంలోని మహా మహా సంగీతకారులు ఎవరైనా ఇస్తారు’ అని అనురాధా పాల్ అంది. ‘కాదు నువ్వు ఇవ్వాలి. సినిమా అంతా నీ తబలా వినిపిస్తే చాలు’ అని మీటింగ్ ముగించాడు ఎం.ఎఫ్.హుసేన్. అనురాధా పాల్ తాను ఒక్కతే తబలా వాయిస్తూ ‘గజ్గామిని’కి రీ రికార్డింగ్ చేసింది. బహుశా ప్రపంచంలో కేవలం తబలా మీద అదీ ఒక స్త్రీ వాయిద్యకారిణి వాయిస్తూ ఉంటే రీ రికార్డింగ్ ముగించుకున్న సినిమా అదొక్కటే ఏమో. అది అనురాధా పాల్ ఘనత. ప్రపంచలోనే ఆమె తొలి మహిళా తబలా వాయిద్య కారిణి. అనురాధా పాల్ది ముంబై. అక్కడే పుట్టి పెరిగింది. వాళ్ల కుటుంబం తాతగారి హయాంలో దేశ విభజన సమయంలో ముంబై వచ్చేసింది. ఆమె తండ్రి దేవిందర్ పాల్ వీధి దీపాల కింద చదువుకుని పెద్ద ఫార్మా కన్సల్టెంట్ అయ్యాడు. తల్లి ఇళా పాల్ గాయని, పెయింటర్. ఆ ఇంట్లో కళల పట్ల ఆసక్తి ఉండేది. పిల్లలు ఏదో ఒక కళలో కనీస అభిరుచి కలిగి ఉండాలని తల్లిదండ్రులు కోరుకునేవారు. అయితే చదువు తప్పనిసరి. కాని ఇంటి చిన్న కుమార్తె అయిన అనురాధా పాల్‌కు చదువు కంటే కళ మీదే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. ఆమె ముందు గాత్రం నేర్చుకుంది. కాని గాత్రం కొనసాగిస్తూ ఉంటే తోడు వాయిద్యం అయిన తబలా ఆమెను ఆకర్షించింది. పాడుతూనే తబలా మీద కొట్టవలసిన తాళాన్ని అందించేది. తబలా ఎందుకు నేర్చుకోకూడదు? అని ఆమెకు అనిపించింది. ఆడపిల్లలు సితార్, వీణ, వయొలిన్ వంటి వాయిద్యాలు నేర్చుకుంటారు. కాని తబలా పూర్తిగా మగవాళ్ల విద్యగా చలామణిలో ఉంది. అలాంటి విద్యను ఆడపిల్ల నేర్చుకోవడమా? కాని తొమ్మిదో ఏటకే అనురాధా పాల్ తబలాలో ప్రావీణ్యం సంపాదించింది. కచ్చేరి ఇచ్చింది కూడా. అనురాధా పాల్ మొదట బెనారస్ ఘరానాలోని గురువుల దగ్గర తబలా నేర్చుకున్నా చివరకు ఉస్తాద్ అల్లారఖా ఆ తర్వాత ఉస్తాద్ జాకిర్ హుసేన్ శిష్యురాలైంది. 18 ఏళ్లకు ఆమె ముంబైలో కచ్చేరి ఇస్తే పత్రికలు ఆమెకు ‘లేడీ జాకిర్ హుసేన్’ అనే బిరుదు ఇచ్చాయి. నిజానికి ఇలాంటి బిరుదులు పరోక్షంగా స్త్రీల శక్తిని తక్కువ అంచనా వేసేవే. కాలక్రమంలో అనురాధా పాల్ తన పేరుతో తానే ఒక గొప్ప తబలా విద్వాంసకురాలిగా పేరు పొందింది. ఆమె పర్కషనిస్ట్ కూడా. అంటే ఒకటికి మించి తోడు వాయిద్యాలను వాయించే వారిని పర్కషనిస్ట్ అంటారు. అనురాధా పాల్ కనీసం 40 రకాల వాయిద్యాలను వాయించగలదు. అలా తానే అన్ని వాయిద్యాలు వాయిస్తూ ఆమె ఆల్బమ్ చేసింది కూడా. అయితే కొత్తల్లో ఆమెకు అంత సజావుగా ఎంట్రీ దొరకలేదు. ‘‘ఒక కచ్చేరిలో నన్ను కొన్ని తాళాలు మాత్రమే వాయించమన్నారు. దూకుడుగా వాయించాల్సిన తాళాలను మగ తబలా ప్లేయర్ వాయిస్తాడని చెప్పారు. కారణం అడిగాను. ‘దూకుడు తాళాల పని నీకు అప్పచెప్తే ఆడపిల్లతో కష్టం చేయిస్తున్నారన్న మాట వస్తుంది’ అని చెప్పారు. నేను అడ్డం తిరుక్కుని మొత్తం వాయించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నాను’’ అంటుంది అనురాధా పాల్. సాధారణంగా కచ్చేరీలలో మగవారు గాత్రంలో ఉంటే మగ సహ వాద్యకారులనే తోడు తీసుకుంటారు. ఆడవాళ్లను ప్రోత్సహించరు. ఆ విషయంలో కూడా అనురాధా పాల్ సుదీర్ఘ పోరాటం చేసి పెద్ద పెద్ద గాత్ర విద్వాంసుల తోడు కూచుని కచేరీ చేయగలిగింది. ‘నేను మహిళను. ఈ శక్తి నాది. నా శక్తికి విలువ ఇవ్వండి. నేను మహిళను కాబట్టి నాకు మెచ్చుకోలులో వాటా ఇవ్వకండి’ అంటుంది అనురాధా పాల్. ఆమె అందరూ మహిళా విద్వాంసులు ఉండే ‘స్త్రీ శక్తి’ అనే బ్యాండ్‌ను తయారు చేసి ప్రపంచంలో అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే క్లాసికల్‌ను వెస్ట్రన్‌తో జత చేస్తూ ‘రీచార్జ్’ అనే బ్యాండ్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇస్తుంది. తన సోలో ప్రదర్శనలు ప్రత్యేకం. ఇంత సాధించినా ఆమెకు ‘పద్మశ్రీ’ ఇంకా దక్కలేదు. సంగీత ప్రపంచంలో పురుషుల ప్రాభవం ఇంకా కొనసాగుతున్నదనే అనుకోవాలి. కాని ఎంత కాలం? అనురాధా పాల్ లాంటి వాళ్లు మరెందరో పుట్టుకు వచ్చి ఇదంతా కచ్చితంగా మార్చరూ? -
పిన్న వయసులో పెద్ద గుర్తింపు
ప్రతిభా కిరణం మాస్టర్ తృప్తరాజ్ పాండే అతి చిన్న వయసు తబలా వాద్యకారుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గొప్ప తబలా వాద్యకళాకారుడిగా గుర్తింపు పొందాడు. ఇందులో మరొక విశేషం ఉంది. పాండే చేతి వేళ్ల నరాల బలహీనతతో పుట్టాడు. ఇలాంటి పిల్లలు సామాన్యంగా ఏవైనా వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే పాండే ఈ బలహీనత ను మనోధైర్యంతో అధిగమించాడు. 2006 అక్టోబర్‌లో ముంబైలోని ములుండ్ ప్రాంతంలో పాండే పుట్టాడు. 18 నెలల పసివాడుగా ఉన్నప్పుడే లయబద్ధంగా ఏ వాద్యాన్నయినా వాయించే నైపుణ్యం ఉండేది. రెండేళ్ళ వయసున్నప్పుడే పాండే సోమయ్య కాలేజీలో మొదటి ప్రదర్శన ఇచ్చాడు. మూడేళ్ళ వయసులో ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చి, ‘బాల కళారత్న’ అవార్డు పొందాడు. పాండే తన నాలుగేళ్ళ వయసు లో దూరదర్శన్ సహ్యాద్రిలో ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పటివరకు పాండే భారతదేశంలో దాదాపు 50 సంగీత కచ్చేరీలు చేశాడు. పుట్టుకతో ఉన్న తన నరాల బలహీనతను అధిగమించి, లయబద్ధంగా తబలా వాయిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలిగే సంగీత మాంత్రికుడైన పాండే ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తాడు. పెద్దయ్యాక మంచి తబలా వాద్యకళాకారుడిగా, క్రికెటర్‌గా పేరు సంపాదించుకోవాలనేది పాండే కోరిక. ఈ చిన్నారి సంగీత విద్వాంసుడు ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాడు. సాధన చేయడం, దాన్ని ప్రేక్షకులకు ఉల్లాసం కలిగేలా ప్రదిర్శించడం ద్వారా ప్రతిభకు వయసుతో పనిలేదని, నైపుణ్యతకు హద్దు లేదని నిరూపించాడు పాండే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు ఇండియన్ బుక్, యునిక్ వరల్డ్ రికార్డు మొదలైనవి పాండేను ‘పిన్న వయసు తబలా విద్యాంసుడి’ గా గుర్తించాయి. పూజ్య ప్రముఖ్ స్వామి, హుస్సేన్, పద్మశ్రీ అనూప్ జలోటా, పండిట్ శివ కుమార్ శర్మ వంటి ఎందరో ప్రముఖ వ్యక్తుల ప్రశంసలు పొందాడు. ఎన్నో సాంస్కృతిక సంఘాలు, సంస్థలు నిర్వహించిన కార్యక్రమా ల్లో పాండే ప్రదర్శనలిచ్చాడు.