పిన్న వయసులో పెద్ద గుర్తింపు
ప్రతిభా కిరణం
మాస్టర్ తృప్తరాజ్ పాండే అతి చిన్న వయసు తబలా వాద్యకారుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గొప్ప తబలా వాద్యకళాకారుడిగా గుర్తింపు పొందాడు. ఇందులో మరొక విశేషం ఉంది. పాండే చేతి వేళ్ల నరాల బలహీనతతో పుట్టాడు. ఇలాంటి పిల్లలు సామాన్యంగా ఏవైనా వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే పాండే ఈ బలహీనత ను మనోధైర్యంతో అధిగమించాడు.
2006 అక్టోబర్‌లో ముంబైలోని ములుండ్ ప్రాంతంలో పాండే పుట్టాడు. 18 నెలల పసివాడుగా ఉన్నప్పుడే లయబద్ధంగా ఏ వాద్యాన్నయినా వాయించే నైపుణ్యం ఉండేది. రెండేళ్ళ వయసున్నప్పుడే పాండే సోమయ్య కాలేజీలో మొదటి ప్రదర్శన ఇచ్చాడు. మూడేళ్ళ వయసులో ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చి, ‘బాల కళారత్న’ అవార్డు పొందాడు.
పాండే తన నాలుగేళ్ళ వయసు లో దూరదర్శన్ సహ్యాద్రిలో ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పటివరకు పాండే భారతదేశంలో దాదాపు 50 సంగీత కచ్చేరీలు చేశాడు. పుట్టుకతో ఉన్న తన నరాల బలహీనతను అధిగమించి, లయబద్ధంగా తబలా వాయిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలిగే సంగీత మాంత్రికుడైన పాండే ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తాడు. పెద్దయ్యాక మంచి తబలా వాద్యకళాకారుడిగా, క్రికెటర్‌గా పేరు సంపాదించుకోవాలనేది పాండే కోరిక.
ఈ చిన్నారి సంగీత విద్వాంసుడు ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాడు. సాధన చేయడం, దాన్ని ప్రేక్షకులకు ఉల్లాసం కలిగేలా ప్రదిర్శించడం ద్వారా ప్రతిభకు వయసుతో పనిలేదని, నైపుణ్యతకు హద్దు లేదని నిరూపించాడు పాండే.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు ఇండియన్ బుక్, యునిక్ వరల్డ్ రికార్డు మొదలైనవి పాండేను ‘పిన్న వయసు తబలా విద్యాంసుడి’ గా గుర్తించాయి. పూజ్య ప్రముఖ్ స్వామి, హుస్సేన్, పద్మశ్రీ అనూప్ జలోటా, పండిట్ శివ కుమార్ శర్మ వంటి ఎందరో ప్రముఖ వ్యక్తుల ప్రశంసలు పొందాడు. ఎన్నో సాంస్కృతిక సంఘాలు, సంస్థలు నిర్వహించిన కార్యక్రమా ల్లో పాండే ప్రదర్శనలిచ్చాడు.