‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ముంబై క్రికెట్ సంఘం
ముంబై: సాధారణంగా క్రికెట్‌లో భారీ స్కోర్లు, భాగస్వామ్యాలు, పరుగులు, శతకాల మోత, వికెట్ల కూతతో అంతర్జాతీయ రికార్డులు నమోదు కావడం సహజం. కానీ వీటన్నింటికి భిన్నంగా ఆట (మ్యాచ్)తో సంబంధం లేకుండా ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) విన్నూత్నమైన రికార్డులోకి ఎక్కడం... అది కూడా ప్రపంచ రికార్డులకే జేజమ్మలాంటి ‘గిన్నిస్ బుక్’లో ఎక్కితే పెద్ద విశేషం కదా!
ఇక అసలు సంగతికి వచ్చేద్దాం... ఎంసీఏకు చెందిన వాంఖెడే స్టేడియంలో అత్యధిక బంతులతో 50 వసంతాలకు సంబంధించిన ఆంగ్ల అక్షర తోరణాన్ని వేదికపై పరిచింది. రెడ్ (ఎరుపు టెస్టులకు వాడే బంతి), వైట్ (తెలుపు వన్డే, టి20లకు వాడే బంతి) ఈ రెండు కలిపి మొత్తం 14, 505 బంతులతో ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖెడే స్టేడియం’ అని గోల్డెన్ జూబ్లీకి సంబంధించిన అక్షరమాలను రాశారు.
గావస్కర్, సచిన్‌లాంటి ఎందరో దిగ్గజాలకు పుట్టిల్లు (సొంతగడ్డ)లాంటి వేదిక 50 వసంతాల వేడుకకు ముస్తాబైంది. ఇక్కడ 1975వ ఏడాది జనవరి 23 నుంచి 29 వరకు తొలి మ్యాచ్ జరిగింది. గురువారం (2025, జనవరి 23)తో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంసీఏ సిబ్బంది వేల సంఖ్యలో ఎరుపు, తెలుపు క్రికెట్ బంతులతో వాంఖెడే మైదానాన్ని తీర్చిదిద్దింది.
ఈ వేదికపైనే 2011లో ధోని సారథ్యంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. తొలి ప్రపంచకప్‌ను కపిల్ సేన 1983లో లార్డ్స్ (ఇంగ్లండ్)లో నెగ్గింది. అత్యధిక బంతుల వినియోగంతో తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ఎక్కడంపై ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ హర్షం వ్యక్తం చేశారు.
భారత్ టి20ల్లో కూడా రెండు ప్రపంచకప్‌లను గెలుచుకుంది. సఫారీలో 2007లో మొదలైన ఆరంభ టి20 ప్రపంచకప్‌ను ధోని నేతృత్వంలో గెలిస్తే... గతేడాది కరీబియన్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌ను రోహిత్ శర్మ బృందం నెగ్గుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment