mumbai cricket association
-
14,505 బంతులతో...
ముంబై: సాధారణంగా క్రికెట్లో భారీ స్కోర్లు, భాగస్వామ్యాలు, పరుగులు, శతకాల మోత, వికెట్ల కూతతో అంతర్జాతీయ రికార్డులు నమోదు కావడం సహజం. కానీ వీటన్నింటికి భిన్నంగా ఆట (మ్యాచ్)తో సంబంధం లేకుండా ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) విన్నూత్నమైన రికార్డులోకి ఎక్కడం... అది కూడా ప్రపంచ రికార్డులకే జేజమ్మలాంటి ‘గిన్నిస్ బుక్’లో ఎక్కితే పెద్ద విశేషం కదా! ఇక అసలు సంగతికి వచ్చేద్దాం... ఎంసీఏకు చెందిన వాంఖెడే స్టేడియంలో అత్యధిక బంతులతో 50 వసంతాలకు సంబంధించిన ఆంగ్ల అక్షర తోరణాన్ని వేదికపై పరిచింది. రెడ్ (ఎరుపు టెస్టులకు వాడే బంతి), వైట్ (తెలుపు వన్డే, టి20లకు వాడే బంతి) ఈ రెండు కలిపి మొత్తం 14, 505 బంతులతో ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖెడే స్టేడియం’ అని గోల్డెన్ జూబ్లీకి సంబంధించిన అక్షరమాలను రాశారు. గావస్కర్, సచిన్‌లాంటి ఎందరో దిగ్గజాలకు పుట్టిల్లు (సొంతగడ్డ)లాంటి వేదిక 50 వసంతాల వేడుకకు ముస్తాబైంది. ఇక్కడ 1975వ ఏడాది జనవరి 23 నుంచి 29 వరకు తొలి మ్యాచ్ జరిగింది. గురువారం (2025, జనవరి 23)తో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంసీఏ సిబ్బంది వేల సంఖ్యలో ఎరుపు, తెలుపు క్రికెట్ బంతులతో వాంఖెడే మైదానాన్ని తీర్చిదిద్దింది. ఈ వేదికపైనే 2011లో ధోని సారథ్యంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. తొలి ప్రపంచకప్‌ను కపిల్ సేన 1983లో లార్డ్స్ (ఇంగ్లండ్)లో నెగ్గింది. అత్యధిక బంతుల వినియోగంతో తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ఎక్కడంపై ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ టి20ల్లో కూడా రెండు ప్రపంచకప్‌లను గెలుచుకుంది. సఫారీలో 2007లో మొదలైన ఆరంభ టి20 ప్రపంచకప్‌ను ధోని నేతృత్వంలో గెలిస్తే... గతేడాది కరీబియన్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌ను రోహిత్ శర్మ బృందం నెగ్గుకొచ్చింది. -
‘ముంబై ప్లేయర్‌గా అతడికి ఇదే ఆఖరి సీజన్’
పృథ్వీ షా పట్ల ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తీరు సరిగా లేదని టీమిండియా మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపె విమర్శించాడు. అతడిని బలి చేసేందుకే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తూ లీకులు ఇస్తున్నారని ఎంసీఏ వర్గాలపై మండిపడ్డాడు. ముంబై తరఫున ఇక పృథ్వీ షా దేశవాళీ క్రికెట్ ఆడే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డాడు.కాగా చిన్న వయసులోనే క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పృథ్వీ షా.. సచిన్ టెండుల్కర్ స్థాయికి ఎదుగుతాడంటూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే టీమిండియా తరఫున 18 ఏళ్ల వయసులో అరంగేట్రంలోనే టెస్టు శతకం బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. వరుస మ్యాచ్‌లలో ఆకట్టుకున్నాడు.టీమిండియాలో చోటు కరువుఅయితే, అదే లయను కొనసాగించలేక వెనుకబడిన పృథ్వీ షాకు శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. వారిద్దరు ఆయా ఫార్మాట్లలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పృథ్వీ షాకు జట్టులో స్థానం కరువైంది. మరోవైపు.. దేశవాళీ క్రికెట్లోనూ అతడికి ఆటంకాలే ఎదురయ్యాయి.క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ సమస్యలు, ఫామ్‌లేమి కారణంగా ఎంసీఏ పృథ్వీ షాను కొన్నాళ్లపాటు పక్కనపెట్టింది. ఫలితంగా తాజా రంజీ సీజన్లో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ కుడిచేతం వాటం బ్యాటర్‌కు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అవకాశం వచ్చింది. అయితే, ఈ టోర్నమెంట్లోనూ షా స్థాయికి తగ్గట్లు రాణించలేదు.ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్‌కు ప్రకటించిన ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. దీంతో.. ‘‘ఇంకెన్ని పరుగులు చేయాలో అర్థం కావడం లేదు దేవుడా!’’ అంటూ పృథ్వీ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు తానే శత్రువుఈ క్రమంలో ఎంసీఏకి చెందిన వ్యక్తి ఒకరు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ఇలాంటి పోస్టుల వల్ల పృథ్వీకి ఎలాంటి ఉపయోగం ఉండదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. ఫిట్గాలేని పృథ్వీ షా వల్ల తాము పది మంది ఫీల్డర్లతోనే ఆడాల్సి వచ్చిందంటూ సదరు వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా.. పృథ్వీ షాకు అస్సలు క్రమశిక్షణ లేదని.. అతడి వల్ల తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. అంతేకాదు.. పృథ్వీకి కొత్తగా శత్రువులు అక్కర్లేదని.. తనకు తానే శత్రువు అని పేర్కొన్నారు.ముంబై తరఫున అతడికి ఇదే ఆఖరి సీజన్ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపె ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘ఎంసీఏ వర్గాల నుంచి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. పృథ్వీ షాకు సహాయం చేయాలనే ఆలోచన వాళ్లకు ఎంతమాత్రం లేదని స్పష్టమవుతోంది. నాకు తెలిసి ముంబై తరఫున పృథ్వీ షాకు ఇదే ఆఖరి సీజన్’’ అని జతిన్ పరాంజపె పేర్కొన్నాడు.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024- ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడనున్న సూర్యకుమార్..!
ముంబై జట్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో అయ్యర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో ముంబైకి కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సారథిగా వ్యహరిస్తాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఎంసీఎ మాత్రం అయ్యర్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.ఈ దేశీవాళీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో రహానే ఆడనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.ఇక టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నట్లు వినికిడి. అయ్యర్ కెప్టెన్సీలో అతడు ముంబై తరపున బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కానున్నట్లు తెలుస్తోంది.కాగా ఇటీవలే సూర్య కెప్టెన్సీలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై స్టార్ ప్లేయర్లు శివమ్ దూబే, ముషీర్ ఖాన్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇక ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముంబై ప్రాబుబుల్స్పృథ్వీ షా, ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్దేష్ లాడ్, హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), షా ముపార్కర్, సాయి పార్క్రాజ్, సాయి పార్క్, , హిమాన్షు సింగ్, సాగర్ ఛబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్, యోగేష్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడి, శశాంక్ అత్తార్డే, జునేద్ ఖాన్ -
కెప్టెన్‌గా అజింక్య రహానే.. మా స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్ నవంబరు 23న మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తమ కెప్టెన్ పేరును వెల్లడించింది. టీ20 టోర్నమెంట్లోనూ టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానేనే తమ సారథిగా కొనసాగుతాడని స్పష్టం చేసింది.స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!అదే విధంగా.. తమ కీలక పేసర్ తుషార్ దేశ్‌పాండే ఫిట్నెస్ గురించి అప్డేట్ అందించింది. చీలమండ శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అతడు.. కోలుకున్నాడని.. త్వరలోనే పునరాగమనం చేస్తాడని వెల్లడించింది. కాగా ముంబై జట్టు దేశీ క్రికెట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.గత రంజీ సీజన్లో చాంపియన్‌గా నిలవడంతో పాటు.. ఇరానీ కప్-2024లో రెస్టాఫ్ ఇండియాను ఓడించి ట్రోఫీ గెలిచింది. ఇక ఈ రెండు సందర్భాల్లోనూ అజింక్య రహానే ముంబై కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక తాజా రంజీ ట్రోఫీ ఎడిషన్‌లోనూ రహానేనే ముంబైని ముందుండి నడిపిస్తున్నాడు.అందుకే అతడే కెప్టెన్ఈ నేపథ్యంలో విజయవంతమైన సారథిగా పేరొందిన రహానేనే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా కొనసాగిస్తామని ఎంసీఏ చెప్పడం విశేషం. ‘‘ఇరానీ కప్‌తో పాటు తాజా రంజీ సీజన్లోనూ అతడి సారథ్యంలో మా జట్టు అద్బుతంగా రాణిస్తోంది. ఈసారి కూడా టీ20 టోర్నీలో అతడే మా కెప్టెన్. ఇక తుషార్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్ నుంచి అతడు అందుబాటులోకి వస్తాడు. అతడి సేవలు మా జట్టుకు ఎంతో కీలకం. శార్దూల్, జునేద్, మోహిత్‌తో పాటు తుషార్ కూడా ఉంటే మా పేస్ బౌలింగ్ లైనప్ మరింత పటిష్టంగా తయారవుతుంది’’ అని ఎంసీఏ అధికారులు వార్తా ఏజెన్సీ ఐఏఎన్ఎస్తో పేర్కొన్నారు.పృథ్వీ షా సైతంకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024తో టీమిండియా మాజీ ఓపెనర్ పృథ్వీ షా సైతం ముంబై జట్టులో తిరిగి చేరనున్నాడు. ఇటీవల.. అనుచిత ప్రవర్తన కారణంగా రంజీ జట్టు నుంచి ఎంసీఏ అతడిని తొలగించింది. అయితే, టీ20 టోర్నీలో మాత్రం పృథ్వీని ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సయ్యద్ ముస్తాన్ అలీ ట్రోఫీ నవంబరు 23- డిసెంబరు వరకు జరుగనుంది.ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25 తొలి మ్యాచ్‌లో ముంబై బరోడా చేతిలో ఓడింది. తర్వాత మహారాష్ట్రపై విజయం సాధించి.. త్రిపురతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తర్వాత ఒడిషాపై గెలుపొందింది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: బ్యాట్‌తోనూ సత్తా చాటిన షమీ -
స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
టీమిండియా ఓపెనర్, తమ స్టార్ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ శుభవార్త అందించింది. ఇటీవల రంజీ జట్టు నుంచి అతడిని తొలగించిన యాజమాన్యం.. దేశీ టీ20 టోర్నీ కోసం మళ్లీ పిలుపునిచ్చేందుకు సిద్ధమైంది. కాగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకువచ్చిన పృథ్వీ షా.. తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయినిలకడలేని ఆటతీరుతో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పోటీలో వెనుకబడి టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయాడు. 2018లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ.. 2021లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 339, 189 పరుగులు చేశాడు.ముంబై తరఫున ఆడుతూఅదే విధంగా.. టీమిండియా తరఫున ఒకే ఒక్క టీ20 ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పృథ్వీ షా.. ముంబై తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు.. విజయ్ హజారే ట్రోఫీ(వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20)లో ఆడుతూనే.. ఐపీఎల్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకంటున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తూఅలాగే ఇంగ్లండ్ దేశీ టోర్నీల్లోనూ పాల్గొంటున్న పృథ్వీ షా.. అక్కడ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో తొలుత పృథ్వీ షాకు అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టింది. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా పృథ్వీపై వేటు వేసింది.శ్రేయస్ అయ్యర్ కూడాఈ నేపథ్యంలో తాజాగా ముంబై ప్రాబబుల్స్ జట్టులో పృథ్వీ పేరు కనిపించడం విశేషం. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో పాల్గొనే అవకాశం ఉన్న ఆటగాళ్ల పేరును ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీ షాతో పాటు టీమిండియా స్టార్, ప్రస్తుతం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో పాటు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.అతడు మాత్రం మిస్‌అయితే, ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్ మాత్రం ఈ లిస్టులో మిస్సయ్యాడు. ఇటీవల భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ.. అక్కడ ఆసీస్-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. కాగా నవంబరు 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానుంది. ఇందులో రంజీ సారథి రహానేనే ముంబైకి నాయక త్వం వహించే అవకాశం ఉంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజింక్య
ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడిగా అజింక్య నాయక్ (37) ఎన్నికయ్యాడు. నిన్న (జులై 23) జరిగిన అధ్యక్ష ఎన్నికలో బీజేపీ బలపరిచిన సంజయ్ నాయక్‌పై 107 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. మొత్తం ఓట్లలో అజింక్యకు 221.. సంజయ్‌కు 114 ఓట్లు పోలయ్యాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా అజింక్య రికార్డు సృష్టించాడు. గత నెలలో మాజీ అధ్యక్షుడు అమోల్ ఖలే మృతి చెందడంతో ఎంసీఏకు ఎన్నిక జరిగింది.అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన అజింక్య, సంజయ్ ప్రస్తుతం ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. అజింక్య కార్యదర్శిగా.. సంజయ్ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఘన చరిత్ర కలిగిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని అజింక్య తెలిపాడు. కాగా, శరద్ పవార్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, మనోహర్ జోషి లాంటి ఉద్దండపిండాలు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించారు. -
ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నుమూత..
ముంబై క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఎ) అధ్యక్షుడు అమోల్ కాలే కన్ను మూశారు. 47 ఏళ్ల అమోల్ కాలే అమెరికాలోని న్యూయర్క్‌లో గుండెపోటుతో మరణించారు.రిపోర్ట్స్ ప్రకారం.. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను అమోల్ కాలే ఎంసీఏ ఆఫీస్ బేరర్లతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం హోటల్ వెళ్లాక ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లు పలురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలో కాలేని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. కాగా అక్టోబర్ 2022లో జరిగిన ముంబై అసోసియేషన్ ఎన్నికల్లో మాజీ భారత ఆటగాడు సందీప్ పాటిల్‌ను ఓడించి కాలే ఎంసీఎ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. వచ్చే దేశీవాళీ సీజన్లో ముంబై సీనియర్ మెన్స్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేయడంలో ఆయనది కీలక పాత్ర. కాలే ఆధ్వర్యంలోనే ముంబై 2023-24 సీజన్లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది. అమోల్ కాలే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.Mumbai Cricket Association president Amol Kale has passed away due to a cardiac arrest in USA. Kale (wearing a cap in the pic) watched the India vs Pakistan match live from the stadium along with MCA office bearers @the_hindu @sportstarweb pic.twitter.com/f3Nl2KFEeK— Amol Karhadkar (@karhacter) June 10, 2024 -
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్‌గా మాజీ క్రికెటర్
దేశవాళీ క్రికెట్ సీజన్ (2024-25)కు ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ మెంటార్‌గా భారత మాజీ పేసర్ ధావల్ కులకర్ణిని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. కులకర్ణి దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో ముంబై జట్టు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మెరకు ఎంసీఏ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కులకర్ణికి అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటకి దేశీవాళీ క్రికెట్లో మాత్రం ముంబై తరపున అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కులకర్ణి.. టీమిండియా తరపున 12 వన్డేలు, రెండు టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం కులకర్ణి 96 మ్యాచ్‌ల్లో ఏకంగా 285 వికెట్లు పడగొట్టాడు. రంజీట్రోఫీ 2023-24 సీజన్ ట్రోఫీని ముంబై సొంతం చేసుకోవడంలో కులకర్ణి కీలక పాత్ర పోషించాడు.రికార్డు స్ధాయిలో 42వ సారి రంజీ ట్రోఫీని ముంబై గెలుచుకున్న అనంతరం కులకర్ణి.. ఈ ఏడాది మార్చిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పకున్నాడు. ఈ క్రమంలోనే అతడి సేవలను ఉపయెగించుకోవాలని భావించిన ఎంసీఏ.. మెంటార్ పదవిని కట్టబెట్టింది. -
IPL 2024: హార్దిక్‌ను టార్గెట్ చేసే వారిపై ఉక్కుపాదం.. ఖండించిన ఎంసీఏ
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి ఆ బాధ్యతలను గుజరాత్ నుంచి వలస వచ్చి హార్దిక్ పాండ్యకు అప్పజెప్పడాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంఐ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వారు హార్దిక్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. హార్దిక్ బహిరంగంగా కనపడిన ప్రతిసారి నోటితో పాటు చేతులకు కూడా పని చెబుతున్నారు (ఖాళీ బాటిళ్లను విసరడం). మైదానంలో అయితే హార్దిక్‌పై దూషణల పర్వం శృతి మించుతుంది. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ హార్దిక్‌కు మద్దతుగా నిలుస్తూ, అదనపు సెక్యూరిటీని కల్పిస్తున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో ఆడే మ్యాచ్‌ల సందర్భంగా హార్దిక్‌ను ఎవరైనా టార్గెట్ చేస్తే వారిపై ఉక్కుపాదం మోపాలని ఎంసీఏ పోలీసులను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై ఎంసీఏ స్పందించింది. MCA Statement: "There are rumours that MCA has instructed security against people who support Rohit or boo Hardik, this is incorrect and baseless rumours, no instructions have been given". pic.twitter.com/6Yoa0MVbG5 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2024 హార్దిక్ విషయంలో తాము పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. మైదానంలో మ్యాచ్ చూసేందుక వచ్చే ప్రేక్షకుల విషయంలో బీసీసీఐ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని వివరణ ఇచ్చింది. అయితే వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేయడం సమర్దనీయం కాదని పేర్కొంది. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో హార్దిక్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో రేపు సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే హార్దిక్‌ను అదనపు సెక్యూరిటీ కల్పిస్తారని ప్రచారం జరిగింది. -
ఆ విషయం గురించి చెప్పడానికి సిగ్గుపడను.. పెద్ద కోరికలేమీ లేవు.. అయితే..
‘‘నేను ముంబైలోని చాలా చోట్ల తలదాచుకున్నాను. ఎక్కడెక్కడో తిరిగాను. ఎప్పుడైతే నేను ఐపీఎల్‌కు సెలక్ట్ అయ్యానో.. అప్పుడు నా మనసులో మెదిలిన ఒకే ఒక ఆలోచన ఏమిటంటే.. ముంబైలో మాకంటూ ఇల్లు కొనుక్కోవడం. నా తల్లిదండ్రులు, తోబుట్టువులను ఇక్కడకు తీసుకువచ్చి వారితో పాటు కలిసి ఉండాలి. ఇంతకంటే నాకు పెద్ద కోరికలేమీ లేవు. వాళ్లకు కావాల్సిన అవసరాలు తీర్చడం.. ఇంటిని చక్కబెట్టుకోవడం అంతే! అంతకంటే ముఖ్యంగా నా ఆటపై దృష్టి సారించడం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అన్నాడు. సెంచరీతో చెలరేగి కాగా ఐపీఎల్ 2020 ఎడిషన్ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ యశస్విని 2.40 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ మెగా వేలం 2022కు ముందు ఏకంగా 4 కోట్లు వెచ్చించి అతడిని రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రాజస్తాన్ కీలక ఆటగాడిగా మారిన యశస్వి తాజా సీజన్లోనూ అదరగొట్టాడు. ఐపీఎల్-2023లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 14 మ్యాచ్‌లు ఆడి 625 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు యశస్వి. ఆ చేదు జ్ఞాపకాలను నేను చెరిపేయలేను ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముంబై బ్యాటర్ మాట్లాడుతూ తన జీవితంలోని ఎత్తుపల్లాల గురించి చెప్పుకొచ్చాడు. ‘‘జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను. నాకన్నీ అలవాటే. నిజానికి నా గతం కారణంగానే.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలను నేను చెరిపెయ్యలేను. ఎవరైనా నా గతం గురించి అడిగితే చెప్పడానికి అస్సలు సిగ్గుపడను. ఇప్పటి వరకు సాగిన నా ఈ ప్రయాణం గురించి చెప్పడంలో నాకెలాంటి అభ్యంతరాలు లేవు. నా జీవితం కొందరికైనా స్ఫూర్తినిస్తే నాకంతే చాలు. త్వరలోనే ఔత్సాహిక క్రికెటర్ల కోసం ఓ ఫౌండేషన్ మొదలుపెట్టాలనుకుంటున్నాను. నేను లక్కీ.. కానీ చాలా మందికి ప్రతిభ ఉండి కూడా ఆర్థిక తోడ్పాటు లేక వెనుకబడి పోతున్నారు. అలాంటి వారికి మా ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తాం. నాకైతే లక్కీగా ముంబై క్రికెట్ అసోసియేషన్ రూపంలో నా నైపుణ్యాలు, ఫిట్నెస్ మెరుగుపరచుకునే వేదిక దొరికింది. అందరి విషయంలో ఇలా జరుగదు కాబట్టి నాలాంటి వాళ్లకు అండగా నిలబడాలని భావిస్తున్నా’’ అని 21 ఏళ్ల యశస్వి జైశ్వాల్ చెప్పుకొచ్చాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లో సాధారణ కుటుంబంలో జన్మించిన యశస్వి.. పదేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. ఆజాద్ మైదాన్‌లో ట్రెయినింగ్ చేస్తూ డైరీ షాపులో పనిచేశాడు. పానీపూరీ అమ్మేవాళ్లకు సాయం చేస్తూ జీవనాధారం పొందేవాడు. ఈ క్రమంలో క్రికెట్ కోచ్ జ్వాలా సింగ్ అతడిని చేరదీశాడు. లీగల్ గార్డియన్‌గా మారి యశస్వి నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి పునాదులు వేశారు. వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ. చదవండి: ఇంతటి విషాదమా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట్లు చూడకుండానే.. మళ్లీ.. -
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ధోనికి అరుదైన గౌరవం
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం ఇవ్వనుంది. వాంఖడే స్టేడియం వేదికగా 12 సంవత్సరాల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం స్టాండ్స్‌లోని ఒక సీటుకు ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది. 91 పరుగులు నాటౌట్‌గా నిలిచిన ధోని సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. కాగా.. శ్రీలంకతో ఫైనల్లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ వెల్లడించారు. వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే సచిన్, గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి వినూత్నంగా సీటుకు ధోని పేరు పెట్టనుండడం విశేషం. -
ఎంసీఏ ఎన్నికల్లో సందీప్ పాటిల్ పరాజయం
ముంబై: ప్రతిష్టాత్మక ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. అమోల్ కాలే 25 ఓట్ల తేడాతో పాటిల్‌పై గెలుపొందారు. బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ మద్దతుతో బరిలో నిలిచిన కాలేకు 183 ఓట్లు రాగా, పాటిల్‌కు 158 ఓట్లు వచ్చాయి. భారత జట్టు తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడిన 66 ఏళ్ల పాటిల్ జాతీయ క్రికెటర్ అకాడమీ డైరెక్టర్‌గా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. భారత్, కెన్యా, ఒమన్ జట్లకు కోచ్‌గా కూడా పని చేసిన ఆయన కొద్ది రోజుల క్రితమే ఎంసీఏ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. చదవండి: T20 World Cup 2022: నమీబియాపై యూఏఈ విజయం.. నెదర్లాండ్స్ సెలబ్రేషన్స్ అదుర్స్ -
‘మహా’ పాలిటిక్స్.. బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రత్యర్థులుగా ఉన్నవారు మిత్రులుగా మారటం, మిత్రులు ప్రత్యర్థులుగా మారటం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. మరోమారు.. అలాంటి సంఘటనే ఎదురైంది. విపక్ష పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్.. బీజేపీతో చేతులు కలిపారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలకు బీజేపీ, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. ఈ మేరకు సోమవారం బీజేపీ ముంబై అధ్యక్షుడు ఆశిష్ షెలార్‌తో సమావేశమయ్యారు శరద్ పవార్. ఆశిష్ షెలార్- శరద్ పవార్ గ్రూప్ కలిసి అభ్యర్థిని బరిలో దింపాయి. అంతకు ముందు.. ఎంసీఏ అధ్యక్ష పదవికి భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్‌కు శరద్ పవార్ గ్రూప్ మద్దతు తెలిపింది. కానీ, ఆ తర్వాత సమీకరణాలు మారిపోయాయి. బీజేపీతో కలిసి ఎంసీఏ ఎన్నికల బరిలో నిలుస్తోంది ఎన్సీపీ. ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ మెంబర్‌గా ఈ కూటమి ఎమ్మెల్యే జితెంద్ర అహ్వాద్ బరిలో నిలుస్తున్నారు. పవార్-షెలార్ గ్రూప్ నుంచి ఉద్ధవ్ థాక్రే పీఏ మిలింద్ నర్వేకర్ పోటీ చేస్తున్నారు. మరోవైపు.. షిండే గ్రూప్ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కుమారుడు విహాంగ్ సర్నాయ్ ముంబై ప్రీమియర్ లీగ్ టీ20 ఛైర్మన్ పదవి బరిలో నిలిచారు. ఈ మేరకు ఆశిష్ ,షెలార్‌తో శరద్ పవార్ కూటమి ఏర్పాటు చేసినట్లు ఓ లేఖ విడుదల చేశారు. లేఖపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మిలింద్ నర్వేకర్ ట్వీట్ చేశారు. అందులో ఆశిష్ షెలార్ ఫోటో కనిపిస్తోంది. అక్టోబర్ 20న ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. పవార్-షెలార్ సంయుక్త గ్రూప్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ సన్నిహితుడు అమోల్ కాలే ఉపాధ్యక్షుడి బరిలో నిలవనున్నారు. మరోవైపు.. 2019-22 వరకు ఉపాధ్యక్షుడిగా కొనసాగిన పవార్ గ్రూప్ అభ్యర్థి అజింక్య నాయక్ సెక్రెటరీగా కొనసాగే అవకాశం ఉంది. దీపక్ పాటిల్ సంయుక్త కార్యదర్శి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: తలాక్‌లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు -
17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్
రంజీ సీనియర్ ఆటగాడు.. 34 ఏళ్ల ఆదిత్య తారే ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో ఉన్న 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికాడు. వచ్చే సీజన్ నుంచి ఆదిత్య తారే ఉత్తరాఖండ్ తరపున ఆడే అవకాశాలు ఉన్నాయి. వచ్చే డొమొస్టిక్ సీజన్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 47 మంది సీనియర్ క్రికెటర్ల లిస్టులో ఆదిత్య తారే పేరు కనిపించలేదు. దీంతో ముంబైతో తారే బంధం ముగిసిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తారే స్వయంగా స్పందించాడు. ''ముంబై జట్టుతో ఉన్న నా 17 ఏళ్ల బంధం నేటితో ముగిసింది. ముంబై నుంచి విడిపోతున్నా అనే పదం చెప్పడం నాకు బాధను కలిగిస్తోంది. అది ఎలా వివరించాలో కూడా అర్థం కావడం లేదు. 16 ఏళ్ల వయసులో అండర్-17 విభాగంలో ముంబైకి తొలిసారి ప్రాతినిధ్యం వహించాను. అప్పటినుంచి దాదాపు 17 ఏళ్ల పాటు ముంబై తరపున అన్ని దేశవాలీ టోర్నీల్లో పాల్గొనడం గర్వంగా అనిపిస్తోంది. ఈ మార్గంలో నేను కొన్నిసార్లు విజయాలు అందుకున్నా. అలాగే విమర్శలతో పాటు వైఫల్యాలను కూడా సహించాను. విజయాలైనా, ఓటములైనా మ్యాచ్ వరకు మాత్రమే. ఈ 17 ఏళ్లలో నా సహచరులతో గడిపిన క్షణాలు నాకు మంచి జ్ఞాపకాలు. నేను ఎక్కువగా మిస్ అయ్యే విషయం ముంబై డ్రెస్సింగ్ రూమ్. ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం.. కొందరు అద్భుతమైన ఆటగాళ్లను చూశాను. అలాగే ముంబై తరపున ఆడుతూ సహచరుల అభినందనలు పొందడం ఎన్నటికి మరిచిపోను'' అంటూ తారే భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. ఇక ఆదిత్య తారే ముంబై తరపున 80 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 73 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. 2015-16 రంజీ సీజన్లో ఆదిత్య తారే నేతృత్వంలోని ముంబై జట్టు రికార్డు స్థాయిలో 41వ సారి రంజీ టైటిల్‌ను అందుకోవడం విశేషం. ఇక ఐపీఎల్‌లోనూ ఎక్కువ శాతం ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఆదిత్య తారే 35 మ్యాచ్‌ల్లో 339 పరుగులు సాధించాడు. చదవండి: IND Vs PAK Asia Cup 2022: ఫీల్డింగ్ పరిమితుల గొడవేంటి.. ఐసీసీ కొత్త రూల్స్ ఏంటంటే! రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు? -
Vinod Kambli: సచిన్ సహచరుడు వినోద్ కాంబ్లీకి లక్ష జీతంతో జాబ్ ఆఫర్
సచిన్ టెండూల్కర్ సహచరుడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కొద్ది రోజుల క్రితం ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)కు ఏదైనా పని కల్పించాలని అభ్యర్థన చేశాడు. ప్రస్తుతం తనకు బీసీసీఐ ఇచ్చే రూ.30వేల పెన్షన్ మాత్రమే ఆధారమని ఆ సమయంలో వెల్లడించాడు. అయితే ఎంసీఏ దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక వ్యాపారవేత్త సహ్యాద్రి ఇండస్ట్రీ గ్రూప్‌లోని ఫైనాన్స్ విభాగంలో వినోద్ కాంబ్లీకి నెలకు రూ.1లక్ష జీతంతో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అయితే కాంబ్లీ ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా, లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది. కాగా, దేశవాళీ క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాంబ్లీ.. అంతర్జాతీయ క్రికెట్లో రాణించడంలో విఫలమయ్యాడు. టీమిండియాకు 17 టెస్టులు, 104 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. కాంబ్లీ 2000లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అయితే చాలా కాలం తర్వాత 2011లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం క్రికెట్ కామెంటర్‌గా మారాడు. అనేక మీడియా ఛానల్లలో పనిచేశారు. కాంబ్లీ కష్టాల్లో ఉన్నప్పుడు సచిన్ ఎన్నో విధాలుగా సాయపడ్డారు. అయితే, కొద్దిరోజుల క్రితం వరకు తన సహచరుడు సచిన్ టెండూల్కర్ ఏర్పాటు చేసిన అకాడమీలో కోచ్‌గా పనిచేసినా, ప్రయాణం చాలా దూరం కావడంతో అక్కడ ఉద్యోగం మానేసినట్లు కాంబ్లీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఉద్యోగం కల్పించాలని ఎంసీఏను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. చదవండి: (ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. సచిన్ సహచరుడు వినోద్ కాంబ్లీ దీనావస్థ..!) -
ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. సచిన్ సహచరుడు వినోద్ కాంబ్లీ దీనావస్థ..!
టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సహచరుడు, ప్రపంచ క్రికెట్లో బ్రియాన్ లారా తర్వాత అంతటి సొగసరి బ్యాటర్‌గా గుర్తింపు పొందిన ముంబై మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో ఎవరైనా ఊహించగలరా..? అంతటి స్టార్ ఇమేజ్ కలిగిన క్రికెటర్ ప్రస్తుతం చాలీచాలని జీతంతో బతుకీడుస్తున్నాడంటే ఎవరైనా నమ్మగలరా..? కానీ ఇది నిజం. ప్రపంచ క్రికెట్లో 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన కాంబ్లీ రకరకాల కారణాల చేత ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయి ప్రస్తుతం పూట గడవని దీనావస్థలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాతో పంచుకున్నాడు. క్రికెట్‌కు సంబంధించి ఏదైనా పని ఉంటే ఇప్పించాలని బీసీసీఐని వేడుకుంటున్నాడు. బీసీసీఐ ఇస్తున్న ముప్సై వేల పెన్షనే తనను తన కుటుంబాన్ని బతికిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్దిరోజుల క్రితం వరకు నేరుల్లో 'టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ'లో యువ క్రికెటర్లకు మెంటార్‌గా పని చేసేవాడినని.. అయితే, నేరుల్ తను నివసించే ప్రాంతానికి చాలా దూరంగా ఉండటంతో సగం రోజు ప్రయాణానానికే సరిపోతుందని.. అందుకే తప్పని పరిస్థితుల్లో ఆ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) చొరవ తీసుకుని వాంఖడే లేదా బీకేసీ స్టేడియంలో ఏదైనా క్రికెట్‌కు సంబంధించిన పని ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని అభ్యర్ధించాడు. పెన్షన్ ఇచ్చి తనను, తన కుటుంబాన్ని పోషిస్తున్న బీసీసీఐకి జీవితకాలం రుణపడి ఉంటానని అన్నాడు. తన ఆర్థిక కష్టాల గురించి చిన్ననాటి స్నేహితుడు సచిన్‌కు తెలుసా..? అని ప్రశ్నించగా.. అతనికి తెలుసని సమాధానమిచ్చాడు. అయితే, సచిన్ నుంచి తాను ఏమీ ఆశించడం లేదని.. 'టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ'లో ఉద్యోగం ఇప్పించింది సచినేనని తెలిపాడు. సచిన్ ఇప్పటికే తనకెంతో చేశాడని.. అతనో గొప్ప స్నేహితుడని.. తన బాగు కోరే వారిలో సచిన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడని చెప్పుకొచ్చాడు. టీమిండియా తరఫున 17 టెస్ట్‌లు, 104 వన్డేలు ఆడిన కాంబ్లీ 3500కు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేసిన కాంబ్లీ ఖాతాలో 4 టెస్ట్ సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో కాంబ్లీ వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాడు. టీమిండియా 1996 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో లంక చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంటున్న సమయంలో కాంబ్లీ కన్నీరు పెట్టడం సగటు భారత అభిమానిని బాగా కదిలించింది. చదవండి: ధవన్‌ను ఇంతలా అవమానించడం సరికాదు.. వేరేవాళ్లయ్యుంటే రచ్చరచ్చ జరిగేది..! -
15 మందికి కరోనా.. ఎంసీఏ ఆఫీసు మూసివేత.. టోర్నీలు కష్టమే!
ముంబై: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత పది రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒక్క రోజే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సెగ ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)ను తాకింది. 15 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఎంసీఏ కార్యాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. ఈ విషయం గురించి ఎంసీఏ వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘మా సిబ్బందిలోని చాలా మంది కరోనా బారిన పడ్డారు. అందుకే శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఆఫీసు మూసివేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. కాగా గురువారం ఒక్కరోజే మహారాష్ట్రలో సుమారు 20 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే దేశవాళీ టోర్నీలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయ సిబ్బంది ముగ్గురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇక దేశావ్యాప్తంగా గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. చదవండి: ICC Big Rule Change: టీ20 ఫార్మాట్లో కీలక మార్పులు... ఈ నెల నుంచే కొత్త నిబంధనలు.. టీమిండియాకు.. -
వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి
ముంబై: వాంఖడే మైదానం వేదికగా 14వ ఎడిషన్ ఐపీఎల్ మ్యాచ్‌లు యధాతధంగా జరుగుతాయని మహారాష్ట్ర సర్కారు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరో ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ నిర్ధారణ అయిన వారిలో ఒకరు ప్లంబర్ కాగా, మరో ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ అని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా వాంఖడే మైదానంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే మహారాష్ట్ర సర్కార్ బీసీసీఐతో సంప్రదింపులు జరిపి, షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, టోర్నీని సజావుగా నడిపే ఉద్దేశంతో మైదాన సిబ్బంది స్టేడియంలోనే బస చేస్తున్నారని, ప్రయాణాలు చేయడం లేదని ఎంసీఏ స్పష్టం చేసింది. కొద్దిరోజుల కిందట ఇదే స్టేడియంలో పని చేసే పది మంది సిబ్బందికి కరోనా సోకినట్లు బయటపడటంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉండగా ముంబై వేదికగా మొత్తం 10 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అందులో తొలి మ్యాచ్ ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగనుంది. చదవండి: పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్ -
అర్జున్ బ్యాటింగ్ మెరుపులు..సిక్సర్ల మోత
ముంబై: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. బంతితోనూ, బ్యాట్‌తోనూ చెలరేగిపోయి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది తన మార్కు చూపించాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్థానికంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్లో అర్జున్ టెండుల్కర్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఎమ్ఐజీ క్రికెట్ క్లబ్- ఇస్లాం జింఖానా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎమ్ఐజీ తరఫున మైదానంలో దిగిన అతడు.. తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా తొలుత బ్యాటింగ్ దిగిన ఎమ్ఐజీ క్రికెట్ క్లబ్ జట్టు.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ప్రగ్నేశ్ కందీలెవార్ సెంచరీ చేయగా, మరో ఆటగాడు కెవిన్ 96 పరుగుల వద్ద నిలిచిపోయాడు. ఇక అర్జున్ టెండుల్కర్ 31 బంతుల్లోనే 77 పరుగులు చేసి వహ్వా అనిపించాడు. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ హషీర్ దఫేదార్ వేసిన ఓవర్లోనే ఐదు సిక్స్‌లు బాదాడు. ఈ ముగ్గురి భారీ ఇన్నింగ్స్‌తో ఎమ్ఐజీ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. (చదవండి: ఇప్పుడేమంటారు: అశ్విన్ భార్య) ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన జింఖానా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు 191 పరుగులకే ఆలౌట్ అయి 194 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. అర్జున్ టెండుల్కర్, అంకుశ్ జైస్వాల్. శ్రేయస్ గౌరవ్ మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. కాగా క్యాష్ రిచ్‌లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భాగంగా అర్జున్ ఇటీవల తన పేరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో రిజిస్టర్ చేసుకున్న అర్జున్, మరో మూడు రోజుల్లో ఆటగాళ్ల వేలం జరుగనున్న వేళ ఈ మేరకు పొట్టి ఫార్మాట్ తరహాలో అద్భుత ఇన్నింగ్స్ ఆడటం విశేషం. -
ముంబై కోచ్‌గా రమేశ్ పొవార్ నియామకం
సాక్షి, ముంబై: ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పొవార్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) మంగళవారం నియమించింది. భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన 42 ఏళ్ల పొవార్.. గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడు. పొవార్ నియామకం ప్రస్తుతానికి తాత్కాలికమే(ప్రస్తుత సీజన్) అయినప్పటికీ.. జట్టు అవసారాల దృష్ట్యా భవిష్యత్త్‌లో కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని ఎంసీఏ సెక్రెటరీ సంజయ్ నాయక్ తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు పేలవ ప్రదర్శన కారణంగా అమిత్ పాగ్నిస్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. కోచ్ పదవికి ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్, రమేశ్ పొవార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. సెలక్టర్లు రమేశ్ పొవార్వైపే మొగ్గు చూపారు. -
దిశ లేకుండా పరే‘షా’న్...
ఒక 20 ఏళ్ల యువ క్రికెటర్ 15 నెలల వ్యవధిలోనే ఉవ్వెత్తున ఎగసి ఉస్సురని కూలిపడ్డాడు... గత కొద్ది నెలలుగా పరిణామాలు చూస్తే పృథ్వీ షాకు బీసీసీఐ నుంచి గానీ ముంబై క్రికెట్ సంఘం నుంచి గానీ సరైన మార్గనిర్దేశనం లభించలేదని అర్థమవుతోంది. అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేయాల్సిన కుర్రాడి కెరీర్‌పై అప్పుడే సందేహాలు రావడం దురదృష్టకరం. సాక్షి క్రీడా విభాగం ఆస్ట్రేలియన్ మీడియా సచిన్‌తో పోలుస్తూ రాసిన వ్యాసాల మధ్య పృథ్వీ షా 2018 నవంబరులో ఉత్సాహంగా ఆసీస్ గడ్డపై అడుగు పెట్టాడు. సిడ్నీలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చూడచక్కటి షాట్లతో అర్ధ సెంచరీ కూడా చేశాడు. అయితే అదే మ్యాచ్‌లో వచ్చిన ఉపద్రవం అతడిని ఇబ్బందుల్లో పడేసింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో షా అనూహ్యంగా గాయపడ్డాడు. బౌండరీ వద్ద క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతని కాలి మడమకు దెబ్బ తగిలింది. ఆ ఘటన తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించగలదని అతనూ ఊహించకపోవచ్చు! ముందుగా ఒక టెస్టుకే దూరమని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించినా... చివరకు సిరీస్ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ అతనికి టీమిండియా అవకాశం దక్కలేదు. తాజాగా రంజీ ట్రోఫీ ప్రదర్శనతో న్యూజిలాండ్‌తో సిరీస్‌పై ఆశలు పెరిగినా... మరో గాయం మళ్లీ అతడిని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి పంపించింది. ఆరంభం అదిరేలా... స్కూల్ క్రికెట్లో సంచలనాల తర్వాత సీనియర్ స్థాయిలో నిలకడైన ప్రదర్శన పృథ్వీ షాకు ముంబై క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఫలితంగా 17 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీ ఆడే అవకాశం దక్కింది. తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించడంతో పాటు దులీప్ ట్రోఫీలో కూడా పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును సవరించడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగినట్లుగానే భారత ‘ఎ’ జట్టు తరఫున కూడా ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు అతను ఎంపికయ్యాడు. అక్కడ మ్యాచ్ ఆడకపోయినా... స్వదేశం రాగానే వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులోనే పృథ్వీ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత జరిగిన హైదరాబాద్ టెస్టులోనూ అతను అర్ధ సెంచరీ చేశాడు. ఇక దూసుకుపోవడమే తరువాయి అన్న సమయంలో గాయం వెతుక్కుంటూ వచి్చంది. కోలుకున్నాక ముస్తాక్ అలీ ట్రోఫీలో, ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ ఆడటంతో షా కెరీర్ మళ్లీ దారిలోకి వచ్చినట్లు అనిపించింది. అయితే మళ్లీ గాయపడటంతో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన వన్డే సిరీస్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. నిజానికి ఈ గాయం గురించి బోర్డు స్పష్టత ఇవ్వలేదు. దగ్గు తెచ్చిన తంటా... ఇన్నేళ్లలో భారత క్రికెట్లో పెద్దగా వినిపించని వివాదంతో పృథ్వీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో బీసీసీఐ అతనిపై 9 నెలల నిషేధం విధించింది. షా ‘టర్బుటలిన్’ అనే నిషేధిత ఉత్రే్పరకం వాడినట్లు తేలింది. అయితే తాను దగ్గుతో బాధపడుతుండటంతో తీసుకున్న సిరప్ వల్లే ఈ సమస్య వచి్చందని ఈ యువ బ్యాట్స్‌మన్ వివరణ ఇచ్చుకున్నాడు. నిజానికి ప్రతీ ఆటగాడికి బీసీసీఐ నిషేధిత డ్రగ్స్ జాబితా ఒకటి ఇస్తుంది. వారు వాడే ఎలాంటి మందులోనైనా ఇవి ఉన్నాయో, లేవో చూసుకోవాలి. సీనియర్ టీమ్‌కు ఆడిన ఒక క్రికెటర్ బోర్డు వైద్య బృందంలో ఎవరినీ సంప్రదించకుండా, సలహా తీసుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా దగ్గు మందు వాడటం నిజంగా ఆశ్చర్యకరం. ఇక్కడే అతనికి ఎవరూ సరైన సూచనలు ఇవ్వలేదని అర్థమవుతోంది. అదృష్టవశాత్తూ పృథ్వీపై నిషేధాన్ని పాత తేదీ నుంచి వర్తింపజేయడంతో గత ఏడాది నవంబర్ 16 నుంచి ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులోకి వచ్చాడు. అవకాశం ఉందా! పృథ్వీ గాయంతో జట్టులోకి వచి్చన మయాంక్ అగర్వాల్ మెల్బోర్న్లో తొలి టెస్టులోనే చెలరేగగా, ఆ తర్వాత కూడా చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడి తన స్థానం ఖాయం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి రోహిత్ శర్మకు మరో ఓపెనర్ స్థానం ఖరారైంది. రిజర్వ్ ఓపెనర్‌గా రాహుల్ అందుబాటులో ఉండగా... అవసరమైతే ఇప్పటికే జట్టుతో ఉంటున్న శుబ్‌మన్ గిల్‌కు అవకాశం దక్కుతుంది. ఈ జాబితాలో పృథ్వీ వెనక్కి వెళ్లిపోయాడు. భారత్ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్‌లో బాగా ఆడి ఉంటే ఏమైనా చాన్స్ ఉండేదేమో కానీ ఇప్పుడు భుజం గాయంతో కనీసం నాలుగు వారాలు క్రికెట్ ఆడే అవకాశమే లేదు. ఈ నెల 12నే న్యూజిలాండ్ టూర్‌కు జట్టు ఎంపిక ఉంది కాబట్టి ఎలాంటి ఆశలు లేవు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని దేశవాళీలో చెలరేగినా మళ్లీ భారత జట్టులోకి రావడం అంత సులువు కాదు. కొత్త వివాదాలు... 20 ఏళ్ల కుర్రాడంటే సరదాలు, షికార్లు చేస్తాడు, అందులో తప్పేముంది! బయటి నుంచి చూస్తే ఇది మామూలుగానే అనిపించవచ్చు. కానీ భారత్ తరఫున ఆడే స్థాయికి ఎదిగిన ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ ఎక్కడ క్రమశిక్షణ తప్పినా అది పెద్ద తప్పు చేసినట్లే. చిన్న వయసులోనే వచి్చన పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఇప్పుడు పృథీ్వని కూడా తప్పు దారి పట్టిస్తున్నాయనేది క్రికెట్ వర్గాల్లో సాగుతున్న చర్చ. వడోదరలో ఇటీవల బరోడాతో మ్యాచ్ సందర్భంగా అతని ప్రవర్తనపై వార్తలు వచ్చాయి. తన హోటల్ గదిలో షా చేసిన ‘రచ్చ’పై ఆగ్రహంతో స్వయంగా ముంబై టీమ్ మేనేజర్ ఫిర్యాదు చేయాల్సి వచి్చందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అపార ప్రతిభ ఉండీ తప్పుడు ప్రవర్తనతో అవకాశాలు కాలదన్నుకున్న వినోద్ కాంబ్లీతో ఇప్పుడు పృథీ్వని వారు పోల్చుతున్నారు. సచిన్ ఉజ్వల ఘనతలకు అతని ఆటతో పాటు క్రమశిక్షణ కూడా కారణమనే విషయాన్ని ఈ యువ ముంబైకర్‌కు గుర్తు చేయాల్సి ఉంది. ‘పృథ్వీ ప్రవర్తన ఇలాగే కొనసాగితే అతనికే నష్టం. అతనికి లభించిన అవకాశాలను మైదానం బయటి వ్యవహారాలతో చేజార్చుకుంటే అది స్వయంకృతమే అవుతుంది. బరోడా ఘటన ఒక్కటే కాదు. అతని గురించి చెప్పాలంటే చాలానే జరిగాయి. అతని ప్రస్తుత జీవనశైలి అన్ని సమస్యలకు కారణం’ అంటూ ముంబై క్రికెట్ సంఘం కీలక సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. పృథ్వీ షా కెరీర్ ఎదుగుదలలో అతని తండ్రి పంకజ్ షా పాత్ర ఎంతో ఉంది. తల్లి లేని పృథీ్వకి అన్నీ తానై క్రికెటర్‌గా ఎదిగేలా తండ్రి ఎంతో శ్రమించాడు. 14 ఏళ్ల వయసులో స్కూల్ క్రికెట్లో 330 బంతుల్లో 546 పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పడంతో పృథ్వీ పేరు మార్మోగిపోయింది. ఈ కుర్రాడు భారత్‌కు ఆడతాడు అంటూ అప్పట్లోనే స్వయంగా సచిన్ అతని ఆటను ప్రశంసించాడు. ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడకుండా పృథ్వీ దూసుకుపోయాడు. నిజానికి సరైన దిశలో వెళ్లడంలో అన్నీ చోట్లా తండ్రి పంకజ్ వెనకుండి నడిపించాడు. అయితే ఇటీవల పరిణామాల అనంతరం సన్నిహితుడొకరు ‘ఈ వయసు కుర్రాళ్లలో ఎందరు తండ్రి మాట వింటారు? ఇప్పుడు అదే జరుగుతోంది. క్రికెట్ కారణంగా ఎక్కువ సమయం పృథ్వీ తన తండ్రికి దూరంగానే ఉంటున్నాడు. ఫలితంగా బయటి స్నేహాలు సమస్యగా మారాయి. దాంతో పంకజ్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు’ అని అభిప్రాయపడ్డాడు. అయితే చిన్న వయసే కాబట్టి ఇప్పటికీ సరిదిద్దుకునే అవకాశం ఉందనేది వారి సూచన. ►సరిగ్గా రెండేళ్ల క్రితం అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు కెపె్టన్ అతను... కొన్నాళ్లకే ఢిల్లీ జట్టు తరఫున భారీ మొత్తానికి ఐపీఎల్లో అవకాశం... ఆ తర్వాత కొద్ది రోజులకే భారత సీనియర్ టెస్టు జట్టులో స్థానం, ఆపై ఓపెనర్‌గా తొలి టెస్టులోనే సెంచరీ... సచిన్ తర్వాత అతి పిన్న వయసులో శతకం బాదిన భారత క్రికెటర్‌గా గుర్తింపు... నెలల వ్యవధిలోనే పృథ్వీ షా పైపైకి దూసుకుపోయిన తీరిది. ►కెరీర్‌ను ఉచ్ఛ స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉన్న ఆస్ట్రేలియా సిరీస్‌కు వెళ్లి కాలి గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వెనుదిరగడం... డోపింగ్‌తో నిషేధానికి గురై ఆటకు దూరం కావడం... పునరాగమనం తర్వాత మళ్లీ వెంటాడుతున్న గాయాలు... దీనికి తోడు క్రమశిక్షణా రాహిత్యం... ఇప్పుడు అతను టీమిండియా ఓపెనర్ స్థానానికి కనీసం పోటీపడే స్థితిలో కూడా కనిపించడం లేదు. -
తప్పించక ముందే తప్పుకున్నారు..!
ముంబై: ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ రాజీనామా చేశాడు. అగార్కర్‌తో పాటు సెలక్షన్ కమిటీలో ఉన్న మరో ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కమిటీ సమావేశమైన కొద్ది గంటల్లోనే వీరు రాజీనామాలు ప్రకటించడం ప్రాధాన్యత ను సంతరించుకుంది. దేశవాళీ టోర్నీల్లో ముంబయి జట్టు దారుణంగా పరాజయం పాలైంది. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో అంచనాలను అందుకోలేదు. దీంతో సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకునేందుకు ఎంసీఏ తాత్కాలిక కమిటీ సిద్ధమైంది. ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్న సమయంలోనే సెలక్షన్ కమిటీ సభ్యులు మూకుమ్ముడిగా రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామాలు చేసిన వారిలో అగార్కర్‌తో నీలేస్ కులకర్ణి, సునీల్ మోరే మరియు రవి ఠక్కర్‌లు ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను ఈ-మెయిల్లో ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎంసిఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సి.కె. నాయక్‌కు పంపారు. -
సంచలనం.. ఒక్కడే 1045 పరుగులు బాదాడు!
ముంబై : క్రికెట్ చరిత్రలోనే సంచలన రికార్డు నమోదైంది. ముంబైలో జరిగిన ఓ లోకల్ టోర్నమెంట్లో తనీష్క్గవటే అనే14 ఏళ్ల కుర్రాడు ఏకంగా 1045 పరుగులు బాదాడు. రెండు రోజుల బ్యాటింగ్ చేసిన ఈ ముంబై ఆటగాడు 149 ఫోర్లు, 67 సిక్సులతో ఈ ఘనత సాధించాడు. నవీ ముంబై, కోపర్ఖైర్నేలోని యశ్వంతరావు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన స్థానిక టోర్నమెంట్ సెమీస్ మ్యాచ్‌లో గవటే ఈ పరుగులు చేశాడు. అయితే ఆఫ్‌సైడ్, లెగ్‌సైడ్ బౌండరీ దగ్గరగా ఉండటంతో ఇన్ని పరుగులొచ్చాయని కోచ్ మనీష్ తెలిపాడు. మరోవైపు ఈ టోర్నీకి ముంబై క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు లేదని అధికారులు స్పష్టం చేశారు. -
బీసీసీఐలో ముంబై ఓటు గల్లంతు
ఈశాన్య రాష్ట్రాలకు ఓటు హక్కు న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు కేంద్ర బిందువైన ముంబై ఇపుడు ప్రభ కోల్పోనుంది. బీసీసీఐలో శాశ్వత ఓటు హక్కును ముంబై సంఘం కోల్పోయింది. జస్టిస్ లోధా కమిటీ కీలక సిఫార్సు అయిన ‘ఒక రాష్ట్రం–ఒక ఓటు’ను అమలు చేసేందుకు బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) సిద్ధమైంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు కొత్తగా బీసీసీఐ ఓటు పరిధిలోకి వచ్చాయి. మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఇప్పుడు బోర్డులో పూర్తిస్థాయి సభ్యత్వం లభించింది. దీంతో ఈ రాష్ట్రాలు బీసీసీఐలో క్రియాశీలం కానున్నాయి. తెలంగాణ (హెచ్‌సీఏ), ఉత్తరాఖండ్ సంఘాలు కూడా శాశ్వత సభ్యులుగా పూర్తిస్థాయి హోదా పొందాయి. సీఓఏ తాజాగా సభ్య సంఘాల మెమోరాండం (ఎంఓఏ) కొత్త నియమావళిని అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను అందులో పొందుపరిచింది. 41 సార్లు రంజీ చాంపియన్లను తయారు చేసిన ముంబై క్రికెట్ సంఘం ఇప్పుడు బీసీసీఐ అనుబంధ సభ్య సంఘంగా కొనసాగుతుంది. వీటితో పాటు బరోడా, సౌరాష్ట్ర సంఘాలు కూడా వారి మాతృ సంఘానికి జతగా... బీసీసీఐకి అనుబంధంగా కొనసాగుతాయి. ఇపుడీ సంఘాలు ప్రతి యేటా రొటేషన్‌లో ఓటు హక్కును వినియోగించుకుంటాయి. అలాగే ఏ సంఘం కూడా మాకు మేమే జవాబుదారీలమనే వైఖరిని విడనాడాల్సిందేనని సీఓఏ స్పష్టం చేసింది. కాంట్రాక్టులు, నిర్మాణం, నిర్వహణ విషయాల్లో అవినీతి వటవృక్షాలవుతున్న ఢిల్లీ క్రికెట్ సంఘం, హైదరాబాద్ క్రికెట్ సంఘాలను ఉద్దేశించి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పారదర్శకంగా వ్యవహరించాల్సిందేనని చెప్పకనే చెప్పింది. -
క్రికెట్ అసోసియేషన్‌కు శరద్‌పవార్ గుడ్‌బై
-
శరద్‌పవార్ కీలక నిర్ణయం
ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు గుడ్‌బై రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ (76) ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. క్రికెట్ సమూల ప్రక్షాళనకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బీసీసీఐలో, దాని అనుబంధ యూనిట్లలోని బాధ్యులు, అధికారులకు వయస్సు పరిమితి, కాలపరిమితి ఉండాలని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారసు అమలైతే.. శరద్ పవార్‌పై వేటు పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్వచ్ఛందంగా తప్పుకొన్నట్టు భావిస్తున్నారు. రాజకీయాలతోపాటు క్రికెట్ అనుబంధం కొనసాగిస్తున్న పవార్ 2005 నుంచి 2008 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2010-12 వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2015 జూన్‌లో ఎంసీఏ అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికయ్యారు. అయితే, 70 ఏళ్లు దాటిన వాళ్లు క్రికెట్ సంఘాల్లో ఉండరాదని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. -
రీసైకిల్ చేసిన నీటినే ఐపీఎల్‌కు వాడుకుంటాం
ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అడ్డు తొలగించుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఓ సరికొత్త పరిష్కారాన్ని కనుగొంది. తాము ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేసే నీటినే మ్యాచ్‌లలో పిచ్ సిద్ధం చేయడానికి వాడుకుంటామని బాంబే హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో సమాధానం దాఖలు చేసింది. వాడిన నీటిని రీసైకిల్ చేసి, ఆ నీళ్లనే ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేస్తుంది. దానివల్ల తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఎంసీఏ చెప్పింది. పిచ్‌లను సిద్ధం చేయడానికి వాళ్లు సరఫరా చేసే రీసైకిల్డ్ నీళ్లు సరిపోతాయని ఎంసీఏ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందువల్ల మంచినీటిని ఉపయోగించకుండానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాగా.. ముంబై, పుణె నగరాల్లో నిర్వహించే 17 మ్యాచ్‌లకు ఈ రీసైకిల్డ్ నీళ్లను ఉపయోగిస్తారు. మరోవైపు నాగపూర్‌లో నిర్వహించదలచిన మూడు మ్యాచ్‌లను మొహాలీకి తరలించేందుకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందని బీసీసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. -
ఆటను మార్చేద్దాం!
ఊర్లలో సరదాగా ఆడుకునే మ్యాచ్‌లు కావచ్చు... పట్టణాల్లో పాఠశాల స్థాయి క్రికెట్ కావచ్చు... నగరాల్లో క్లబ్ క్రికెట్ కావచ్చు... చాలా సాధారణంగా ఒక దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. బాగా ఆడే క్రికెటర్లు ఒక నలుగురు జట్టులో ఉంటారు. వాళ్లే బౌలింగ్ చేస్తారు, వాళ్లే బ్యాటింగ్ చేస్తారు. సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదేస్తారు. మిగిలిన ఏడుగురూ ఫీల్డర్లుగా మాత్రమే పనికొస్తారు. మరో ముగ్గురు లేదా నలుగురిని మంచినీళ్లు ఇవ్వడానికి మాత్రమే వాడుకుంటారు. దేశం తరఫున ఆడే పోటీ క్రికెట్లో విజయం ముఖ్యం కాబట్టి... బాగా ఆడే నలుగురు ముందే ఆడినా అభ్యంతరం లేదు. కానీ నైపుణ్యం వెలుగులోకి రావాల్సిన జూనియర్ స్థాయి క్రికెట్లోనూ ఇదే జరుగుతోంది. దీనివల్ల చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు. రోజంతా స్కూల్ మానేసి కూడా పిల్లలు బెంచ్ మీద కూర్చుని ఆట చూస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది పిల్లలు వెలుగులోకి రావడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఏ స్థాయి క్రికెట్లో అయినా విజయం ముఖ్యం. కచ్చితంగా మన దగ్గర ఉన్న ఉత్తమ క్రికెటర్లను ఆడించి ప్రత్యర్థిని ఓడించాలి. ఏ కోచ్ అయినా, ఏ అకాడమీ అయినా, ఏ కెప్టెన్ అయినా ఇదే ఆలోచిస్తాడు. అండర్-16 స్థాయి దాటిన తర్వాత ఈ వ్యవస్థ ఉన్నా ఫర్వాలేదు. కానీ పిల్లల్లో ప్రతిభను వెలికితీయాల్సిన స్థాయిలోనూ ఇదే జరుగుతోంది. భారత క్రికెట్‌కు ఇది ఎంతమాత్రం మంచిది కాదనేది ద్రవిడ్ అభిప్రాయం. దీనివల్ల పిల్లల సమయం వృథా అవడం తప్ప ఉపయోగం లేదని చెబుతున్నాడు. మరోవైపు సచిన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకే ఈ ఇద్దరు క్రికెట్లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ముఖ్యంగా జూనియర్ క్రికెట్లో ఈ మార్పులు చేస్తే ఎక్కువ మంది వెలుగులోకి వస్తారని ఇద్దరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. సచిన్ చేసిన ప్రతిపాదనలను ముంబై క్రికెట్ సంఘం కొంతమేరకు అంగీకరించింది. అయితే చిన్న మార్పులతో వాటిని అమలు చేయాలని నిర్ణయించింది. -సాక్షి క్రీడావిభాగం ద్రవిడ్ ప్రతిపాదనలు * ఫుట్‌బాల్‌లో మాదిరిగా స్కూల్ స్థాయి క్రికెట్లో సబ్స్టిట్యూట్లను విరివిగా వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలి. * బ్యాటింగ్, బౌలింగ్‌లో కచ్చితంగా రొటేషన్ పద్ధతిని పాటించాలి. * జూనియర్ క్రికెట్లో ఆడే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలి. దీనివల్ల కుర్రాడు ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆసక్తి పెంచుకుంటాడు. * ఓ బ్యాట్స్‌మన్ అర్ధసెంచరీ చేస్తే ఇక అతను రిటైరవ్వాలి. జట్టు మూడు వికెట్లు కోల్పోతేనే మళ్లీ అతను బ్యాటింగ్‌కు రావాలి. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది. * క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ సెంచరీ తర్వాత కూడా అలాగే కొనసాగితే తర్వాతి మ్యాచ్‌లకు కూడా అతనిపైనే ఎక్కువ ఆధారపడతారు. దీనివల్ల ఆటగాళ్లలోని సహజ నైపుణ్యం, అంకితభావం దెబ్బతింటాయి. ఖాళీగా కూర్చోవడం, వాటర్ బాటిల్స్ అందించడం మినహా మిగిలిన వారికి పని ఉండదు. * మ్యాచ్‌లో బౌలర్ గరిష్టంగా మూడోవంతు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించాలి. * ఎవరైనా బౌలర్ ఐదు వికెట్లు తీస్తే అతన్ని బౌలింగ్ నుంచి తప్పించాలి. * స్కూల్ స్థాయి మొదలుకొని అండర్-15 వరకు ఇదే పద్ధతిని కొనసాగించాలి. అప్పుడు కుర్రాళ్లలో నైపుణ్యాన్ని, ప్రతిభను వెలికి తీయొచ్చు. * జూనియర్ స్థాయి మ్యాచ్‌ల్లో ఆడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. లేకపోతే సరైన అవకాశాల్లేక వాళ్లలోని ప్రతిభ మరుగున పడిపోతుంది. అలాగే వాళ్ల తల్లిదండ్రులు కూడా ఆటపై ఆసక్తి చంపేసుకుంటారు. అవకాశాలు ఇచ్చినప్పుడే ఏదో ఓ రూపంలో అతనికి ప్రోత్సాహం అందుతుంది. సచిన్ ప్రతిపాదనలు * ఇంటర్ స్కూల్ మ్యాచ్‌ల్లో 11 మందికి బదులుగా 15 మందికి అవకాశం ఇవ్వాలి. దీనివల్ల మైదానానికి వచ్చిన ప్రతి పిల్లాడికీ ఆడే అవకాశం వస్తుంది. * బ్యాటింగ్ సమయంలో నిఖార్సైన ఏడుగురు బ్యాట్స్‌మన్ ఆడాలి. * బౌలింగ్ సమయంలో నాణ్యమైన బౌలర్లకు ఆరుగురికి అవకాశం ఇవ్వాలి. ఇందులో పేసర్లయినా స్పిన్నర్లయినా ఉండొచ్చు. * ఫీల్డింగ్‌లో మాత్రం 11 మందినే కొనసాగించాలి. మ్యాచ్‌లో ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఇద్దరిని సబ్‌స్టిట్యూట్‌గా అనుమతించాలి. * దీనివల్ల కుర్రాళ్లకు సమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆటపై ఆసక్తి ఏర్పడుతుంది. లేదంటే... రిజర్వ్ బెంచ్‌కు పరిమితమైన క్రికెటర్ కొన్నాళ్లకు తమ సహజ నైపుణ్యాన్ని మర్చిపోతాడు. * ఆటగాళ్ల సంఖ్య పెరిగితే జట్టు మేళవింపులో భిన్నత్వం పెరుగుతుంది. దీంతో జట్టులోని ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్‌గా తయారవుతారు. ఒక్కరిపైనే ఆధారపడే భావన తగ్గుతుంది. రిజర్వ్ బెంచ్ సత్తా పెరుగుతుంది. * గాయాలు, ఫిట్నెస్ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా సమష్టితత్వం పెంపొందుతుంది. * 2013లో రిటైర్మెంట్ తర్వాత సచిన్ ఈ ప్రతిపాదన చేశాడు. * సచిన్ చేసిన ఈ ప్రతిపాదనను మొదట తిరస్కరించిన ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అండర్-14 విభాగంలో 11 మంది క్రికెటర్లకు బదులు 13 మందికి అవకాశం ఇవ్వనుంది. ఇద్దర్ని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకొవచ్చు. ఏడుగురు బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయొచ్చు. ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేసుకోవచ్చు. సచిన్ 15 మందిని ప్రతిపాదిస్తే... ప్రస్తుతం 13 మందితో దీనిని ఆచరణలోకి తెచ్చారు. -
జహీర్‌ఖాన్‌కు సన్మానం
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పేసర్ జహీర్ ఖాన్‌ను ఆదివారం ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఘనంగా సత్కరించింది. ఐదో వన్డే ముగిసిన అనంతరం ఎంసీఏ తరఫున జహీర్‌కు సచిన్ టెండూల్కర్ ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జహీర్, తన కెరీర్లో అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు రైతుల సంక్షేమం కోసం గతంలో ఎంసీఏ ప్రకటించిన రూ. కోటి చెక్‌ను కూడా స్థానిక క్రికెటర్లు రోహిత్ శర్మ, రహానేలతో కలిసి ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అందజేశారు. -
షారూఖ్ ఖాన్ పై నిషేధం ఎత్తివేత
ముంబై: బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ పై విధించిన నిషేధాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఎత్తివేసింది. వాంఖేడ్ స్టేడియంలోకి ఆయనను అడుగుపెట్టకుండా విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ఎంసీఏ తొలగించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న అంకిత్ చవాన్ పై బీసీసీఐ కొనసాగిస్తున్న నిషేధాన్ని సవాల్ చేయరాదని ఎంసీఏ నిర్ణయించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా ప్రమేయంపై సాక్ష్యాలు లేవని కోర్టు తీర్పు చెప్పింది. అయితే తమ దగ్గర ఉన్న సాక్ష్యాల కారణంగాపై వీరు ముగ్గురుపై నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
బీకేసీలోకి బీసీసీఐ ప్రధాన కార్యాలయం!
ముంబై: వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలోకి మార్చనున్నారు. ఈ మేరకు కార్యాలయానికి సరిపోయేంత ఖాళీ ప్రదేశాన్ని కేటాయించాలని బోర్డు... ఎంసీఏని కోరింది. ప్రస్తుతం సబర్బన్ ప్రాంతమైన బంద్రా కుర్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో బోర్డు కార్యాలయ మార్పుపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ‘బీకేసీలోని క్లబ్ హౌస్‌కు ఎదురుగా ఉన్న ప్రదేశంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దాన్ని బీసీసీఐకి కేటాయిస్తాం. బీకేసీ చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌కు చాలా దగ్గరగా ఉండటంతో కార్యాలయాన్ని ఇక్కడికి తరలించాలని వాళ్లు భావిస్తున్నట్లు ఉన్నారు. ప్రస్తుత కార్యాలయానికి రావడానికి ఎయిర్పోర్ట్ నుంచి రెండు గంటలకు పైగా పడుతోంది. చిన్న మీడియా గ్యాలరీ, నివాసానికి అనువుగా కొన్ని రూమ్‌లను కూడా కొత్త బిల్డింగ్‌లో ఏర్పాటు చేస్తాం’ అని ఎంసీఏ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఆదివారం జరిగే ఎంసీఏ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
ఎంసీఏకు చవాన్ లేఖ
ముంబై: తన క్రికెట్ కెరీర్‌ను తిరిగి కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు చవాన్ అధికారికంగా విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ లేఖను రాశాడు. అయితే ఆగస్టు 2న ఎంసీఏ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం జరిగే సమావేశంలో ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్, ఇతర కమిటీ సభ్యుల ముందు ఈ లేఖను ఉంచుతామని సంయుక్త కార్యదర్శి డాక్టర్ పీవీ షెట్టి తెలిపారు. కమిటీ నిర్ణయం ఎలా ఉన్నా.. తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ చేతుల్లోనే ఉంటుందన్నారు. -
పవార్‌కే ‘పవర్’
ఎంసీఏ అధ్యక్షుడిగా విజయం ముంబై: ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. బుధవారం ఆసక్తికరంగా సాగిన ఎంసీఏ ఎన్నికల్లో పవార్ 27 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి విజయ్ పాటిల్‌పై విజయం సాధించారు. పవార్‌కు మొత్తం 172 ఓట్లు రాగా, పాటిల్‌కు 145 ఓట్లు పడ్డాయి. పవార్ వర్గానికే చెందిన మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఆశిష్ షెలార్ ఉపాధ్యక్షులుగా, నితిన్ దలాల్ కోశాధికారిగా, పీవీ శెట్టి సంయుక్త కార్యదర్శులుగా గెలిచారు. -
'ఎంసీఏ చరిత్రలో నాదే బెస్ట్ స్కోర్'
ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తనపై చేసిన విమర్శలకు ఎన్సీపీ అధ్యక్షుడు, ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) అధ్యక్షుడు శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. ఎంసీఏ చరిత్రలో తాను బెస్ట్ స్కోరు చేశానని చెప్పారు. 'అభివృద్ధి కోణంలో చూస్తే వాంఖేడ్ మైదానం నిర్మించి దివంగత ఎస్ కే వాంఖేడ్ మొదటి సెంచరీ సాధించారు. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక బాంద్రా కర్లా ఇండోర్ అకాడమీ ఏర్పాటు చేశాం. ఇదే రకమైన సౌకర్యాలు కాందవలి,ధానేల్లో కల్పించాం. దీన్నిబట్టి చూస్తే నేను మూడు సెంచరీలు సాధించినట్టు లెక్క. ఇదీ మా స్కోరు' అని శరద్ పవార్ అన్నారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటర్లు రిటైరయ్యారు కానీ శరద్ పవార్ మాత్రం ఎంసీఏను వీడలేదని ఉద్ధవ్ థాకరే ఎద్దేవా చేశారు. జీరో స్కోరు చేసినా పవార్ ఇప్పటికీ ప్యాడ్లు కట్టుకుని ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 14 ఏళ్లుగా ఎంసీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పవార్ మరోసారి పోటీకి రెడీ అవుతున్న నేపథ్యంలో థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు. -
చవాన్‌కు రూ. 32 లక్షలు చెల్లించిన ఎంసీఏ
ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌తో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న అంకిత్ చవాన్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ 2012-13 రంజీ సీజన్‌కు సంబంధించిన బకాయిలను చెల్లిం చింది. మ్యాచ్ ఫీజులు, బోనస్‌తో కలిపి మొత్తం రూ. 32 లక్షలను ఇచ్చామని ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు. ‘బకాయిల చెల్లింపు అంశంపై బీసీసీఐ అనుమతి కోసం గతేడాది నవంబర్‌లో లేఖ రాశాం. కానీ మార్చి వరకూ బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చేసేదేమీలేక బకాయిలు విడుదల చేశాం. చవాన్‌పై నిషేధం ఉంది కాబట్టి బోర్డు నుంచి అనుమతి కోరాల్సి వచ్చింది’ అని సావంత్ పేర్కొన్నారు. -
ఫడణ్‌విస్ కు పవార్ స్నేహ హస్తం
ముంబై: మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడణ్‌విస్ కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్నేహ హస్తం అందించారు. ఫడణ్‌విస్ ప్రమాణ స్వీకారోత్సవానికి పూర్తి సహకారం అందించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఐ) అధికారులను పవార్ ఆదేశించారు. అంతేకాదు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న వాంఖేడ్ స్టేడియంను ఉచితంగా ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయించారు. ఎంసీఐకు పవార్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. వాంఖేడ్ మైదానంలో ఈవిధమైన రాజకీయ కార్యక్రమం నిర్వహించనుండడం ఇదే మొదటిసారని ఎంసీఐ సంయుక్త కార్యదర్శి పీవీ శెట్టి తెలిపారు. ఈ నెల 31న జరగనున్న ఫడణ్‌విస్ ప్రమాణస్వీకారోత్సవానికి పూర్తి సహకారం అందించాలని తమ అధ్యక్షుడు పవార్ ఆదేశించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ హాజరుకానున్నారు. దాదాపు 30 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. -
షారుఖ్‌ను అనుమతిస్తాం
ఐపీఎల్ షరతులకు ఎంసీఏ అంగీకారం ముంబై: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షరతులకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎట్టకేలకు తలొగ్గింది. ఫైనల్ మ్యాచ్ నిర్వహణను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరాదన్న ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ పాటించేందుకు అంగీకరించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్‌ను ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు వాంఖడేలోకి అనుమతిస్తామని చెప్పింది. ‘ఫైనల్ మ్యాచ్ వాంఖడేలోనే జరగాలని మా అధ్యక్షుడు శరద్ పవార్ కోరుకుంటున్నారు. అందుకే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విధించిన 14 షరతులకూ అంగీకరిస్తున్నాం. షారుఖ్ ఖాన్‌పై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ఈ మ్యాచ్ వరకు తాత్కాలికంగా సడలిస్తున్నాం. వాంఖడేలో ఆయన ప్రవేశం ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం’ అని ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ స్పష్టం చేశారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులైన గవాస్కర్, రవిశాస్త్రి ముంబై మాజీ ఆటగాళ్లే అయినందున వారు తమకు మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తాజా పరిణామంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఎంసీఏనుంచి అధికారికంగా లేఖ వచ్చిన తర్వాత స్పందిస్తామని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ చెప్పారు. -
షారుక్‌ను అనుమతించక తప్పదా!
ఐపీఎల్ షరతులతో సంకటంలో ఎంసీఏ ముంబై: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ విషయంలో నెలకొన్న వివాదం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఫైనల్ మ్యాచ్‌ను తిరిగి వాంఖడే స్టేడియానికే కేటాయించాలంటే తాము విధించే షరతులకు అంగీకరించాలని ఎంసీఏకు ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిశ్వాల్ సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ షరతుల్లో ఫ్రాంచైజీ యజమానులందరినీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు తప్పనిసరిగా అనుమతించాలని ఉంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని అయిన షారుక్ఖాన్నూ వాంఖడేలోకి అనుమతించాల్సి వస్తుంది. 2012లో కోల్‌కతా జట్టు ఫైనల్ మ్యాచ్‌లో నెగ్గాక ఎంసీఏ సిబ్బందితో షారుక్ గొడవకు దిగడంతో అతనిపై ఐదేళ్లపాటు నిషేధం విధించారు. వాంఖడేతోపాటు ఎంసీఏ పరిసరాల్లోకి కూడా షారుక్‌ను అనుమతించరాదని ఎంసీఏ అప్పటి అధ్యక్షుడు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఐపీఎల్ అధికారుల తాజా షరతుతో ఎంసీఏ సంకటంలో పడింది. షారుక్‌ను అనుమతించడమంటే అతనిపై నిషేధాన్ని ఎత్తివేయడమేనన్న అభిప్రాయంతో ఉంది. అయితే... ఫ్రాంచైజీ యజమానుల్ని ఫైనల్ మ్యాచ్‌కు తప్పనిసరిగా అనుమతించాలన్న నిబంధనేదీ ఐపీఎల్లో లేదని ఎంసీఏకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. -
ఆ షరతులు ఒప్పుకుంటేనే..!
ముంబైకి ఫైనల్ అవకాశం ఐపీఎల్ నుంచి ఎంసీఏకు లేఖ! ముంబై: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పు వ్యవహారం మరో మలుపు తిరిగింది. వాంఖడే నుంచి ఈ మ్యాచ్‌ను బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి మార్చిన వైనంపై ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఐపీఎల్ పాలకమండలి (జీసీ)కి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఎంసీఏ నిరసనపై జీసీ సమావేశమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. మరోవైపు లీగ్ చైర్మన్ రంజిబ్ బిశ్వాల్ ఎంసీఏ నిరసనపై సమాధానమిచ్చారు. కానీ ఈ అంశంపై కొన్ని షరతులు కూడా విధించారు. తమ తరఫున రానున్న అతిథుల కోసం హాస్పిటాలిటీ బాక్సుల నిర్వహణ తమకే అప్పగించడం, రాత్రి పది తర్వాత బాణసంచా కాల్చడానికి, పెద్ద శబ్దంతో సంగీతం పెట్టుకునేందుకు ముంబై పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడంలాంటి షరతులు వీటిలో ఉన్నట్టు సమాచారం. ‘బిశ్వాల్ నుంచి మాకు లేఖ అందింది. షరతులపై చర్చించేందుకు మా మేనేజింగ్ కమిటీ సమావేశమవుతుంది’ అని ఎంసీఏ ఉపాధ్యక్షుడు సావంత్ తెలిపారు. -
ఎంసీఏ లేఖపై నేడు నిర్ణయం
ముంబై: ఐపీఎల్-7 ఫైనల్ మ్యాచ్ వేదికను వాంఖడే స్టేడియం నుంచి తరలించ డాన్ని నిరసిస్తూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) రాసిన లేఖపై లీగ్ పాలక మండలి నేడు (మంగళవారం) నిర్ణయం తీసుకోనుంది. ‘సోమవారం మా మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఫైనల్ వేదికను బెంగళూరుకు మార్చడాన్ని సభ్యులు వ్యతిరేకించారు. ఈ విషయంపై బీసీసీఐతో పాటు ఐపీఎల్ పాలకమండలితో టచ్‌లో ఉన్నాం. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ కూడా మా లేఖపై చర్చించి తుది విషయం నేడు చెబుతామని అన్నారు. ఎంసీఏకు అనుకూలంగానే అంతా జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని కమిటీకి అధ్యక్షత వహించిన ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు. జూన్ 1న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌ను ఎలాంటి కారణాలు చూపకుండానే ముంబై నుంచి బెంగళూరుకు తరలిస్తూ శనివారం ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
ముదురుతున్న వివాదం
బీసీసీఐతో అమీతుమీకి సిద్ధమవుతున్న ఎంసీఏ నేడు అత్యవసర సమావేశం ముంబై: బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)ల మధ్య వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. ఐపీఎల్-7 ఫైనల్ మ్యాచ్‌ను వాంఖడే నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలించాలని గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎంసీఏ.. బీసీసీఐతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సోమవారం ఎంసీఏ మేనేజింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించింది. బీసీసీఐతో భవిష్యత్ సంబంధాలను నిర్ణయించే దిశగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తరలింపునకు గల అసలు కారణమేంటో చెప్పాలని ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్ అటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తోపాటు బీసీసీఐ సభ్యులకు శనివారమే లేఖ రాశారు. దీనికితోడు ఐపీఎల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంసీఏ అధికారులు ఇప్పటికే తమ అక్రిడిటేషన్లను కూడా నిర్వాహకులకు తిరిగి ఇచ్చేశారు. స్పష్టమైన కారణం తెలపకుండానే మ్యాచ్‌ను తరలిస్తూ తీసుకున్న నిర్ణయానికి నిరసనగానే తమ అక్రిడిటేషన్లు వెనక్కి ఇచ్చేశామని ఎంసీఏ మీడియా మేనేజర్ వినోద్ దేశ్‌పాండే తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం వాంఖడేలో ఐదు లీగ్ మ్యాచ్‌లతోపాటు ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సివుంది. అయితే ఎలిమినేటర్‌ను బ్రబౌర్న్ స్టేడియానికి, ఫైనల్‌ను బెంగళూరుకు తరలించాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికి మూడు లీగ్ మ్యాచ్‌లు జరగగా, మరో రెండు మ్యాచ్‌లు జరగాల్సి వున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు మ్యాచ్‌లను కూడా వేరే చోట నిర్వహించుకోవాల్సిందిగా ఎంసీఏలో ఎక్కువ మంది సూచిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
ఐపీఎల్ ఫైనల్ బెంగళూరులో
న్యూఢిల్లీ: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) పెద్ద ఝలక్ ఇచ్చింది. జూన్ 1న జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌ను వాంఖడే నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలించింది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో ఒకదాన్ని ఈడెన్ గార్డెన్స్‌లో, ఎలిమినేటర్ మ్యాచ్‌ను బ్రబౌర్న్‌లో నిర్వహించనున్నారు. శనివారం జరిగిన ఐపీఎల్ జీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వేదిక మార్పుకు సంబంధించి స్పష్టమైన కారణాన్ని బీసీసీఐ వెల్లడించకపోవడంతో ఎంసీఏ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఐపీఎల్ చైర్మన్ బిస్వాల్‌కు లేఖ రాసింది. వేదిక మార్పుపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన వ్యక్తులు కూడా నోరు మెదపడం లేదు. అయితే వాంఖడే ఆతిథ్య బాక్స్‌లో సౌకర్యాలు బాగాలేవని, మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే ఉన్నతస్థాయి వ్యక్తుల ముందు ఇది చిన్నచూపుగా ఉంటుందని బోర్డు చెబుతోంది. బీసీసీఐ సభ్యులకు వీవీఐపీ కారు పార్కింగ్ పాస్‌లను ఇవ్వడంలో ఎంసీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాదిస్తోంది. పొలార్డ్ (ముంబై), స్టార్క్ (బెంగళూరు)ల గొడవపై కూడా జీసీలో చర్చించారు. సభ్యులందరూ దీన్ని తీవ్రంగా ఖండించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. -
తుది జట్టును15 మందితో ఆడించండి
ముంబై: మరింత మంది నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి రావాలంటే జట్టులో 11 మందికి బదులు 15 మందితో ఆడించాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు సూచించాడు. ఎంసీఏ ఆధ్వర్యంలో మంగళవారం సచిన్‌కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇంటర్ కాలేజి, ఇంటర్ స్కూల్ పోటీల్లో ఎంసీఏ తమ తుది జట్టులోని ఆటగాళ్ల సంఖ్యను పెంచాల్సిందిగా సూచించాడు. ‘ప్రత్యర్థి జట్లపై ముంబై క్రికెట్ ఎలా ఆధిక్యం సాధించాలనే అంశంపై నేను, మా అన్నయ్య ఓ సారి చర్చించుకున్నాం. ఆ సందర్భంగానే ఈ ఆలోచన వచ్చింది. ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజి మ్యాచ్‌ల్లో 11 మందికి బదులుగా 15 మందితో ఆడించాలి. ప్రతీ ఆటగాడు మ్యాచ్ ఆడేందుకే ఇంటి నుంచి బయల్దేరుతాడు. కానీ జట్టులో చోటు దొరుకుతుందా లేదా అనే అనుమానం ఉంటుంది. ఈ కొత్త ఆలోచనను అమల్లోకి తెచ్చి ప్రతీ ఆటగాడికి ఆడే అవకాశాన్ని కల్పిస్తే ముందు ఎంసీఏ లాభపడుతుంది’ అని మాస్టర్ అన్నాడు. అయితే ఈ విషయాన్ని తన కొడుకు అర్జున్ టెండూల్కర్‌ను దృష్టిలో ఉంచుకుని చె ప్పడం లేదని సచిన్ స్పష్టం చేశాడు. గతేడాది ముంబై అండర్-14 జట్టులో అర్జున్ సభ్యుడుగా ఉన్నాడు. భారతరత్నపై పిల్ కొట్టివేత చెన్నై: సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడాన్ని నిరసిస్తూ దాఖలైన పిల్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గత నెల 29న న్యాయవాది కనకసబై ఈమేరకు కోర్టుకెక్కారు. నిబంధనలకు విరుద్ధంగా క్రీడాకారులకు ఈ అవార్డును అందజేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే ఈ అత్యున్నత అవార్డు కోసం క్రీడాకారుల పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. -
క్రికెట్ ను రాజకీయం చేయకండి : ఉద్దవ్ థాకరే
క్రీడల్లో జోక్యం చేసుకోవద్దని రాజకీయ నాయకులకు శివసేన అధినేత ఉద్దవ్ థాకరేకు విజ్క్షప్తి చేశారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడి స్థానానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీజేపీ నేత గోపినాధ్ ముండేల మధ్య పోటిపై నెలకొన్న తాజా వివాద నేపథ్యంలో ఉద్దవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో ముండే నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరించి.. పవార్ ను ఏకగ్రీవంగా ఎంసీఏ ఎన్నుకోవడం వివాదంగా మారింది. దాంతో ఎంసీఏ అధ్యక్షుడి ఎన్నికను సవాల్ చేస్తూ ముంబై కోర్టులో ముండే పిటిషన్ దాఖలు చేశారు. ముండే పిటిషన్ విచారించిన కోర్టు..పవార్ నియామకంపై వారం రోజుల స్టే విధించింది. రాజకీయ నాయకుల కారణంగా క్రికెట్ లో నెలకొంటున్న వివాదాలపై శివసేన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయంలో కథనాన్ని వెల్లడించింది. క్రికెట్ ఆడుతున్న 11 దేశాల్లో రాజకీయ నాయకుల జోక్యం లేదని, కేవలం భారత దేశంలోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది అని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. బ్రిటన్ లో ప్రిన్స్ చార్లెస్ ఎన్నడూ క్రికెట్ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని.. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా క్రీడల్లో రాజకీయ నేతల జోక్యం లేదని ఉద్దవ్ అన్నారు. ప్రధాని పదవి రేసులో పవార్, ముంబై ముఖ్యమంత్రి పదవి కోసం ముండే పోటి పడుతున్న ముండేలు ఎంసీఏ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారని ఉద్దవ్ సంపాదకీయంలో రాశారు. క్రికెట్ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడాన్ని ఆపివేయాలని ఉద్దవ్ విజ్క్షప్తి చేశారు. -
కోహ్లిదే పే... ద్ద ఫొటో
ముంబై: భారత క్రికెట్ జట్టులో నెలకొన్న కార్పొరేట్ ప్రకటనల యుద్ధం.... సచిన్ వీడ్కోలు అంశానికి విలువ లేకుండా చేసింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) చేసిన నిర్వాకం వల్ల దిగ్గజ బ్యాట్స్‌మన్ శతకాలకు గుర్తింపు లేకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే... వాంఖడేలో కెరీర్ చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని ఎంసీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా స్టేడియం రూఫ్ భాగంలో మాస్టర్ చేసిన 51 టెస్టు సెంచరీల యాక్షన్ ఫొటోలను, ప్రత్యర్థి జట్ల పేరును బిల్‌బోర్డు రూపంలో పెట్టాలని భావించింది. అయితే పత్రికల్లో, మ్యాగజైన్లలో వచ్చిన ఫొటోలను ఎన్లార్జ్ చేయడంతో అవి సాధారణ కంటికి కనిపించడం లేదు. కానీ వాటి పక్కనే ఉన్న విరాట్ కోహ్లి యాడ్ బిల్బోర్డ్ మాత్రం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. చాలా రోజుల ముందే ఈ ప్రకటనకు సంబంధించిన కంపెనీ బిల్ బోర్డును ప్రత్యేకంగా తయారు చేయించింది. దీంతో మాస్టర్ ఫొటోలను అది పూర్తిగా డామినేట్ చేస్తోంది. ఈ విషయంపై ఎంసీఏ అధికారులను అడిగితే ఏం చేయాలో తెలియడం లేదని సమాధానమిచ్చారు. ‘ఓ కంపెనీకి స్టేడియం లోపలి హక్కులను కట్టబెట్టారు. దీంతో రాష్ట్ర సంఘానికి ఆ డీల్ గురించి పెద్దగా తెలియదు. మొత్తానికి సచిన్ బిల్ బోర్డును కోహ్లి ఫొటో డామినేట్ చేస్తోంది. అయితే ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సచిన్ బిల్‌బోర్డు పక్కన ఎలాంటి ఫొటోలు పెడతారనే దానిపై ఆలోచన చేయలేదు’ అని అధికారులు తెలిపారు. -
సచిన్ '200 టెస్టు' టిక్కెట్ల విక్రయానికి బ్రేక్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు, చరిత్రాత్మక 200వ టెస్టు టిక్కెట్ల విక్రయానికి బ్రేక్ పడింది. సోమవారం ఆన్లైన్లో టిక్కెట్లను విక్రయానికి ఉంచిన కాసేపటికే సాంకేతిక కారణాల వల్ల వెబ్సైట్ పనిచేయడం మానేసింది. దీంతో టిక్కెట్లను గురువారం నుంచి అమ్మాలని నిర్ణయించారు. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు అనంతరం సచిన్ కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. దీంతో సచిన్ చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు అమితాసక్తి చూపుతున్నారు. టిక్కెట్ల ధరలను 500, 1000, 2500 రూపాయలుగా నిర్ణయించారు. ఆన్లైన్లో ఒక్కొక్కరికి రెండేసి టిక్కెట్లను మాత్రమే విక్రయించనున్నారు. ముంబై క్రికెట్ సంఘం అధికారిక వెబ్సైట్ KyaZoonga.Comలో టిక్కెట్లను అందుబాటులో ఉంచుతారు. -
‘ధోని మంచి కెప్టెన్ అవుతాడని చెప్పాడు’
అత్యంత విజయవంతమైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంఎస్ ధోని పేరు తెచ్చుకోవడం వెనుక మాస్టర్ బ్లాస్టర్ ప్రమేయముందని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) చీఫ్ శరద్ పవార్ తెలిపారు. 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు జట్టు కెప్టెన్‌గా ధోనిని నియమిస్తే బాగుంటుందని సచిన్ సలహా ఇచ్చాడని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘2007లో ధోనిని కెప్టెన్‌గా నియమించాలని సచిన్ సూచించాడు. ‘మీరోసారి ప్రయత్నించండి. అతడో గొప్ప కెప్టెన్ కాగలడు. నేనీ విషయాన్ని ఓ బాధ్యతగా చెబుతున్నాను’ అని అన్నాడు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ ధోనిని కెప్టెన్‌ను చేయడం.. అతడు టి20, వన్డే ప్రపంచకప్‌లను అందించడం చరిత్ర. ఇదంతా సచిన్ దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది’అని పవార్ పేర్కొన్నారు. -
‘రంజీల్లో ఆడేలా ఒప్పిస్తాం’
సచిన్‌పై ముంబై క్రికెట్ సంఘం ముంబై: అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్న సచిన్‌ను దేశవాళీ టోర్నీ ఆడేలా ఒప్పించేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సిద్ధమవుతోంది. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున మాస్టర్ ఆడాలని కోరుకుంటోంది. ‘మేం మా ఎలక్షన్స్ హడావుడిలో ఉన్నప్పుడు సచిన్ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. చివరి టెస్టు అనంతరం ఈ సీజన్లో ముంబై తరఫున రంజీ ఆడాలని సచిన్‌ను కోరనున్నాం. ఈ సీనియర్ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌ను హర్యానాపై గెలిపించాడు. ఇంకా అతడిలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. అలాగే ఎంసీఏకు సచిన్ ఇంకా అధికారికంగా రంజీ ట్రోఫీ నుంచి రిటైర్ అవుతున్నట్టు చెప్పలేదు. 200 టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు బీసీసీఐకి మాత్రం చెప్పాడు. ఆ తర్వాత దేశవాళీ ఆడతాడేమో’ అని ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు. -
సచిన్ వీడ్కోలుకు ఎంసీఏ ఘనంగా ఏర్పాట్లు
ముంబై: చివరి టెస్టు ఆడనున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వినూత్న రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. టెండూల్కర్ ముఖచిత్రంతో ఓ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని ఎంసీఏ గురువారం నిర్ణయించింది. సచిన్ 200వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందే వాంఖేడే స్టేడియంలో ఈ స్టాంపును ఆవిష్కరించనున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టాస్ కోసం ప్రత్యేక నాణేన్ని వినియోగించనున్నారు. దీనిని ఎంసీఏ జాగ్రత్తగా పదిలపర్చనుంది. అంతేగాకుండా సచిన్ గురించి ప్రముఖ క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు చెప్పిన మాటలతోపాటు సచిన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సూక్తులతో 64 పేజీల ఓ బ్రోచర్‌ను కూడా విడుదల చేయనుంది. పరిమిత సంఖ్యలో విడుదల చేయనున్న ఈ బ్రోచర్లను, నాణేలను ఎంసీఏ, బీసీసీఐ ప్రతినిధులకు అందజేయనున్నారు. ఇక సచిన్ చివరిసారిగా ఆడనున్న ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే ఐదురోజులపాటు రోజుకు 10,000 సచిన్ ఫేస్ మాస్క్‌లను, సచిన్ ముఖచిత్రంతో కూడిన 10,000 స్కోర్ కార్డులను, సచిన్ పేరు రాసి ఉన్న 10,000 టోపీలను ప్రేక్షకులకు ఇవ్వనున్నారు. మ్యాచ్ జరిగే స్టేడియంలోని ప్రతి స్టాండ్‌లోనూ సచిన్‌కు సంబంధించిన అరుదైన ఫోటోలను ఏర్పాటు చేయనున్నారు. -
టెండూల్కర్ ‘ఫేర్వెల్’
సంతోషంగా ఉన్నాడు! ముంబై: సొంతగడ్డపై ఆఖరి టెస్టు ఆడనుండటం పట్ల సచిన్ టెండూల్కర్ సంతోషంగా ఉన్నాడని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వెల్లడించింది. సచిన్ తరఫున ఎంసీఏ గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘సొంత ప్రేక్షకుల మధ్య ముంబైలో ఆడటం పట్ల సచిన్ ఆనందంగా ఉన్నాడు. ఆఖరి టెస్టు సమయంలో తన తల్లి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూస్తే చాలని అతను కోరుకుంటున్నాడు. ఎంసీఏ అతడిని ఏ రకంగా సన్మానించినా తనకు సమ్మతమే అని సచిన్ చెప్పాడు’ అని ప్రకటనలో ఎంసీఏ సంయుక్త కార్యదర్శి పీవీ శెట్టి వ్యాఖ్యానించారు. అయితే మాస్టర్ తరఫున అనూహ్యంగా ఎంసీఏ ప్రకటన జారీ చేయడం వెనుక ఆంతర్యం ఎవరకీ అంతుపట్టడం లేదు. మరో వైపు కాందివిలి మైదానానికి తన పేరు పెట్టడంతోపాటు, ఎంసీఏ పెయింటింగ్ బహుమతిగా ఇవ్వనుందని వస్తున్న వార్తలపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తొలి మ్యాచ్‌లో... ఆఖరి మ్యాచ్‌లో... ముంబై: సులక్షణ్ కులకర్ణి...ముంబై తదితర జట్ల తరఫున 65 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీపర్. మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌తో అతనికి ప్రత్యేక అనుబంధం ఉంది. సచిన్ తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ (1988లో) ఆడిన సమయంలో కులకర్ణి ముంబై (అప్పటి బాంబే) జట్టు సభ్యుడిగా మాస్టర్‌తో కలిసి ఆడాడు. ఇప్పుడు సచిన్ ఆఖరి రంజీ మ్యాచ్‌కు సులక్షణ్ ముంబై కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ప్రస్తుతం ముంబై జట్టు ఆటగాళ్లు ఉద్విగ్నభరిత క్షణాలు ఎదుర్కొంటున్నారని సులక్షణ్ చెప్పారు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా ఉద్విగ్నంగా ఉంది. హర్యానాతో మ్యాచ్ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సచిన్‌తో కలిసి ఉండటం యువ ఆటగాళ్లతో పాటు ఇతర సిబ్బందికి కూడా ఎంతో గొప్ప అవకాశం’ అని కులకర్ణి అన్నారు. ప్రస్తుత ముంబై జట్టులో వసీం జాఫర్, జహీర్ ఖాన్ మినహా అంతా కుర్రాళ్లే. ‘ఇది సచిన్ ఆఖరి మ్యాచ్ అని అందరికీ తెలుసు. అయితే అతని రిటైర్మెంట్ గురించి జట్టులో చర్చించే ధైర్యం ఎవరికీ లేదు. ఆట గురించి మాస్టర్ ఇచ్చే సూచనలు అమూల్యమైనవి. గతంలో ఎవరూ అలాంటి మాటలు చెప్పి ఉండకపోవచ్చు’ అని వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు. పేస్ ప్రశంస పుణే: అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలం కెరీర్‌ను కొనసాగించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ కొనియాడాడు. అలాగే మైదానం లోన వెలుపల అతడు ప్రవర్తించిన తీరు ప్రశంసనీయమన్నాడు. ‘నా దృష్టిలో ఇన్నాళ్ల కెరీర్లో సచిన్ తన ప్రవర్తనతో ఆకట్టుకున్న తీరు అమోఘం. 24 ఏళ్ల పాటు ఆడటం గొప్ప విషయం. ఈ విషయంలో మాస్టర్‌పై నాకు గౌరవముంది’ అని పేస్ అన్నాడు. -
'కండివీలి క్లబ్‌హౌజ్'కు సచిన్ పేరు
ముంబై: సచిన్ టెండూల్కర్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ నవంబర్ 11న సన్మానం చేయనుంది. సచిన్ టెండూల్కర్ ముంబై క్రికెట్ కు చేసిన సేవలు గాను కొత్త నిర్మిస్తున్న భవనానికి ‘కండివీలి క్లబ్‌హౌజ్ సచిన్ పేరును పెడుతున్నారు. ఈ భవనం ఆవిష్కరణ కార్యక్రమం వచ్చే నెల 11న జరుగుతుంది. అదే రోజు సచిన్‌కు సన్మానం జరపాలని నిర్ణయించారు. కోల్‌కతా నుంచి ముంబైలో అడుగుపెట్టే భారత్, వెస్టిండీస్ జట్లు నేరుగా ఈ కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత తమ హోటళ్లకు వెళతాయి. మహారాష్ర్ట ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్, బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, ఇతర అధికారులు, ముంబైకి చెందిన మాజీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. అలాగే 14న ఆరంబమయ్యే రెండో టెస్టు మ్యాచ్ జరిగే పది నిమిషాల ముందు బీసీసీఐ కూడా సచిన్‌ను సన్మానించనుంది’ అని ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. భారత్-వెస్టిండీస్ ల మధ్య నవంబరు 6వ తేదీన తొలి టెస్టు జరగనుంది. -
ఎంసీఏ చీఫ్‌గా మళ్లీ శరద్ పవార్!
ముంబై: ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ మళ్లీ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) పగ్గాలు చేపట్టనున్నారు. అధ్యక్ష పదవికి ఆయన ఎన్నిక ఖరారైంది. పవార్ ప్రత్యర్థి, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే నామినేషన్‌తో పాటు ఆయన చేసుకున్న అప్పీలు కూడా తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నూతన కార్యవర్గం ఎన్నికలు జరుగనున్నప్పటికీ మిగతా పదవులపైనే పోటీ ఉంటుంది. పవార్ ఒక్కరి నామినేషనే ఉండటంతో అధ్యక్ష పదవికి ప్రకటనే మిగిలుంది. గతంలో పవార్ 2001 నుంచి 2011 వరకు దశాబ్దంపాటు ఎంసీఏ పీఠంపై కొనసాగారు. ఎంసీఏ నిబంధనల ప్రకారం కేవలం ముంబై వాసి మాత్రమే సంఘం ఎన్నికలకు అర్హులు. కానీ ముండే నివాస ధృవీకరణ పత్రం విషయమై స్పష్టత కొరవడటంతో ఎన్నికల అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. తన అభ్యర్థిత్వాన్ని ఉద్దేశపూర్వకంగానే తోసిపుచ్చారని గోపీనాథ్ ముండే ఆరోపించారు. దీనిపై కోర్టుకెక్కుతానని ఆయన వెల్లడించారు. -
ఎంసీఏ ఎన్నికల బరిలో పవార్!
సాక్షి, ముంబై: ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఎన్నికల్లో ప్రముఖ పోటీ రాజకీయ నాయకుల మధ్య జరగనుంది. ఇప్పటివరకు ఎంసీఏ ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండనున్నారనేది అధికారికంగా స్పష్టం కాకున్నా అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. ఈసారి ఎంసీఏ పోటీలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని భావించిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మళ్లీ పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆయన గతంలోనే తన చిరునామాను కూడా ముంబైకి మార్చుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఈసారి పోటీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వార్త లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు బరిలోకి దిగి తే ఈసారి ఎంసీఏ ఎన్నికల పోరు రసవత్తరంగా జరిగే అవకాశాలు కనబడుతున్నా యి. వీరితో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన నేత సుభాష్ దేశాయి తదితర ప్రముఖ నాయకులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రముఖ పోటీ మాత్రం శరద్ పవా ర్, సీఎం పృథ్వీరాజ్ చవాన్ మధ్య ఉండే అవకాశాలున్నాయి. అయితే శరద్ పవార్‌కు డీవై పాటిల్ అకాడమీ అధ్యక్షుడు విజయ్ పాటిల్ మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ శరద్‌పవార్ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాలేదు. ముంబైలో నివసించే వ్యక్తికాకపోవడంతో రెండేళ్ల క్రితం శరద్ పవార్ ఎంసీఏ ఎన్నికల నుంచి చివరి నిమిషంలో తప్పుకొని దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు మద్దతు పలికా రు. దీంతో దేశ్‌ముఖ్ సులభంగానే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన మరణానంతరం రవీ సావంత్ అధ్యక్షునిగా పనిచేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎవరు పోటీ చేయనున్నారనేది ఇప్పటివరకు స్పష్టత రాకున్నా ప్రముఖ రాజకీయ నాయకులు మాత్రం బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 18న ఎంసీఏ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానానికి ప్రముఖ రాజకీయ నాయకులు పోటీపడే అవకాశం మాత్రం ఉందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
ఎంసీఏ వేదికగా రాజకీయ క్రీడ
సాక్షి, ముంబై: ప్రజా సేవలో మునిగి తేలుతున్న రాజకీయ నాయకులు క్రికెట్ సేవలందించేందుకు పరితపిస్తున్నారు. రాజకీయ మైదానంపై రాణించిన రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు క్రికెట్ పిచ్‌పై కూడా బౌన్స్‌లు సంధిం చేందుకు సిద్ధమవుతున్నారు. అటు రాజకీయం...ఇటు క్రికెట్లో రాణించి అల్‌రౌండర్‌గా అందరి నోళ్లలో నానేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి ఆ పార్టీ...ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు క్రికెట్ సంఘాల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళూరుతున్నారు. అక్టోబరు 18న జరగబోయే ‘ముంబై క్రికెట్ అసోసియేషన్’ (ఎంసీఏ) ఎన్నికల్లో తమ అస్త్రాలను వదిలేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల కోసం కసరత్తు ఎంసీఏ ఎన్నికల్లో రాజకీయ నాయకుల జట్లు తలపడనున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయ్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, శివసేన నేత సుభాష్ దేశాయి తదితర ప్రముఖ రాజకీయ నాయకులు ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. అయితే గోపీనాథ్ ముండేకు పృథ్వీరాజ్ చవాన్ మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. తటస్థవైఖరిని అవలంభించడంలో ముందుండే ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయ్ కూడా ఎంసీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్ గత ఎన్నికల్లో ఎంసీఏ అధ్యక్షునిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు శరద్ పవార్ పూర్తి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే అదేపద్ధతిలో గోపీనాథ్ ముండేకు పృథ్వీరాజ్ చవాన్ మద్దతు పలికే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో ఈ సారి జరగబోయే పోటీలు రసవత్తరంగా మారనున్నాయని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల ప్రాతినిథ్యం... మాజ్‌గావ్ క్లబ్‌కు పృథ్వీరాజ్ చవాన్, స్టాయిలో క్లబ్ కు గోపీనాథ్ ముండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెండు క్లబ్‌లకు యజమాని షా ఆలోమ్ శేఖ్ అనే ఒకే వ్యక్తి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాం గ్రెస్ కార్యకర్త అయిన శేఖ్ గతంలో విలాస్రావ్దేశ్ముఖ్కు కూడా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మద్దతు పలికారు. ఇక దాదర్ పార్సీ జోరాష్ట్రీయన్ క్లబ్‌కు ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయి, గోరేగావ్ ప్రబోధన్‌కు సుభాష్ దేశాయ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. శరద్ పవార్ పోటీలకు దూరం..? ఈసారి ఎంసీఏ పోటీలకు శరద్ పవార్ దూరంగా ఉండే అవకాశాలున్నాయి. శరద్ పవార్‌కు డీవై పాటిల్ అకాడమీ చీఫ్ విజయ్ పాటిల్ మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ శరద్‌పవార్ స్వయంగా ఈసారి పోటీలో దిగే అవకాశాలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలి సింది. ఆయన గోవా నుంచి బీసీసీఏ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనకు ఎంసీఏలో ఓటు హక్కు మాత్రం ఉండనుంది. 1991 నుంచి రాజకీయ నాయకుల అరంగేట్రం..! ఎంసీఏ ఎన్నికల్లో అనేక మంది ఇప్పటివరకు రాజకీ య నాయకులు పదవులు చేపట్టారు. తొలిసారిగా 1991లో క్రికెట్ అభిమాని అయిన రాజకీయ నాయకుడు శేషారావ్ వాంఖడే ఎంసీఏకు అధ్యక్షునిగా ఎంపికయ్యారు. అనంతరం ఆయన పేరునే ముం బైలోని స్టేడియానికి పెట్టారు. ఇది జరిగిన అనంతరం 1992లో మాధవ్ మంత్రి, శివసేన నాయకుడు మనోహర్ జోషీల మధ్య ఎంసీఏ అధ్యక్ష పీఠం కోసం పోటీ జరిగింది. ఇందులో మనోహర్ జోషి విజయం సాధించారు. ఎంసీఏకు ఆయన ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షునిగా కొనసాగారు. 2000 నుంచి 2012 వరకు అధికారం శరద్ పవార్ చేతిలోకి వచ్చింది. ఎంసీఏ అధ్యక్షుడిగా ఉంటూనే శరద్ పవార్ బీసీసీఐ, ఐసీసీ అధ్యక్ష పదవులు కూడా అలంకరించారు. 2012లో మాత్రం ముంబై ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో చివరి క్షణంలో తప్పుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన కింగ్‌మేకర్ పాత్రను పోషించారు. విలాస్రావ్దేశ్ముఖ్కు ఆ పదవి దక్కడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ముంబైలో 330 క్రికెట్ క్లబ్‌లు.. ముంబైలో 330 క్రికెట్ క్లబ్‌లు ఉన్నాయి. వీటిలో అనేక క్లబ్‌లకు రాజకీయ నాయకులే అధ్యక్షులు. కొన్ని క్లబ్లనైతే కోట్లాది రూపాయలు వెచ్చించి కొందరు రాజకీయ నాయకులు కొనుగోలు చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, యువ సేన అధ్య క్షుడు ఆదిత్య ఠాక్రే, బీజేపీ నాయకులు ఆశీష్ శెలా ర్, జితేంద్ర అవాడ్, శివసేన స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ శెవాలే క్లబ్‌లను కొనుగోలు చేసి ఎంసీఏ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు.