పృథ్వీ షా పట్ల ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తీరు సరిగా లేదని టీమిండియా మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపె విమర్శించాడు. అతడిని బలి చేసేందుకే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తూ లీకులు ఇస్తున్నారని ఎంసీఏ వర్గాలపై మండిపడ్డాడు. ముంబై తరఫున ఇక పృథ్వీ షా దేశవాళీ క్రికెట్ ఆడే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డాడు.
కాగా చిన్న వయసులోనే క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పృథ్వీ షా.. సచిన్ టెండుల్కర్ స్థాయికి ఎదుగుతాడంటూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే టీమిండియా తరఫున 18 ఏళ్ల వయసులో అరంగేట్రంలోనే టెస్టు శతకం బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. వరుస మ్యాచ్‌లలో ఆకట్టుకున్నాడు.
టీమిండియాలో చోటు కరువు
అయితే, అదే లయను కొనసాగించలేక వెనుకబడిన పృథ్వీ షాకు శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. వారిద్దరు ఆయా ఫార్మాట్లలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పృథ్వీ షాకు జట్టులో స్థానం కరువైంది. మరోవైపు.. దేశవాళీ క్రికెట్‌లోనూ అతడికి ఆటంకాలే ఎదురయ్యాయి.
క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్‌లేమి కారణంగా ఎంసీఏ పృథ్వీ షాను కొన్నాళ్లపాటు పక్కనపెట్టింది. ఫలితంగా తాజా రంజీ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ కుడిచేతం వాటం బ్యాటర్‌కు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అవకాశం వచ్చింది. అయితే, ఈ టోర్నమెంట్లోనూ షా స్థాయికి తగ్గట్లు రాణించలేదు.
ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్‌కు ప్రకటించిన ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. దీంతో.. ‘‘ఇంకెన్ని పరుగులు చేయాలో అర్థం కావడం లేదు దేవుడా!’’ అంటూ పృథ్వీ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు తానే శత్రువు
ఈ క్రమంలో ఎంసీఏకి చెందిన వ్యక్తి ఒకరు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ఇలాంటి పోస్టుల వల్ల పృథ్వీకి ఎలాంటి ఉపయోగం ఉండదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. ఫిట్‌గాలేని పృథ్వీ షా వల్ల తాము పది మంది ఫీల్డర్లతోనే ఆడాల్సి వచ్చిందంటూ సదరు వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అదే విధంగా.. పృథ్వీ షాకు అస్సలు క్రమశిక్షణ లేదని.. అతడి వల్ల తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. అంతేకాదు.. పృథ్వీకి కొత్తగా శత్రువులు అక్కర్లేదని.. తనకు తానే శత్రువు అని పేర్కొన్నారు.
ముంబై తరఫున అతడికి ఇదే ఆఖరి సీజన్
ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపె ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘ఎంసీఏ వర్గాల నుంచి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. పృథ్వీ షాకు సహాయం చేయాలనే ఆలోచన వాళ్లకు ఎంతమాత్రం లేదని స్పష్టమవుతోంది. నాకు తెలిసి ముంబై తరఫున పృథ్వీ షాకు ఇదే ఆఖరి సీజన్’’ అని జతిన్ పరాంజపె పేర్కొన్నాడు.
విజయ్ హజారే వన్డే టోర్నీ 2024- ముంబై జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్‌క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్‌స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్.
చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు
Comments
Please login to add a commentAdd a comment