BGT: ఆసీస్‌ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్‌’ పాంటింగ్‌కు చోటు | IND Vs AUS BGT: McSweeney Dropped Sam Konstas Receives Maiden Call, Check Out More Insights | Sakshi
Sakshi News home page

భారత్‌తో టెస్టులకు ఆసీస్‌ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్‌’ పాంటింగ్‌కు చోటు

Published Fri, Dec 20 2024 9:58 AM | Last Updated on Fri, Dec 20 2024 11:19 AM

Ind Vs Aus BGT: McSweeney Dropped Sam Konstas receives maiden Call

సామ్‌ కొన్‌స్టాస్‌(PC: CA X)

టీమిండియాతో మిగిలిన రెండు టెస్టులకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టు నుంచి ఓపెనర్‌ నాథన్‌ మెక్‌స్వీనీకి ఉద్వాసన పలికింది. అతడి స్థానంలో సామ్‌ కొన్‌స్టాస్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటిచ్చింది.

అతడి పునరాగమనం
అదే విధంగా.. ఫాస్ట్‌ బౌలర్‌ జే రిచర్డ్‌సన్‌కు కూడా భారత్‌తో మెల్‌బోర్న్‌, సిడ్నీ టెస్టులకు ఎంపిక చేసింది. కాగా గాయం వల్ల 2021-22 యాషెస్‌ సిరీస్‌ తర్వాత టెస్టు జట్టుకు దూరమైన రిచర్డ్‌సన్‌ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక సీన్‌ అబాట్‌ కూడా పునరాగమనం చేయగా.. అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్‌ కూడా జట్టుతో కొనసాగనున్నాడు.

ఇక పిక్క కండరాల నొప్పి కారణంగా మూడో టెస్టు సందర్భంగా గాయపడ్డ స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌.. నాలుగు, ఐదో టెస్టులకు పూర్తిగా దూరమయ్యాడు. కాగా ఆస్ట్రేలియా-‘ఎ’ తరఫున రాణించిన మెక్‌స్వీనీ టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా పెర్త్‌లో అరంగేట్రం చేశాడు.

వరుస సెంచరీలతో చెలరేగి
అయితే, ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడు నిరాశపరిచాడు. ఫలితంగా మెక్‌స్వీనీ (ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 72 రన్స్‌)పై వేటు వేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. సామ్‌ కొన్‌స్టాస్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. కాగా సామ్‌ తన చక్కటి బ్యాటింగ్‌ శైలితో జూనియర్‌ రిక్కీ పాంటింగ్‌గా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. 19 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌ ఇటీవల షెఫీల్డ్‌షీల్డ్‌ మ్యాచ్‌లో సౌత్‌ వేల్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. సౌత్‌ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో వరుస సెంచరీలు(152, 105) బాదాడు.

ఫాస్టెస్‌ ఫిఫ్టీతో
అంతేకాదు.. భారత్‌-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా-‘ఎ’ తరఫున 73 రన్స్‌తో చెలరేగాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ అడుగుపెట్టిన ఈ యువ సంచలనం.. సిడ్నీ థండర్‌ తరఫున అరంగేట్రంలోనే ఫాస్టెస్‌ ఫిఫ్టీ(27 బంతుల్లో 56) నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.

ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా.. అడిలైడ్‌ టెస్టులో ఆతిథ్య ఆసీస్‌ గెలుపొందాయి. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌ టెస్టు డ్రా అయింది. 

ఫలితంగా సిరీస్‌ 1-1తో సమంగా ఉండగా.. మెల్‌బోర్న్‌(డిసెంబరు 26-30)లో, సిడ్నీ(జనవరి 3-7) నాలుగు, ఐదో టెస్టులు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల ఫలితంపైనే ఆసీస్‌- టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

భారత్‌తో మూడు, నాలుగు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్(వైస్ కెప్టెన్), స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్‌, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, జే రిచర్డ్‌సన్‌, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్‌.

చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్‌.. వరల్డ్‌ రికార్డు సమం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement