రోహిత్ శర్మతో రహానే (ఫైల్ ఫొటో)
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్ నవంబరు 23న మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తమ కెప్టెన్ పేరును వెల్లడించింది. టీ20 టోర్నమెంట్లోనూ టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానేనే తమ సారథిగా కొనసాగుతాడని స్పష్టం చేసింది.
స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
అదే విధంగా.. తమ కీలక పేసర్ తుషార్ దేశ్‌పాండే ఫిట్‌నెస్ గురించి అప్‌డేట్ అందించింది. చీలమండ శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అతడు.. కోలుకున్నాడని.. త్వరలోనే పునరాగమనం చేస్తాడని వెల్లడించింది. కాగా ముంబై జట్టు దేశీ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
గత రంజీ సీజన్లో చాంపియన్‌గా నిలవడంతో పాటు.. ఇరానీ కప్-2024లో రెస్టాఫ్ ఇండియాను ఓడించి ట్రోఫీ గెలిచింది. ఇక ఈ రెండు సందర్భాల్లోనూ అజింక్య రహానే ముంబై కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక తాజా రంజీ ట్రోఫీ ఎడిషన్‌లోనూ రహానేనే ముంబైని ముందుండి నడిపిస్తున్నాడు.
అందుకే అతడే కెప్టెన్
ఈ నేపథ్యంలో విజయవంతమైన సారథిగా పేరొందిన రహానేనే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా కొనసాగిస్తామని ఎంసీఏ చెప్పడం విశేషం. ‘‘ఇరానీ కప్‌తో పాటు తాజా రంజీ సీజన్‌లోనూ అతడి సారథ్యంలో మా జట్టు అద్బుతంగా రాణిస్తోంది. ఈసారి కూడా టీ20 టోర్నీలో అతడే మా కెప్టెన్. ఇక తుషార్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.
రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్ నుంచి అతడు అందుబాటులోకి వస్తాడు. అతడి సేవలు మా జట్టుకు ఎంతో కీలకం. శార్దూల్, జునేద్, మోహిత్‌తో పాటు తుషార్ కూడా ఉంటే మా పేస్ బౌలింగ్ లైనప్ మరింత పటిష్టంగా తయారవుతుంది’’ అని ఎంసీఏ అధికారులు వార్తా ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌తో పేర్కొన్నారు.
పృథ్వీ షా సైతం
కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024తో టీమిండియా మాజీ ఓపెనర్ పృథ్వీ షా సైతం ముంబై జట్టులో తిరిగి చేరనున్నాడు. ఇటీవల.. అనుచిత ప్రవర్తన కారణంగా రంజీ జట్టు నుంచి ఎంసీఏ అతడిని తొలగించింది. అయితే, టీ20 టోర్నీలో మాత్రం పృథ్వీని ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సయ్యద్ ముస్తాన్ అలీ ట్రోఫీ నవంబరు 23- డిసెంబరు వరకు జరుగనుంది.
ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25 తొలి మ్యాచ్‌లో ముంబై బరోడా చేతిలో ఓడింది. తర్వాత మహారాష్ట్రపై విజయం సాధించి.. త్రిపురతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తర్వాత ఒడిషాపై గెలుపొందింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టు
పృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్‌క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్‌స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్.
చదవండి: బ్యాట్‌తోనూ సత్తా చాటిన షమీ
Comments
Please login to add a commentAdd a comment