దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ అజింక్య రహానే పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బరోడా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన రహానే సెంచరీ దిశగా పయనించాడు.
శతకానికి రెండు పరుగుల దూరంలో
అయితే, దురదృష్టవశాత్తూ శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు రహానే. అయితేనేం తన మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైకి విజయం అందించి.. ఫైనల్‌కు చేర్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ముంబై జట్టు బరోడాతో తలపడింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. బరోడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.
రాణించిన శివాలిక్ శర్మ
బరోడా ఇన్నింగ్స్‌లో శివాలిక్ శర్మ(36 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ శశ్వత్ రావత్(33), కెప్టెన్ కృనాల్ పాండ్యా(30), ఆల్‌రౌండర్ అతిత్ సేత్(14 బంతుల్లో 22) ఫర్వాలేదనిపించారు.
ఇక ముంబై బౌలర్లలో పేసర్లు సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. శివం దూబే, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి ఒక్కో వికెట్ తీశారు. ఇక స్పిన్ బౌలర్లు తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టిన రహానే
ఇక బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలో షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీ షా(8) అవుటయ్యాడు. అయితే, ఆ ఆనందం బరోడాకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ అజింక్య రహానే బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టాడు.
కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో ఏకంగా 98 పరుగులు రాబట్టాడు. అయితే, అభిమన్యు సింగ్ బౌలింగ్‌లో విష్ణు సోలంకికి క్యాచ్ ఇవ్వడంతో రహానే విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. తృటిలో సెంచరీ అతడి చేజారింది.
సూర్య విఫలం
మిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 46 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. ఏడు బంతులు ఆడిన స్కై కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. శివం దూబే 0, సూర్యాంశ్ షెడ్గే 6 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఇక రహానే ధనాధన్ బ్యాటింగ్ కారణంగా ముంబై 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో బరోడాను ఓడించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఫైనల్ చేరింది.
చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment