దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్‌లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.
అతడిపై వేటు
అయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది.
గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.
మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.
ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్‌తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.
రహానే దూరం
మరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.
తిరుగులేని ముంబై
కాగా భారత దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్‌ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్‌క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్‌స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్.
Comments
Please login to add a commentAdd a comment