టీమిండియా టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్‌లపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ‘స్టార్’ బ్యాటర్ల కంటే.. ‘‘మీరే నయం’’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే.
శతకాలతో చెలరేగిన ఆసీస్ బ్యాటర్లు
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినా అనూహ్య రీతిలో పుంజుకుంది. టీమిండియా పేసర్ల ధాటికి 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డవేళ.. ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆసీస్‌ను ఆదుకున్నారు. హెడ్(152) భారీ శతకం బాదగా.. స్టీవ్ స్మిత్(101) కూడా సెంచరీతో చెలరేగాడు.
ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌర్లలో పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా ఆరు, మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు మొదలుపెట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి.
ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడ్డ టీమిండియా
టాపార్డర్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(4), వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(1) ఘోరంగా విఫలమయ్యారు. మిడిలార్డర్‌లో వచ్చిన విరాట్ కోహ్లి(3), రిషభ్ పంత్(9), కెప్టెన్ రోహిత్ శర్మ(10) సైతం పూర్తిగా నిరాశపరిచారు.
ఆదుకున్న రాహుల్, జడేజా
ఈ క్రమంలో ఓపెనర్ కేఎల్ రాహుల్(84) అద్భుత అర్థ శతకంతో రాణించి భారత ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతడికి తోడుగా నితీశ్ రెడ్డి(61 బంతుల్లో 16) పట్టుదలగా నిలబడ్డాడు.
ఇక సిరాజ్(11 బంతుల్లో 1) కూడా కాసేపు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించాడు. కాగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడ్డూ మొత్తంగా 123 బంతులు ఎదుర్కొని 77 పరుగులు సాధించాడు. అయితే జడేజా అవుటయ్యే సమయానికి టీమిండియా ఇంకా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కలేదు.
అలాంటి సమయంలో జడ్డూ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరగడంతో టీమిండియా పని అయిపోయిందని కంగారూలు సంబరాలు చేసుకున్నారు. ఇక ఫాలో ఆన్ ఆడించడమే తరువాయి అని భావించారు.
బ్యాట్ ఝులిపించిన బుమ్రా, ఆకాశ్
అయితే, పది, పదకొండో స్థానాల్లో బ్యాటింగ్ చేసిన బుమ్రా, ఆకాశ్ దీప్.. ఊహించని రీతిలో బ్యాట్ ఝులిపించారు. ఆచితూచి ఆడుతూనే వికెట్ పడకుండా బుమ్రా జాగ్రత్త పడగా.. మరో ఎండ్ నుంచి సహకారం అందించిన ఆకాశ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.
Jasprit Bumrah just smashes Pat Cummins for six! #AUSvIND pic.twitter.com/vOwqRwBaZD
— cricket.com.au (@cricketcomau) December 17, 2024
ఫాలో ఆన్ గండం తప్పింది
వీరిద్దరి చక్కటి సమన్వయం, బ్యాటింగ్ కారణంగా 246 పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా.. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. ఇక వెలుతురులేమి కారణంగా మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి బుమ్రా, ఆకాశ్ క్రీజులోనే ఉన్నారు.
బుమ్రా 27 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 10, ఆకాశ్ దీప్ 27 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు చేశాడు. అయితే, ఫాలో ఆన్ గండం నుంచి జట్టును గట్టెక్కించిన తర్వాత ఆకాశ్ కొట్టిన సిక్సర్‌తో భారత శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది.
Akash Deep makes sure India avoid the follow-on and then smashes Pat Cummins into the second level!#AUSvIND pic.twitter.com/HIu86M7BNW
— cricket.com.au (@cricketcomau) December 17, 2024
హెడ్‌కోచ్ గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నవ్వులు చిందిస్తూ తమ టెయిలెండర్లను ప్రశంసించారు. ఇక మంగళవారం ఆట పూర్తయ్యేసరికి టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. కాగా తొలి రోజు నుంచే ఈ మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది.
ఫాలో ఆన్ అంటే ఏమిటి?
టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు.. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే.. ఫాలో ఆన్ ఆడిస్తుంది. అంటే.. సెకండ్ బ్యాటింగ్ టీమ్ ఆలౌట్ అయిన వెంటనే మళ్లీ బ్యాటింగ్ చేయమని అడుగుతుంది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ)లోని 14.1.1 నిబంధన ప్రకారం ఆధిక్యంలో ఉన్న జట్టుకు ఈ హక్కు లభిస్తుంది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు(డిసెంబరు 14- 18)
వేదిక: ది గబ్బా, బ్రిస్బేన్
టాస్: భారత్.. తొలుత బౌలింగ్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్
నాలుగోరోజు(డిసెంబరు 17) ఆట పూర్తయ్యేసరికి భారత్ స్కోరు: 252/9
చదవండి: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment