
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah )ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ కీలక సూచనలు చేశాడు. గాయాలతో సావాసం చేస్తున్న ఈ రైటార్మ్ బౌలర్.. కెరీర్ పొడిగించుకోవాలంటే జిమ్‌లో మరింతగా కష్టపడాలన్నాడు.
రోజురోజుకు వయసు పెరుగుతున్న కారణంగా మునుపటిలా త్వరగా కోలుకునే అవకాశాలు తక్కువ.. కాబట్టి గాయాల బారిన పడకుండా తనను తాను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా పేస్ దళ భారం మొత్తాన్ని బుమ్రా తన భుజాలపై మోసిన విషయం తెలిసిందే.
ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో ఐదు టెస్టులకు గానూ.. రెండింటిలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా అదనపు భారం వల్ల బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టింది.
ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకూ దూరం
ఫలితంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) మొత్తానికి బుమ్రా దూరమయ్యాడు. అయితే, ప్రధాన బౌలర్ లేకపోయిన్పటికీ.. ఈ వన్డే టోర్నీలో టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడిన కారణంగా స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించుకుని విజయవంతమైంది. ఈ మెగా ఈవెంట్‌లో చాంపియన్‌గా అవతరించింది.
ఇదిలా ఉంటే.. బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోనేట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
స్పష్టంగా ఏ రోజు నుంచి, ఏ మ్యాచ్‌కు అతడు ఆడేది చెప్పనప్పటికీ.. ఏప్రిల్ రెండో వారంలో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారం, వచ్చే నెల మొదటి వారం రోజుల్లో జరిగే ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు బుమ్రా గైర్హాజరు కానున్నాడు.
ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాస శిబిరంలో ఉన్న పేసర్ వెన్నుగాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ మాట్లాడుతూ.. ‘‘మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రా తన శరీరాన్ని ఎక్కువగా కష్టపెడతాడు. శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు. అయితే, దానిని ఎలా మేనేజ్ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. కానీ దురదృష్టవశాత్తూ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు.
ఇకపై మరింత తెలివిగా వ్యవహరించాలి
గతంలో చాలాసార్లు గాయాల నుంచి అతడు బయటపడి.. సరికొత్త ఉత్సాహంతో పునరాగమనం చేశాడు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. జిమ్‌లో ఎంతగా కష్టపడాలి అనే విషయాలపై అతడికి స్పష్టత ఉంది. కానీ రోజురోజుకూ వయసు పెరుగుతున్న కారణంగా.. ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు అతడు ఇంకాస్త కఠినంగా శ్రమించాలి.
మైదానం వెలుపలా కష్టపడాలి. మరింత స్మార్ట్‌గా ఉండాలి. ఫాస్ట్ బౌలర్ నడిచే కార్ లాంటివాడైతే.. అందులో ఇంధనం ఉన్నంత వరకే ముందుకు వెళ్తుంది. నిజానికి బుమ్రాతో పోలిస్తే నా ఫ్యూయల్ ట్యాంకు పెద్దది. ఎందుకంటే.. అతడిలా నేను అతి వేగంతో బౌలింగ్ చేయను.
ముందుగా చెప్పినట్లు.. బుమ్రా తన శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు కాబట్టే.. పనిభారాన్ని తగ్గించుకోవడం కూడా ముఖ్యం. అతడు లేకుంటే టీమిండియా అనుకున్న ఫలితాలు రాబట్టలేదు.
కాబట్టి బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్ కూడా ఉంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాంగ్ కూడా బుమ్రా గురించి ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment