Glenn McGrath
-
బుమ్రాకు ఆ విషయం తెలుసనుకుంటా: ఆసీస్ లెజెండ్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ కీలక సూచనలు చేశాడు. శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెట్టకూడదని.. మ్యాచ్‌ల మధ్య కచ్చితంగా విరామం తీసుకోవాలని సూచించాడు. పనిభారాన్ని తగ్గించుకుంటేనే కెరీర్‌ను పొడిగించుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా మిగతా ఆటగాళ్లతో పోలిస్తే ఫాస్ట్‌బౌలర్లకు సహజంగానే గాయాల బెడద ఎక్కువన్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా సైతం వెన్నునొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్ సహా పలు కీలక ఈవెంట్లకు దూరమయ్యాడు. ఐపీఎల్-2023కి కూడా అందుబాటులో ఉండలేకపోయాడు ఈ ముంబై ఇండియన్స్ స్టార్. అయితే, ఈసారి రెట్టించిన ఉత్సాహంతో తిరిగి ఎంఐ కుటుంబంలో అడుగుపెట్టాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత టీమిండియా తరఫున అదరగొట్టి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా నిలిచిన బుమ్రా తదుపరి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌తో మళ్లీ మైదానంలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెగ్రాత్ బుమ్రాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘బుమ్రా లాంటి ఆటగాళ్లకు కొంతకాలం బ్రేక్ ఇవ్వడం తప్పనిసరి. తన బౌలింగ్ యాక్షన్ సంప్రదాయశైలికి భిన్నంగా ఉంటుంది. అందువల్ల బౌలింగ్ చేసే ప్రతిసారీ అతడి శరీరం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. కాబట్టి గాయాల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువే. గతంలో ఏం జరిగిందో చూశాం కదా! అతడు వరుస మ్యాచ్‌ల తర్వాత విరామం తీసుకుంటేనే మంచిది. నిజానికి తనిప్పుడు అనుభవజ్ఞుడు. వర్క్‌లోడ్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలో తనకు తెలిసే ఉంటుంది. కానీ నా సలహా మాత్రం ఇదే’’ అని పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానుండగా.. బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ మార్చి 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్ పాండ్యా జట్టును ముందుకు నడిపించనున్నాడు. "It's very good to be back." 💙 Hardik Pandya shares his joy on reuniting with #MumbaiIndians, the team where his incredible journey started 🫶#OneFamily @hardikpandya7 pic.twitter.com/0SymPUikDY — Mumbai Indians (@mipaltan) March 18, 2024 -
Aus Vs Pak: నా రికార్డు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజం
Australia vs Pakistan, 3rd Test: ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆట తీరుపై బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెగ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ తరఫున తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టగల సత్తా లియోన్‌కు ఉందన్నాడు. కాగా పాకిస్తాన్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆమె జ్ఞాపకార్థం ‘పింక్’ టెస్టు నిర్వహణ ఇరుజట్ల మధ్య బుధవారం (జనవరి 3) నుంచి ‘పింక్ టెస్టు’ ఆరంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. కాగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించిన గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పింక్ టెస్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీలో తాజాగా జరుగనున్న మ్యాచ్ 16వది. ఈ టెస్టు సందర్భంగా మెగ్రాత్ ఫౌండేషన్ విరాళాల సేకరణ చేపట్టనుంది. ఈ సందర్భంగా గ్లెన్ మెగ్రాత్ ప్రసంగిస్తూ.. నాథన్ లియోన్ బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు. ‘‘ప్రతి రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు. ఒకవేళ లియోన్ నన్ను దాటేస్తే అంతకంటే సంతోషం ఉండదు. అతడు అసాధారణ బౌలర్. అలా అయితే అతడికి తిరుగే ఉండదు లియోన్‌కు ఆల్ ది బెస్ట్. ఒకవేళ నాతో పాటు షానో(షేన్ వార్న్) రికార్డును కూడా అధిగమిస్తే అతిడికి తిరుగే ఉండదు. లియోన్ బౌలింగ్ నైపుణ్యాలు అద్భుతం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం అతడికి అలవాటు’’ అని మెగ్రాత్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా గ్లెన్ మెగ్రాత్ ఘనత సాధించాడు. నేటికీ అతడి రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. ఆసీస్ తరఫున 124 టెస్టులు ఆడిన రైటార్మ్ పేసర్ మెగ్రాత్ 563 వికెట్లు తీశాడు. 500 వికెట్ల క్లబ్లో నాథన్ లియోన్ మరోవైపు.. ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్‌తో పెర్త్ టెస్టు సందర్భంగా ఈ మైలురాయిని చేరుకున్నాడు. తాజా పింక్ టెస్టుకు ముందు అతడి ఖాతాలో మొత్తంగా 505 వికెట్లు ఉన్నాయి. సుమారు మరో నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్న లియోన్ ఇంకో 59 వికెట్లు తీస్తే .. ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో మెగ్రాత్‌ను అధిగమిస్తాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్ దిగ్గజ దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ టెస్టుల్లో 708 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చదవండి: IPL 2024: హార్దిక్ పాండ్యా దూరం! ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బుమ్రా? -
Aus Vs Pak: చెత్త బౌలింగ్.. అయినా వరల్డ్‌కప్‌లో అరుదైన ఘనత!
ICC ODI WC 2023: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్ లెజెండరీ పేస్ బౌలర్ వసీం అక్రం పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆసీస్ శుక్రవారం పాకిస్తాన్‌తో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్‌కు.. కంగారూ ఓపెనర్లు చుక్కలు చూపించారు. డేవిడ్ వార్నర్- మిచెల్ మార్ష్ కలిసి మొదటి వికెట్‌కు రికార్డు స్థాయిలో 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 367 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో పాక్ 305 పరుగులకే పరిమితం కావడంతో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(18), మహ్మద్ రిజ్వాన్(46), ఇఫ్తికార్ అహ్మద్(26) రూపంలో కీలక వికెట్లు తీయడంతో పాటు మహ్మద్ నవాజ్(14) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, స్టార్క్ మాత్రం ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 8 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 65 పరుగులు సమర్పించుకుని.. ఒక (హసన్ అలీ(8)) వికెట్ తీయగలిగాడు. అయినప్పటికీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వసీం అక్రంతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన రెండో ఆసీస్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు ►గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా)- 39 మ్యాచ్‌లలో 71 వికెట్లు ►ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 40 మ్యాచ్‌లలో 68 వికెట్లు ►లసిత్ మలింగ(శ్రీలంక)- 29 మ్యాచ్‌లలో 56 వికెట్లు ►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 22 మ్యాచ్‌లలో 55 వికెట్లు ►వసీం అక్రం(పాకిస్తాన్)- 38 మ్యాచ్‌లలో 55 వికెట్లు. ►►వసీం అక్రం కంటే వేగంగా స్టార్క్ 55 వికెట్లు తీయడం గమనార్హం. చదవండి: WC 2023: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..!
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మెక్‌గ్రాత్ 1996-2007 మధ్యలో 39 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. వరల్డ్‌కప్‌లో మెక్‌గ్రాత్ అత్యుత్తమ గణాంకాలు 7/15గా ఉన్నాయి. ఈ జాబితాలో స్పిన్ లెజెండ్, శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీథరన్ రెండో స్థానంలో ఉన్నాడు. మురళీ 1996-2011 మధ్యలో 40 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 నాలుగు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో మురళీ అత్యుత్తమ గణాంకాలు 4/19గా ఉన్నాయి. మూడో స్థానం విషయానికొస్తే.. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ ఈ స్థానాన్ని అక్యూపై చేశాడు. మలింగ 2007-2019 మధ్యలో 29 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్‌లో మలింగ అత్యుత్తమ గణాంకాలు 6/38గా ఉన్నాయి. మలింగ తర్వాత వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాక్ పేస్ లెజెండ్ వసీం అక్రమ్ నిలిచాడు. అక్రమ్ 1987-2003 మధ్యలో 38 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్‌లో అక్రమ్ అత్యుత్తమ గణాంకాలు 5/28గా ఉన్నాయి. ఈ జాబితాలో భారత బౌలర్ జహీర్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచాడు. జహీర్ 2003-2011 మధ్యలో 23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ నాలుగు వికెట్ల ఘనత ఉంది. ప్రపంచకప్‌లో జహీర్ అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న బౌలర్లలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (18 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు) ఐదో స్థానంలో.. కివీస్ స్పీడ్‌గన్ ట్రెంట్ బౌల్ట్ (19 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు) 10వ ప్లేస్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈనెల 5వ తేదీ నుంచి వరల్డ్‌కప్ స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. -
అన్ని ఫార్మాట్లలో ఆడటం కష్టం బుమ్రా.. గుడ్‌బై చెప్పు.. నీకే మంచిది!
'I am a big Bumrah fan but…': Glenn McGrath's game-changing advice: 2018లో బొటనవేలి గాయం.. 2019లో వెన్నునొప్పి.. 2020-21లో కడుపునొప్పి.. 2022లో తీవ్రమైన వెన్నునొప్పి.. గాయం తిరగబెట్టిన కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరం.. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా టీ20 కప్-2022, టీ20 వరల్డ్‌కప్-2022 వంటి మెగా టోర్నీలకు అందుబాటులో లేకపోవడం వల్ల జట్టుకు భారీ ఎదురుదెబ్బలు... అవును మీరు ఊహించిన పేరు నిజమే.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించే ఈ ఉపోద్ఘాతం.. ఫాస్ట్‌బౌలర్లకు గాయాల బెడద ఎక్కువన్న విషయం తెలిసిందే. అయితే, భారత జట్టు పేస్ గుర్రం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ+ గ్రేడ్ కలిగి ఉన్న బుమ్రా విషయంలో మాత్రం తరచూ ఇదే పునరావృతమవుతోంది. ఐర్లాండ్ సిరీస్‌తో కెప్టెన్‌గా రీఎంట్రీ వెన్నునొప్పి తిరగబెట్టడంతో సర్జరీ చేయించుకుని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన బుమ్రా.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఏకంగా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రపంచకప్-2023కి ముందు ఈ స్టార్ పేసర్ ఫిట్నెస్, సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. నేను అతడికి వీరాభిమానిని.. కానీ ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియాకు దొరికిన అసాధారణ పేసర్ బుమ్రా అనడంలో సందేహం లేదు. అతడి కెరీర్‌లోని బౌలింగ్ గణాంకాలే ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాయి. అతడికి నేను వీరాభిమానిని. కానీ బుమ్రా బౌలింగ్ యాక్షన్ కారణంగా అతడి శరీరం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. కాబట్టి తను ఎంత ఫిట్‌గా ఉంటే అంత మంచిది. అలా అయితే, ఇంకొన్నాళ్లు అతడు క్రికెట్ కెరీర్‌ను కొనసాగించగలడు’’ అని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఏదో ఒక ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పు ఐపీఎల్ కారణంగా ఫాస్ట్ బౌలర్లకు ముఖ్యంగా బుమ్రా వంటి స్టార్లకు విశ్రాంతి లేకుండా పోతుందన్న మెక్‌గ్రాత్.. అన్ని ఫార్మాట్లలో ఆడే విషయంపై అతడు పునరాలోచించుకోవాలని సూచించాడు. విరామం లేకుండా మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమని.. అందుకే ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే బుమ్రా తన కెరీర్‌ను మరింత పొడిగించుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2024: ఆర్సీబీని వీడటం చాలా బాధగా ఉంది.. అందరికీ థాంక్స్ 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్ ఆవిర్భావం -
ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్ కాదది కజ్బాల్'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా గురువారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే యాషెస్ సిరీస్‌కు ముందు బజ్‌బాల్ ఆటతో ఆసీస్‌కు ముకుతాడు వేస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రగల్బాలు పలికాడు. తీరా అసలు ఆట మొదలయ్యాకా సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇప్పటికే 0-2తో వెనుకబడిన ఆ జట్టు కనీసం మూడో టెస్టులోనైనా గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని చూస్తోంది. తాజాగా మూడో టెస్టు మొదలైన నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంగ్లండ్ జట్టుకు పరోక్షంగా చురకలు అంటించాడు.'' ఇంగ్లండ్ ఆడుతుంది బజ్‌బాల్ కాదని.. అది కజ్బాల్ అని దుయ్యబట్టాడు. బీబీసీ కాలమ్‌కు రాసిన మెక్‌గ్రాత్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ముందు జానీ బెయిర్ స్టో ఔట్ వివాదంతో మొదలుపెడతా. ఇక్కడ రెండు అంశాలు నా మదిలోకి వచ్చాయి. మొదట చూసినప్పుడు పాట్ కమిన్స్ అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకుంటే బాగుంటుందనిపించింది. కానీ నిశితంగా పరిశీలించాకా ఆసీస్ కెప్టెన్ నిర్ణయం సరైందే అనిపించింది. ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు హాస్యాస్పదం అనిపించింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటకు నేను అభిమానిని. ప్రత్యర్థి జట్లకు ఏ మాత్రం భయపడకుండా వారిపైనే ఒత్తిడి తెచ్చేలా ఇన్నింగ్స్‌ను ఆడడం అనే బజ్‌బాల్ కాన్సెప్ట్‌ను స్వాగతిస్తున్నా. కానీ బెయిర్ స్టో ఔట్ వివాదం కారణంగా ఇంగ్లండ్ బజ్‌బాల్ కాస్త నాకు కజ్బాల్(Casual Bowling)లా కనిపించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజును విడవడంతో అలెక్స్ కేరీ బంతిని వికెట్లకు గిరాటేశాడు. రూల్ ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. ఇక్కడ రాజుకున్న మంట టెస్టు ముగిసినా చల్లారలేదు. ఆసీస్ జట్టు చీటింగ్ చేసి గెలిచిదంటూ ఇంగ్లండ్ అభిమానులు సహా స్థానిక మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆస్ట్రేలియా మీడియా కూడా ధీటుగానే బదులిచ్చింది. ఇక బెయిర్ స్టో వివాదం ఇరుదేశాల ప్రధానులు మాట మాట అనుకునే వరకు వెళ్లడం ఆసక్తి కలిగించింది. Glenn Mcgrath said "Bairstow's dismissal epitomizes what we have seen from England in this series, it has been Casual ball - CazBall if you will, not Bazball". [BBC] pic.twitter.com/bKAdHQbgJ1 — Johns. (@CricCrazyJohns) July 5, 2023 చదవండి: Ashes 2023: మూడో టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బజ్‌బాల్‌ను పక్కనబెడుతుందా? -
NZ Vs Eng: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో..
New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల జంట జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్ మెగ్రాత్- షేన్ వార్న్ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. పేసర్ మెగ్రాత్- స్పిన్నర్ షేన్ వార్న్ 104 టెస్టు మ్యాచ్‌లలో కలిసి ఆడి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్- బ్రాడ్ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు. కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో ఆండర్సన్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్లో బ్రాడ్ నైట్ వాచ్‌మన్ నీల్ వాగ్నర్ వికెట్ పడగొట్టాడు. దీంతో జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ జంట 1000 వికెట్ల క్లబ్లో చేరింది. ఇక ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో టాప్-5 వికెట్ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల ఆండర్సన్ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్ 160 మ్యాచ్‌లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు, షేన్ వార్న్ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్ మాంగనీయ్ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఇంగ్లండ్ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చదవండి: Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! నటాషా నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్ -
ఆండర్సన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. పేసర్లలో మొనగాడిగా..!
James Andersdon: దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్ (6/62), ఓలీ రాబిన్సన్ (5/91), స్టువర్ట్ బ్రాడ్ (4/61), బెన్ స్టోక్స్ (4/47) చెలరేగి సఫారీలను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 330 పరుగులకే (151, 179) పరిమితం చేయగా.. బెన్ స్టోక్స్ (103), బెన్ ఫోక్స్ (113 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 415/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన రెండో టెస్ట్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ ప్లేయర్ సైమన్ హార్మర్ వికెట్ పడగొట్టడం ద్వారా ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు (951, టెస్ట్‌ల్లో 664, వన్డేల్లో 269, టీ20ల్లో 18) సాధించిన పేస్ బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. మెక్‌గ్రాత్.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 949 వికెట్లు సాధించాడు. తాజాగా ఆండర్సన్.. మెక్‌గ్రాత్ రికార్డు బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్ బౌలర్‌గా అవతరించాడు. 40 ఏళ్ల ఆండర్సన్ మరో 5 వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల (పేసర్లు, స్పిన్నర్లు) జాబితాలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను (955 వికెట్లు) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకుతాడు. ఇంగ్లండ్-సఫారీల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 8న ప్రారంభమవుతుంది. చదవండి: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు -
McGrath: ఆ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉంది..!
ఆసీస్ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ టీమిండియా యువ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉందని అన్నాడు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్లు చెన్నైలోని ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకున్న నేపథ్యంలో మెక్‌గ్రాత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరితో పాటు మరో 27 మంది ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో మెళకువలు నేర్చుకున్న బౌలర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇదే సందర్భంగా వన్డే క్రికెట్ మనుగడపై ప్రస్తుతం నడుస్తున్న చర్చపై కూడా మెక్‌గ్రాత్ స్పందించాడు. బ్యాటర్లు పరుగులు చేస్తున్నంత కాలం వన్డే ఫార్మాట్‌కు ఢోకా లేదని అభిప్రాయపడ్డాడు. డబ్బు, శారీరక ఒత్తిడి కారణంగా ఆటగాళ్లు వన్డేలపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారని అనుకోవట్లేదని అన్నాడు. తన మట్టుకు సంప్రదాయ టెస్ట్ క్రికెటే అత్యుత్తమమని చెప్పుకొచ్చాడు. టెస్ట్‌ల తర్వాత ఆటగాళ్ల సత్తా బయటపడేది వన్డే క్రికెట్లోనేనని తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనే ఆటగాళ్లకు సరైన పరీక్ష ఎదురవుతుందని అన్నాడు. చదవండి: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
షేన్ వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్ ఆటగాడు షేన్ వార్న్‌కు లెజెండరీ క్రికెటర్లు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. బుధవారం మెల్బోర్న్లోని ఎంసీజీ గ్రౌండ్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులతో పాటు పలువురు ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. గ్లెన్ మెక్‌గ్రాత్, మైకెల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ తదితర క్రికెటర్లంతా వార్న్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా ఇయాన్ బోథమ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లు వార్న్ సేవలను గుర్తుచేసుకుంటూ కడసారి వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను స్కై స్పోర్ట్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో సచిన్ మాట్లాడుతూ.. ''గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత నేను లండన్‌కు వెళ్లాను. అక్కడ అనుకోకుండా నా చిరకాల మిత్రుడు షేన్ వార్న్ ఎదురుపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇద్దరం కలవడంతో చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఈ సందర్భంలోనే ఇద్దరం కలిసి లండన్‌లో గోల్ఫ్ క్రీడను ప్రారంభించాలనుకున్నాం. కానీ ఈరోజు వార్న్ అది నెరవేరకుండానే దూరమయ్యాడు. మా ఇద్దరి బంధానికి గుర్తుగా లండన్‌లో త్వరలోనే గోల్ఫ్ కోర్సును ప్రారంభిస్తాను. కడసారి నా మిత్రునికి వీడ్కోలు పలుకుతున్నా.. భౌతికంగా దూరమైనా మా గుండెల్లో చిరకాలం నిలిచిపోతావు'' అంటూ తెలిపాడు. సచిన్‌తో పాటు మెక్‌గ్రాత్, ఇయాన్ బోథమ్‌లు వార్న్‌తో తమకున్న అనుబంధాన్ని ఫోటోల రూపంలో వీడియోలో పంచుకున్నారు. చదవండి: Symonds-Shane Warne: 'వార్న్.. సాక్సుల్లో నోట్ల కట్టలు దాచేవాడు' Sachin Tendulkar, Glenn McGrath and Ian Botham pay their tributes to Shane Warne at the memorial service at the MCG. pic.twitter.com/2PJo9hYMFe — Sky Sports Cricket (@SkyCricket) March 30, 2022 Shane Warne's father Keith pays tribute to his son at the memorial service at the MCG as the world remembers the legendary Australian cricketer. pic.twitter.com/07TFQHPxTW — Sky Sports Cricket (@SkyCricket) March 30, 2022 -
23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్
కరాచీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం 1999లో అడిలైడ్ టెస్టులో మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డకౌట్ అయ్యాడు. మెక్‌గ్రాత్ వేసిన షార్ట్‌పిచ్ బంతి వేయడంతో సచిన్ కాస్త కిందకు వంగి షాట్ ఆడుదామని భావించాడు. అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ కాకుండా అదే లెంగ్త్‌లో వెళ్లి సచిన్ తొడలను తాకుతూ భుజాల పైనుంచి బంతి వెళ్లింది. దీంతో మెక్‌గ్రాత్ అప్పీల్ చేయగా.. అప్పటి అంపైర్ డారెల్ హార్పర్ సందేహం లేకుండా ఔట్ ఇచ్చాడు. అంపైర్ నిర్ణయంతో షాక్ అయినప్పటికి సచిన్ ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ తర్వాత సచిన్ ఎల్బీ అయినట్లు బిగ్‌స్ర్కీన్‌పై క్లియర్‌గా కనిపించింది. కాగా సచిన్ ఎల్బీ క్రికెట్ చరిత్రలో ఫేమస్ ఎల్బీగా మిగిలిపోయింది. తాజాగా పాక్-ఆసీస్ రెండో టెస్టులో మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈసారి బౌలర్ కామెరాన్ గ్రీన్ కాగా.. బ్యాట్స్‌మన్ అజహర్ అలీ. అప్పటికే 54 బంతులు ఎదుర్కొన్న అజర్ అలీ ఆరు పరుగులు మాత్రమే చేసి క్రీజులో ఇబ్బంది పడుతున్నాడు. ఇది బలంగా భావించిన కామెరాన్ గ్రీన్ తాను వేసిన 23వ ఓవర్లో మెక్‌గ్రాత్‌ను గుర్తుచేస్తూ.. షార్ట్‌లెంగ్త్ డెలివరీ వేశాడు. అయితే అజహర్ అలీ బంతిని సరిగా అంచనా వేయలేక కిందకు వంగాడు. బంతి నేరుగా తొడపై బాగం తాకుతూ వెళ్లింది. గ్రీన్ అప్పీల్ చేయగానే అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఇది చూసి షాక్ అయిన అజహర్ అలీ.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అబ్దుల్లా షఫీక్ చెబ్తున్నా వినకుండా రివ్యూకు వెళ్లాడు. అజహర్‌ను దురదృష్టం వెంటాడింది. బంతి తొడ బాగాన్ని తాకడానికి ముందు చేతి గ్లోవ్స్‌ను తాకినట్లు రిప్లేలో తేలింది. దీంతో అతను ఎల్బీగా ఔటైనట్లు థర్డ్ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ''23 ఏళ్ల క్రితం సచిన్.. ఇప్పుడు అజహర్ అలీ''.. ''అప్పుడు మెక్‌గ్రాత్.. ఇప్పుడు కామెరాన్ గ్రీన్ బౌలర్స్.. మిగతాదంతా సేమ్ టూ సేమ్''..''ఎక్కడ చూసిన ఈ ఆస్ట్రేలియన్ బౌలర్స్ కామన్‌గా ఉంటారు.'' అంటూ కామెంట్స్ చేశారు.ఇక 506 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 171.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు సాధించింది. బాబర్, రిజ్వాన్‌ల 115 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం తర్వాత ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ సఫలమైంది. తర్వాతి బంతికే ఫహీమ్ (0)ను, కొద్ది సేపటికే సాజిద్ (9)ను అవుట్ చేసి ఆసీస్ పట్టు బిగించింది. అయితే మిగిలిన 8 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టడంలో విఫలమైన కంగారూలు తీవ్రంగా నిరాశ చెందారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి లాహోర్‌లో మూడో టెస్టు జరుగుతుంది. చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు MS Dhoni: నెంబర్-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్ Green gets Azhar after lunch. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/M161IxLr6s — Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022 -
కంగ్రాట్స్ ప్రసీద్ కృష్ణ: మెక్‌గ్రాత్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడనున్న భారత జట్టులో చోటు దక్కించుకున్న ప్రసీద్ కృష్ణకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ శుభాకాంక్షలు తెలిపాడు. సిరీస్‌లో మెరుగ్గా రాణించి, గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ చెబుతూ ప్రసీద్ కృష్ణ ఫొటో షేర్ చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్ అతడిని అభినందించాడు. కాగా మార్చి 23 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫాస్ట్‌బౌలర్ ప్రసీద్ కృష్ణకు ప్రాబబుల్స్‌లో చోటు కల్పిస్తున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అతడితో పాటు రెండో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్‌కు కూడా అవకాశం కల్పించింది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున మూడు సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించిన ప్రసీద్ కృష్ణకు ప్యాట్ కమిన్స్, లాకీ ఫెర్గూసన్ వంటి మేటిగాళ్లతో కలిసి ఆడాడు. ఇక ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 6 మ్యాచ్‌లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు, మొత్తంగా 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలో అతడికి అంతర్జాతీయ వన్డేల్లో ఆడే అవకాశం లభించింది. ఇక తాను సెలక్ట్ అయ్యాయని తెలియగానే.. ‘‘దేశం తరఫున ఆడేందుకు పిలుపు రావడం.. ఒక వింత అనుభూతినిచ్చింది. నా కల నిజమైంది. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు అవకాశం కల్పించిన బీసీసీఐకి ధన్యవాదాలు. ఇంక నేను ఎదురుచూడలేను. తొందరగా సిరీస్ ఆరంభమైతే బాగుండు’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇక పుణె వేదికగా మార్చి 23, మార్చి 26, మార్చి 28 తేదీల్లో టీమిండియా- ఇంగ్లండ్ వన్డే సిరీస్ జరుగనుంది. చదవండి: ఇంగ్లండ్ ఓడినా.. మలాన్ నయా రికార్డు లిఖించాడు View this post on Instagram A post shared by Glenn McGrath (@glennmcgrath11) -
అక్రమ్, మెక్‌గ్రాత్ తర్వాత అండర్సన్ మాత్రమే
అహ్మదాబాద్: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండోరోజు ఆటలో అజింక్య రహానేను ఔట్ చేయడం ద్వారా అండర్సన్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 900 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటి వరకూ ఆరుగురు బౌలర్లు మాత్రమే ఈ మార్క్‌ని చేరుకోగా.. ఇందులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారు. గురువారం ఓపెనర్ శుభమన్ గిల్ (0)ని మొదటి ఓవర్లోనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న జేమ్స్ అండర్సన్.. ఈరోజు వైస్ కెప్టెన్ అజింక్య రహానేను ఔట్ చేసి ఈ ఫీట్ అందుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని వెంటాడిన రహానె.. స్లిప్‌లో బెన్‌స్టోక్స్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితా చూస్తే.. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 1,347 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ (1,001 వికెట్లు), భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (956), ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (949), పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ (916) టాప్-5లో కొనసాగుతున్నారు. తాజాగా ఆరో బౌలర్/ మూడో పేసర్‌గా జేమ్స్ అండర్సన్ (900) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. చదవండి: ఒకే దెబ్బకు రోహిత్ శర్మ రెండు రికార్డులు నాలుగో టెస్టు : పంత్ దూకుడు.. ఆధిక్యంలోకి టీమిండియా -
తన ఆటతో ఇంప్రెస్ అయ్యాను: మెక్‌గ్రాత్
సిడ్నీ: టీమిండియా బౌలర్ నటరాజన్‌పై ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా టూర్లో భాగంగా భారత్ నటరాజన్ రూపంలో గొప్ప ఆటగాడు లభించాడంటూ కొనియాడాడు. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఇలాగే ఫామ్‌ను కొనసాగించాలని ఆకాంక్షించాడు. కాగా వన్డే సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న తమిళనాడు పేసర్ నటరాజన్, అరంగేట్రంలోనే రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా అప్పటికే ఆసీస్ చేతిలో 2-0తో సిరీస్ కోల్పోయిన కోహ్లి సేన చివరి వన్డేలో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. మహ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసిన అతడు.. తాను సరైన ఎంపిక అని రుజువు చేసుకున్నాడు. (చదవండి: నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్) అంతేకాక శుక్రవారం జరిగిన తొలి టీ20లో 4 ఓవర్లలో మూడు కీలక వికెట్లు(30 పరుగులు) తీసి సత్తా చాటాడు. అదే విధంగా.. ఆదివారం నాటి రెండో టీ20 మ్యాచ్‌లోనూ నిన్నటి మ్యాచ్‌లో నటరాజన్ నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 20 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగానే ఆసీస్ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. ఈ క్రమంలో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుని బదులు తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా కామంటేటర్ మెక్‌గ్రాత్ మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా నటరాజన్ కలిసినట్లు పేర్కొన్నాడు. (చదవండి: నటరాజన్ అరంగేట్రం.. అద్భుతమైన కథ!) ప్రస్తుతం అతడు బౌల్ చేస్తున్న తీరు అద్భుతమని, ఆస్ట్రేలియా పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడని చెప్పుకొచ్చాడు. ఇకపై తాను వికెట్లు తీసేందుకు కేవలం యార్కర్లపై మాత్రమే ఆధారపడే పరిస్థితి లేదన్నాడు. నటరాజన్ ఆటతో తనను ఇంప్రెస్ చేశాడని ప్రశంసించాడు. కాగా 2015-16 ఆసీస్ టూర్లో భాగంగా బుమ్రా, 2018-19లో మయాంక్ అగర్వాల్ మెరుగైన ప్రదర్శనతో వెలుగులోకి రాగా ప్రస్తుతం నటరాజన్ సైతం ఆస్ట్రేలియా టూర్లోనే తనదైన ముద్ర వేయడం గమనార్హం. ఇక అరంగేట్ర మ్యాచ్ నుంచి మెరుగ్గా రాణిస్తున్న నటరాజన్‌పై ఇప్పటికే మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నటరాజన్ ఫామ్ చూస్తుంటే షమీ స్థానానికి ఎసరు వచ్చేలా ఉందని సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే విధంగా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి టీమిండియాకు ఆడటం వెనుక ఉన్న అతడి కఠోర శ్రమ గురించి క్రికెట్ దిగ్గజాలు ఇయాన్ బిషప్, టామ్ మూడీ సైతం ప్రస్తావిస్తూ... తనది మనసును హత్తుకునే అద్భుతమైన కథ అంటూ ట్వీట్ చేశారు. -
'మెక్‌గ్రాత్ గుర్తుంచుకో.. నేనింకా క్రీజులోనే ఉన్నా'
ముంబై : క్రికెట్లో బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్‌కు మధ్య జరిగే సన్నివేశాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తన బౌలింగ్‌లో పరుగులు తీయడానికి ఇబ్బంది పడే బ్యాట్స్‌మెన్‌ను చూస్తూ గేలి చేయడం బౌలర్ నైజమైతే.. అదే బౌలర్ మళ్లీ బౌలింగ్‌ను వచ్చినప్పుడు బౌండరీలు బాది బ్యాట్స్మన్లు ధీటుగా బదులిస్తారు. అలాంటి ఘటనలు క్రికెట్లో చాలానే చూశాం. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌లు ఈ కోవకే చెందినవారే. వీరిద్దరు పరస్పరం తలపడినప్పుడు వారి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ('రసెల్‌తో ఆడితే హైలెట్స్ చూస్తున్నట్లే అనిపిస్తుంది') 90 వ దశకం నుంచి 2003 సంవత్సరం వరకు తీసుకుంటే వీరిద్దరు ఎదురుపడినప్పుల్లా మ్యాచ్ సంగతి పక్కన పెట్టి అభిమానులు వీరిపై దృష్టి సారించేవారు. 1999 టెస్టు సిరీస్, కెన్యాలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ, 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లనే ఉదాహరణగా చెప్పొచ్చు. తాజాగా సచిన్ టెండూల్కర్ మెక్‌గ్రాత్‌తో జరిగిన ఒక సంఘటనను ఒక వీడియో చాట్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియోనూ బీసీసీఐ తమ అధికార ట్విటర్లో షేర్ చేసింది. 1999లో భారత జట్టు ఆసీసీలో పర్యటించింది. అడిలైడ్ టెస్టు సందర్భంగా గ్లెన్ మెక్‌గ్రాత్ తనను ఎంతగా విసుగు తెప్పించాడనేది సచిన్ గుర్తు చేశాడు. ' 1999.. అడిలైడ్‌లో మొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాము. ఇంకా 40 నిమిషాల పాటు ఆడితే మొదటి రోజు ఆట ముగుస్తుంది. అప్పటికే నాకు మెక్‌గ్రాత్ ఐదు ఓవర్లు మెయిడిన్ వేసి చికాకు తెప్పించాడు. వాళ్లు (ఆసీస్ ఆటగాళ్లు) నాకు విసుగు తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు 70 శాతం బంతులను గిల్‌క్రిస్ట్ చేతుల్లో పడాలని, 10 శాతం బంతులను మాత్రమే సచిన్ బ్యాట్‌కు తగిలేలా వేయాలని మెక్‌గ్రాత్‌కు వివరించారు. మెక్‌గ్రాత్ అదే విధంగా బౌలింగ్ చేస్తుంటే చాలా బంతుల్ని వదిలేశాను. అయితే మంచి బంతులను మాత్రం నా స్టైల్లో ఆడాను. ఆట ముగిసిన తర్వాత మెక్‌గ్రాత్‌ను ఉద్దేశించి.. బాగానే బౌలింగ్ చేశావు.. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్లి మళ్లీ బౌలింగ్ చేయ్.. ఎందుకంటే నేనింకా క్రీజులోనే ఉన్నా అంటూ కౌంటర్ ఇచ్చా. తర్వాతి రోజు బ్యాటింగ్ దిగినప్పుడు మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో కొన్ని బౌండరీలు సాధించినా కొన్ని బంతులు మాత్రం బాగానే ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే తర్వాతి రోజు ఇద్దరం సమానస్థాయిలో ఉన్నాం. కానీ వాళ్లు మాత్రం నన్ను విసిగించే పనినే టార్గెట్‌గా పెట్టుకున్నారంటూ ' సచిన్ చెప్పుకొచ్చాడు. Must Watch - From his daily routine to his on-field rivalries to the famous Desert Storm innings - @sachin_rt tells it all in this Lockdown Diary. Full video 📽️ https://t.co/y7cIVLxwAU #TeamIndia — BCCI (@BCCI) April 28, 2020 -
అలా చేస్తే ద్వేషిస్తా: మెక్‌గ్రాత్
మెల్బోర్న్: తానొక సంప్రదాయ క్రికెటర్‌నని ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ స్పష్టం చేశాడు. సంప్రదాయ క్రికెటర్నైన తాను ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ను మాత్రమే ఇష్టపడతానన్నాడు. టెస్టు మ్యాచ్ రోజుల్ని కుదించడం సరైనది కాదన్నాడు. దీనిలో భాగంగా ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతిపాదనను ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వ్యతిరేకించాడు. ‘నేను సంప్రదాయవాదిని. ఇప్పుడున్న టెస్ట్ ఫార్మాటే నాకిష్టం. అలా కాకుండా కుదిస్తే మాత్రం ద్వేషిస్తా. పింక్ బాల్ లాంటి ప్రయోగాల కారణంగా టెస్ట్‌ల ఆదరణ పెరుగుతోంద’ని మెక్‌గ్రాత్ చెప్పాడు. తాజా ప్రతిపాదనను ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్, కోచ్ జస్టిన్ లాంగర్ కూడా వ్యతిరేకించారు. అయితే, ఈ విషయమై మాట్లాడడం తొందరపాటే అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కామెంట్ చేశాడు.(ఇక్కడ చదవండి: చివరి ఓవర్లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్) -
ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్ దిగ్గజ బౌలర్
లీడ్స్ : ఇంగ్లండ్ యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై ఆస్ట్రేలియా లెజండరీ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘టెస్టుల్లో పదునైన పేస్‌తో పాటు కచ్చితత్వంతో బౌలింగ్ చేయాలి. అప్పుడే విజయం సాధిస్తాం. ఆర్చర్ ఆ పనిని చాలా సులువుగా చేస్తున్నాడు. అతడి బౌలింగ్ చాలా సహజసిద్దంగా ఉంటుంది. ఆర్చర్ రనప్, క్రీజును వదిలే క్రమం అన్నీ ఎక్కువ స్ట్రెస్ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటాయి. టాప్ పేస్‌తో లాంగ్ స్పెల్ బౌలింగ్ చేస్తున్నాడు. అదే విధంగా బౌలింగ్ వేగంలో చాలా వేరియేషన్స్ చూపిస్తున్నాడు. ఆర్చర్ పేస్ బౌలింగ్‌కు అనుభవం తోడైతే ఎన్నో రికార్డులు సృష్టిస్తాడు’అంటూ ఆర్చర్‌ను మెక్‌గ్రాత్ ఆకాశానికి ఎత్తాడు. ఇక యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆర్చర్ అరంగేట్రం చేశాడు. అరంగేట్రపు తొలి టెస్టులోనే ఆర్చర్ రెచ్చిపోయాడు. బుల్లెట్ వంటి బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను గెలిపించినంత పనిచేశాడు. ఇక అదే మ్యాచ్‌లో ఆర్చర్ పదునైన బౌన్సర్‌కు ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ గాయపడ్డాడు. అయితే స్మిత్ గాయంతో విలవిల్లాడుతుంటే ఆర్చర్ ప్రవర్తించిన తీరుపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, పలువురు ఆసీస్ మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మెక్‌గ్రాత్ ఆర్చర్‌ను ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
చివరి ఓవర్లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్
సాక్షి, అమరావతి : భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అన్నాడు. ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు కోచింగ్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నాడు. క్యాన్సర్ వ్యాధి నివారణకు ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థ కార్యక్రమంలో మెక్‌గ్రాత్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన క్రీడా జీవితానికి సంబంధించిన పలు విషయాలు క్రీడాకారులతో పంచుకున్నాడు. ‘ఆస్ట్రేలియాలో క్రికెట్ జాతీయ క్రీడ. నాకు కుటుంబం నుంచి పూర్తి సహకారం ఉంది. బౌలర్‌గా చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. టీ20, వన్డేల మధ్య మానసిక ఒత్తిడిలో తేడా ఉంటుంది. 1997లో మొదటి వన్డే మ్యాచ్ ఆడినప్పుడు, 2007లో చివరి వన్డే ఆడినప్పుడు నాది ఒకేరకమైన పరిస్ధితి’ అని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఫుల్‌టాస్‌లు వేయకూడదు వర్ధమాన క్రికెటర్లు శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని మెక్‌గ్రాత్ సూచించాడు. ‘ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడూ ప్రశాంతంగా వుండాలి. చివరి ఓవర్లో ఒత్తిడికి గురి కాకూడదు. అదే విధంగా అప్పుడు ఫుల్‌టాస్‌లు వేయకూడదు. నిజానికి ఫాస్ట్ బౌలర్లకు ఫిట్ నెస్ చాలా ముఖ్యం. ఏకాగ్రతతతో ఉండి సమయానికి అనుకూలంగా వ్యవహరించాలి. అదే విధంగా క్రీడాకారులందరికీ యోగాతో ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈతరం క్రికెటర్స్ మరింత ఉత్సాహంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలుగుతారు’ మెక్‌గ్రాత్ యువ ఆటగాళ్లకు సలహాలు ఇచ్చాడు. -
‘టెక్నికల్‌గా సరైన బ్యాట్స్‌మన్ కాదు’
మెల్బోర్న్: తన సమకాలీన టెస్టు క్రికెటర్ల పరంగా చూస్తే యావరేజ్లో అందరికంటే ముందున్న ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌పై ఆ దేశానికే చెందిన దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్లో స్మిత్ తనదైన ముద్ర వేసినా టెక్నికల్‌గా చూస్తే సరైన బ్యాట్స్‌మన్ కాదని పేర్కొన్నాడు. స్మిత్ టెక్నిక్ చాలా వీక్‌గా ఉంటుందని, కాకపోతే పిచ్ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆడటంలో సిద్ధహస్తుడని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతని టెక్నిక్ బాగాలేకపోయినా కెరీర్ ముగిసే సమయానికి ఒక ప్రత్యేకమైన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాడన్నాడు.యాషెస్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్మిత్ వరుసగా రెండు భారీ సెంచరీలు సాధించి ఆసీస్ ఘన విజయం సాధించడంలో సహకరించాడు. దాంతో స్మిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తుండగా, మెక్‌గ్రాత్ మాత్రం తన అభిప్రాయాన్ని కాస్త భిన్నంగా స్పందించాడు. ‘ స్మిత కెరీర్ ముగిసే సమయానికి ఒక స్పెషల్ క్రికెటర్‌గా నిలుస్తాడు. అతని టెస్టు యావరేజ్ ప్రస్తుతం 60కి పైగా ఉంది. కాకపోతే సాంకేతికంగా చూస్తూ స్మిత్ ఆట తీరు సరైనది కాదు. మ్యాచ్ పరిస్థితుల్ని అర్ధం చేసుకునే ఆడే కొంతమంది క్రికెటర్లలో స్మిత్ కూడా ఒకడు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ పరంగా చూస్తే క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి స్మిత్ ఎక్కవ సమయం తీసుకుంటాడనేది వాస్తవం. దాంతోనే పలు ప్రత్యేకమైన ఇన్నింగ్స్ల్ని స్మిత్ నమోదు చేస్తున్నాడు’ అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. -
నన్ను ఇబ్బంది పెట్టింది వారే: యువీ
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన యువరాజ్ సింగ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన క్రికెట్ కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల పేర్లను యువీ వెల్లడించాడు. తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరనేనని స్పష్టం చేశాడు. మురళీధరన్‌ను ఆడటానికి తీవ్ర ఇబ్బందులు పడేవాడినన్న యువీ.. అదే సమయంలో పేస్ విభాగంలో ఆసీస్ మాజీ పేసర్ మెక్‌గ్రాత్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వచ్చేదన్నాడు. ఈ ఇద్దరే తనను ఎక్కువ ఇబ్బందులు గురి చేశారని యువీ పేర్కొన్నాడు. ఇక తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే ప్రశ్నకు ఆసీస్‌కు రెండుసార్లు వరల్డ్‌కప్ సాధించి పెట్టిన రికీ పాంటింగ్ అని బదులిచ్చాడు. పాంటింగ్ బ్యాటింగ్‌తో పాటు వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ల ఆటను ఎక్కువగా ఆస్వాదించానన్నాడు. (ఇక్కడ చదవండి: అతడిని ఎప్పటికీ క్షమించను: యువీ తండ్రి) -
ఆ రెండు జట్లే వరల్డ్‌కప్ ఫేవరెట్స్: మెక్‌గ్రాత్
మెల్బోర్న్: మరో రెండు నెలల్లో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు హాట్ ఫేవరెట్ అని ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. భారత్‌తో పాటు ఇంగ్లండ్ కూడా వరల్డ్‌కప్ ఫేవరెట్ జట్లలో ఒకటన్నాడు. భారత్, ఇంగ్లండ్‌లకు వరల్డ్‌కప్ గెలిచే సత్తా ఉందంటూ తన మనసులోని మాటను వెల్లడించాడు. ‘ భారత్, ఇంగ్లండ్‌లు వరల్డ్‌కప్ పోరులో టాప్ జట్లుగా బరిలో దిగుతున్నాయి. వీటికే వరల్డ్‌కప్‌ను సాధించే అవకాశాలు ఎక్కువ. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఇంగ్లండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. మరొకవైపు స్వదేశంలో జరిగిన రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్‌కు పరాభవం ఎదురైంది. అయినప్పటికీ ఈ రెండు జట్లే వరల్డ్‌కప్ హాట్ ఫేవరెట్స్. అన్ని విభాగాల్లోనూ భారత్-ఇంగ్లండ్‌లు చాలా పటిష్టంగా ఉన్నాయి. భారత్‌పై గెలిచిన సిరీస్‌లతో ఆసీస్ కూడా వరల్డ్‌కప్ రేసులోకి వచ్చిందనే చెప్పాలి’ అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. కాగా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మెక్‌గ్రాత్ ప్రశంసలు కురిపించాడు. అతనొక అసాధారణ ఆటగాడిగా అభివర్ణించిన మెక్‌గ్రాత్.. అతని కెరీర్ ముగిసే సమయానికి దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా తరహాలో చరిత్రలో నిలిచిపోతాడన్నాడు. అదే సమయంలో భారత్ పేస్ బౌలర్లు బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు వరల్డ్‌కప్‌లో కీలక పాత్ర పోషిస్తారన్నాడు. -
మెక్‌గ్రాత్ చేతికి గులాబీ టోపీలు
సిడ్నీ టెస్టు మూడో రోజు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ సంతకాలతో కూడిన గులాబీ రంగు టోపీలను దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు తిరిగిచ్చారు. రొమ్ము క్యాన్సర్‌తో మృతి చెందిన మెక్‌గ్రాత్ భార్య జేన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు నిధుల సమీకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా జనవరిలో నిర్వహించే తొలి టెస్టులో ఆటగాళ్లు ‘పింక్’ కలర్లోని క్రీడా సామాగ్రితో మైదానంలో దిగుతారు. దీనికోసం భారత కెప్టెన్ కోహ్లి సైతం గులాబీ రంగు గ్రిప్‌తో బ్యాటింగ్‌కు దిగాడు. ఇదే సందర్భంలో మ్యాచ్‌కు ముందురోజు ఇరు జట్ల ఆటగాళ్లకు గులాబీ టోపీలు ఇచ్చారు. వీటినే ఆటగాళ్లు శనివారం తిరిగిచ్చారు. దీనిపై ‘మైదానంలోనే కాదు... బయట కూడా భారత క్రికెట్ జట్టు అభిమానం పొందింది. అద్భుతమైన సహకారం’ అంటూ మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది -
కోహ్లి నిరూపించుకునే సమయం
లండన్: ‘టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్‌గా రికార్డుల మీద రికార్డులు అతడి సొంతం.. తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఇంగ్లండ్ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో 13.50 సగటుతో కేవలం 134 పరుగులు చేసి కోహ్లి తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. 37 టెస్టులు 3699 పరుగులు ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కోహ్లి.. తిరిగి పుంజుకుని అసాధరణ ఆటతో చెలరేగిపోయాడని ఈ ఆసీస్ మాజీ బౌలర్ పేర్కొన్నాడు. 2014 టెస్టు సిరీస్ అనంతరం 37 టెస్టులు ఆడిన కోహ్లి 64.89 సగటుతో 3699 పరుగులు సాధించాడని.. ఇందులో15 సెంచరీలు, ఆరు ద్విశతకాలు ఉన్నాయని గుర్తుచేశాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ అయిన టీమిండియా సారథి తాను ఏంటో నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మెక్‌గ్రాత్ తెలిపాడు. ఆసీస్ పిచ్‌లకు ఇంగ్లండ్ పిచ్‌లకు అదే తేడా ఆసీస్ పిచ్‌లపై వీరవిహారం చేసిన విరాట్ కోహ్లి ఇంగ్లండ్ పిచ్‌లపై తడబడటానికి గల కారణాలు మెక్‌గ్రాత్ వివరించాడు. బంతి దూసుకొస్తూ, బౌన్స్ అయ్యే పిచ్‌లు ఆసీస్ సొంతమని.. ఇంగ్లండ్ పిచ్‌లు అలాకాదని విపరీతంగా స్వింగ్ అవడంతో బ్యాట్స్‌మెన్ ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నాడు. ఆచితూచి ఆడితే ఈ పిచ్‌లపై కూడా పరుగులు రాబట్టచ్చని కోహ్లికి సూచించాడు. స్పిన్, బ్యాటింగే టీమిండియా బలం టీమిండియా బలం బ్యాటింగేనని, స్పిన్ బౌలింగ్ అదనపు బలమని మెక్‌గ్రాత్ తెలిపాడు. పేస్ బౌలర్లు కూడా నిలకడగా రాణిస్తున్నారన్నారు. ఇషాంత్ శర్మ అనుభవం ఈ సిరీస్‌లో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. బుమ్రా, భువనేశ్వర్ లేకపోవడంతో పేస్ బౌలింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని మెక్‌గ్రాత్ తెలిపాడు. -
కోహ్లికి మాతో అంత ఈజీ కాదు!
ఆస్ట్రేలియాతో ఆట అంటేనే మాటల యుద్దం, స్లెడ్జింగ్, గెలవడానికి ఏదైనా చేస్తుందని అందరి అభిప్రాయం. కాగా, ఈ ఏడాది చివర్లో టీమిండియాతో కీలక సిరీస్ దృష్ట్యా ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటినుంచే మాటల యుద్దం ప్రారంభించారు. ఆసీస్‌తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఏ జట్టుపై అయినా సెంచరీ చేయగలడు కానీ మాపై సెంచరీ కాదుకదా పరుగులు కూడా చేయలేడని ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్‌తో కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు దూరమైనప్పటికీ టీమిండియాతో సిరీస్‌లో ఆసీసే ఫేవరేటని ఈ బౌలర్ అభిప్రాయపడుతున్నాడు. 2014లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇద్దరు ఆగ్రశ్రేణి ఆటగాళ్లు( స్టీవ్ స్మిత్ (769పరుగులు), విరాట్ కోహ్లి (692 పరుగులు) ) పోటీ పడి పరుగులు చేశారని గుర్తు చేశాడు. కానీ, ఈసారి కోహ్లిని బోల్తా కొట్టిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఆసీస్ దిగ్గజ ఆటగాడు మెక్‌గ్రాత్ సూచనలతో కోహ్లిపై వ్యూహాలు రచిస్తున్నామని కమిన్స్ తెలిపాడు. మెక్‌గ్రాత్ వ్యూహంలో భాగంగానే.. వరుస ఓటములు, వివాదాలు వీటి నుంచి కాస్త ఉపశమనం పోందాలంటే టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు టీమిండియాతో జరగబోయే సిరీస్‌ను గెలవాలని ఆసీస్ తాపత్రయపడుతోంది. ఇప్పటికే ఆసీస్ మాజీ బౌలర్ మెక్‌గ్రాత్ యువబౌలర్లకు సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. మంగళవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాడు. కోహ్లిపై వీలైనంత త్వరగా ఒత్తిడి పెంచి, క్రీజులో నిలదొక్కుకోముందే ఔట్ చేయాలని ఆసీస్ ఆటగాళ్లకు సూచించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే మిగతా ఆటగాళ్లను ఔట్ చేయడం సులభమవుతుందని ఈ దిగ్గజ ఆటగాడు పేర్కొన్నాడు. తాను ఆడినప్పుడు కూడా ఇదే ఫార్ములాను ప్రయోగించానని తెలిపాడు. -
'ఈసారి వరల్డ్ కప్ వారిదే'
సిడ్నీ: క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్.. అయితే ఆ జట్టు ఇప్పటివరకూ ఒక్క వన్డే వరల్డ్ కప్‌ను కూడా అందుకోలేకపోయింది. ఈ మెగా టైటిల్ కోసం 11 సార్లు టోర్నీలు జరగ్గా, మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్ ఏ ఒక్కసారి టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. 1979,1987, 1992 సంవత్సరాల్లో రన్నరప్‌గానే ఇంగ్లిష్ జట్టు సంతృప్తి పడింది.అయితే స్వదేశంలో జరుగనున్న 2019 వన్డే వరల్డ్ కప్‌లో కచ్చితంగా ఇంగ్లండ్ టైటిల్ ఫేవరెట్ అని ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ జోస్యం చెప్పాడు. అందుకు పలుకారణాలు చెప్పిన మెక్‌గ్రాత్.. ఈసారి ఇంగ్లండ్‌ను వరల్డ్ కప్ సాధించకుండా ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో ఇంగ్లండ్ వన్డే క్రికెట్‌ను చూసిన తర్వాతే తాను ఆ జట్టును టైటిల్ ఫేవరెట్‌గా చెబుతున్నానన్నాడు.'గత రెండు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 22 అంతర్జాతీయ వన్డేలకు గాను 19 విజయాలను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ఇదే తరహా ఆటను కొనసాగిస్తే మాత్రం ఇంగ్లండ్‌ను ఎవరూ ఆపలేరు. అందులోనూ సొంతగడ్డపై జరిగే వరల్డ్ కప్ కావడంతో ఇంగ్లండ్‌ను ఓడించడం చాలా కష్టం' అని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు.