'I am a big Bumrah fan but…': Glenn McGrath's game-changing advice: 2018లో బొటనవేలి గాయం.. 2019లో వెన్నునొప్పి.. 2020-21లో కడుపునొప్పి.. 2022లో తీవ్రమైన వెన్నునొప్పి.. గాయం తిరగబెట్టిన కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరం.. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా టీ20 కప్-2022, టీ20 వరల్డ్‌కప్-2022 వంటి మెగా టోర్నీలకు అందుబాటులో లేకపోవడం వల్ల జట్టుకు భారీ ఎదురుదెబ్బలు...
అవును మీరు ఊహించిన పేరు నిజమే.. టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించే ఈ ఉపోద్ఘాతం.. ఫాస్ట్‌బౌలర్లకు గాయాల బెడద ఎక్కువన్న విషయం తెలిసిందే. అయితే, భారత జట్టు పేస్ గుర్రం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ+ గ్రేడ్ కలిగి ఉన్న బుమ్రా విషయంలో మాత్రం తరచూ ఇదే పునరావృతమవుతోంది.
ఐర్లాండ్ సిరీస్‌తో కెప్టెన్‌గా రీఎంట్రీ
వెన్నునొప్పి తిరగబెట్టడంతో సర్జరీ చేయించుకుని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన బుమ్రా.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఏకంగా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రపంచకప్-2023కి ముందు ఈ స్టార్ పేసర్ ఫిట్‌నెస్, సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
నేను అతడికి వీరాభిమానిని.. కానీ
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియాకు దొరికిన అసాధారణ పేసర్ బుమ్రా అనడంలో సందేహం లేదు. అతడి కెరీర్‌లోని బౌలింగ్ గణాంకాలే ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాయి.
అతడికి నేను వీరాభిమానిని. కానీ బుమ్రా బౌలింగ్ యాక్షన్ కారణంగా అతడి శరీరం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. కాబట్టి తను ఎంత ఫిట్‌గా ఉంటే అంత మంచిది. అలా అయితే, ఇంకొన్నాళ్లు అతడు క్రికెట్ కెరీర్‌ను కొనసాగించగలడు’’ అని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
ఏదో ఒక ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పు
ఐపీఎల్ కారణంగా ఫాస్ట్ బౌలర్లకు ముఖ్యంగా బుమ్రా వంటి స్టార్లకు విశ్రాంతి లేకుండా పోతుందన్న మెక్‌గ్రాత్.. అన్ని ఫార్మాట్లలో ఆడే విషయంపై అతడు పునరాలోచించుకోవాలని సూచించాడు. విరామం లేకుండా మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమని.. అందుకే ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే బుమ్రా తన కెరీర్‌ను మరింత పొడిగించుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2024: ఆర్సీబీని వీడటం చాలా బాధగా ఉంది.. అందరికీ థాంక్స్
36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్ ఆవిర్భావం
Comments
Please login to add a commentAdd a comment