James Andersdon: దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్ (6/62), ఓలీ రాబిన్సన్ (5/91), స్టువర్ట్ బ్రాడ్ (4/61), బెన్ స్టోక్స్ (4/47) చెలరేగి సఫారీలను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 330 పరుగులకే (151, 179) పరిమితం చేయగా.. బెన్ స్టోక్స్ (103), బెన్ ఫోక్స్ (113 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 415/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన రెండో టెస్ట్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ ప్లేయర్ సైమన్ హార్మర్ వికెట్ పడగొట్టడం ద్వారా ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (951, టెస్ట్‌ల్లో 664, వన్డేల్లో 269, టీ20ల్లో 18) సాధించిన పేస్ బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది.
మెక్‌గ్రాత్.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 949 వికెట్లు సాధించాడు. తాజాగా ఆండర్సన్.. మెక్‌గ్రాత్ రికార్డు బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్ బౌలర్‌గా అవతరించాడు. 40 ఏళ్ల ఆండర్సన్ మరో 5 వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల (పేసర్లు, స్పిన్నర్లు) జాబితాలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను (955 వికెట్లు) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకుతాడు. ఇంగ్లండ్-సఫారీల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 8న ప్రారంభమవుతుంది.
చదవండి: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment