భారత యువబౌలర్‌పై దిగ్గజ క్రికెటర్ ప్రశంసలు
భారత యువబౌలర్‌పై దిగ్గజ క్రికెటర్ ప్రశంసలు
Published Tue, Jul 18 2017 9:12 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM
సిడ్నీ: భారత యువబౌలర్ బసీల్ థంపీని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ పొగడ్తలతో ముంచెత్తాడు. భారత్‌లో యువబౌలర్స్ సత్తా చాటుతున్నారని, భవిష్యత్తులో భారత్‌కు బలమైన పేస్ బౌలర్లు అందుబాటులోకి వస్తారని థంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఎమ్‌ఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్, క్రికెట్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెక్‌గ్రాత్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. మెక్‌గ్రాత్ డైరెక్టర్‌గా ఉన్న ఎమ్‌ఆర్‌ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన ముగ్గురు యువబౌలర్లు బసీల్ థంపీ, అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరిలు దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యారు. ముగ్గురు యువబౌలర్లు ఎంపికైనప్పటికే మెక్‌గ్రాత్ బసీల్ థంపీపైనే ప్రశంసలు కురిపించాడం విశేషం.
డైరెక్టరైన మెక్‌గ్రాత్ శిక్షణలో భారత యువ బౌలర్లు శిక్షణ పొందారు. అకాడమీ శిక్షణలో రాటు దేలిన థంపీ ఐపీఎల్‌లో సత్తాచాటి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలిచకున్నాడని గుర్తు చేస్తూ కొనియాడాడు. ఇక ఈ అకాడమీలో ట్రైనీగా చేరి డైరెక్టర్‌గా సేవలందించడం సంతోషంగా ఉందని మెక్ గ్రాత్ తెలిపాడు. రాబోయే రోజుల్లో మరింత మంది పేస్ బౌలర్లను భారత్‌కు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాల్లో యువ బౌలర్లు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. బసీల్ థంపీ ఐపీఎల్-10 గుజరాత్ లయన్స్ తరుపున 11 వికెట్లు పడగొట్టి దిగ్గజ ఆటగాళ్ల మన్ననలు పొందాడు.
Advertisement