బుమ్రాకు ఆ విషయం తెలుసనుకుంటా: ఆసీస్‌ లెజెండ్‌ | IPL 2024 Bumrah Must Regularly Take Breaks Advises Glenn McGrath | Sakshi
Sakshi News home page

IPL 2024: బుమ్రాకు ఆ విషయం తెలుసనుకుంటా: ఆసీస్‌ లెజెండ్‌ కీలక వ్యాఖ్యలు

Published Wed, Mar 20 2024 10:22 AM | Last Updated on Wed, Mar 20 2024 1:20 PM

IPL 2024 Bumrah Must Regularly Take Breaks Advises Glenn McGrath - Sakshi

బుమ్రా (PC: IPL/MI)

టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాకు ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెగ్రాత్‌ కీలక సూచనలు చేశాడు. శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెట్టకూడదని.. మ్యాచ్‌ల మధ్య కచ్చితంగా విరామం తీసుకోవాలని సూచించాడు. పనిభారాన్ని తగ్గించుకుంటేనే కెరీర్‌ను పొడిగించుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డాడు.

కాగా మిగతా ఆటగాళ్లతో పోలిస్తే ఫాస్ట్‌బౌలర్లకు సహజంగానే గాయాల బెడద ఎక్కువన్న సంగతి తెలిసిందే. జస్‌ప్రీత్‌ బుమ్రా సైతం వెన్నునొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌ సహా పలు కీలక ఈవెంట్లకు దూరమయ్యాడు. ఐపీఎల్‌-2023కి కూడా అందుబాటులో ఉండలేకపోయాడు ఈ ముంబై ఇండియన్స్‌ స్టార్‌.

అయితే, ఈసారి రెట్టించిన ఉత్సాహంతో తిరిగి ఎంఐ కుటుంబంలో అడుగుపెట్టాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత టీమిండియా తరఫున అదరగొట్టి వరల్డ్‌ నంబర్‌ 1 బౌలర్‌గా నిలిచిన బుమ్రా తదుపరి ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌తో మళ్లీ మైదానంలో దిగనున్నాడు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెగ్రాత్‌ బుమ్రాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘బుమ్రా లాంటి ఆటగాళ్లకు కొంతకాలం బ్రేక్‌ ఇవ్వడం తప్పనిసరి. తన బౌలింగ్‌ యాక్షన్‌ సంప్రదాయశైలికి భిన్నంగా ఉంటుంది. 

అందువల్ల బౌలింగ్‌ చేసే ప్రతిసారీ అతడి శరీరం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. కాబట్టి గాయాల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువే. గతంలో ఏం జరిగిందో చూశాం కదా! 

అతడు వరుస మ్యాచ్‌ల తర్వాత విరామం తీసుకుంటేనే మంచిది. నిజానికి తనిప్పుడు అనుభవజ్ఞుడు. వర్క్‌లోడ్‌ను ఎలా మేనేజ్‌ చేసుకోవాలో తనకు తెలిసే ఉంటుంది. కానీ నా సలహా మాత్రం ఇదే’’ అని పేర్కొన్నాడు. 

కాగా మార్చి 22న ఐపీఎల్‌-2024 ఆరంభం కానుండగా.. బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్‌ మార్చి 24న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్‌ పాండ్యా జట్టును ముందుకు నడిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement