'అది భారత్ క్రికెట్ లోకఠినమైన జాబ్'
సిడ్నీ: గత కొంతకాలంగా భారత్ క్రికెట్ నుంచి నాణ్యమైన పేస్ బౌలర్లు వస్తుండటం ఆ జట్టుకు శుభపరిణామని ఆసీస్ దిగ్గజ ఆటగాడు గ్లెన్ మెక్గ్రాత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో పేస్ విభాగంలో తీవ్ర పోటీ నెలకొనడమే ఇందుకు ఉదాహరణగా తెలిపాడు. కేవలం స్పిన్నర్లు, బ్యాట్స్మెన్లకు మాత్రమే అనుకూలించే భారత పిచ్ లపై పేసర్లు తయారుకావటం చాలా కష్టమని ఈ సందర్భంగా మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు.
'భారత క్రికెట్ నుంచి చాలా మంది ఫాస్ట్ బౌలర్లు రావడం మంచి పరిణామం. భారత్ నుంచి ఫాస్ట్ బౌలర్ తయారుకావడం అనేది ఒక కఠినమైన జాబ్ వంటిది. అక్కడ పేసర్లు తయారు కావడం చాలా కష్టం. ప్రధానంగా స్పిన్, బ్యాటింగ్ పిచ్లే భారత్ లో మనకు కనిపిస్తాయి. అటువంటి తరుణంలో కూడా అక్కడ నుంచి పేసర్లు రావడం నిజంగా అద్భుతమే. భారత్ లో ఒక పేసర్ తయారు కావాలంటే విపరీతమైన శ్రమ అవసరం. ఎంతో శ్రమిస్తే కానీ భారత్ లో పేసర్ తయారు కాలేడు. ప్రస్తుతం భారత్ లో పలువురు బౌలర్లు 140 కి.మీకు పైగా వేగంతో బౌలింగ్ వేస్తున్నారు. అది ఆ జట్టు భవిష్యత్తుకు భరోసా ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు'అని మెక్గ్రాత్ తెలిపాడు.