
'ఆ బౌలర్ నన్నుఅధిగమిస్తాడు'
మెల్బోర్న్: తాను టెస్టు మ్యాచ్ ల్లో సాధించిన వికెట్లను అధిగమించే సత్తా ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్కు ఉందని ఆస్ట్రేలియా దిగ్గజం మెక్గ్రాత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం 450 వికెట్ల క్లబ్ లో చేరిన అండర్సన్.. తాను సాధించిన 563 వికెట్లను అధిగమించగలడని మెక్గ్రాత్ అభిప్రాయపడ్డాడు.
'అండర్పన్ ఒక నాణ్యమైన బౌలర్. అందులో ఎటువంటి సందేహం లేదు. వేగవంతమైన బంతులను సంధిచడమే కాదు.. స్వింగ్ కూడా బాగా రాబట్టగలడు. అటువంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్ 100 టెస్టులను ఆడటమే గగనం. ఇప్పటివరకూ అండర్సన్115 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఇప్పటికీ బాగా బౌలింగ్ చేస్తున్నాడు.. వికెట్లూ తీస్తున్నాడు. నా వికెట్లను చేరుకునే సత్తా అతనిలో ఉంది' అని మెక్గ్రాత్ తెలిపాడు. ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో మెక్గ్రాత్ నాల్గో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. మెక్ గ్రాత్ కంటే ముందు వరుసలో ముత్తయ్య మురళీధరన్(800), షేన్ వార్న్(708), అనిల్ కుంబ్లే(619)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.