ఆస్ట్రేలియాతో ఆట అంటేనే మాటల యుద్దం, స్లెడ్జింగ్, గెలవడానికి ఏదైనా చేస్తుందని అందరి అభిప్రాయం. కాగా, ఈ ఏడాది చివర్లో టీమిండియాతో కీలక సిరీస్ దృష్ట్యా ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటినుంచే మాటల యుద్దం ప్రారంభించారు. ఆసీస్‌తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఏ జట్టుపై అయినా సెంచరీ చేయగలడు కానీ మాపై సెంచరీ కాదుకదా పరుగులు కూడా చేయలేడని ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బాల్ ట్యాంపరింగ్‌తో కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు దూరమైనప్పటికీ టీమిండియాతో సిరీస్‌లో ఆసీసే ఫేవరేటని ఈ బౌలర్ అభిప్రాయపడుతున్నాడు. 2014లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇద్దరు ఆగ్రశ్రేణి ఆటగాళ్లు( స్టీవ్ స్మిత్ (769పరుగులు), విరాట్ కోహ్లి (692 పరుగులు) ) పోటీ పడి పరుగులు చేశారని గుర్తు చేశాడు. కానీ, ఈసారి కోహ్లిని బోల్తా కొట్టిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఆసీస్ దిగ్గజ ఆటగాడు మెక్‌గ్రాత్ సూచనలతో కోహ్లిపై వ్యూహాలు రచిస్తున్నామని కమిన్స్ తెలిపాడు.
మెక్‌గ్రాత్ వ్యూహంలో భాగంగానే.. వరుస ఓటములు, వివాదాలు వీటి నుంచి కాస్త ఉపశమనం పోందాలంటే టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు టీమిండియాతో జరగబోయే సిరీస్‌ను గెలవాలని ఆసీస్ తాపత్రయపడుతోంది. ఇప్పటికే ఆసీస్ మాజీ బౌలర్ మెక్‌గ్రాత్ యువబౌలర్లకు సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. మంగళవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాడు. కోహ్లిపై వీలైనంత త్వరగా ఒత్తిడి పెంచి, క్రీజులో నిలదొక్కుకోముందే ఔట్ చేయాలని ఆసీస్ ఆటగాళ్లకు సూచించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే మిగతా ఆటగాళ్లను ఔట్ చేయడం సులభమవుతుందని ఈ దిగ్గజ ఆటగాడు పేర్కొన్నాడు. తాను ఆడినప్పుడు కూడా ఇదే ఫార్ములాను ప్రయోగించానని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment