చెన్నై వేదికగా టీమిండియాతో నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్లిష్టమైన దశ నుంచి అద్భుతంగా పురోగమనం సాధించి, ఆసీస్ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను విరాట్ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి గట్టెక్కించారు. ఫలితంగా భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది.
కోహ్లి క్యాచ్‌ను జారవిడిచిన మార్ష్..
ఓ దశలో భారత్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడింది. జట్టు స్కోర్ 20 పరుగుల వద్ద ఉండగా హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ కోహ్లి క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ లైఫ్ అనంతరం వెనుదిరిగి చూసుకోని కోహ్లి భారత్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. ఓ రకంగా చెప్పాలంటే కోహ్లి డ్రాప్ క్యాచే ఆసీస్ కొంపముంచింది. అయితే ఈ విషయాన్ని కమిన్స్ అంగీకరించలేదు.
కోహ్లి క్యాచ్ డ్రాప్.. అప్పుడే మర్చిపోయా..!
మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా కమిన్స్ మాట్లాడుతూ.. మార్ష్ కోహ్లి క్యాచ్ డ్రాప్ చేసిన విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. క్రికెట్‌లో ఇది సర్వసాధారణం. అయితే స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఏ జట్టుకైనా 10/4 స్కోర్ డ్రీమ్ స్టార్ట్ అని చెప్పాలి. మేము ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాం. అయినా మా ఓటమికి ఇది కారణం కాదు.
మేము అదనంగా మరో 50 పరుగులు చేసి ఉండాల్సింది. ఇలాంటి టఫ్ పిచ్‌పై 200 స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. క్రెడిట్ భారత స్పిన్నర్లకే. వారు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఓడిపోయినందుకు బాధ లేదు. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. రోహిత్ గెలిచి ఉన్నా ఇదే పని చేసేవాడు అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment