బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఈ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు గత ఎనిమిది సంవత్సరాలుగా గోతి కాడి నక్కలా కాచుకు కూర్చున్నారు. ఈ విషయం ఆస్ట్రేలియా ఆటగాళ్ల తాజా వ్యాఖ్యల్లో తేటతెల్లమైంది. బీజీటీ 2024-25 నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటి నుంచే టీమిండియాపై మాటల యుద్ధాన్ని మొదలుపెట్టారు. బీజీటీ తమకు యాషెస్ కంటే ముఖ్యమని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు గాయాల బారిన పడకుండా ఉండేందుకు కొంతకాలం క్రికెట్‌కు సైతం దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నాడు. కమిన్స్ కెప్టెన్సీ కెరీర్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒక్కటే లోటు. ఆసీస్ కెప్టెన్‌గా అతను సాధించాల్సివన్నీ సాధించాడు. ప్రస్తుత ఆసీస్ జట్టులోనూ చాలామంది ఆటగాళ్లకు బీజీటీ అందని ద్రాక్షాగానే ఉంది.
దీంతో ఈసారి ఎలాగైన దాన్ని దక్కించుకుని తీరాలని ఆసీస్ ఆటగాళ్లంతా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇందులో భాగంగా కమిన్స్‌తో పాటు హాజిల్‌వుడ్, నాథన్ లయోన్ భారత ఆటగాళ్లతో మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. ఈసారి ఎలాగైనా భారత్‌ను ఓడించి తీరతామని వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈసారి బీజీటీ తమ దేశంలోనే జరుగుతుంది కాబట్టి భారత్‌ను సునాయాసంగా మట్టికరిపిస్తామని చెబుకుంటున్నారు.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా చివరిసారిగా 2014-15లో కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా నాలుగు సిరీస్‌ల్లో, ఇంటాబయటా భారతే ఆ ట్రోఫీని చేజిక్కించుకుంది. 2016-17, 2022-23 ఇండియాలో.. 2018-19, 2020-21లో ఆసీస్‌లో టీమిండియా బీజీటీని నెగ్గింది. గతానికి భిన్నంగా ఈసారి బీజీటీ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా సాగనుంది. ఈ సిరీస్ కోసం భారత్ నవంబర్‌లో ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ నవంబర్ 22న, రెండో టెస్ట్ డిసెంబర్ 6న, మూడో టెస్ట్ డిసెంబర్ 14న, నాలుగో టెస్ట్ డిసెంబర్ 26న, ఐదో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3న ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment