
మాట మార్చిన మెక్ గ్రాత్!
న్యూఢిల్లీ: ట్వి20 వచ్చిన తర్వాత ఫాస్ట్ బౌలర్లు కష్టపడడం మానేయడమే కాకుండా, క్రికెటర్లను ఈజీ మనీ చెడగొడుతుందని గత నెల్లో వ్యాఖ్యానించిన ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్.. తాజాగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వర్థమాన క్రికెటర్ల కెరీర్ కు టీ 20 ఫార్మాట్ తో ఎటువంటి ముప్పు ఉండదంటూ తన మాటను సవరించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తరహా టోర్నీల వల్ల వర్థమాన క్రికెటర్లకు నష్టం వాటిల్లుతుందని తాను అనుకోవడం లేదన్నాడు.
'ఐపీఎల్, బీబీఎల్ టోర్నీలతో యువ క్రికెటర్ల కెరీర్ నాశనం చేస్తున్నారని అనుకోవడం లేదు. కాకపోతే వంద శాతం కచ్చితమైన ఆటను ప్రదర్శిస్తేనే వర్థమాన క్రికెటర్లు భవిష్యత్తు ఉంటుందనేది గుర్తించుకోవాలి. నీ అత్యుత్తమ ఆట తీరు కోసం తీవ్రంగా శ్రమించాలి. ఇది ఒక్క రోజు సాధ్యమయ్యే పనికాదు. ఎప్పటికప్పడు మనల్ని మెరుగుపరుచుకోవాలి. యువ క్రికెటర్లకు ఇదే నా హెచ్చరిక. సక్సెస్ కోసం విశ్రమించకండి' అని మెక్ గ్రాత్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సుదీర్ఘ సేవలందించిన తనకు ఆ గేమ్ కు దూరంగా ఉంటున్నాననే భావన ఎప్పుడూ కలగలేదన్నాడు. క్రికెట్ ఆడటం మానేసిన నాటి నుంచి ఆ వెలితి తెలియకపోవడానికి తనకున్న అద్భుతమైన కుటుంబమే కారణమన్నాడు. దాంతో పాటు ఆస్ట్రేలియాలో మెక్ గ్రాత్ ఫౌండేషన్ నిర్వహించడం కూడా తాను క్రికెట్ కు దూరంగా ఉన్న సంగతిని మరచిపోయేలా చేస్తుందని వ్యాఖ్యానించాడు.