ఐపీఎల్‌ సొమ్ము పాపిష్టిది.. అదే మా రిలేషన్‌ను చెడగొట్టింది..! | Andrew Symonds Reveals How IPL Poisoned His Relationship With Michael Clarke | Sakshi
Sakshi News home page

Andrew Symonds: ఐపీఎల్‌ సొమ్ము పాపిష్టిది.. అదే మా రిలేషన్‌ను చెడగొట్టింది..!

Published Mon, Apr 25 2022 12:36 PM | Last Updated on Mon, Apr 25 2022 12:36 PM

Andrew Symonds Reveals How IPL Poisoned His Relationship With Michael Clarke - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో క్రికెటర్లకు పేరు, హోదాతో పాటు ఆర్ధిక స్థిరత్వాన్ని అందించిన క్యాష్‌ రిచ్‌ లీగ్‌పై ఈ వివాదాస్పద ఆటగాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో లభించిన సొమ్ము పాపిష్టిదని, దాని వల్లే తన ఆప్తమిత్రుడు, ఆసీస్‌ మాజీ సారధి మైఖేల్‌ క్లార్క్‌ తనకు దూరమయ్యాడని సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశాడు. 

ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌ (2008)లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తనను రూ.5.4 కోట్లకు కొనుగోలు చేసిందని, అదే క్లార్క్‌తో తన స్నేహం శత్రుత్వంగా మారడానికి కారణమయ్యిందని వ్యాఖ్యానించాడు. ఇదే సందర్భంగా సైమండ్స్‌ మరో బాంబు పేల్చాడు. ఐపీఎల్‌లో తనకు భారీ ధర పలకడం చూసి క్లార్క్ ఈర్ష్య (జెలసీ) పడ్డాడని, అందుకే నేనంటే అతనికి నచ్చేది కాదని, ఈ విషయాన్ని మాథ్యూ హేడెన్ తనతో చెప్పాడని పేర్కొన్నాడు. ఆప్తమిత్రులుగా ఉన్న తమ మధ్య ఐపీఎల్‌ డబ్బే చిచ్చు పెట్టిందని, మొత్తంగా మా రిలేషన్‌ దెబ్బ తినడానికి ఐపీఎలే కారణమైందని అన్నాడు. ఇప్పటికీ క్లార్క్‌ అంటే నాకు గౌరవం ఉందని, అందుకే అన్ని విషయాలు బయటపెట్టలేకపోతున్నానని బ్రెట్‌ లీ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కాగా, ఆసీస్‌ 2007 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ఆండ్రూ సైమండ్స్, నాటి ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌ కీలకపాత్ర పోషించారు. వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉండి ఆసీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అయితే, 2008లో ఓ వన్డే మ్యాచ్‌కి సైమండ్స్ తాగేసి వచ్చాడని క్లార్క్ ఆరోపించడంతో వీరిద్దరి మధ్య రగడ మొదలైంది. ఇందుకు కౌంటర్‌గా సైమండ్స్‌ సైతం పోటాపోటీ ప్రెస్‌మీట్లు పెట్టి క్లార్క్‌ కెప్టెన్సీపై దుమ్మెత్తిపోశాడు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు అప్పట్లో సంచలనం క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే, నిత్యం వివాదాలతో కెరీర్‌ను కొనసాగించిన సైమండ్స్‌.. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్ట్‌లు, 198 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 
చదవండి: IPL 2022: నిర్లక్ష్యపు షాట్లు.. అదే మా కొంప ముంచింది: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement