విరాట్ సేన బలం అదే..
చెన్నై: ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ భారత బౌలర్లపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల అన్ని రకాల మైదానాల్లో చెలరేగుతున్న ఉమేశ్, బుమ్రాలను ప్రత్యేకంగా అభినందించారు. ‘ఉమేశ్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా ఆఖరి ఓవర్లలో ఆకట్టుకుంటున్నాడు. మంచి లెంగ్త్‌తో పాటు పేస్ కూడా రాబడుతున్నాడు. అవసరమైనప్పుడు యార్కర్లూ సంధిస్తున్నాడు. కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు బౌలర్లు బలంగా నిలుస్తారు. వారికున్న పేస్–స్పిన్ కాంబినేషన్ జట్టును ఫేవరెట్లలో ఒకరిగా నిలబెడుతోంది. భారత్ క్రికెట్ జట్టుకు ప్రధాన బలం బౌలింగ్’ అని తెలిపాడు. రెండు, మూడు సంవత్సరాలుగా భారత బౌలర్ల ప్రదర్శన జట్టుకు అదనపు శక్తిగా మారుతోందని ఆయన అన్నారు.
‘ప్రస్తుతం మంచి వన్డే జట్టుగా ఉన్న భారత్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు సెమీస్ చేరుకుంటుంది. దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్‌లకు నాలుగో జట్టుగా చేరే అవకాశం ఉంది. నా ఉద్దేశం ప్రకారం ఆస్ట్రేలియాకే ట్రోఫీ వస్తుంది. ఇంగ్లండ్‌తో మా జట్టుకు పోటీ ఉండచ్చు’ అని అభిప్రాయపడ్డారు. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడైనా ఆసక్తికరమని, దీనిలో భారత్‌కే గెలిచే అవకాశాలున్నాయని మెక్‌గ్రాత్ వ్యాఖ్యానించారు.