champions trophy 2017
-
Mohammad Shami: పాక్ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్..!
Mohammad Shami Confronts Pakistani Fan After Champions Trophy Defeat Vs Pak: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా పాక్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం భారత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ కొందరు దురభిమానులు సోషల్‌మీడియా వేదికగా మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. పాక్ చేతిలో ఓటమికి షమీనే కారణమని, అతడు పాక్‌కు అమ్ముడుపోయాడని, షమీని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే షమీకి ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, టీమిండియా అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇందులో షమీ పాక్ అభిమానికి వార్నింగ్ ఇస్తూ కనిపిస్తాడు. Those calling @mdshami11 a #gaddar after the #IndiaVsPak match, please watch this 2017 video, when after losing to Pakistan, only Shami had the courage to confront the bullying Pakistani. #IndvsPak #shami #Kohli #ICCT20WorldCup #RohithSharma pic.twitter.com/8ixvhbJadP — निंदाTurtle (@Tawishz) October 25, 2021 వివరాల్లోకి వెళితే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఓటమి అనంతరం భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సందర్భంగా ఓ పాక్ అభిమాని గ్యాలరీలో నుంచి టీమిండియా ఆటగాళ్లందరినీ ఉద్దేశించి పరుష పదజాలంతో దూషణకు దిగాడు. ఈ దూషణ పర్వాన్ని భారత ఆటగాళ్లంతా గమనించిప్పటికీ.. మౌనంగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. అయితే ఆ మాటలు విన్న షమీ మాత్రం స్పందించాడు. సదరు పాక్ అభిమానిపైకి దూసుకెళ్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే కెప్టెన్ ధోని షమీని సముదాయించి లోపలికి తీసుకెళ్లాడు. ఈ వీడియోను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ దేశం పట్ల షమీకి ఉన్న అంకితభావం ఇదంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియా వైరలవుతుంది. దీంతో షమీకి భారీ ఎత్తున నెటిజన్ల మద్దతు లభిస్తుంది. గతంలో షమీ టీమిండియా తరఫున సాధించిన ఘనతలను షేర్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. చదవండి: IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘బుమ్రా నో బాల్ కొంపముంచింది’
న్యూఢిల్లీ: సుమారు మూడేళ్ల క్రితం పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గురించి టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా వేసిన నో బాల్ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నాడు. పాక్ బ్యాట్స్‌మన్ ఫకార్ జమాన్‌కు బుమ్రా వేసిన నో బాల్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందన్నాడు. బుమ్రా బౌలింగ్ ఆరంభంలోనే ఫకార్ ఇచ్చిన క్యాచ్‌ను ధోని అందుకున్నా అది నో బాల్ కావడం కొంపముంచిందన్నాడు. ఆ తర్వాత మ్యాచ్ మొత్తం వన్ సైడ్ వార్‌లా మారిపోవడంతో పాక్ టైటిల్‌ను గెలిచిందన్నాడు. ‘2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఏకపక్ష పోరులా మారిపోయింది. జట్టంతా సమష్టిగా విఫలం చెందడం ఒక ఎత్తు అయితే, బుమ్రా వేసిన నో బాల్ మరొక ఎత్తు. (30 నిమిషాల కామెంటరీ అనుకుంటే..) నో బాల్‌తో బతికి బయటపడ్డ ఫకార్ 114 పరుగులు చేసి పాక్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ఆ తర్వాత మేము బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాం. పాక్ 338 పరుగులు చేస్తే, మేము 158 పరుగులకే ఆలౌటై 180 పరుగుల తేడాతో భారీ ఓటమి చెందాం’ అని భువీ తెలిపాడు. అయితే ఓవరాల్‌గా గత కొన్నేళ్లుగా భారత ప్రదర్శన ఎంతో మెరుగైందనే విషయాన్ని భువీ తెలిపాడు. ‘2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మూడు నుంచి నాలుగు ఐసీసీ టోర్నీలు జరిగితే అందులో రెండు నుంచి మూడు సార్లు సెమీస్,ఫైనల్స్‌కు చేరాం. 2015లో ఆసీస్‌తో సెమీస్‌లో ఓడిపోయాం. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమి. 2019 వరల్డ్‌కప్‌లో కూడా బ్యాడ్‌లక్ వెంటాడింది. మా టాపార్డర్ విఫలం కావడంతో సాధారణ స్కోరును కూడా సాధించలేక సెమీస్ నుంచే నిష్క్రమించాం’ అని భువీ పేర్కొన్నాడు.(రోహిత్‌ను వరల్డ్‌కప్‌లోకి తీసుకోలేకపోవడమే..) -
పాక్‌కు రిటర్న్ గిఫ్ట్ అదిరింది
హైదరాబాద్ : ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జయభేరి మోగించిన విషయం తెలిసిందే. రోహిత శర్మ సూపర్ సెంచరీతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో దాయాది పాక్‌పై కోహ్లి సేన సునాయసయంగా విజయం అందుకుంది. అయితే ఐసీసీ చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది ఇదే రోజు(జూన్ 18న). సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు ఓవల్‌లో చాంపియన్ ట్రోఫీ ఫైనల్ భారత్‌ను పాక్ ఓడించిందని ఐసీసీ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. దీనిపై టీమిండియా అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఏ గడ్డపై ఓడిపోయామో అదే గడ్డపై మట్టికరిపించాం అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘పాకిస్తాన్‌కు టీమిండియా ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అదిరింది’ , ‘చాంపియన్ ట్రోఫీ జరిగిన ఇంగ్లండ్‌లోనే ప్రపంచకప్‌లో పాక్ పనిపట్టాం’ ‘రెండు సంవత్సరాలకు రెండు రోజుల ముందే పాక్‌పై బదులు తీర్చుకున్నాం’అంటూ మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో పాక్‌పై టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. #OnThisDay in 2017, Pakistan beat India at The Oval to win the ICC Champions Trophy! pic.twitter.com/Hmnp6VlqbP — ICC (@ICC) 18 June 2019 చదవండి: ఐసీసీకి సచిన్ కౌంటర్! గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా -
కోహ్లిని అప్పుడు అలా ఔట్ చేశా: పాక్ బౌలర్
ఇస్లామాబాద్ : చాంపియన్స్ ట్రోఫీ-2017 టోర్నీలో ఆసాంతం ఆకట్టుకున్న టీమిండియా ఫైనల్లో దాయదీ పాకిస్తాన్ చేతి ఖంగుతిన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు చేర్చి పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ భారత పతానాన్ని శాసించాడు. తాజాగా వాయిస్ ఆఫ్ క్రికెట్ షోలో ఈ పేస్ బౌలర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీయడం వెనుకున్న తన వ్యూహం ఎంటో తెలియజేశాడు. ‘రోహిత్ శర్మను ఔట్ చేయడానికి ఉపయోగించిన ఇన్ స్వింగ్ బంతినే కోహ్లికి ప్రయోగించా. కానీ అతను నా వ్యూహాన్ని పసిగట్టి చక్కగా ఆడాడు. అనంతరం కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మా ఫీల్డర్ చేజార్చాడు. దీంతో ఈ అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకోని చెలరేగుతాడని భావించాను. కానీ ఎలాగైన అతని వికెట్ పడగొట్టాలని దేవున్ని ప్రార్థించాను. మరుసటి బంతికే షాదాబ్‌ఖాన్ అద్భుత క్యాచ్‌తో కోహ్లి వికెట్ దక్కింది.’ అని నాటి రోజును ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. సచిన్ టెండూలర్క్, కోహ్లిలలో తనకు ప్రత్యేకమైన వికెట్ ఏది అన్న ప్రశ్నకు సచిన్‌దేనని అభిప్రాయపడ్డాడు. ‘ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మెన్. కానీ సచిన్ వికెటే నాకు ప్రత్యేకం. ఎందుకంటే సచిన్‌కు ప్రత్యర్థిగా నేను ఆడితే. అప్పుడు నేను జట్టుకు కొత్త. కాబట్టి నాకు సచిన్ వికెట్ ప్రత్యేకం అవుతోంది.’ అని తెలిపాడు. ఈ ఫైనల్లో ఆమిర్ భారత టాపార్డర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పెవిలియన్ చేర్చి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్లోనే తన ఇన్‌స్వింగ్ బంతితో వికెట్లు ముందు రోహిత్‌ను బోల్తాకొట్టించాడు. హర్దిక్ పాండ్యా(76) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమవడంతో భారత్ 180 పరుగుల ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: కోహ్లి, నేను అందుకే నవ్వుకున్నాం -
హార్దిక్ బ్యాటింగ్ రికార్డు
లండన్:చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ 180 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ జట్టు సమష్టిగా విఫలమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే నిన్నటి భారత క్రికెట్ జట్టు ప్రదర్శనలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులు తప్పితే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హార్దిక్ చెలరేగి ఆడి భారత్ అభిమానుల్లో కాసేపు జోష్ ను తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ నెలకొల్పిన రికార్డును హార్దిక్ బద్దలు కొట్టాడు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ల్లో వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 32 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి ఐసీసీ ఫైనల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా గిల్ క్రిస్ 33 బంతుల్లో నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సవరించాడు. ఆ రికార్డును 18 ఏళ్ల క్రితం గిల్లీ నెలకొల్పాడు. 1999 వరల్డ్ కప్ లో గిల్ క్రిస్ట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సాధించగా, దాన్ని ఇంతకాలానికి హార్దిక్ పాండ్యా అధిగమించాడు. -
కోహ్లిపై ఫిక్సింగ్ ఆరోపణలు
ముంబై: వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) మరోసారి రెచ్చిపోయాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై విషం కక్కాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడంతో కేఆర్కే తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించాడు. అతడిని జైలుకు పంపాలని అన్నాడు. భారత, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులంతా కలిసి అతడిని వెళ్లగొట్టాలని వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించాలని బీసీసీఐకు సూచించాడు. ‘సోదరా కోహ్లి.. నీవు ఇచ్చిన క్యాచ్ పాకిస్తాన్ ఫీల్డర్లు వదిలేశారు. తర్వాతి బంతికే సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యావు. నువ్వు ఫిక్సింగ్‌కు పాల్పడ్డావని క్లియర్‌గా అర్థమవుతోంది. 130 కోట్ల మంది భారతీయుల ప్రతిష్టను పాకిస్తాన్‌కు అమ్మేసిన విరాట్ కోహ్లిపై జీవితకాల నిషేధం విధించాలి. అతడిని జైలుకు పంపాలి. కోహ్లితో పాటు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని కూడా ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. మీరందరూ ఫిక్సర్లు. ప్రజలను మోసం చేయడం మానుకోవాల’ని ట్వీట్ చేశాడు. నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసిన కేఆర్కేపై టీమిండియా, పాకిస్తాన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఆటను ఆటలా చూడాలని, అనవసర ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. టీమిండియా మేటి జట్లను ఓడించి ఫైనల్ చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కోహ్లి నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ అని గుర్తుచేశారు. -
చిత్తుగా ఓడినా టీమిండియానే గ్రేట్!
న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని క్రికెట్ అభిమానులు భావించారు. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ తమ జట్టు విజయం కోసం పూజలు, హోమాలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోహ్లి సేన విజయాన్ని కాంక్షిస్తూ మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఊహించిన దానికి భిన్నంగా మ్యాచ్ ఏకపక్షంగా జరగడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. దీంతో చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, కొంత మంది క్రీడాస్ఫూర్తి కనబరిచారు. ఆటలో గెలుపోటముల సహజమని, బాగా ఆడిన జట్టే గెలిచిందని పేర్కొన్నారు. అనూహ్యంగా పుంజుకుని విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు అభినందనలు తెలిపారు. చివరి మెట్టుపై బోల్తా పడిన కోహ్లి సేనకు బాసటగా నిలిచారు. గెలిచినా, ఓడినా టీమిండియాను అభిమానిస్తూనే ఉంటామన్నారు. ఒక్క మ్యాచ్ ఓడినంతమాత్రానా ద్వేషించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. ప్రతిసారి మనమే గెలవడం సాధ్యంకాదని, ఇప్పటికీ గొప్ప జట్టు టీమిండియానే అని పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యా ఎదురు నిలిచి పోరాడాడని ప్రశంసించారు. కోహ్లి క్రీడాస్ఫూర్తిని మెచ్చుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు రిషికపూర్, అభిషేక్ బచ్చన్, రణవీర్ సింగ్, సిద్ధార్థ మల్హోత్ర, అర్జున్ రాంపాల్, వరుణ్ ధావన్, ఫర్హాన్ అక్తర్, సుస్మిత సేన్, దియా మిర్జా, సోహ అలీఖాన్, విశాల్ తదితరులు కూడా ఇండియా టీమ్‌కు మద్దతుగా ట్వీట్లు పెట్టారు. Yes Pakistan, you have defeated us. Well played, outplayed us in all departments. Many congratulations, I concede. Best wishes! — Rishi Kapoor (@chintskap) June 18, 2017 Win some, lose some..still the greatest team in the world! ✊ -
కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తిన పాక్ ఫ్యాన్స్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ చేతులో ఘోర పరాజయం పొంది చాంపియన్స్ ట్రోఫీని కోల్పోయి భారతీయులతో తిట్లు తిన్నా పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల మనసులను మాత్రం టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ కొళ్లకొట్టాడు. ఓటమి అనంతరం కెప్టెన్ హోదాలో అతడు ఇచ్చిన స్పీచ్‌కు పాక్ క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. తమపై సముచిత గౌరవాన్ని ప్రకటించిన కోహ్లీ నిజమైన ఆడగాడని, అసలైన కెప్టెన్ అంటూ వారు ట్వీట్ల వర్షం కురిపించారు. ఆదివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడిన భారత్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిశాక కెప్టెన్ కోహ్లీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ తుది ఫలితం మాకు నిరాశ కలిగించినా ఫైనల్ చేరడం సంతృప్తినిచ్చింది. మేం ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు కానీ పాకిస్తాన్ మరింత పట్టుదలతో ఆడింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా వారు దూకుడు కనబర్చారు. తమదైన రోజున పాక్ ఎవరినైనా ఓడించగలదని మళ్లీ రుజువైంది. టోర్నీలో వారు కోలుకున్న తీరు అద్భుతం. హార్దిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బుమ్రా నోబాల్‌లాంటి చిన్న పొరపాట్లు కూడా ఒక్కోసారి పెద్దగా మారిపోతాయి. మా బలం (ఛేజింగ్)పై నమ్మకముంది. కానీ ఈసారి అది సరిపోలేదు. అయితే మేం ఓడింది ఒక్క మ్యాచ్ మాత్రమే. తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళతాం. ఈ సందర్భంగా విజయం సాధించిన పాక్‌కు నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని పరిస్థితులు వారికి అనుగుణంగా మారిపోయాయి. మేం కొంత నిరుత్సాహపడిన ఇప్పటికీ నా ముఖంలో చిరునవ్వుందంటే కారణం మేం ఫైనల్‌కు చేరడం సంతృప్తి నిచ్చింది. ఫఖార్ జమాన్ లాంటి ఆటగాళ్లకు ఒక రోజంటూ వచ్చినప్పుడు వారిని అపడం కష్టమవుతుంది. ఎందుకంటే అతడు ఆడిన 80శాతం షాట్లు కూడా హై రిస్క్‌తో కూడుకున్నవి. ఒక బౌలర్‌గా, కెప్టెన్‌గా ఇలాంటిది జరుగుతున్నప్పుడు కలిసొచ్చే రోజున దేన్నయినా మార్చేందుకు ఈ ఒక్కడు చాలేమో అనిపిస్తుంది’ అని అన్నాడు. ఈ స్పీచ్‌కు ఫిదా అయిన పాక్ క్రికెట్ అభిమానులు మ్యాచ్ ముగిశాక కోహ్లీ స్పీచ్ సూపర్ అన్నారు. ‘ధన్యవాదాలు కోహ్లీ.. మ్యాచ్ ముగిశాక నువు చేసిన ప్రకటనతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నావు. నువ్వు చాలా గొప్ప ఆటగాడివి. జెంటిల్‌మెన్‌వి కూడా’... మాకోసం మంచి మనసుతో నువ్వు చెప్పిన మాటలకు ధన్యవాదాలు, ఇండియా టీమ్ చాలా గొప్పది.. కోహ్లీ ఇంటర్వ్యూలో నిజమైన క్రీడాకారుడిగా స్ఫూర్తినిచ్చారు’ అంటూ ఇలా పలు ట్వీట్లు కురిపించారు. Thank you @imVkohli with your post match statement you won many hearts. You are a great player and a gentleman too — Mubasher Lucman (@mubasherlucman) 18 June 2017 Thank you @imVkohli for very kind words for us. And Team India, you're a really good team. It is an honour to have won from World Champions. — Marvi Sirmed (@marvisirmed) 18 June 2017 Credit too to @imVkohli for being gracious to PK and their fans - no greater team to play against — fatima bhutto (@fbhutto) 18 June 2017 Superb sportsmanship from @imVkohli in the interview right now. -
పాక్ విజయం: కశ్మీర్లో పేలిన టపాసులు
శ్రీనగర్: పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిందని భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను పాకిస్తాన్ గెలవడంతో కశ్మీర్ యువత సంబరాలు చేసుకుంది. చాలా ప్రాంతాల్లో యువకులు బాణాసంచా కాల్చి, డాన్సులు చేశారు. శ్రీనగర్‌లోని పాతబస్తీలో ఫరా కాదల్, సెకిదాఫార్ ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. కొంత మంది అత్యుత్సాహవంతులు బాణాసంచా కాల్చి సీఆర్ఫీఎఫ్ క్యాంపులు, స్థానిక పోలీస్ స్టేషన్లోకి విసిరారు. పాకిస్తాన్ విజయంతో సాధించినందుకు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ మహిళలు కూడా కశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో యువత ఇంత హడావుడి చేయనప్పటికి బాజాలు, డప్పులు వాయించి తమ ఆనందాన్ని తెలిపారు. అటు పాకిస్తాన్‌లోనూ సంబరాలు ఆకాశన్నంటాయి. తమ జట్టు తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ సాధించడంతో పాక్ క్రికెట్ అభిమానులు వేడుకల్లో ముగినితేలుతున్నారు. తమ టీమ్‌కు ఘన స్వాగతం పలింకేందుకు సిద్ధమవుతున్నారు. -
టీవీలు ధ్వంసం.. పోస్టర్లు దగ్థం
న్యూఢిల్లీ: టీవీలు పగిలాయి.. పోస్టర్లు దగ్థమయ్యాయి.. నినాదాలు హోరెత్తాయి... చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత భారత క్రికెట్ అభిమానుల రియాక్షన్ ఇది. దాయాదుల సమరంలో పోరాడకుండానే కోహ్లి సేన సులువుగా లొంగిపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా ఫ్యాన్స్ తమ కోపాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి కోహ్లి సేనకు వ్యతిరేకంగా గళమెత్తారు. అహ్మదాబాద్‌లో కొంత మంది టీవీలు రోడ్డు మీదకు తెచ్చి బద్దలు కొట్టారు. భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్పూర్‌లో కెప్టెన్ కోహ్లి, అశ్విన్, యువరాజ్ సింగ్, ఇతర ఆటగాళ్ల పోస్టర్లను తగలబెట్టారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో క్రికెట్ ప్రేమికుల ఆగ్రహానికి టీవీలు పగిలిపోయాయి. టీమిండియా సభ్యుల ఆటతీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాళ్లదాడి, అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్తగా రాంచిలోని మహేంద్ర సింగ్ ధోని ఇంటి వద్ద భద్రతను పెంచారు. మిగతా ఆటగాళ్ల నివాసాల దగ్గర కూడా భద్రత కట్టుదిట్టం చేసినట్టు సమాచారం. -
భారత్-పాక్ మ్యాచ్; టర్నింగ్ పాయింట్స్
లండన్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా చేజేతులారా ఓడింది. చెత్త బౌలింగ్, పసలేని బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారీ తేడాతో భారత్ ఓడిపోవడం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోరాట పటిమ చూపకుండా చేతులెత్తేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కోహ్లిసేన ఆట తీరులోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. ప్రధానంగా ఐదు అంశాలు టీమిండియా ఓటమికి కారణలయ్యాయని విశ్లేషిస్తున్నారు. 1. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నందుకు కోహ్లి మూల్యం చెల్లించుకున్నాడు. టాస్ ఓడిపోవడం పాకిస్తాన్ టీమ్‌కు కలిసొచ్చింది. అయితే తాను టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటానని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పడం విశేషం. టాస్ గెలిస్తే పాకిస్తాన్‌కు ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వొద్దని మాజీ ఇమ్రాన్ ఖాన్ ఎందుకు చెప్పాడో టీమిండియాకు తెలిసొచ్చివుంటుంది. 2. భారత బౌలర్ల నిర్లక్ష్యపు బౌలింగ్ కొంపముంచింది. సెంచరీ వీరుడు ఫకార్ జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేసే అవకాశాన్ని బుమ్రా కాలదన్నాడు. నోబాల్ విసిరి అతడి సెంచరీకి కారణమయ్యాడు. అవకాశాన్ని అందిపుచ్చుకుని ఫకార్ జమాన్ తన తొలి వన్డే సెంచరీతో చెలరేగాడు. 3. ఛేజింగ్ హీరో విరాట్ కోహ్లి సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడం మ్యాచ్‌లో పెద్ద మలుపు. ఒంటిచేత్తో విజయాలు అందించగల సత్తా ఉన్న టీమిండియా కెప్టెన్ స్వల్ప స్కోరుకే పెలివిలియన్ చేరడంతో ఓటమి ఖాయమయింది. ఒక లైఫ్ ఇచ్చినప్పటికీ కోహ్లి నిలదొక్కుకోకపోవడంతో భారత్ బ్యాటింగ్ గాడి తప్పింది. 4. పాక్ బౌలర్ ఆమిర్ విజృంభణతో భారత బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొంతకాలం ఆటకు దూరమైనా అతడి బౌలింగ్‌లో పదును తగ్గలేదు. ముగ్గురు టాప్ బ్యాట్స్మెన్లను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆమిర్ ధాటికి రోహిత్(0), ధావన్(21), కోహ్లి(5) తోక ముడిశారు. 5. హేమాహేమీలందరూ ఎవరో పిలుస్తున్నట్టు పెవిలియన్‌కు వడివడిగా వరుస కట్టినా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం అంత సులువుగా లొంగలేదు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్న పాండ్యా భారీ ఓటమి నుంచి గట్టెక్కిస్తాడని ఆశ పడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అతడు రనౌట్ కావడంతో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. -
చిత్తుగా ఓడిన విరాట్ సేన
-
చిత్తుగా ఓడిన విరాట్ సేన
లండన్: చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరులో భారత్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో విరాట్ సేన చిత్తుగా ఓడింది. అసలు పోరాటమనే విషయాన్నే మరిచిన భారత జట్టు 180 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాపార్డర్ పూర్తిగా వైఫల్యం చెందడంతో భారత జట్టు జీర్ణించుకోలేని పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్క హార్దిక్ పాండ్యా(76; 43 బంతుల్లో 4 ఫోర్లు,6 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరూ ఆకట్టుకోలేకపోవడంతో భారత్ కు అతి పెద్ద ఓటమి ఎదురైంది. హార్దిక్ తరువాత శిఖర్ ధావన్(21), యువరాజ్(22), రవీంద్ర జడేజా(15)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. రోహిత్ శర్మ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, విరాట్ కోహ్లి(5) ఎంఎస్ ధోని(4), కేదర్ జాదవ్(9)లు తీవ్రంగా నిరాశపరిచారు. అమీతుమీ పోరులో భారత్ జట్టు 30.3 ఓవర్లలో 158 పరుగులకే చాపచుట్టేసింది. దాంతో వరుసగా రెండో సారి ట్రోఫీ సాధించాలనుకున్న భారత్ ఆశ నెరవేరలేదు. మరొకవైపు తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరిన పాకిస్తాన్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ బౌలర్లలో మొహ్మద్ అమిర్, హసన్ అలీ తలో మూడు వికెట్లతో భారత్ జట్టు వెన్నువిరవగా, షాదబ్ ఖాన్ కు రెండు, జునైద్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ ఓపెనర్లు ఫకార్ జమాన్(114;106బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ అలీ(59;71బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్)లతో పాటు బాబర్ అజమ్(46;52 బంతుల్లో 4 ఫోర్లు), మొహ్మద్ హఫీజ్(57 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్సర్లు) లు మెరిసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు జమాన్, అజహర్ అలీలు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్ కు 128 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ముందు అజహర్ అలీ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై జమాన్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఆపై వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడే క్రమంలో అలీ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆపై జమాన్ కు జత కలిసిన ఫస్ట్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే బాబర్-జమాన్ లు జోడి72 పరుగులు జత చేసింది. దాంతో పాకిస్తాన్ 33.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అటు తరువాత పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(12)నిరాశపరిచినప్పటికీ, బాబర్ అజమ్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి కొ్ద్ది దూరంలో నాల్గో వికెట్ గా అజమ్ అవుటయ్యాడు. కాగా, ఆపై మొహ్మద్ హఫీజ్ సైతం చెలరేగి ఆడటంతో పాకిస్తాన్ జట్టు మూడొందల మార్కును అవలీలగా దాటింది. ఇమాద్ వసీం(25 నాటౌట్; 21 బంతుల్లో 1 ఫోర్, 1సిక్సర్) తో కలిసి 71 పరుగులు జత చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. -
హార్దిక్ మెరుపులు
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాకిస్తాన్ తో జరుగుతున్న తుది పోరులో భారత్ జట్టు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించాడు. వరుస సిక్సర్లతో దూకుడును పెంచిన పాండ్యా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ అంతా విఫలమైన తరుణంలో 32 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో అర్థ శతకం సాధించాడు. 23 ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సర్ల సాధించడంతో భారత్ స్కోరు బోర్డులో వేగం పెరిగింది. అయితే హార్దిక్ మంచి దూకుడుగా ఉన్న తరుణంలో రవీంద్ర జడేజా చేసిన తప్పిదం వల్ల రనౌట్ అవుటయ్యాడు. హార్దిక్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అంతకుముందు పాకిస్తాన్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ ఓపెనర్లు ఫకార్ జమాన్(114;106బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ అలీ(59;71బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్)లతో పాటు బాబర్ అజమ్(46;52 బంతుల్లో 4 ఫోర్లు), మొహ్మద్ హఫీజ్(57 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్సర్లు) లు మెరిసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు జమాన్, అజహర్ అలీలు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్ కు 128 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ముందు అజహర్ అలీ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై జమాన్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఆపై వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడే క్రమంలో అలీ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆపై జమాన్ కు జత కలిసిన ఫస్ట్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే బాబర్-జమాన్ లు జోడి72 పరుగులు జత చేసింది. దాంతో పాకిస్తాన్ 33.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అటు తరువాత పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(12)నిరాశపరిచినప్పటికీ, బాబర్ అజమ్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి కొ్ద్ది దూరంలో నాల్గో వికెట్ గా అజమ్ అవుటయ్యాడు. కాగా, ఆపై మొహ్మద్ హఫీజ్ సైతం చెలరేగి ఆడటంతో పాకిస్తాన్ జట్టు మూడొందల మార్కును అవలీలగా దాటింది. ఇమాద్ వసీం(25 నాటౌట్; 21 బంతుల్లో 1 ఫోర్, 1సిక్సర్) తో కలిసి 71 పరుగులు జత చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. -
ఫైనల్లో అంతే.. కోహ్లి చెత్త రికార్డు..!
ప్రస్తుత భారత జట్టులో డ్యాషింగ్ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లికి ఘనమైన చరిత్ర ఉంది. సెంచరీల మీద సెంచరీలు చేయడమే కాదు అనేక మ్యాచుల్లో భారత్‌ను గెలిపించిన ఘనత అతనిది. మూడు ఫార్మెట్లలోనూ సారథిగా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను కోహ్లి అందిస్తూ వచ్చాడు. జట్టు ప్రతిష్టను పెంచాడు. కానీ కోహ్లిపై ఒక మచ్చ ఉంది. అదే కీలకమైన ఫైనల్ మ్యాచుల్లో ఆడకపోవడం. విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఎనిమిది ఫైనల్ మ్యాచులు ఆడాడు. కానీ ఒక్క ఫైనల్ మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీగానీ, అర్ధసెంచరీగానీ చేయలేదు. ఈ ఎనిమిది ఫైనల్ మ్యాచుల్లోనూ కోహ్లి బ్యాటింగ్ సగటు 22 మాత్రమే. అత్యంత కీలకమైన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లోనూ కోహ్లి చేతులెత్తేశాడు. ఆమిర్ బౌలింగ్‌లో మొదట స్లిప్‌లో క్యాచ్ మిస్ అయి.. లైఫ్ దొరికినా.. దానిని కోహ్లి సద్వినియోగం చేసుకోలేదు. ఆ వెంటనే ఆమిర్ బౌలింగ్‌లోనే కోహ్లి పెవిలియన్ బాట పట్టాడు. ఫైనల్లో ఏమాత్రం ఆడిన ఘనత లేని కోహ్లి దాయాది పోరులో ఇంతకన్నా ఎక్కువ స్కోరు చేస్తాడని తాము ఆశించలేమని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
అమిర్ విజృంభణ: కష్టాల్లో భారత్
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న టైటిల్ పోరులో భారత్ ఎదురీదుతోంది. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఆదిలోనే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ డకౌట్ గా పెవిలియన్ చేరగా, విరాట్ కోహ్లి(5), శిఖర్ ధావన్(21)లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరి నిరాశపరిచారు. ఈ మూడు వికెట్లు పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అమిర్ ఖాతాలో చేరాయి. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన దగ్గర్నుంచీ నిప్పులు చెరిగే బంతులతో అమిర్ చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ఐదు ఓవర్లలో ఒక మెయిడిన్ సాయంతో మూడు వికెట్లు సాధించాడు. భారత్ జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. -
ఆనాటి మ్యాచ్‌లో పాక్‌పై 329 కొట్టేశాం!
ఎంతో ఆసక్తి రేపుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో పాకిస్థాన్ జట్టు అంచనాలకు మించి ఆడి 339 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియాకు విసిరింది. ఐసీసీ టోర్నమెంటు ఫైనల్లో నమోదైన రెండో అత్యధిక స్కోరు ఇది. 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టు చేసిన 359/2 పరుగులు ఇప్పటివరకు అత్యధిక స్కోరు కాగా..రెండో అత్యధిక స్కోరు కూడా భారత్‌కు వ్యతిరేకంగానే నమోదు కావడం గమనార్హం. ఇక 1975లో లార్డ్స్ వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాపై చేసిన 291/8 పరుగులు మూడో అత్యధిక స్కోరుగా ఉంది. ఇక భారత్‌పై పాకిస్థాన్ చేసిన రెండో అత్యధిక స్కోరు కూడా ఇదే. 2004లో కరాచీ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ 8వికెట్లకు 344 పరుగులు చేసింది. అయితే, పాకిస్థాన్‌పై 300 పైచిలుకు భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన చరిత్ర భారత్‌కు ఉంది. 2012 ఆసియా కప్‌లో విరాట్ కోహ్లి చెలరేగి 183 పరుగులు చేయడంతో 329 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించింది. టీమిండియాకు ఉన్న బ్యాటింగ్ లైనప్, బ్యాటింగ్‌లో మన బ్యాట్స్‌మన్ వీరోచిత ప్రతిభను గమనిస్తే.. ప్రస్తుతం 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్ విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. -
భారీగా దెబ్బతీసింది ఆ ఇద్దరి బౌలింగే!
లండన్: భారత బౌలర్లపై ఎంతో నమ్మకంతో కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బౌలర్లు మాత్రం చేతులెత్తేశారు. ఒక్క భువనేశ్వర్ తప్ప ఎవరూ అంచనాల తగ్గట్టు రాణించలేదు. మొదటినుంచి దూకుడుగా ఆడిన పాకిస్థాన్ జట్టు టీమిండియా శిబిరాన్ని ఆరంభంలోనే ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఫకర్ జమాన్ సెంచరీకితోడు.. చివర్లో దూకుడుగా హఫీజ్ అర్ధసెంచరీ చేయడంతో పాకిస్థాన్ 339 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. స్పిన్ బౌలింగ్‌లో 137 పరుగులు.. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ దూకుడును కట్టడి చేయడంలోనూ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయడంలోనూ భారత స్పిన్ బౌలర్లు విఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో పరుగులు అడ్డుకుంటారనుకున్న స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడ్డేజా.. ఇద్దరూ చేతులెత్తేశారు. అశ్విన్, జడ్డేజా కలిసి వేసిన 18 ఓవర్లో పాక్ బ్యాట్స్‌మెన్ 137 పరుగులు పిండుకోవడం.. పాక్‌ను పరిమిత లక్ష్యానికి నిలువరించాలన్న టీమిండియా ఆలోచనను భారీగా దెబ్బతీసింది. డేత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పేరొందిన బుమ్రా సైతం ఒత్తిడిని తట్టుకొని నిలబడలేకపోయాడు. తొమ్మిది ఓవర్లు వేసిన అతను ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో మూడు నోబాల్స్, ఐదు వైడ్లు ఉన్నాయి. 10 ఓవర్లలో భువీ ఓ వికెట్ తీసుకొని.. 44 పరుగులు ఇచ్చి.. పాక్ ఎదురుదాడిలోనూ తట్టుకొని నిలబడ్డాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. భువీకి కాస్తో-కూస్తో తోడుగా నిలిచింది హార్దిక్ పాండ్యా మాత్రమే. పాండ్యా 10 ఓవర్లలో ఓ వికెట్ తీసుకొని 53 పరుగులు ఇచ్చాడు. -
విరాట్ సేనకు భారీ లక్ష్యం
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ భారత్ తో జరుగుతున్న టైటిల్ పోరులో పాకిస్తాన్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ ఓపెనర్లు ఫకార్ జమాన్(114;106బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ అలీ(59;71బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్)లతో పాటు బాబర్ అజమ్(46;52 బంతుల్లో 4 ఫోర్లు), మొహ్మద్ హఫీజ్(57 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్సర్లు) లు మెరిసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు జమాన్, అజహర్ అలీలు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్ కు 128 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ముందు అజహర్ అలీ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై జమాన్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఆపై వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడే క్రమంలో అలీ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆపై జమాన్ కు జత కలిసిన ఫస్ట్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే బాబర్-జమాన్ లు జోడి72 పరుగులు జత చేసింది. దాంతో పాకిస్తాన్ 33.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అటు తరువాత పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(12)నిరాశపరిచినప్పటికీ, బాబర్ అజమ్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి కొ్ద్ది దూరంలో నాల్గో వికెట్ గా అజమ్ అవుటయ్యాడు. కాగా, ఆపై మొహ్మద్ హఫీజ్ సైతం చెలరేగి ఆడటంతో పాకిస్తాన్ జట్టు మూడొందల మార్కును అవలీలగా దాటింది. ఇమాద్ వసీం(25 నాటౌట్; 21 బంతుల్లో 1 ఫోర్, 1సిక్సర్) తో కలిసి 71 పరుగులు జత చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్‌లు తలో వికెట్ తీశారు. -
స్పిన్నర్లు తేలిపోయారు..!
కీలకమైన ఫైనల్ పోరులో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ జోరు కొనసాగిస్తున్నారు. ఓవల్‌లోని ఫ్లాట్ పిచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు తీసుకొని కెప్టెన్ కోహ్లి బరిలోకి దిగడం అస్సలు ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, కోహ్లికి ఇంతకుమించి పెద్ద ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతను స్పిన్నర్ల మీద ఎక్కువ ఆధారపడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉమేశ్ యాదవ్ అందుబాటులో ఉండి ఉంటే పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉండేదని నిపుణుల అభిప్రాయం. కోహ్లి ప్రయోగించిన స్పిన్నర్లు తేలిపోయారు. బుమ్రా కూడా భారీగా పరుగులు సమర్పించకున్నాడు. భువనేశ్వర్, హార్ధిక్ పాండ్యా మాత్రమే పర్వాలేదనిపించారు. 40 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసిన పాక్ ఓ దశలో 350 పరుగులను చేరుకుంటుందా? అనిపించింది. అయితే, కానీ చివరకు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. పటిష్టంగా ఉన్న టీమిండియా బ్యాట్స్‌మెన్ జోరు ప్రదర్శిస్తే.. ఈ లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. -
అప్పుడు కూడా బూమ్రా నో బాల్ వల్లే..
లండన్:భారత బౌలర్ల నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల మూల్యం చెల్లించుకున్న సందర్భాల్లో అనేకం. ప్రధానంగా నో బాల్స్ వల్ల భారత్ అనేక కీలక మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న తుది పోరులో సైతం భారత్ జట్టు నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల భారీ మూల్యం చెల్లించుకుంది. భారత ప్రధాన పేసర్ బూమ్రా వేసిన నాల్గో ఓవర్ తొలి బంతి పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ బ్యాట్ ను తాకి వికెట్ కీపర్ ధోని చేతుల్లో పడింది. అయితే అది నో బాల్ కావడంతో జమాన్ బతికిపోయాడు. అప్పుడు ఫకార్ జమాన్ వ్యక్తిగత స్కోరు 3. కాగా, ఆపై రెచ్చిపోయిన జమాన్ ఏకంగా సెంచరీ సాధించి పాక్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఇదిలా ఉంచితే, 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గుర్తుంది కదా. వెస్టిండీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అప్పుడు బూమ్రా వేసిన నో బాల్ వల్లే విండీస్ సునాయాసంగా గెలిచి ఫైనల్ కు చేరింది. లెండిల్ సిమన్స్ ను ముందులోనే బూమ్రా అవుట్ చేసినప్పటికీ, అది నో బాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఆపై మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్ ను ఫైనల్ కు చేర్చాడు. ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ లో జమాన్ శతకంతో మెరవడం ఆ ఘటనను గుర్తుకు తెస్తుంది. ఈ రోజు మ్యాచ్ లో బూమ్రా వేసిన నో బాల్ తో లైఫ్ వచ్చిన ఫకార్ దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని సెంచరీ సాధించాడు. 92 బంతుల్లో శతకం చేసి పాకిస్తాన్ ను పటిష్ట స్థితికి చేర్చాడు. ఒకవేళ మ్యాచ్ లో ఫలితం పాకిసాన్ కు అనుకూలంగా ఉంటే మాత్రం అందుకు బూమ్రా నో బాలే కారణం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. -
పసలేని టీమిండియా బౌలింగ్
లండన్: చాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా భారత్ తో జరుగుతున్న తుది పోరులో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. పాకిస్తాన్ ఓపెనర్లు అజహర్ అలీ, ఫకార్ జమాన్ లు హాఫ్ సెంచరీలు సాధించి శుభారంభాన్ని అందించారు. అజహర్ అలీ 61 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, ఫకార్ జమాన్ 60 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఒక లైఫ్ తో బతికిబయట పడ్డ ఫకార్ మరొకసారి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతనికి అజహర్ అలీ నుంచి చక్కటి సహకారం లభించింది. అయితే 23 ఓవర్ లో అజహర్ అలీ(59) రనౌట్ గా పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ 25.0 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆది నుంచి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ముందుకు సాగుతోంది. స్కోరు బోర్డుపై రన్ రేట్ కాపాడుకుంటూ నిలకడైన ఆటను ప్రదర్శిస్తోంది. భారత్ బౌలింగ్ లో పసలేకపోవడంతో పాకిస్తాన్ బ్యాట్స్మన్లు ఎటువంటి తడబాటు లేకుండా పరుగులు రాబడుతున్నారు. -
నో బాల్ వేశారు.. లైఫ్ ఇచ్చారు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న తుది పోరులో పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ ఒక లైఫ్ తో బతికి బయటపడ్డాడు. ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ లో భాగంగా బూమ్రా వేసిన తొలి బంతిని జమాన్ బ్యాట్ ను తాకి వికెట్ కీపర్ ధోని చేతుల్లో పడింది. దాంతో భారత జట్టులో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. కాగా, ఆ బంతిని థర్డ్ అంపైర్ కు ఇవ్వడంతో అది నో బాల్ గా తేలింది. ఆనందం కాస్తా తుస్ మంది. ఒక లైఫ్ తో బతికి పోయిన ఫకార్ జమాన్ పాకిస్తాన్ కు కీలక ఆటగాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో అతను ఏమైనా భారీ ఇన్నింగ్స్ సాధిస్తే మాత్రం అది తుది ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
మెయిడిన్ తో ఆరంభించారు..
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైనల్ పోరును భారత్ జట్టు మెయిడిన్ ఓవర్ తో ఆరంభించింది. తొలి ఓవర్ ను వేసిన భువనేశ్వర్ కుమార్ తన మొదటి ఓవర్లో పరుగులేమీ ఇవ్వకుండా మెయిడిన్ వేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి .. ముందుగా పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ ను అజహర్ అలీ, ఫకార్ జమాన్ లు ఆరంభించారు. ఈ ఇద్దరూ పాకిస్తాన్ కీలకం కావడంతో ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లే యత్నం చేస్తున్నారు. అంతిమ సమరంలో భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవుతుండగా, పాకిస్తాన్ మాత్రం ఒక మార్పు చేసింది. పేసర్ మొహ్మద్ అమిర్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. -
'చాంపియన్స్' ఎవరు?
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ తో భారత్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి.. పాకిస్తాన్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అంతిమ సమరంలో భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవుతుండగా, పాకిస్తాన్ మాత్రం ఒక మార్పు చేసింది. పేసర్ మొహ్మద్ అమిర్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. మరొకవైపు ఐసీసీ టోర్నీల్లో పాక్ పై తిరుగులేని రికార్డు ఉండటం కూడా భారత్ కు కలిసొచ్చే అంశం. ఐసీసీ టోర్నీల్లో భారత్ 13 మ్యాచ్ ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ కేవలం రెండింట మాత్రమే గెలుపొందింది. దాంతో భారత్ జట్టే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మరొకవైపు సంచలన పాకిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ టోర్నీ లో పాకిస్తాన్ ఫైనల్ కు చేరే క్రమంలో కొన్ని అద్భుతమైన విజయాలు సాధించి తుది పోరులో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తర పోరు తప్పదు. మరొకొద్ది గంటల్లో తేలిపోనున్న ఫైనల్ ఫలితంలో చాంపియన్స్ ఎవరు అనే దాని కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐదుసార్లు ఛేజింగ్ జట్లే.. ఈ టోర్నీ ఆరంభమైన దగ్గర్నుంచీ చూస్తే ఫైనల్ పోరులో ఛేజింగ్ చేసిన జట్టుకే మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ జరిగిన ఆరు ఫైనల్లో ఐదుసార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు విజేతగానిలిచింది. ఒకసారి మాత్రమే మొదటి బ్యాటింగ్ చేసిన జట్టును కప్ వరించింది. అది కూడా 2013 లో భారత్ జట్టు కావడం ఇక్కడ విశేషం. గత చాంపియన్ప్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి కప్ ను దక్కించుకుంది. పాకిస్తాన్ తుదిజట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), అజహర్ అలీ, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, మొహ్మద్ అమిర్, షాదబ్ ఖాన్, హసన్ అలీ, జునైద్ ఖాన్ భారత్ తుదిజట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్ -
ఉత్కంఠ పోరు.. ఎవరిదో జోరు
లండన్: దాయాదుల సమరం కోసం క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్తాన్ తలపడుతుండటంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కింగ్స్టన్ ఓవల్ మైదానంలో అభిమానుల కోలాహలం నెలకొంది. బిగ్‌ఫైట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు భారీ ఎత్తున స్టేడియంకు తరలిరావడంతో కిక్కిరిసింది. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, సర్ఫరాజ్ బృందం సంచలనాన్నే నమ్ముకుంది. తమ జట్లు చెలరేగాలని ఇరు దేశాల అభిమానులు కోరుకుంటున్నారు. 2013 ఫలితం పునరావృతం అవుతుందని టీమిండియా వీరాభిమాని సుధీర్ గౌతమ్ అన్నాడు. కప్పు కోహ్లి సేనదేనని విశ్వాసం వ్యక్తం చేశాడు. మరోవైపు కోహ్లి సేన విజయం సాధించాలని ఇండియా ఫ్యాన్స్ తమ దేశంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రార్థనలు నిర్వహించారు. కోహ్లి సేనకు మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. మహా సమరంపై బెట్టింగులు కూడా జోరుగా జరుగుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
కోహ్లి విజయరహస్యం చెప్పిన స్టార్ క్రికెటర్
లండన్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విరాట్ కోహ్లిని కట్టడి చేయడంపైనే పాకిస్తాన్ విజయావకాశాలు ఆధారపడివుంటాయని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్లపై ఒకడైన కోహ్లి, మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉందని, కానీ పాక్ బౌలర్లుగా ప్రధానంగా కోహ్లిపైనే దృష్టి పెట్టాలని సూచించాడు. క్రీజులో విరాట్ కోహ్లి చేయి సిద్ధహస్తుడైన శస్త్ర నిపుణుడిలా ఉంటాడని పేర్కొన్నాడు. ‘ఆట కోసం కోహ్లి చాలా శ్రమిస్తాడు. ఎంత ఒత్తిడి ఉంటే అతడు అంత బాగా ఆడతాడు. బంతిని ఖాళీల్లోంచి కొట్టడంలో దిట్ట. ఎప్పుడు ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండడమే అతని విజయరహస్యం. ప్రపంచంలో అత్యద్భుతమైన క్రికెటర్ అతడే. కోహ్లి ఫామ్ ఇలాగే కొనసాగితే ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా వరుస విజయాలు అందుకోవడం ఖాయమ’ని డివిలియర్స్ అన్నాడు. కెరీర్ ఆరంభంలో కోహ్లి మైదానంలో దూకుడుగా ఉండేవాడని, కానీ ఇప్పుడు అరుదుగా మాత్రమే అతడు కోపంగా ఉంటున్నాడని పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా మసలుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా అతడు పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నాడని ప్రశంసించాడు. కోహ్లి ఆట చూడటానికి ఎంతో ఇష్టపడతానని చెప్పాడు. -
'పాకిస్తాన్ పేసర్ల భయం అక్కర్లేదు'
న్యూఢిల్లీ:చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ బౌలింగ్ ను చూసి భారత జట్టు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో మొహ్మద్ అమిర్ అత్యుత్తమ బౌలర్ అయినప్పటికీ, అతను భారత్ బ్యాటింగ్ పై పైచేయి సాధిస్తాడని అనుకోవడం లేదన్నాడు. గతంలో ఇరు జట్లు ఆడినప్పుడు కూడా భారత్ బ్యాటింగ్ కు, పాకిస్తాన్ బౌలింగ్ కు ఫైట్ జరిగిన విషయాన్ని గంభీర్ ఈ సందర్బంగా ప్రస్తావించాడు. పాకిస్తాన్ బౌలింగ్ కు భారత్ వణికిపోయిన రోజుల్ని తాను ఎప్పుడూ చూడలేదన్నాడు. ఆదివారం నాటి ఫైనల్లో కూడా పాక్ బౌలింగ్ పై భారత్ బ్యాటింగ్ దే ఆధిపత్యం అవుతుందన్నాడు. ఇంగ్లండ్ లో ఫ్లాట్ పిచ్‌లు ఎదురుకావడంతో బౌలర్లకు అనుకూలిస్తాయని అనుకోవడం లేదన్నాడు. అనుకూలించే పిచ్ లపై మాత్రమే ప్రభావం చూపే అమిర్.. ఫైనల్ పోరులో సాధారణ బౌలింగ్ కే పరిమితమవుతాడని గంభీర్ జోస్యం చెప్పాడు. -
'ఫైనల్లో పాక్ ను తేలిగ్గా తీసుకోవద్దు'
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ పోరులో భారత్-పాకిస్తాన్ తలపడనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా ఒకవైపు.. తొలి సారి టైటిల్ ను ఒడిసి పట్టుకోవాలని భావిస్తున్న పాకిస్తాన్ మరొకవైపు.. వెరసి ఇరు జట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడ భారత్ టైటిల్ ఫేవరెట్ గా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయకూడదనేది మాజీల అభిప్రాయం. టైటిల్ పోరులో పాకిస్తాన్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ. రేపటి(ఆదివారం) ఫైనల్లో భారత్ ఫేవరెట్. అయితే పాకిస్తాన్ ను తక్కువగా అంచనా వేయకండి. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు వచ్చిన క్రమం ప్రతీజట్టును ఆశ్చర్యంలో ముంచెత్తింది. వన్డే ర్యాంకింగ్ లో ఎనిమిదో స్థానం ఉన్న పాకిస్తాన్ అంచనాలకు మించి ప్రదర్శన చేసింది. పాక్ కు ప్రతీ గేమ్ నాకౌట్ గా మారిన తరుణంలో ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఐసీసీ ట్రోఫీల్లో భారత్ పై పాక్ కు మెరుగైన రికార్డు లేకపోవచ్చు..కానీ చాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు భారత్ ను ఓడించిన ఘనత పాక్ ది. దాంతో భారత్ జాగ్రత్తగా ఆడితేనే టైటిల్ ను నిలబెట్టుకుంటుంది'అని హస్సీ తెలిపాడు. -
నా ఉద్దేశం అది కాదు: అమిర్ సొహైల్
లాహోర్: 'చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు చేరిందంటే అందుకు కారణం బయట శక్తుల ప్రమేయమే. పాకిస్తాన్ ఫైనల్ కు చేరడంలో ఆటగాళ్ల గొప్పదనం ఏమీ లేదు. దీనికి కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఉప్పొంగి పోవాల్సిన అవసరం కూడా లేదు'అని ఆ దేశ మాజీ ఆటగాడు అమిర్ సొహైల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను తాజాగా ఖండించాడు సొహైల్. జట్టు విజయానికి పరోక్షంగా తోడ్పడే వాళ్లను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాడు. అందులో మ్యాచ్ ఫిక్సింగ్, మోసానికి తావుందనేది తన ఉద్దేశం కాదన్నాడు. తన మాటల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ సమర్ధించుకునే యత్నం చేశాడు. -
విరాట్ సేనకు పాక్ మాజీల ప్రశంసలు..
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఫైనల్ కు చేరిన క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిదిలు హర్షం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తో జరిగిన సెమీస్ లో ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరిన విరాట్ సేనకు అభినందలు అంటూ అక్తర్ ట్వీట్ చేయగా, భారత్ జట్టు అమోఘంగా ఆడిందంటూ ఆఫ్రిది ప్రశంసించాడు. 'చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు అర్హత సాధించిన భారత్ కు కంగ్రాట్స్. మరోసారి పాకిస్తాన్ తో మెగా గేమ్ కు టీమిండియా సిద్ధమైంది. ఇక్కడ పాక్ కు గుడ్ లక్. టైగర్స్ పై మీరు గెలిచినా, ఓడినా నేను మీతోనే ఉంటాను'అని అక్తర్ పేర్కొన్నాడు. ' భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఇక క్రికెట్ లో అతి పెద్ద సమరమే మిగిలి ఉంది. భారత్ పై పాక్ గెలవాలంటే నిలకడ అవసరం'అని ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. తొలి సెమీస్ లో ఇంగ్లండ్ పై గెలిచిన పాకిస్తాన్ ఫైనల్ కు చేరగా, ఆ తరువాత బంగ్లాదేశ్ పై విజయం సాధించిన భారత జట్టు తుది సమరానికి సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ లో ఇది భారత్ కు వరుసగా రెండో ఫైనల్ కాగా, పాకిస్తాన్ కు మాత్రం ఇదే మొదటి ఫైనల్. -
అందుకు ధోనినే కారణం..
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కేదర్ జాదవ్ పాత్ర వెలకట్టలేనిది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనిస్తున్నప్పుడు కేదర్ చక్కటి బ్రేకిచ్చాడు. బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను బౌల్డ్ చేయడమే కాకుండా, మరో కీలక ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ ను సైతం అవుట్ చేశాడు. హాఫ్ సెంచరీలు చేసి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో వారిద్దర్నీ జాదవ్ పెవిలియన్ కు పంపాడు. అయితే తన స్ఫూర్తిదాయకమైన బౌలింగ్ కు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనినే కారణమంటున్నాడు జాదవ్. 'గత ధోని సారథ్యంలో నా బౌలింగ్ లో మెరుగుదలకు బీజం పడింది. నేను భారత జట్టులోకి వచ్చిన్నప్పట్నుంచీ ఎక్కువ సమయం ధోనితోనే గడిపా. అతని నుంచి అనేక విషయాలు నేర్చుకునే వాణ్ని. ఆ క్రమంలోనే నా నుంచి ధోని ఏమి కోరుకుంటున్నాడో నాకు అర్థమయ్యేది. అతని కళ్ల ద్వారా నా నుంచి ఏమి ఆశిస్తున్నాడు తెలుసుకునే వాడ్ని. అదే రకంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యే వాడిని. ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా నాపై నమ్మకంతో బంతిని చేతికిస్తున్నాడు. బంగ్లాతో మ్యాచ్ లో నన్ను ఒక గేమ్ ఛేంజర్ గా మార్చిన ఘనత కోహ్లిది. అయితే నా బౌలింగ్ మెరుగుపడటానికి మాత్రం కచ్చితంగా ధోనినే కారణం' అని కేదర్ జాదవ్ తెలిపాడు. కాగా, మ్యాచ్ టర్న్ చేసిన జాదవ్ పై కోహ్లి ప్రశంలస వర్షం కురిపించాడు. నెట్స్ లో కేదర్ పెద్దగా బౌలింగ్ చేయకపోయినా, అతనొక స్మార్ట్ క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. అసలు నిన్నటి మ్యాచ్ లో జాదవ్ బౌలింగ్ ను దింపడానికి ధోనినే కారణమని కోహ్లి పేర్కొన్నాడు. 'ఇక్కడ మొత్తం క్రెడిట్ ను కేదర్ కు ఇవ్వడం లేదు. కేదర్ కు బౌలింగ్ కు ఇచ్చే ముందు ధోనిని సంప్రదించా. మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత జాదవ్ కు బంతిని అప్పజెప్పా. ఆ సమయంలో జాదవ్ బౌలింగ్ మాకు మంచి ఆప్షన్ అనిపించింది. నిజంగా అతను చాలా బాగా బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు 'అని కోహ్లి తెలిపాడు. -
'యువరాజ్ లేకుండా చూడలేం'
న్యూఢిల్లీ: మూడొందల వన్డే మ్యాచ్ ఆడి అరుదైన ఘనతను సొంత చేసుకున్న భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ పై దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతని పదిహేడేళ్ల క్రికెట్ కెరీర్ అసాధారణమని ద్రవిడ్ కితాబిచ్చాడు. అసలు యువరాజ్ లేని ఆల్ టైమ్ వన్డే ఎలెవన్ జట్టును చూడటం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. సీరియస్ గా చూస్తే యువరాజ్ లేని భారత వన్డే జట్టును ఊహించలేమన్నాడు. ' యువరాజ్ జట్టులో ఉండాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటాడు. అతని సుదీర్ఘ కెరీర్లో సాధించిన అద్భుతమైన ఘనతలే యువరాజ్ ను ఉన్నతస్థానంలో నిలబెట్టాయి. యువరాజ్ లేని జట్టును ప్రస్తుతం ఎవరూ కోరుకోరు. ఒంటి చేత్తో ఎన్నో విజయాల్ని అందించాడు. అతనొక క్రికెట్ లో సూపర్ స్టార్. యువరాజ్ లేకుండా జట్టును ఊహించలేము. క్యాన్సర్ ను సైతం జయించడమే అతి పెద్ద విషయమైతే, ఆ తరువాత కూడా యువరాజ్ మునుపటిలా ఆడటం నిజంగా అద్భుతం 'అని ద్రవిడ్ కొనియాడాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ యువరాజ్ కు 300వ వన్డే. అయితే ఆ మ్యాచ్ లో యువరాజ్ బ్యాటింగ్ కు దిగకుండానే భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.ఇదిలా ఉంచితే, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు ఫామ్ ను కొనసాగించి టైటిల్ ను సాధించాలని ద్రవిడ్ ఆకాంక్షించాడు. మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లి అదే ఆట తీరును తుది పోరులో కనబరుస్తాడని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని కోహ్లికి ద్రవిడ్ సూచించాడు. ఇటీవల అతి పెద్ద లక్ష్యాలను సైతం భారత్ సునాయాసంగా ఛేదించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ద్రవిడ్.. జట్టు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు పలువురు సీనియర్ ఆటగాళ్లు తమ అనుభవంతో ఆదుకుంటున్నారన్నాడు. ఇది భారత జట్టు పటిష్టతను తెలియజేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. -
షేన్ వార్న్.. మాట నిలబెట్టుకున్నాడు!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టుపై పందెం కాసి ఓడిపోయిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మాట నిలబెట్టుకున్నాడు. తన పందెం ప్రకారం ఇంగ్లండ్ జెర్సీని ధరించి కొత్త లుక్ లో దర్శనిమిచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ-ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ లు చిన్నపాటి పందెం కాసుకున్నారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్-వార్న్‌లు ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల బలబలాపై పందెం కాసారు. గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ దే పైచేయి అవుతుందని గంగూలీ పేర్కొనగా, దానికి వార్న్ తమ జట్టే గెలుస్తుందంటూ సవాల్ విసిరాడు. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోతే ఆసీస్ జెర్సీ ధరించాలంటూ గంగూలీకి సవాల్ విసిరాడు. ఒకవేళ ఆసీస్ ఓడిపోతే తాను ఇంగ్లండ్ ధరిస్తానని వార్న్ పేర్కొన్నాడు. ఇలా వింతగా కాసుకున్న ఈ పందెంలో గంగూలీ గెలవగా, వార్న్ ఓడిపోయాడు. పందెం ప్రకారం ఇంగ్లండ్ గెలిచింది కాబట్టి వార్న్ ఆ జట్టు జెర్సీని ధరించాల్సి వచ్చింది. అయితే ఇంగ్లండ్ జెర్సీ ధరించినందుకు బాధగా ఉందంటూ వార్న్ ట్వీట్ చేశాడు. అయితే పందెం అనేది పందెమే కాబట్టి తప్పని సరి పరిస్థితుల్లో ఇంగ్లండ్ జెర్సీని ధరించాల్సి వచ్చిందని వార్నీ తెలిపాడు. -
కోహ్లి ఆశ్చర్యం
బర్మింగ్‌హామ్: బంగ్లాదేశ్ సులువుగా లొంగుతుందని అనుకోలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. బంగ్లా నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావించానని, కానీ ఎటువంటి పోరాటం లేకుండానే ఆ జట్టు తోక ముడవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ప్రమాదకరమైన జట్టుగా పరిగణించిన బంగ్లాదేశ్ ఘోరంగా ఓడిపోవడం తనను ఆశ్చర్యం కలిగించిందన్నాడు. 9 వికెట్ల భారీ తేడాతో గెలుస్తామని అస్సలు ఊహించలేదన్నాడు. ‘ఇంత ఘన విజయం సాధిస్తామని అనుకోలేదు. టాప్ ఆర్డర్లో నాణ్యమైన క్రికెట్ ఆడాం. ఓపెనర్లు ఇద్దరూ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. దీంతో నేను ఎటువంటి ఒత్తిడిని లోనుకాకుండా సహజంగా ఆడటానికి ఆస్కారం లభించింది. బంతిలోనూ రాణించాం. ఆ రెండు వికెట్లు కోల్పోవడం వల్లే బంగ్లాదేశ్ దూకుడు తగ్గింది. జాదవ్ బాగా బౌలింగ్ చేశాడు. పిచ్‌ను బట్టి బంతి ఎక్కడ వేయాలో జాదవ్‌కు తెలుసు. 300 పరుగులు చేధించాల్సి వస్తుందనుకున్నాను. కేదార్ బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపం మారింది. బంగ్లాను 264 పరుగులకు కట్టడిచేయగలిగామ’ని కోహ్లి చెప్పాడు. పాకిస్తాన్‌తో ఆదివారం జరగనున్న ఫైనల్‌ను మరో మ్యాచ్‌లాగే చూస్తామని అన్నాడు. -
ధావన్ మరో రికార్డు..
బర్మింగ్‌హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో వెయ్యి పరుగుల్ని వేగవంతంగా సాధించిన బ్యాట్స్‌మన్ గా భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భారత్ కే చెందిన సచిన్ టెండూల్కర్ రికార్డును ధావన్ సవరించాడు. అయితే ఇదే టోర్నీలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ధావన్ మరో రికార్డును నెలకొల్పాడు. ఓవరాల్ చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన భారత్ ఆటగాడిగా ధావన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(655)రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ధావన్ 680 పరుగులతో ఉన్నాడు. మరొకవైపు ప్రస్తుత టోర్నీలో ధావన్ 317 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండటం మరో విశేషం. ఈ మ్యాచ్ లో ధావన్ 46 పరుగులు సాధించి తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. -
జహీర్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా
బర్మింగ్‌హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సాధించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లను సాధించిన ఘనతను జడేజా సొంతం చేసుకున్నాడు. గురువారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో ఒక వికెట్ తీయడం ద్వారా భారత్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. తద్వారా జహీర్ ఖాన్ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్ లు ఆడిన జడేజా 16 వికెట్లు సాధించాడు. దాంతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన జహీర్ 15 వికెట్ల ఘనతను సవరించాడు. ఆ తరువాత స్థానాల్లో హర్భజన్ సింగ్(14), సచిన్ టెండూల్కర్(14), ఇషాంత్ శర్మ(13), భువనేశ్వర్ కుమార్ (12)లు ఉన్నారు. ఇదిలా ఉంచితే భారత్ ఖాతాలో మరో ఘనత చేరింది. ఈ టోర్నమెంట్లో 11 నుంచి 40 ఓవర్ల మధ్యలో అత్యధిక వికెట్లను సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది. భారత్ 19 వికెట్లతో తొలి స్థానాన్ని ఆక్రమించగా, పాకిస్తాన్ 18 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. -
టీమిండియా లక్ష్యం 265
బర్మింగ్‌హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 265 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(70;82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికర్ రహీమ్(61;85 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ శతకాలతో రాణించి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో సౌమ్య సర్కార్(0) వికెట్ ను కోల్పోయింది. ఆపై ఫస్ట్ డౌన్ ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్(19)ను కూడా నిరాశపరచడంతో బంగ్లాదేశ్ 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి రెండు వికెట్లను సాధించి బంగ్లాకు షాకిచ్చాడు. అయితే ఆ తరుణంలో తమీమ్ కు జత కలిసిన రహీమ్ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ జోడి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనించింది. కాగా, తమీమ్ అవుటైన తరువాత షకిబుల్ హసన్(15), ముష్ఫికర్ రహీమ్ లు కూడా పెవిలియన్ చేరండంతో బంగ్లాదేశ్ స్కోరులో వేగం తగ్గింది. అయితే చివరి వరుస ఆటగాళ్లు మొహ్మదుల్లా(21),మొసడక్ హుస్సేన్(15), మోర్తజా(30 నాటౌట్), తస్కీన్ అహ్మద్(11నాటౌట్) లు బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్,బూమ్రా, కేదర్ జాదవ్ లు తలో రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. -
హార్దిక్ ఎంత పనిచేశాడు..!
బర్మింగ్‌హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఏడో ఓవర్ ఐదో బంతికి మరో వికెట్ ను నష్టపోయింది. ఈ రెండు వికెట్లు భువనేశ్వర్ ఖాతాలోనే చేరడం విశేషం. అయితే 13 ఓవర్లో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కు లైఫ్ వచ్చింది. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్ ఐదో బంతిని వికెట్లపైకి ఆడకున్న తమీమ్ బౌల్డ్ అయ్యాడు. కాగా, అదే నో బాల్ గా తేలింది. హార్దిక్ పాండ్యా లైన్ కు ముందుకొచ్చినట్లు రిప్లేలో కనబడటంతో తమీమ్ బతికిపోయాడు. అప్పటికి తమీమ్ స్కోరు 15. బంగ్లా కీలక ఆటగాడైన తమీమ్ విషయంలో ఇలా జరగడం భారత్ అభిమానుల్ని నిరాశకు గురిచేసింది. హార్దిక్ ఎంత పని చేశాడు అంటూ అభిమానులు తలలు పట్టుకున్నారు. ఆ తరువాత తమీమ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 62 బంతుల్లో నాలుగు ఫోర్లు, 1 సిక్సర్ తో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆపై 82 బంతుల్లో 70 పరుగుల వ్యక్తిగత స్కోరును సాధించిన తరువాత కేదర్ జాదవ్ బౌలింగ్ లో తమీమ్ మూడో వికెట్ గా అవుటయ్యాడు. అయితే విలువైన పరుగులు తమీమ్ సాధించడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరొకవైపు బంగ్లాదేశ్ ఆదిలో వికెట్ల కోల్పోయినా రన్ రేట్ ను కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. బంగ్లాదేశ్ 30 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. -
తొలి రెండు వికెట్లు భువీకే..
బర్మింగ్‌హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించి తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ ను డకౌట్ గా పంపి శుభారంభాన్ని అందించిన భువీ..ఆపై కాసేపటికి దూకుడుగా ఆడుతున్న షబ్బిర్ రెహ్మాన్(19)ను సైతం అవుట్ చేసి సత్తా చాటాడు. దాంతో బంగ్లాదేశ్ 31 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయింది. తొలి స్పెల్ లో ఆరు ఓవర్లు వేసిన భువనేశ్వర్ రెండు వికెట్లు తీయడమే కాకుండా ఒక మెయిడిన్ ఓవర్ సాయంతో 30 పరుగులిచ్చాడు. -
రెండో ఫైనల్ బెర్త్ ఎవరిదో?
బర్మింగ్‌హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీ ఫైనల్ బెర్త్ కు రంగం సిద్ధమైంది. గురువారం బంగ్లాదేశ్ తో జరిగే సెమీస్ పోరులో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించిన పాకిస్తాన్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, భారత్-బంగ్లాదేశ్ జట్లు రెండో సెమీస్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లి సేన ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బలాబలాలపరంగా చూస్తే భారత్‌దే అన్నింటా పైచేయిగా కనిపిస్తోంది. ఓపెనింగ్, మిడిలార్డర్, అనుభవం... ఇలా అన్నింటా బంగ్లాదేశ్ జట్టు ఎదురు నిలిచే పరిస్థితి లేదు. అయితే బౌలింగ్‌లో మాత్రం మన కుర్రాళ్లతో బంగ్లా ఆటగాళ్లు కూడా పోటీ పడుతున్నారు. ఇక పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఆ జట్టు ఆడితే మరో సంచలనానికి అవకాశం ఉంటుంది. అన్నట్లు 2015 ప్రపంచ కప్ తర్వాత టాప్–8 జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ 11 గెలిచి, 13 ఓడితే... బంగ్లాదేశ్ కూడా 11 గెలిచి, 10 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. మరొకవైపు ఇరు జట్ల ఓవరాల్ ముఖాముఖి పోరులో భారత్ 26 విజయాలు సాధించగా,బంగ్లాదేశ్ ఐదు సార్లు గెలుపొందింది.ఇదిలా ఉంచితే, ఇరు జట్లు తలపడిన చివరి నాలుగు గేమ్‌ల్లో తలో రెండు మ్యాచ్ లు గెలిచి సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. గ్రూప్ స్టేజ్ లోదక్షిణాఫ్రికాతో ఆడిన జట్టునే భారత్ కొనసాగించనుంది. బంగ్లాదేశ్ తుది జట్టు: మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్,షబ్బిర్ రెహ్మాన్, ముష్ఫికర్ రహీమ్,షకిబుల్ హసన్,మొహ్మదుల్లా, మొసడెక్ హుస్సేన్, రూబేల్ హుస్సేన్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ భారత్ తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్,హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్,భువనేశ్వర్ కుమార్,బూమ్రా -
రాజీపడే ప్రసక్తే లేదు: పాకిస్తాన్ క్రికెట్ కోచ్
కరాచీ:తమ క్రికెటర్ల ఫిట్నెస్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్ స్పష్టం చేశాడు. ఆధునిక క్రికెట్లో సక్సెస్ కావాలంటే ఫిట్నెస్ అనేది చాలా కీలకమన్నాడు. ఒకవేళ ఫిట్నెస్ విషయంలో రాజీ పడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ కు సంబంధించి పలు విషయాల్ని ఇంజమామ్‌తో కలిసి పరిశీలించడం లేదనే వార్తలను ఆర్థర్ ఖండించాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొన్న ఆర్థర్.. క్రికెట్ గేమ్‌కు సంబంధించి తాము చాలా కఠినంగా ఉంటున్నామన్నాడు. ఈ మేరకు ఆటగాళ్లకు కావాల్సిన వనరుల్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తరువాత ఆటగాళ్లకు స్వదేశంలో ఫిట్నెస్ బూట్ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, గతేడాది ఇంగ్లండ్ పర్యటనకకు రావడం తమకు ఇప్పుడు కలిసొస్తుందని ఆర్థర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరొకవైపు చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ సెమీస్ కు చేరడంపై ఆ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఏ జట్టును తేలిగ్గా తీసుకోకూడదని విషయం ఫలితాల్ని చూస్తే అర్థమవుతుందన్నాడు. ఈ టోర్నీలో పెద్ద జట్లైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లు గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టడాన్ని ఇంజమామ్ ప్రస్తావించాడు. బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ పై పాకిస్తాన్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశాడు. -
'టీమిండియాపై ఆఫ్ కట్టర్లు సంధిస్తా'
బర్మింగ్‌హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో గురువారం భారత్ తో తలపడబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ కట్టర్లు సంధిస్తానని అంటున్నాడు బంగ్లాదేశ్ ఆశాకిరణం ముస్తాఫిజుర్ రెహ్మాన్. ప్రస్తుతం ఇంగ్లండ్ లో పరిస్థితులు పేసర్లకు పెద్దగా అనుకూలించడం లేదని పేర్కొన్న ముస్తాఫిజుర్.. భారత్ తో జరిగే అమీతుమీ పోరులో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 'నా బౌలింగ్ ను మెరుగుపరుచుకోవడంలో ముగింపు అనేది లేదు. నా ఆయుధం ఆఫ్ కట్టర్లే. కాకపోతే పేసర్లకు ఇంగ్లండ్ లో పరిస్థితులు అనుకూలించడం లేదు. అయినప్పటికీ ఆఫ్ కట్టర్లు వేయడానికే శతవిధాలా ప్రయత్నిస్తా. నా శక్తివంచన లేకుండా బంగ్లాదేశ్ విజయానికి కృషి చేస్తా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి నిలిపా. అంతా మాకు మంచే జరుగుతుందని ఆశిస్తున్నా'అని ముస్తాఫిజుర్ తెలిపాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మూడు గేమ్‌లు ఆడిన ముస్తాఫిజుర్ కేవలం వికెట్ మాత్రమే తీశాడు. -
'ఆ జట్లు సెమీస్‌కు వస్తాయని అనుకోలేదు'
చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకపై అనూహ్య విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరుకోవడంపై కుమార సంగక్కర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కీలకమైన ఈ మ్యాచ్‌లో లంక జట్టు పలు పొరపాట్లు చేసిందని ఆ జట్టు మాజీ ఆటగాడైన సంగక్కర అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆసియాకు చెందిన మూడు జట్లు టాప్-4లో ఉన్నాయని, టోర్నమెంటుకు ముందు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయని తాను అనుకోలేదని, కానీ అద్భుతంగా ఆడి ఆ జట్లు ఈ ఘనత సాధించాయని, చక్కని క్రికెట్ ఆడి సెమీస్‌కు చేరిన ఘనత వాటికి దక్కుతుందని అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డిక్వెల్లా (86 బంతుల్లో 73; 4 ఫోర్లు), మ్యాథ్యూస్ (54 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించగలిగారు. పేసర్లు జునైద్ ఖాన్, హసన్ అలీలకు మూడేసి, ఆమిర్, అష్రాఫ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులు చేసింది. లక్ష్యఛేదన సందర్భంగా పాకిస్థాన్ ఓ దశలో స్కోరు 162/7తో వెనుకబడటంతో... ఇక శ్రీలంక గెలుపు ఖాయమే అని అంతా భావించారు. కానీ, కెప్టెన్ సర్ఫరాజ్ (79 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు), ఆమిర్ (43 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్) పట్టువదలని పోరాటం ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. పాక్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్), అజహర్ అలీ (50 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించారు. -
అందరి చూపులు అందుకోసమే: కోహ్లి
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాలతో దిగిన జట్లు భారత్-ఇంగ్లండ్‌లు. ఇక్కడ భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగగా, ఇంగ్లండ్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పోరుకు సిద్ధమైంది. ఈ రెండు జట్లు సెమీస్ కు చేరిన క్రమంలో ఫైనల్లో కూడా ఆ రెండు జట్లే చేరతాయనేది విశ్లేషకుల అభిప్రాయం. దాంతో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఏకీభవించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లే దాదాపు ఆడే అవకాశం ఉందని కోహ్లి పేర్కొన్నాడు.' ప్రతీ ఒక్కరు భారత్-ఇంగ్లండ్ ల ఫైనల్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లకు సెమీస్ లో కఠినమైన సవాల్ ఎదురైనప్పటికీ, ఫైనల్లో ఇంగ్లండ్ తో పోరుకే అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారన్నాడు. ఫైనల్ పోరులో ఏ జట్లు పోటీ పడతాయన్న ప్రశ్నకు ఓ కార్యక్రమానికి హాజరైన విరాట్ పై విధంగా సమాధానం ఇచ్చాడు. బుధవారం ఇంగ్లండ్-పాక్ ల మధ్య తొలి సెమీస్ జరుగనుండగా, గురువారం భారత్-బంగ్లాదేశ్ ల మధ్య రెండో సెమీస్ జరుగనుంది. -
పాకిస్తాన్ జట్టుకు ఝలక్
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ చేరుకున్న ఆనందంలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. పాక్ టీమ్‌కు మ్యాచ్ రిఫరీల ప్యానల్ ఝలక్ ఇచ్చింది. నిర్ణీత సమయం కంటే తక్కువ ఓవర్లు వేసినందుకు జరిమానా విధించింది. పాక్ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం చొప్పున కోత విధించింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు 20 శాతం జరిమానా వేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5.1 నిబంధన కింద ఈ చర్య తీసుకుంది. తప్పును ఒప్పుకోవడంతో పాటు జరిమానా చెల్లించేందుకు పాకిస్తాన్ టీమ్ అంగీకరించడంతో దీనిపై ఇక ఎటువంటి విచారణ జరపాల్సిన అవరసరముండదు. రెండోసారి కూడా పాక్ జట్టు ఇదే తప్పు చేస్తే కెప్టెన్ సర్ఫరాజ్‌ను ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కొవాల్సివుంటుంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన శ్రీలంకతో జరిగిన గ్రూప్‘బీ’ మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో పాకిస్తాన్ తలపడనుంది. సర్ఫరాజ్ (79 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపించాడు. -
శ్రీలంకపై పాకిస్తాన్ అద్భుత విజయం
-
మూడు మెయిడిన్లు.. మూడు వికెట్లు..
► పాకిస్తాన్ విజయలక్ష్యం 237 ► రాణించిన లంక ఓపెనర్ డిక్ వెల్లా కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బిలో సోమవారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. అమీతుమీ పోరులో లంకేయుల్ని 49.2 ఓవర్లలో 236 పరుగులకే కూల్చేసి బౌలింగ్ లో సత్తా చాటుకున్నారు. అటు ఫాస్ట్ బౌలర్లు, ఇటు మీడియం పేసర్లు విజృంభించడంతో లంక పూర్తి ఓవర్లు ఆటకుండానే చాపచుట్టేసింది. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, హసన్ అలీలు తలో మూడు వికెట్లు సాధించగా, మొహ్మద్ అమిర్, ఫాహీమ్ అష్రాఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రధానంగా పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ విశేషంగా ఆకట్టుకున్నాడు. 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన పేసర్ జునైద్ 40 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. జునైద్ వేసిన ఓవర్లలో మూడు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. వన్డే మ్యాచ్ లో ఒక పాకిస్తాన్ బౌలర్ మూడు అంతకంటే ఎక్కువ మెయిడిన్లు వేయడం నాలుగేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2013లో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో ఆఫ్రిది మూడు మెయిడిన్ల వేశాడు. ఆ తరువాత ఇంతకాలానికి ఆఫ్రిది సరసన జునైద్ చేరాడు. ఇదిలా ఉంచితే, తాజా మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులు గుణతిలకా(13) వికెట్ ను ఆదిలోనే కోల్పోయారు. ఆ తరుణంలో డిక్ వెల్లా అత్యంత జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. కుశాల్ మెండిస్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే జట్టు స్కోరు 82 పరుగుల వద్ద మెండిస్(27) అవుట్ కావడంతో పాటు, ఆపై వెంటనే చండిమల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. దాంతో 83 పరుగులకు మూడు వికెట్లను కోల్పయారు లంకేయులు. అయితే డిక్ వెల్లా(73; 86 బంతుల్లో 4 ఫోర్లు) ఆత్మవిశ్వాసంతో ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. అతనికి మెండిస్(27), మాథ్యూస్(39)ల నుంచి కూడా మోస్తరు సహకారం లభించడంతో లంకేయుల్లో నిలకడగా కనబడింది. అయితే జట్టు స్కోరు 161 పరుగుల వద్ద మాథ్యూస్ నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరిన తరువాత లంకేయులు వరుసగా వికెట్లను చేజార్చుకున్నారు. ఆరు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో లంక తేరుకోలేకపోయింది.ఇక చివర్లో గుణరత్నే(27),లక్మాల్(26)లు ఫర్వాలేదనిపించడంతో లంక 237 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందుంచింది. -
ఆ రెండు రనౌట్లు నా తప్పిదమే..
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శనతో చతికిలబడింది. భారత్ తో జరిగిన పోరులో కనీసం పోటీ ఇవ్వని సఫారీలు దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. దక్షిణాఫ్రికా పరాజయంలో మూడు రనౌట్లు కీలక పాత్ర పోషించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏబీ డివిలియర్స్, డేవిడ్ మిల్లర్, ఇమ్రాన్ తాహీర్ లు రనౌట్లకు పెవిలియన్ చేరారు. ఇందులో భారత ఫీల్డర్లు మెరుపు ఫీల్డింగ్ కు డివిలియర్స్, మిల్లర్లు బలి కావడం ఆ జట్టు ఘోర ఓటమిపై ప్రభావం చూపింది. అయితే డివిలియర్స్, మిల్లర్ల రనౌట్లకు తన తొందరపాటు నిర్ణయమే కారణమని అంటున్నాడు డు ప్లెసిస్. 'డివిలియర్స్, మిల్లర్ ల రనౌట్లకు నా తప్పిదమే కారణం. ఆ ఇద్దరూ మా జట్టులో కీలక ఆటగాళ్లు. అనవసరపు పరుగు కోసం యత్నించి రెండు కీలక రనౌట్లకు కారణమయ్యా. నా అనాలోచిత చర్యతో మేము భారీ మూల్యం చెల్లించుకున్నాం. ఆ ఇద్దరు మరి కొంత సేపు క్రీజ్ లో ఉండి ఉంటే పరిస్థితి మరొలా ఉండేది'అని డు ప్లెసిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 29 ఓవర్లో జడేజా వేసిన బౌలింగ్ లో బంతిని పాయింట్ దిశగా మరల్చిన డు ప్లెసిస్ పరుగు కోసం డివిలియర్స్ ను పిలిచాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా బంతిని వేగంగా అందుకుని ధోనికి ఇవ్వడంతో డివిలియర్స్ రనౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు. ఆపై డు ప్లెసిస్ సమన్వయ లోపానికి మిల్లర్ సైతం బలయ్యాడు. -
పాకిస్తాన్ తొమ్మిదిసార్లు..
కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-బిలో పాకిస్తాన్-శ్రీలంక జట్లు నాకౌట్ సమరానికి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. దాంతో ఇరు జట్ల గెలుపు కన్నేశాయి. గత మ్యాచ్ లో లంకేయులు డిఫెండింగ్ చాంపియన్ భారత్ ను కంగుతినిపించడంతో ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. మరొకవైపు పెద్దగా అంచనాలు లేని పాకిస్తాన్ సైతం దక్షిణాఫ్రికా లాంటి నంబర్ వన్ జట్టును ఓడించడం ఆ జట్టు ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. దాంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ప్రత్యర్థి లంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మరొకవైపు ఐసీసీ నిర్వహించిన వన్డే టోర్నీల్లో శ్రీలంకపై పాకిస్తాన్ తొమ్మిదిసార్లు గెలవడం ఇక్కడ విశేషం. ఐసీసీ వన్డే టోర్నీల్లో లంకపై పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. 2002 చాంపియన్స్ ట్రోఫీలో ప్రేమదాస స్టేడియంలో జరిగిన వన్డేలో పాక్ పై లంక గెలిచింది. ఇది పాకిస్తాన్ కు కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక తుదిజట్లు: ఏంజెలో మాథ్యూస్(కెప్టెన్), కుశాల్ మెండిస్, డిక్ వెల్లా, గుణ తిలకా, చండిమాల్, గుణరత్నే, ధనంజయ డిసిల్వా, పెరీరా, లక్మల్, లసిత్ మలింగా, నువాన్ ప్రదీప్ పాకిస్తాన్ తుదిజట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), అజహర్ అలీ, ఫకార్ జమాన్, బాబర్ అజమ్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, ఫహీమ్ అష్రాఫ్, మొహ్మద్ అమిర్, హసన్ అలీ, జునైద్ ఖాన్ -
షోయబ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన సానియా
చాంపియన్స్ ట్రోఫీ చివరి సెమీ ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక-పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్థాన్ తరఫున 250 వన్డేలు ఆడిన క్రికెటర్‌గా స్టార్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ ఘనత సాధించబోతున్నాడు. ఈ సందర్భంగా షోయబ్ సతీమణి, భారత టెన్నిస్ తార సానియా మీర్జా అతనిపై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ మ్యాచ్ తామందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొంది. ‘పాకిస్థాన్ పట్ల, క్రికెట్ పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ను ఇది చాటుతోంది. క్రికెట్ పట్ల ప్రేమతో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తపనతో అతను ఎప్పుడూ ఉంటాడు. అతని తల్లికి, సోదరుడికి, నాకు ఇది ఎంతో గర్వకారణమైన సందర్భం. అతను సాధించిన దానిపట్ల మేం చాలా గర్వంగా ఉన్నాం’ అని సానియా పేర్కొంది. తామిద్దరం క్రీడాకారులు కావడంతో ఒకరితో ఒకరు కలిసి గడిపేందుకు వీలుగా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటామని సానియ వివరించింది. ‘క్రీడాకారులం కావడంతో మేం చాలా సమయం వేరుగా గడుపుతాం. కానీ ఫోన్లు చాలా సాయపడతాయి. ఎంతో సమన్వయంతో ప్లాన్ చేసుకుంటాం. నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడే పాక్ జట్టు ఆస్ట్రేలియాకు వచ్చింది. అలాంటి సమయాల్లో కలుసుకుంటాం. కొన్నిసార్లు మా షెడూళ్లు మ్యాచ్ అవుతాయి. నాకు ఈ వారాంతం కలిసి వచ్చింది. అందుకే దుబాయ్‌కో, ఇండియాకో వెళ్లకుండా ఇక్కడికి (లండన్) వచ్చాను. దీంతో కొన్ని క్రికెట్ మ్యాచులను వీక్షించే అవకాశం దక్కింది’ అని చెప్పింది. ఇన్ని రోజులు ప్యారిస్‌లో ఉండటం వల్ల చాంపియన్స్ ట్రోఫీని క్రమంతప్పకుండా చూడలేకపోయానని, పాక్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌తోపాటు భారత్ మ్యాచ్‌లను కొన్నింటిని మాత్రమే చూడగలిగానని ఆమె చెప్పింది. -
అదరగొట్టిన విరాట్ సేన
-
సెమీస్‌లోకి విరాట్ సేన..
►మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. 'నాకౌట్' పోరులో సఫారీలను చిత్తు చేసిన భారత్.. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత సఫారీలను కూల్చేసిన టీమిండియా.. ఆపై ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(78;83 బంతుల్లో 12 ఫోర్లు, 1సిక్స్), విరాట్ కోహ్లి(76 నాటౌట్; 101 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్ )హాఫ్ సెంచరీలతో రాణించి జట్టుకు విజయాన్నందించారు. దక్షిణాఫ్రికా విసిరిన 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించిన కోహ్లి అండ్ గ్యాంగ్.. 38.0 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురేసింది. సఫారీలు విసిరిన స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు ఆదిలో పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. తొలి ఓవర్ ను మెయిడిన్ ఖాతా ప్రారంభించిన సఫారీలు లైన్ అండ్ లెంగ్త్ ధ్యేయంగా బంతులు విసిరారు. ఈ క్రమంలో ఓపెనర్లు శిఖర్ ధావన్- రోహిత్ శర్మలు స్ట్రైక్ రొటేట్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దక్షిణాఫ్రికా పేసర్లు రబడా, మోర్నీ మోర్కెల్ నుంచి పదునైన బంతులు ఎదురుకావడంతో భారత్ ఆటగాళ్లు సింగిల్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రోహిత్ శర్మ తొలి వికెట్ గా అవుటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి కూడా దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. తొలి పది ఓవర్లలో మూడు మెయిడిన్లు వేసి బౌలింగ్ లో సత్తా చాటుకున్నారు సఫారీలు. అయితే కోహ్లి-ధావన్‌లు క్రీజ్‌లో కుదురుకున్న తరువాత మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. ప్రధానంగా 20 ఓవర్లు దాటిన తరువాత వీరి విజృంభణ మొదలైంది. ముందు శిఖర్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై కోహ్లి అర్థ శతకంతో మెరిశాడు. ఈ జోడి రెండో వికెట్ కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో భారత్ గెలుపు సులువైంది. మ్యాచ్ ను యువరాజ్ సింగ్(23 నాటౌట్;25 బంతుల్లో 1ఫోర్, 1 సిక్స్) సిక్సర్ తో మ్యాచ్ ను ముగించడం విశేషం. మరొకవైపు గట్టి పోటీ ఇస్తుందనుకున్న దక్షిణాఫ్రికా పూర్తిగా వైఫల్యం చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు డీకాక్-ఆమ్లాలు ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించారు. ఆదిలో ఆచితూచి ఆడుతూ మధ్య మధ్యలో బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 76 పరుగులు భాగస్వామ్యం వచ్చిన తరువాత ఆమ్లా పెవిలియన్ చేరాడు. ఆపై డీకాక్ కు జత కలిసిన డు ప్లెసిస్ బాధ్యతాయుతంగా ఆడాడు. కాగా, జట్టు స్కోరు 116 పరుగుల వద్ద డీకాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత డివిలియర్స్(16), మిల్లర్(1) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. స్కోరును పెంచే క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా క్యూకట్టారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో దక్షిణాఫ్రికా స్పల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బూమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా,అశ్విన్, పాండ్యా, రవీంద్ర జడేజాలు వికెట్ చొప్పున తీశారు. -
షేన్ వార్న్.. ఇంగ్లండ్ జెర్సీ ధరిస్తాడా?
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడం ఆ దేశ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ కు సరికొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. తమ జట్టును టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా లెక్కలేసుకున్న వార్న్ కు ఇప్పుడొక చిక్కొచ్చిపడింది. ఇందుకు కారణం శనివారం ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచే కారణం. ఆ మ్యాచ్ ను ఆసీస్ కచ్చితంగా గెలుస్తుందంటూ గొప్పలకు పోయిన వార్న్.. అందుకు సంబంధించి మన దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీతో 'బెట్టింగ్' కూడా కట్టాడు. ఇంతకీ ఆ బెట్టింగ్ ఏంటంటే.. ఆ మ్యాచ్ లో ఆసీస్ గెలిచిన పక్షంలో వారి జెర్సీని గంగూలీ ధరించాలి. అదే సమయంలో ఇంగ్లండ్ గెలిస్తే ఆ జట్టు జెర్సీని తాను ధరిస్తానని వార్న్ పందెం కాసాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కొన్ని రోజుల క్రితం 'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా గంగూలీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు వార్న్, మైకేల్ క్లార్క్‌లు పాల్గొన్నారు. దానిలో భాగంగా జూన్18 వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రెండు పటిష్టమైన జట్టు ఆస్ట్రేలియా-భారత్‌లు తలపడతాయంటూ క్లార్క్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అయితే దీంతో గంగూలీ విభేదించాడు. ఫైనల్ తలపడే జట్టు భారత్-ఇంగ్లండ్‌లు అంటూ గంగూలీ జోస్యం చెప్పాడు. దాంతో కాసింత అసహనానికి లోనైన క్లార్క్.. ఇంగ్లండ్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎవరున్నారంటూ గంగూలీని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో జో రూట్, బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారని, ఆస్ట్రేలియా కంటే ఇంగ్లండ్ జట్టే అన్ని విభాగాల్లో ఉందంటూ గంగూలీ ఎటువంటి మొహం లేకుండా చెప్పేశాడు. ఇది పక్కనే ఉన్న షేన్ వార్న్‌కు ఎంతమాత్రం రుచించలేదు. గ్రూప్-ఎ మ్యాచ్‌లో జూన్ 10 వ తేదీన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌లు తలపడుతున్నాయి కదా. ఇక్కడ ఆసీస్ గెలుస్తుందనేది తన బెట్ అంటూ వార్న్ సవాల్ విసిరాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే గంగూలీ తమ జట్టు జెర్సీ ధరించాలంటూ వార్న్ ఛాలెంజ్ చేశాడు. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే ఇంగ్లిష్ జెర్సీని వేసుకుంటానని తనకు తానేగా పేర్కొన్నాడు. మరి ఇప్పుడు ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఇంగ్లండ్ జెర్సీని వార్నర్ జెర్సీని ధరిస్తాడా?అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. -
10 ఓవర్లు.. 3 మెయిడిన్లు!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో కీలక మ్యాచ్ లో స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిన దక్షిణాఫ్రికా బౌలింగ్ లో మాత్రం సత్తాను చాటుతోంది. 192 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సఫారీలు పదునైన బంతులను సంధిస్తున్నారు. తొలి పది ఓవర్లలో మూడు మెయిడిన్లు వేసి భారత్ పై ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ను మెయిడిన్ తో ఆరంభించిన రబడా.. ఏడు ఓవర్ లో కూడా పరుగులేమీ ఇవ్వకుండా మెయిడిన్ చేశాడు. ఆపై మోర్నీ మోర్కెల్ వేసిన ఎనిమిదో ఓవర్ సైతం మెయిడిన్ కావడంతో భారత్ స్కోరు మందగించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆపై బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(12) మొదటి వికెట్ గా అవుటయ్యాడు. -
శ్రీలంకకు ఎదురుదెబ్బ
కొలంబో(శ్రీలంక): ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి జోరుమీదున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా గాయం కారణంగా టోర్నికి దూరమయ్యాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పెరీరా తన వ్యక్తిగత స్కోరు 47 పరుగుల వద్ద తొడకండరం పట్టేయడంతో అర్ధంతరంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెల్సిందే. పెరీరా స్థానంలో శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వాకు పిలుపువచ్చింది. డిసిల్వా శ్రీలంక తరపున 16 వన్డేలు ఆడి 334 పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన రెండో శ్రీలంక ఆటగాడు పెరీరా. ఇంతకుముందు చమర కపుగెదెరా మోకాలి గాయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో దనుష్క గుణతిలకను తీసుకున్నారు. క్రిస్ వోక్స్(ఇంగ్లండ్), వహబ్ రియాజ్(పాకిస్తాన్) కూడా గాయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. కాగా, సోమవారం జరగనున్న కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీస్‌కు వెళుతుంది. -
టీమిండియా విజృంభణ..
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టీమిండియా విజృంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను 191 పరుగులకే కట్టడి చేసి శభాష్ అనిపించింది. ఏ దశలోనూ సఫారీలను తేరుకోనీయకుండా చేసి భారత్ పైచేయి సాధించింది. భారత దెబ్బకు పేకమేడలా కూలిపోయిన దక్షిణాఫ్రికా కనీసం రెండొందల మార్కును కూడా దాటలేకపోయింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీకాక్(53;72 బంతుల్లో 4 ఫోర్లు), హషీమ్ ఆమ్లా(35;54 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్(36;50 బంతుల్లో 1 ఫోర్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో ఆ జట్టు 44.3 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన సఫారీలకు శుభారంభం లభించింది. ఓపెనర్లు డీకాక్-ఆమ్లాలు ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించారు. ఆదిలో ఆచితూచి ఆడుతూ మధ్య మధ్యలో బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 76 పరుగులు భాగస్వామ్యం వచ్చిన తరువాత ఆమ్లా పెవిలియన్ చేరాడు. ఆపై డీకాక్ కు జత కలిసిన డు ప్లెసిస్ బాధ్యతాయుతంగా ఆడాడు. కాగా, జట్టు స్కోరు 116 పరుగుల వద్ద డీకాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత డివిలియర్స్(16), మిల్లర్(1) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. స్కోరును పెంచే క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా క్యూకట్టారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో దక్షిణాఫ్రికా స్పల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బూమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా,అశ్విన్, పాండ్యా, రవీంద్ర జడేజాలు వికెట్ చొప్పున తీశారు. -
'అవుట్' కోసం పోటీ పడ్డారు!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 'అవుట్' నుంచి తప్పించుకునేందుకు ఒకరితో ఒకరు పోటీ పడిన అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో భాగంగా అశ్విన్ వేసిన 30వ ఓవర్ తొలి బంతిని డు ప్లెసిస్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన ఆ బంతికి డు ప్లెసిస్ పరుగు తీసేందుకు ముందుకొచ్చాడు. అయితే అవతలి ఎండ్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ కూడా పరుగు కోసం సగం క్రీజ్ దాటి వచ్చాడు. అయితే ఆ బంతిని వేగంగా అందుకున్న బూమ్రా నాన్ స్టైకింగ్ ఎండ్ వైపు వేగంగా విసిరాడు. దాంతో రనౌట్ తప్పదని భావించిన సఫారీ ఆటగాళ్లు మిల్లర్-డు ప్లెసిస్‌లు తమను అవుట్ నుంచి రక్షించుకునేందుకు స్ట్రైకింగ్ ఎండ్ వైపు వేగంగా పరుగు తీశారు. ఇక నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో బ్యాట్స్‌మన్ ఎవరూ లేకపోవడంతో ఆ బంతిని అందుకున్న కోహ్లి ఎటువంటి తడబాటు లేకుండా వికెట్లను ఎగురేశాడు. కాగా, అసలు అవుట్ ఎవరయ్యారనే దాని కోసం ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్ రివ్యూను కోరాల్సి వచ్చింది. ఇక్కడ మిల్లర్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. -
'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్టు బెన్ స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్ని కచ్చితంగా కోరుకుంటుందని కొనియాడాడు. ఈ విషయం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వంటి వేలంలో నిరూపించబడిందని మోర్గాన్ ప్రస్తావించాడు. ' బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో స్టోక్స్ ది ప్రత్యేక స్థానం. అతనొక కీలకమైన ఆల్ రౌండర్. అతను జట్టులో ఉన్నాడంటే భరోసా ఉంటుంది. నిన్నటి మ్యాచ్ లో చాలా పరుగుల్ని స్టోక్స్ సేవ్ చేశాడు. దాంతో పాటు బౌలింగ్ లో కూడా మెరిశాడు. బ్యాటింగ్ లో సెంచరీతో అదరగొట్టాడు. మా జట్టులో స్టోక్స్ ఉండటం నిజంగా అదృష్టం. ఏదో రకంగా జట్టుకు ఉపయోగపడుతూనే ఉంటాడు. అతని లాంటి ఆటగాడ్ని ఏ జట్టైనా కోరుకుంటుంది'అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ భారాన్ని స్టోక్స్ తన భుజాలపై వేసుకుంటాడన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్టోక్స్ చేసిన సెంచరీనే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో బెన్ స్టోక్స్ (109 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. -
అశ్విన్ వచ్చేశాడు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి ముందుగా సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. గత రెండు మ్యాచ్ లకు దూరమైన రవి చంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాపై అశ్విన్ కు మంచి రికార్డు ఉండటంతో పాటు, ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఉండటం చేత అశ్విన్ తీసుకున్నారు. ఉమేశ్ యాదవ్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు. ఐసీసీ టోర్నీల్లో దక్షిణాఫ్రికాపై మంచి రికార్డును కల్గి ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. 12 మ్యాచ్ ల్లో భారత్ ఎనిమిదింట గెలవగా, నాలుగసార్లు ఓడింది. దాంతో పాటు ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచ్ ల్లో భారత్ దే పైచేయి కావడం విశేషం.అయితే ఈ మ్యాచ్ విరాట్ సేనకు కచ్చితంగా కఠిన పరీక్షే. శ్రీలంకతో మ్యాచ్ లో భారత్ జట్టు భారీ స్కోరు చేసి కూడా ఓడిపోవడం విమర్శలకు దారిచ్చింది. మరొకవైపు కోచ్ కుంబ్లేతో విభేదాలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఇక్కడ గెలుపు అనివార్యం. ఓడితే మాత్రం కోచ్ కుంబ్లేతో విభేదాలు, మైదానం బయటి వివాదాలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్ దక్షిణాఫ్రికా రూపంలో భారత్‌కు సవాల్ ఎదురుగా నిలిచింది. అక్కడా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తన ఫామ్‌తో తంటాలు పడుతున్నా, పాక్ చేతిలో అనూహ్యంగా ఓడినా జట్టుగా సఫారీలు ఎప్పుడైనా ప్రమాదకరమే. ఈ నేపథ్యంలో ఏబీ సేనను దాటి డిఫెండింగ్ చాంపియన్ ముందంజ వేయగలదా? అనేది ఆసక్తికరం. దక్షిణాఫ్రికా తుది జట్టు: ఏబీ డివిలియర్స్(కెప్టెన్), డీ కాక్, హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, జేపీ డుమినీ, క్రిస్ మోరిస్, రబడా, ఫెవిలుక్యుయో, మోర్నీ మోర్కెల్, ఇమ్రాన్ తాహీర్ భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవి చంద్రన్ అశ్విన్, బూమ్రా -
ఒక్క మ్యాచ్ గెలువకుండానే తోక ముడిచారు!
వరల్డ్ కప్ ఫైనలిస్టుల దీనగాథ! వన్డే వరల్డ్‌కప్ విజేత అయిన ఆస్ట్రేలియా చాంపియన్స్ ట్రోఫీ నుంచి అవమానకరరీతిలో వైదొలిగింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కంగారులు ఓటమిపాలయ్యారు. చావో-రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనూ వర్షం వెంటాడటం, ఓటమి తప్పకపోవడంతో ఆ జట్టు తట్టాబుట్టా సర్దుకొని ఇంటిముఖం పట్టింది. నిజానికి 2015 వరల్డ్‌కప్ ఫైనలిస్ట్ అయిన న్యూజిలాండ్ కూడా చాంపియన్స్ ట్రోఫీలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన కివిస్ జట్టు ఇంటిముఖం పట్టింది. వరల్డ్ కప్ ఫైనలిస్టులు అయిన ఈ రెండు జట్లు చాంపియన్స్ ట్రోఫీలో కనీసం ఒక్క విజయం కూడా సాధించకపోవడం గమనార్హం. చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టును వర్షం దారుణంగా వెంటాడింది. వర్షం కారణంగా ఆ జట్టుకు సంబంధించిన రెండు మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో మ్యాచుల్లో గెలిచే స్థితిలో వర్షం రావడంతో ఆసిస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 2009లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా..2013, 2017లో జరిగిన ఈ టోర్నమెంటులో ఒక్క మ్యాచ్ కూడా గెలువకపోవడం గమనార్హం. ఇక అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కివిస్‌కు బంగ్లాదేశ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగో వికెట్‌కు మహ్మదుల్లా, షకిబ్ ఆల్ హసన్ రికార్డుస్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో బంగ్లా జట్టు 268 పరుగులు సాధించి కివిస్ విసిరిన లక్ష్యాన్ని అలవోకగా అధిగమించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి వరల్డ్ కప్ ఫైనలిస్టులను తరిమేసి ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరాయి. -
కష్టాల్లో ఇంగ్లండ్
బర్మింగ్‌హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆసీస్ విసిరిన 278 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కీలక వికెట్లును చేజార్చుకుంది. ఆరు ఓవర్లలో 35 పరుగులు చేసిన ఇంగ్లండ్ మూడు ప్రధాన వికెట్లను నష్టపోయింది. జాసన్ రాయ్(4), హేల్స్(0), జో రూట్(15)లు పెవిలియన్ కు చేరారు. ఈ మూడు వికెట్లలో హజల్ వుడ్ కు రెండు, స్టార్క్ కు వికెట్ దక్కింది. అయితే ఆసీస్ వికెట్ల వేటతో బిజీగా ఉన్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కు వెళ్లాలంటే ఆసీస్ కు ఈ మ్యాచ్ లో గెలుపు అనివార్యం. అంతకుముందు ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్ లు వర్షం వల్ల రద్దు కావడంతో ఆ జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇదిలా ఉంచితే ఇంగ్లండ్ ముందుగా సెమీస్ కు చేరడంతో ఆసీస్ తో మ్యాచ్ లో ఓటమి ఎదురైనా ఆ జట్టుకు ఇబ్బందేమీ ఉండదు. -
15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు..
బర్మింగ్‌హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ ఆటగాళ్లలో అరోన్ ఫించ్(68;64 బంతుల్లో 8 ఫోర్లు), స్టీవ్ స్మిత్(56;77 బంతుల్లో 5 ఫోర్లు), ట్రావిస్ హెడ్(71నాటౌట్; 64 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరుకు సహకరించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను డేవిడ్ వార్నర్-అరోన్ ఫించ్‌లు ఆరంభించారు. జట్టు స్కోరు 40 పరుగుల వద్ద వార్నర్(21 )తొలి వికెట్ అవుట్ కాగా, ఫించ్ నిలకడగా ఆడాడు. అతనికి కెప్టెన్ స్టీవ్ స్మిత్ నుంచి మంచి సహకారం లభించింది. ఈ జోడి 96 పరుగుల్ని జత చేసి ఆసీస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ క్రమంలోనే అరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ జోడి కుదురుగా ఆడుతున్న సమయంలో అరోన్ ఫించ్ ను బెన్ స్టోక్స్ పెవిలియన్ కు పంపాడు. ఆపై కొద్ది సేపటికి స్టీవ్ స్మిత్ సైతం అర్థ శతకం చేసిన తరువాత అవుట్ కావడంతో ఆసీస్ తడబడినట్లు కనబడింది. ఆ దశలో ట్రావిస్ హెడ్ అత్యంత నిలకడగా ఆడాడు. వరుసగా వికెట్లు పడుతున్నా హెడ్ కడవరకూ క్రీజ్ లో ఉండటంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషిద్, మార్క్ వుడ్ లు తలో నాలుగు వికెట్లు సాధించారు. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు.. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మూడొందల పరుగులకు పైగా స్కోరును చేస్తుందని తొలుత భావించినప్పటికీ వరుస వికెట్లును చేజార్చుకుని కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 239 పరుగుల వద్ద మ్యాక్స్ వెల్(20)ను ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఆపై స్వల్ప విరామాల్లో వికెట్లను నష్టపోయింది. ప్రధానంగా 15 పరుగుల వ్యవధిలో ఆసీస్ ఐదు వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టు స్కోరులో వేగం తగ్గింది. ఇంగ్లండ్ బౌలర్లు రషిద్, మార్క్ వుడ్లు చెలరేగిపోయి ఆసీస్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. -
వార్నర్ 'గర్జన' ఏది?
బర్మింగ్‌హోమ్: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొంతకాలంగా ఆసీస్ విజయాల్లో వార్నర్ పాత్ర వెలకట్టలేనిది. అటు టెస్టులైనా, ఇటు వన్డేలైనా, మరొకవైపు ట్వంటీ 20 లీగ్లైనా వార్నర్ మార్క్ ఉండాల్సిందే. ఆ క్రమంలోనే 2016లో ఏడు వన్డే సెంచరీలు చేసి ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ఆసీస్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఓవరాల్ గా ఒక ఏడాదిలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ తరువాత స్థానం పొందాడు. ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే వన్డే టోర్నమెంట్లలో మాత్రం వార్నర్ ఇప్పటివరకూ భారీ స్కోర్లు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటివరకూ ఐసీసీ నిర్వహించిన టాప్-8 జట్లపై వార్నర్ వన్డే సగటు 26. మొత్తం 10 ఇన్నింగ్స్ ల్లో వార్నర్ చేసిన పరుగులు 234. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 45 మాత్రమే. ప్రతీ చోట తనదైన ముద్రను వేసే వార్నర్.. ఇలా ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లలో గర్జించకపోవడం ఆసీస్ ను ఆందోళన పరుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్ లో వార్నర్ (21) నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తేనే సెమీస్ లోకి చేరుతుంది. -
అశ్విన్ ను ప్రయోగిస్తారా?
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ లో ఫాస్ట్ పిచ్‌ల నేపథ్యంలో స్పిన్నర్ అయిన అశ్విన్ ను పక్కను పెట్టాల్సి వచ్చింది. అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్ కు అశ్విన్ కు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ లో డీకాక్, డుమిని, డేవిడ్ మిల్లర్ల వంటి ఎడమచేతి స్టార్ ఆటగాళ్లు ఉండటం చేత అశ్విన్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కష్టం కనుక అశ్విన్ ను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు. రేపటి మ్యాచ్ లో అశ్విన్ కు చోటు దక్కుతుందని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకన్జీ సైతం అభిప్రాయపడ్డాడు. తమతో చావో రేవో మ్యాచ్ లో అశ్విన్ ఎంపిక కూడా కీలకం కానుందని మెకన్జీ పేర్కొన్నాడు.ఈ మేరకు భారత జట్టు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయన్నాడు. మరొకవైపు శ్రీలంకతో ఓటమి భారత ఆటగాళ్ల మదిలో తీవ్రంగా ఉందన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ పై ఒత్తిడి నెలకొన్న తరుణంలో దాన్నిసద్వినియోగం చేసుకుంటామన్నాడు. అయితే ఒక్క మ్యాచ్ లో ఓటమితో భారత్ ను తక్కువగా అంచనా వేయడం లేదన్నాడు. కచ్చితంగా భారత్ తో రసవత్తర పోరు ఖాయమన్నాడు. -
డివిలియర్స్ ఫామ్‌లో లేకపోతే..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఫామ్ లేకపోవడంపై ఆ జట్టు స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ స్పందించాడు. ఇప్పటివరకూ రెండు మ్యాచ్ లు ఆడిన డివిలియర్స్ నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో డకౌట్ కాగా, శ్రీలంకతో మ్యాచ్ లో నాలుగు పరుగులతో నిరాశపరిచాడు. అయితే ఏబీ ఫామ్ లేకపోవడం అనేది తాత్కాలికమంటూ అతనికి మద్దతుగా నిలిచాడు మిల్లర్. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన ఏబీ ఫామ్ లేకపోవడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుందని పేర్కొన్నాడు. ఒకవేళ డివిలియర్స్ వైఫల్యం చెందిన పక్షంలో అది తమ జట్టుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని మిల్లర్ స్పష్టం చేశాడు. 'డివీ ఫామ్ లో లేకపోతే అది మాకు కష్టంగానే ఉంటుంది. డివీ విఫలం కావడం అనేది చాలా అరుదు. డివిలియర్స్ కెరీర్ లో ఎక్కువసార్లు విఫలమైన సందర్భాలను నేను చూడలేదు. దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ కీలక ఆటగాడు. ప్రస్తుతం ఏబీ ఫామ్ లేకపోవడం అనేది తాత్కాలికమే. అది మాకు సమస్యగా భావించడం లేదు. పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ ల్లో ఏబీని దురదృష్టం వెంటాడింది. దాంతోనే అతను తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఆదివారం భారత్ తో జరిగే పోరుకు ఏబీ పూర్వపు ఫామ్ తో చెలరేగుతాడని ఆశిస్తున్నా'అని మిల్లర్ తెలిపాడు. రేపు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకూ కీలకమే. ఆ మ్యాచ్ లో గెలిచిన జట్టే నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. దాంతో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. -
ఆసీస్ నిలుస్తుందా?
బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో ఆ జట్టు చావోరేవో సవాల్ కు సిద్ధమైంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో జరిగిన మ్యాచ్‌లు రద్దు కావడంతో ఆసీస్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ తరుణంలో గ్రూప్-ఎలో ఇంగ్లండ్ తో శనివారం జరిగే వన్డే మ్యాచ్ ఆసీస్ కు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే నేరుగా నాకౌట్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓటమి ఎదురైతే గ్రూప్ స్టేజ్ లోనే ఆసీస్ ఇంటి దారి పట్టక తప్పదు. మరొకవైపు వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్ కు చేరిన ఇంగ్లండ్ ను ఓడించడం ఆసీస్ కు కష్టంగానే కనిపిస్తోంది. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ మంచి జోరుమీద ఉంది. దాంతో పటిష్టమైన ఇంగ్లండ్ పై విజయం సాధించాలంటే ఆసీస్ పూర్తిస్థాయి ప్రదర్శన చేయాలి. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్ ఇంగ్లండ్ కు నామమాత్రపు మ్యాచ్ కావడం ఆ జట్టు మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, హెన్రిక్యూస్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్ వెల్, మాథ్యూ వేడ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా,హజల్ వుడ్ ఇంగ్లండ్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్),జాసన్ రాయ్, హేల్స్, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ, రషిద్, ప్లంకెట్, మార్క్ వుడ్, జాక్ బాల్ -
బంగ్లాదేశ్ సంచలనం
-
భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు
-
ఆస్ట్రేలియాకు మరోసారి వరుణుడు
-
బంగ్లాదేశ్ లక్ష్యం 266
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం ఇక్కడ బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(57; 69 బంతుల్లో 5 ఫోర్లు),రాస్ టేలర్(63;82 బంతుల్లో 6 ఫోర్లు) మినహా పెద్దగా ఎవరూ రాణించకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితం కావాల్సివచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆద్యంతం తడబాటునే కొనసాగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ కు మార్టిన్ గప్టిల్, ల్యూక్ రోంచీలు దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే రోంచీ(16), గప్టిల్(33)లు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో న్యూజిలాండ్ 69 పరుగులకే ఓపెనర్ల వికెట్లను నష్టపోయింది. ఆ దశలో కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడాడు. రాస్ టేలర్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆ క్రమంలోనే ముందుగా విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై టేలర్ కూడా అర్థ శతకం సాధించాడు. కాగా, జట్టు స్కోరు 152 పరుగుల వద్ద విలియమ్సన్ మూడో వికెట్ అవుటవ్వగా, 201 పరుగుల వద్ద టేలర్ పెవిలియన్ బాటపట్టాడు. వీరిద్దరూ నిష్ర్రమించిన తరువాత న్యూజిలాండ్ స్కోరు మరింత మందగించింది. అయితే ఆల్ రౌండర్ నీషమ్(23) కాస్త ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ మొసాదక్ హుస్సేన్ మూడు వికెట్లు సాధించి న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్టవేశాడు. అతనికి తస్కీన్ అహ్మద్ రెండు వికెట్లతో చక్కటి సహకారం అందించాడు. -
విలియమ్సన్ మరో హాఫ్ సెంచరీ
కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. శుక్రవారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో విలియమ్సన్ అర్ద శతకం నమోదు చేశాడు. కివీస్ 69 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. 58 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్ధ శతకం సాధించి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. దాంతో న్యూజిలాండ్ జట్టు 27 ఓవర్లలో రెండు వికెట్లకు 144 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు మార్టిన్ గప్టిల్(33),రోంచీ(16)లు దూకుడుగా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 46 పరుగుల వద్ద రోంచీ తొలి వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికి గప్టిల్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ దశలో విలియమ్సన్-రాస్ టేలర్‌ల జోడి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలోనే విలియమ్సన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో సెంచరీ సాధించిన విలియమ్సన్.. ఆపై ఇంగ్లండ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. -
మిస్టర్ కోహ్లి.. పాక్ ను చూసి నేర్చుకో!
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన శ్రీలంక చేతిలో ఓటమి పాలుకావడంతో విమర్శల వర్షం కురుస్తోంది. శ్రీలంకను తక్కువ అంచనా వేయడంతో భారత క్రికెట్ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లి ధ్వజమెత్తాడు. అసలు గేమ్ ప్లాన్ ఎలా ఉండాలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును చూసి నేర్చుకుంటే బాగుంటుందంటూ తీవ్రంగా మండిపడ్డాడు. వరల్డ్ నంబర్ వన్ జట్టైన దక్షిణాఫ్రికాను పాకిస్తాన్ ఎలా కట్టడి చేసి విజయం సాధించిందో ఒకసారి కోహ్లి చూసి నేర్చుకుంటే బాగుంటుందంటూ చురకలంటించాడు. 'మిస్టర్ కోహ్లి.. ఎక్కడ నీ గేమ్ ప్లానింగ్. పరుగుల సునామీలో లంకేయులు పైచేయి సాధించారు. ఇక్కడ టీమిండియా ప్లానింగ్ కనబడలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గేమ్ ప్లాన్ ను ఒక్కసారి చూడండి. సఫారీలపై పాక్ ప్రణాళిక చాలా బాగుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో పాక్ ప్రణాళికను చూసి కోహ్లి కచ్చితంగా నేర్చుకుంటే మంచిది'అని కాంబ్లి విమర్శించాడు. -
ధోని 'సిక్సర్ల' రికార్డు!
లండన్:టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సాధించాడు. విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ధోని అరుదైన ఫీట్ ను నెలకొల్పాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా భారత్ తరపున అత్యధిక విదేశీ సిక్సర్ల రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో ధోని 52 బంతుల్లో7 ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. ఇక్కడ ధోని రెండు సిక్సర్లు సాధించడంతో భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు. ఇప్పటివరకూ విదేశాల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడి రికార్డు గంగూలీ పేరిట ఉండేది. 296 విదేశీ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో గంగూలీ 159 సిక్సర్లు కొట్టగా, ఆ రికార్డును 281 మ్యాచ్ ల్లో ధోని సవరించాడు. ప్రస్తుతం ధోని 161 విదేశీ సిక్సర్లతో తొలిస్థానంలో ఉన్నాడు. శ్రీలంకత మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని సంచలనాలకు మారుపేరైన శ్రీలంక సునాయాసంగా ఛేదించింది. దాంతో గ్రూప్-బిలో సెమీస్ రేసు రసకందాయంలో పడింది. ప్రస్తుతం భారత్, శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలో లు తలో మ్యాచ్ లో గెలవడంతో సెమీస్ కు ఎవరు చేరతారు అనే దానిపై సందిగ్ధత నెలకొంది. -
న్యూజిలాండ్ గెలిస్తేనే..!
కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పటివరకూ ఈ టోర్నీలో బోణీ కొట్టని న్యూజిలాండ్ గెలుపు కోసం ఆరాటపడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ కు విజయం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ రద్దు కాగా, ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఓటమి ఎదురైంది. దాంతో గ్రూప్ దశలో ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్న న్యూజిలాండ్ విజయంపై కన్నేసింది. శుక్రవారం బంగ్లాదేశ్ త్ జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తేనే న్యూజిలాండ్ సెమీస్ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ కానిపక్షంలో న్యూజిలాండ్ ఇంటిదారి పట్టక తప్పదు ఇప్పటికే గ్రూప్-ఎలో ఇంగ్లండ్ సెమీస్ కు చేరగా, రెండో బెర్తు కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్ లు వర్షార్పణం కావడంతో ఆ జట్టుకు రెండు పాయింట్లు మాత్రమే లభించాయి. ఇక న్యూజిలాండ్ కేవలం ఒక పాయింట్ తో మాత్రమే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే మూడు పాయింట్లు వస్తాయి. అదే సమయంలో రేపు ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోవాలి. అప్పుడే న్యూజిలాండ్ కు అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిసిపోయి ఉండటంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. న్యూజిలాండ్ తుది జట్టు:కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, ల్యూక్ రోంచీ, రాస్ టేలర్, బ్రూమ్, నీషమ్, కోరీ అండర్సన్, సాంత్నార్, మిల్నే, సౌథీ, ట్రెంట్ బౌల్ట్ బంగ్లాదేశ్ తుది జట్టు: మష్రఫ్ మోర్తాజ(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, తస్కిన్ అహ్మద్, ముష్పికర్ రహీమ్, షకిబుల్ హసన్, షబ్బిర్ రెహ్మాన్, మొహ్ముదుల్లా, మొసడెక్ హుస్సేన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ -
'భారత క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నా'
లండన్: గత కొంతకాలంగా భారత క్రికెట్ చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ. అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా చాలా మంచి క్రికెట్ ఆడుతుందంటూ కితాబిచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత జట్టుకే మరొకసారి టైటిల్ ను గెలిచే సత్తా ఉందన్నాడు. 'చాలాకాలంగా భారత క్రికెట్ మంచి ఫలితాలు సాధిస్తుంది. ఇప్పుడు ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ల్లో సమతుల్యతను కల్గి ఉంది. మంచి క్రికెట్ ఆడుతున్న భారత క్రికెట్ ను చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నా. చాంపియన్స్ ట్రోఫీని గెలిచే అవకాశాలు భారత్ కే ఉన్నాయి. కాకపోతే ఆస్ట్రేలియా టైటిల్ ను సాధించాలని కోరుకుంటున్నా'అని బ్రెట్ లీ తెలిపాడు.గత ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించడాన్ని బ్రెట్ లీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. పాక్ పై భారత్ సాధించిన విజయం నిజంగా అద్భుతమని కొనియాడాడు. అదొక పరిపూర్ణ విజయంగా బ్రెట్ లీ అభివర్ణించాడు. -
శ్రీలంకకు భారీ లక్ష్యం
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ గురువారం శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో భారత జట్టు 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ(78;79 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్(125; 128 బంతుల్లో 15 ఫోర్లు 1 సిక్స్), ఎంఎస్ ధోని(63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో లంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టుకు శిఖర్ ధావన్-రోహిత్ శర్మ లు శుభారంభం అందించారు. ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా రోహిత్ శర్మ 58 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై శిఖర్ ధావన్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మరొకవైపు చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు(నాలుగుసార్లు) నమోదు చేసిన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నారు.పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో వీరిద్దరూ 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. అయితే తాజాగా లంకేయులతో మ్యాచ్‌లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ ఘనతను నాల్గోసారి తన ఖాతాలో వేసుకుంది. రోహిత్ శర్మ తొలి వికెట్ గా అవుటైనప్పటికీ శిఖర్ మాత్రం మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. ధోనితో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 82 పరుగుల జత చేసిన తరువాత శిఖర్ (125; 128 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. ఆపై హార్దిక్ పాండ్యా(9) ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఆ సమయంలో కేదర్ జాదవ్‌తో కలిసి ధోని ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఒకవైపు ధోని దూకుడుగా ఆడితే జాదవ్ మాత్రం కుదరుగా ఆడాడు. ఆ క్రమంలోనే 46 బంతుల్లో ధోని హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఇక చివర్లో జాదవ్(25 నాటౌట్;13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. లంక బౌలర్లలో మలింగా రెండు వికెట్లు సాధించగా,లక్మాల్, ప్రదీప్,పెరీరా, గుణరత్నేలకు తలో వికెట్ దక్కింది. -
ధావన్ దరువు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో మెరిశాడు. శిఖర్ ధావన్ 112 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ సాధించి సత్తాచాటుకున్నాడు. లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన బ్యాటింగ్ లో హవాను కొనసాగించాడు. తొలుత 69 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరిన ధావన్.. మరో అర్ధ శతకం సాధించడానికి 43 బంతులను ఎదుర్కొన్నాడు. దాంతో తన వన్డే కెరీర్ లో 10వ సెంచరీను సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టుకు శిఖర్ ధావన్-రోహిత్ శర్మ లు శుభారంభం అందించారు.ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా రోహిత్ శర్మ 58 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై శిఖర్ ధావన్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. వీరిద్దరూ రాణించి చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు(నాలుగుసార్లు) నమోదు చేసిన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నారు.పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో వీరిద్దరూ 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. అయితే తాజాగా లంకేయులతో మ్యాచ్‌లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ ఘనతను నాల్గోసారి తన ఖాతాలో వేసుకుంది. మరోవైపురోహిత్-ధావన్‌ల జోడి మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. వరుసగా వన్డేల్లో భారత తరపున మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జో్డిగా సరికొత్త ఘనత సాధించింది. ఈ టోర్నీలో రెండు సెంచరీ భాగస్వామ్యాలతో పాటు అంతకుముందు ఆస్ట్రేలియాతో్ ఆడిన వన్డేలో శిఖర్-రోహిత్ ల జోడి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఇదిలా ఉంచితే, లంకతో మ్యాచ్ లో రోహిత్ శర్మ తొలి వికెట్ గా అవుటైనప్పటికీ శిఖర్ మాత్రం మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. ధోనితో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 82 పరుగుల జత చేసిన తరువాత శిఖర్ (125; 128 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. -
విరాట్ కోహ్లి విఫలం
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బిలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమయ్యాడు. ఐదు బంతుల్ని ఎదుర్కొన్న కోహ్లి డకౌట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. నువాన్ ప్రదీప్ బౌలింగ్ లో కీపర్ డిక్ వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ(78; 79 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్ గా వెనుదిరిగిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లి షాట్ యత్నించి పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో రోహిత్-శిఖర్ ధావన్ ల జోడి శుభారంభాన్ని అందించింది. ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్నిసాధించి భారత్ భారీ స్కోరుకు బాటలు వేసింది. -
రోహిత్-ధావన్‌లు నాల్గోసారి..
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల జోడి మరోసారి మెరిసింది. గురువారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్-ధావన్‌లు సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో ఈ టోర్నీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు(నాలుగుసార్లు) నమోదు చేసిన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో వీరిద్దరూ 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. అయితే తాజాగా లంకేయులతో మ్యాచ్‌లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ ఘనతను నాల్గోసారి తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 58 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక్కడ రోహిత్ సిక్సర్ తో హాఫ్ సెంచరీ మార్కును చేరడం విశేషం. అంతకుముందు పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా సిక్సర్ తోనే రోహిత్ శర్మ అర్థశతకం నమోదు చేశాడు. మరోవైపు శిఖర్ ధావన్ 69 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఇదే చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ఇదిలా ఉంచితే, రోహిత్-ధావన్‌ల జోడి మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. వరుసగా వన్డేల్లో భారత తరపున మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జో్డిగా సరికొత్త ఘనత సాధించింది. ఈ టోర్నీలో రెండు సెంచరీ భాగస్వామ్యాలతో పాటు అంతకుముందు ఆస్ట్రేలియాతో్ ఆడిన వన్డేలో శిఖర్-రోహిత్ ల జోడి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.