![శ్రీలంకకు ఎదురుదెబ్బ](/styles/webp/s3/article_images/2017/09/5/61497188457_625x300.jpg.webp?itok=egj53w2s)
శ్రీలంకకు ఎదురుదెబ్బ
కొలంబో(శ్రీలంక): ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి జోరుమీదున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా గాయం కారణంగా టోర్నికి దూరమయ్యాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పెరీరా తన వ్యక్తిగత స్కోరు 47 పరుగుల వద్ద తొడకండరం పట్టేయడంతో అర్ధంతరంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెల్సిందే. పెరీరా స్థానంలో శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వాకు పిలుపువచ్చింది. డిసిల్వా శ్రీలంక తరపున 16 వన్డేలు ఆడి 334 పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు.
గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన రెండో శ్రీలంక ఆటగాడు పెరీరా. ఇంతకుముందు చమర కపుగెదెరా మోకాలి గాయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో దనుష్క గుణతిలకను తీసుకున్నారు. క్రిస్ వోక్స్(ఇంగ్లండ్), వహబ్ రియాజ్(పాకిస్తాన్) కూడా గాయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. కాగా, సోమవారం జరగనున్న కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సెమీస్‌కు వెళుతుంది.