NZ vs SL: కుశాల్‌ పెరీరా ‘ఫాస్టెస్ట్‌ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి! | NZ Vs SL 3rd T20I Perera Fastest Ton Sri lanka Beat New Zealand Since 2006 | Sakshi
Sakshi News home page

NZ vs SL: కుశాల్‌ పెరీరా ‘ఫాస్టెస్ట్‌ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి!

Published Thu, Jan 2 2025 12:47 PM | Last Updated on Thu, Jan 2 2025 1:03 PM

NZ Vs SL 3rd T20I Perera Fastest Ton Sri lanka Beat New Zealand Since 2006

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ గండం నుంచి శ్రీలంక తప్పించుకుంది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన నామమాత్రపు మూడో టీ20లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. కుశాల్‌ పెరీరా(Kusal Perera) విధ్వంసక శతకంతో దుమ్ములేపగా.. చరిత్‌ అసలంక(Charith Asalanka) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించడంతో లంక గట్టెక్కగలిగింది. 

మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా మొదట టీ20లు జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజిలాండ్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గురువారం నెల్సన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం పర్యాటక లంక ఆతిథ్య కివీస్‌ జట్టుకు ఊహించని షాకిచ్చింది.

సాక్స్‌టన్‌ ఓవల్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఓపెనర్లు పాతుమ్‌ నిసాంక(12 బంతుల్లో 14), కుశాల్‌ మెండిస్‌(16 బంతుల్లో 22) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.

లంక తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ
అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాల్‌ పెరీరా మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. కేవలం 46 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 219కి పైగా స్ట్రైక్‌రేటుతో 101 పరుగులు సాధించాడు. తద్వారా శ్రీలంక తరఫున అంతర్జాతీయ టీ20లలో ఫాస్టెస్ట్‌ సెంచరీ(44 బంతుల్లో) నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఇక మిడిలార్డర్‌లో అవిష్క ఫెర్నాండో(17) విఫలమైనా.. చరిత్‌ అసలంక(24 బంతుల్లో 46) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగిలిన వాళ్లలో భనుక రాజపక్స, చమిందు విక్రమసింఘే చెరో ఆరు పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. 

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి శ్రీలంక 218 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, జాకబ్‌ డఫీ, జకారీ ఫౌల్క్స్, మిచెల్‌ సాంట్నర్‌, డారిల్‌ మిచెల్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

రాణించిన రచిన్‌
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ఘనంగానే ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. ఓపెనర్లలో టిమ్‌ రాబిన్సన్‌(21 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. రచిన్‌ రవీంద్ర(39 బంతుల్లో 69) అర్ధ శతకంతో రాణించాడు. కానీ వీరిద్దరు అవుటైన తర్వాత కివీస్‌ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. వన్‌డౌన్‌లో వచ్చిన మార్క్‌ చాప్‌మన్‌(9), గ్లెన్‌ ఫిలిప్స్‌(6) పూర్తిగా విఫలమయ్యారు.

అయితే, డారిల్‌ మిచెల్‌(17 బంతుల్లో 35) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగగా నువాన్‌ తుషార అతడికి చెక్‌ పెట్టాడు. మిగతా వాళ్లలో మిచెల్‌ హే(8), మైకేల్‌ బ్రాస్‌వెల్‌(1) విఫలమయ్యారు. ఆఖర్లో సాంట్నర్‌(10 బంతుల్లో 14*), జకారీ ఫౌల్క్స్‌(13 బంతుల్లో 21*) మెరుపులు మెరిపించినా.. విజయానికి కివీస్‌ ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 211 పరుగులే చేయగలిగింది. 

2006  తర్వాత తొలిసారి
ఫలితంగా ఏడు పరుగుల తేడాతో జయభేరి మోగించిన శ్రీలంక సిరీస్‌లో కివీస్‌ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి.. వైట్‌వాష్‌ నుంచి తప్పించుకుంది. అంతేకాదు.. కివీస్‌ గడ్డపై 2006 తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. 

ఇదిలా ఉంటే.. లంక బౌలర్లలో అసలంక అత్యధికంగా మూడు, వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్‌ తుషార, బినుర ఫెర్నాండో ఒక్కో వికెట్‌ తీశారు.ఇక సెంచరీ వీరుడు కుశాల్‌ పెరీరా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకోగా.. కివీస్‌ పేసర్‌ జాకబ్‌ డఫీ(Jacob Duffy)కి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు దక్కింది.

చదవండి: IND vs AUS 5th Test: రోహిత్‌ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement