
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో శ్రీలంక సత్తాచాటింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేను 8 వికెట్ల తేడాతో లంక చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
టి మారుమణి(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజా(28), బర్ల్(18), సీన్ విలియమ్స్(23), ముసెకివా(18) రాణించారు. శ్రీలంక బౌలర్లలో దుషాన్ హేమంత మూడు వికెట్లు పడగొట్టగా.. చమీరా రెండు, పతిరాన, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.
కమిల్ మిశ్రా విధ్వంసం..
అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలో చేధించింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు కుశాల్ మెండిస్(33), ఫాథుమ్ నిస్సాంక(30) 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఆ తర్వాత యువ ఆటగాడు కమిల్ మిశ్రా(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడితో పాటు కుశాల్ పెరీరా(26 బంతుల్లో 46) బ్యాట్ ఝూలిపించాడు. జింబాబ్వే బౌలర్లలో రజా, ముజర్బానీ తలా వికెట్ సాధించారు. కాగా రెండో టీ20లో శ్రీలంక అనూహ్య ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
చదవండి: SA vs ENG: ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం.. వన్డేల్లో భారీ స్కోర్! భారత్ రికార్డు సమం