శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
అయితే, ఈ ఎడిషన్‌లో ఆఖరిగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది. ఈ టూర్‌లో భాగంగా రెండు వన్డేలు కూడా ఆడనుంది. ఈ క్రమంలో తొలుత గాలె వేదికగా బుధవారం లంక- ఆసీస్ జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది.
ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) డబుల్ సెంచరీ(232)తో చెలరేగగా.. ట్రవిస్ హెడ్ మెరుపు అర్ధ శతకం(40 బంతుల్లో 57) బాదాడు.
స్మిత్, ఇంగ్లిస్ శతకాలు
మిగతా వాళ్లలో వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత శతకం(141)తో దుమ్ములేపాడు. ఇక టెస్టు అరంగేట్రంలోనే జోస్ ఇంగ్లిష్ సెంచరీ(102)తో మెరిసి తన విలువను చాటుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(46 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. టెయిలెండర్లలో బ్యూ వెబ్‌స్టర్(23), మిచెల్ స్టార్క్(19 నాటౌట్) తమ శక్తిమేర పరుగులు రాబట్టారు.
ఈ క్రమంలో 154 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఉన్న వేళ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో స్పిన్నర్లు ప్రబాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే శ్రీలంక తడబడింది.
కంగారూ స్పిన్నర్ల ధాటికి కుదేలు
ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె ఏడేసి పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ చండిమాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. అయితే, ఆసీస్ స్పిన్నర్ అద్భుత బంతితో చండిమాల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.
మిగతా వాళ్లలో ఏంజెలో మాథ్యూస్(15), కెప్టెన్ ధనంజయ డి సిల్వ(22), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(21) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. దీంతో 165 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియాన్ మూడు వికెట్లు కూల్చాడు. పేసర్ మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఫాలో ఆన్ గండం.. తప్పని ఓటమి
అయితే, తమ తొలి ఇన్నింగ్స్‌లో లంక కనీసం సగం కూడా స్కోరు చేయకపోవడంతో.. ఆస్ట్రేలియా ధనంజయ బృందాన్ని ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో వెంటనే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 247 పరుగులకే కుప్పకూలింది.
ఆసీస్ స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియాన్ ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటారు. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(6), దిముత్ కరుణరత్నె(0) మరోసారి విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు కాసేపు నిలబడ్డారు.
చండిమాల్ 31, ఏంజెలో మాథ్యూస్ 41, కమిందు మెండిస్ 32, ధనంజయ డి సిల్వ 39, కుశాల్ మెండిస్ 34 పరుగులు చేశారు. ఇక ఆఖర్లో జెఫ్రీ వాండర్సే ఒక్కడే అర్ధ శతకం(53) చేయగలిగాడు.
లంక క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అయితే, ఆస్ట్రేలియా స్కోరుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన శ్రీలంక.. ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది. ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment