![SL vs Aus: Australia Creates History Becomes First Team In World To Win](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/australia.jpg.webp?itok=-50AFQjP)
శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. తద్వారా పద్నాలుగేళ్ల తర్వాత లంక గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలుపును నమోదు చేసింది. అంతేకాదు.. మరో అరుదైన ఘనతనూ తన ఖాతాలో వేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2023-25 సీజన్‌లో ఇప్పటికే ఆసీస్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
స్మిత్ కెప్టెన్సీలో
టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ డబ్ల్యూటీసీ సీజన్‌లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడింది. గాలె వేదికగా జరిగిన ఈ సిరీస్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. స్టీవ్ స్మిత్ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు.
స్మిత్ కెప్టెన్సీలో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులోనూ శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆసీస్.. లంకను 257 పరుగులకు ఆలౌట్ చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టుకు 157 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ స్మిత్(131)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(156) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 414 పరుగులు చేసింది.
ఆ తర్వాత శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన స్మిత్ బృందం కేవలం ఒక వికెట్ కోల్పోయి కథ ముగించింది.
డబ్ల్యూటీసీలో సరికొత్త చరిత్ర
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియాకు ఇది 33వ విజయం. తద్వారా డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది.
కాగా 2019లో డబ్ల్యూటీసీ మొదలుకాగా.. ఇప్పటి వరకు 53 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 33 విజయాలు సాధించి.. పదకొండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తొమ్మిది మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఇక ఈ జాబితాలో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. 65 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న స్టోక్స్ బృందం 32 మ్యాచ్‌లలో గెలిచి.. 25 మ్యాచ్‌లలో ఓడింది. ఎనిమిది మ్యాచ్‌లు డ్రా చేసుకుంది.
మూడో స్థానంలో టీమిండియా
ఇక డబ్ల్యూటీసీ తొలి రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరగలిగిన టీమిండియా మూడో స్థానంలో ఉంది. 56 మ్యాచ్‌లకు గానూ 31 గెలిచి.. 19 ఓడి.. రెండు డ్రా చేసుకుంది. కాగా డబ్ల్యూటీసీ అరంగేట్ర విజేతగా న్యూజిలాండ్ నిలవగా.. రెండో సీజన్‌లో ఆస్ట్రేలియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక తాజా ఎడిషన్‌లో టైటిల్ కోసం ఆసీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది.
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2023-25 పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. లంకతో సిరీస్‌కు ముందే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన ఆసీస్ జట్టు చివరకు 67.54 విజయాల శాతంతో రెండో స్థానం దక్కించుకుంది. రెండేళ్ల వ్యవధిలో 19 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ 13 విజయాలు, 4 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకుంది.
మరోవైపు దక్షిణాఫ్రికా 69.44 విజయాల శాతంతో పట్టిక ‘టాప్’ ప్లేస్ దక్కించుకుంది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. గత రెండు పర్యాయాలు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టు 50.00 విజయాల శాతంతో పట్టికలో మూడో స్థానానికి పరిమితమైంది.
చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి..
Comments
Please login to add a commentAdd a comment