
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) అద్బుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. శ్రీలంక(Sri Lanka vs Australia)తో రెండో టెస్టులోనూ ఈ కుడిచేతి వాటం ఆటగాడు సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఇటీవలే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న స్మిత్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు.
ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్మిత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.
భారత్‌తో బ్రిస్బేన్ టెస్టులో 101 పరుగులు సాధించిన స్మిత్.. మెల్‌బోర్న్‌లో భారీ శతకం(140)తో చెలరేగాడు. అనంతరం.. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ తాత్కాలిక స్మిత్ శతక్కొట్టాడు. గాలె మ్యాచ్‌లో 141 పరుగులతో చెలరేగి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ సందర్భంగానే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల క్లబ్‌లో కూడా చేరాడు.
ఇక తాజాగా లంకతో రెండో టెస్టులోనూ స్టీవ్ స్మిత్ శతకం దిశగా పయనిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా గడ్డ మీద పందొమ్మిది వందలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని.. ఆస్ట్రేలియా తరఫున హయ్యస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. లంకతో రెండో టెస్టు భోజన విరామ సమయానికి స్మిత్.. ఆసియాలో 1917 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన స్మిత్
ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆతిథ్య లంకను ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి గాలెలో రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్ల విజృంభణ కారణంగా 257 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్(22 బంతుల్లో 21), ఉస్మాన్ ఖవాజా(57 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(4) మరోసారి విఫలమయ్యాడు.
ఈ దశలో స్మిత్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ వేగంగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి నిలకడైన ప్రదర్శన కారణంగా 55 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 215 పరుగుల వద్ద నిలిచింది.
ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు
👉స్టీవ్ స్మిత్: 23 మ్యాచ్‌లలో సగటు 50.35తో 1917+ పరుగులు. అత్యధిక స్కోరు- 178*- శతకాలు ఆరు.
👉రిక్కీ పాంటింగ్: 28 మ్యాచ్‌లలో సగటు 41.97తో 1889 పరుగులు- అత్యధిక స్కోరు 150- శతకాలు ఐదు
👉అలెన్ బోర్డర్: 22 మ్యాచ్‌లలో సగటు 54.51తో 1799తో 1799 పరుగులు- అత్యధిక స్కోరు 162- శతకాలు ఆరు
👉మాథ్యూ హెడెన్: 19 మ్యాచ్‌లలో 50.39 సగటుతో 1663 పరుగులు- అత్యధిక స్కోరు 203- శతకాలు నాలుగు
👉ఉస్మాన్ ఖవాజా: 17 మ్యాచ్‌లలో 61.76 సగటుతో 1544 పరుగులు- అత్యధిక స్కోరు 232- శతకాలు ఐదు.