
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను అధిగమించాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే(India vs England) సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం ద్వారా మరిన్ని రికార్డులను హిట్‌మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అద్భుత ఇన్నింగ్స్
కాగా రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దారుణంగా విఫలమైన అతడు రిటైర్ అయిపోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్‌తో కటక్ వన్డేలో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. విమర్శించినవాళ్లే ప్రశంసించేలా రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
వన్డే కెరీర్‌లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ
బరాబతి స్టేడియంలో లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్ శర్మ. ఫ్లడ్‌లైట్ల సమస్య కారణంగా కాసేపు అవాంతరాలు ఎదురైనా.. అతడి ఏకాగ్రత చెదరలేదు. ఒంటిమీదకు బాణాల్లా దూసుకువస్తున్న ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ల బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.
డెబ్బై ఆరు బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో హిట్‌మ్యాన్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 15404 పరుగులు చేశాడు. తద్వారా సచిన్ టెండుల్కర్‌ను అధిగమించాడు.
కాగా ఓపెనర్‌గా సచిన్ టెండుల్కర్ 15335 పరుగులు చేశాడు. మరోవైపు.. ఈ జాబితాలో విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలోకి ఇప్పుడు రోహిత్ దూసుకువచ్చాడు. కాగా 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.. 2013లో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు.
ద్రవిడ్‌ను అధిగమించి
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (267 వన్డేల్లో 10,987 పరుగులు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ (344 వన్డేల్లో 10,889 పరుగులు) ఐదో స్థానానికి చేరాడు. టాప్–3లో సచిన్ టెండూల్కర్ (463 వన్డేల్లో 18,246 పరుగులు), విరాట్ కోహ్లి (296 వన్డేల్లో 13,911 పరుగులు), సౌరవ్ గంగూలీ (311 వన్డేల్లో 11,363 పరుగులు) ఉన్నారు.
32వ శతకం
వన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు 32. తద్వారా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్–2లో విరాట్ కోహ్లి (50), సచిన్ టెండూల్కర్ (49) ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. కటక్‌లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు బట్లర్ బృందం ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 44.3 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది.
ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్- ఇంగ్లండ్ మధ్య నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరుగుతుంది.
చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ