![SL vs Aus: Nathan Lyon Becomes 1st Non Asian Bowler Take 150 wickets in Asia](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/nathan.jpg.webp?itok=AYrQQMLf)
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్(Nathan Lyon) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియాలో టెస్టు ఫార్మాట్లో 150కి పైగా వికెట్లు తీసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు ప్రస్తుతం శ్రీలంక(Sri Lanka vs Australia)లో పర్యటిస్తోంది.
తొలిరోజే తొమ్మిది వికెట్లు
ఇందులో భాగంగా తొలుత గాలె(Galle) వేదికగా టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో లంకను ఆసీస్ మట్టికరిపించింది. ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అనంతరం ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.
లంక బ్యాటర్లలో దినేశ్ చండిమాల్ (163 బంతుల్లో 74; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (107 బంతుల్లో 59 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే (83 బంతుల్లో 36; 3 ఫోర్లు) కాసేపు పోరాడినా... భారీ స్కోరు చేయలేకపోయాడు.
ఇతరులలో పతుమ్ నిశాంక (11), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (0) దారుణంగా విఫలమయ్యారు. చండిమాల్, కుశాల్ మెండిస్ కాస్త పోరాడటంతో లంక జట్టు ఆమాత్రం స్కోరు చేయగలిగింది.
నాన్- ఆసియన్ బౌలర్‌గా చరిత్ర
ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్‌తో కలిసి ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా ఖండంలో టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ నమోదు చేసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
అంతకు ముందు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆసియాలో 127 వికెట్లు తీయగా.. న్యూజిలాండ్ మాజీ స్టార్ డేనియల్ వెటోరి 98, ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 92 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఆసియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాన్-ఆసియన్ బౌలర్లు
👉నాథన్ లియోన్- 30 టెస్టుల్లో 150
👉షేన్ వార్న్- 25 టెస్టుల్లో 127
👉డేనియల్ వెటోరి- 21 టెస్టుల్లో 98
👉జేమ్స్ ఆండర్సన్- 32 టెస్టుల్లో 92.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు స్టార్క్, నాథన్ లియోన్ మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ కూహ్నెమన్ రెండు, ట్రవిస్ హెడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 229/9 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 257 పరుగులకు ఆలౌట్ అయింది.
చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్
Comments
Please login to add a commentAdd a comment