
ధావన్ మరో రికార్డు..
బర్మింగ్హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో వెయ్యి పరుగుల్ని వేగవంతంగా సాధించిన బ్యాట్స్మన్ గా భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భారత్ కే చెందిన సచిన్ టెండూల్కర్ రికార్డును ధావన్ సవరించాడు. అయితే ఇదే టోర్నీలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ధావన్ మరో రికార్డును నెలకొల్పాడు.
ఓవరాల్ చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన భారత్ ఆటగాడిగా ధావన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(655)రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ధావన్ 680 పరుగులతో ఉన్నాడు. మరొకవైపు ప్రస్తుత టోర్నీలో ధావన్ 317 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండటం మరో విశేషం. ఈ మ్యాచ్ లో ధావన్ 46 పరుగులు సాధించి తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు.