
ధావన్ దరువు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో మెరిశాడు. శిఖర్ ధావన్ 112 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ సాధించి సత్తాచాటుకున్నాడు. లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన బ్యాటింగ్ లో హవాను కొనసాగించాడు. తొలుత 69 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరిన ధావన్.. మరో అర్ధ శతకం సాధించడానికి 43 బంతులను ఎదుర్కొన్నాడు. దాంతో తన వన్డే కెరీర్ లో 10వ సెంచరీను సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టుకు శిఖర్ ధావన్-రోహిత్ శర్మ లు శుభారంభం అందించారు.ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా రోహిత్ శర్మ 58 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై శిఖర్ ధావన్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.
వీరిద్దరూ రాణించి చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు(నాలుగుసార్లు) నమోదు చేసిన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నారు.పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో వీరిద్దరూ 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. అయితే తాజాగా లంకేయులతో మ్యాచ్లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ ఘనతను నాల్గోసారి తన ఖాతాలో వేసుకుంది. మరోవైపురోహిత్-ధావన్ల జోడి మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. వరుసగా వన్డేల్లో భారత తరపున మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జో్డిగా సరికొత్త ఘనత సాధించింది. ఈ టోర్నీలో రెండు సెంచరీ భాగస్వామ్యాలతో పాటు అంతకుముందు ఆస్ట్రేలియాతో్ ఆడిన వన్డేలో శిఖర్-రోహిత్ ల జోడి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.
ఇదిలా ఉంచితే, లంకతో మ్యాచ్ లో రోహిత్ శర్మ తొలి వికెట్ గా అవుటైనప్పటికీ శిఖర్ మాత్రం మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. ధోనితో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 82 పరుగుల జత చేసిన తరువాత శిఖర్ (125; 128 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు.