సెంచరీకి చేరువలో రోహిత్‌కు నిరాశ..
దాయాదుల సమరంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు నిరాశ ఎదురైంది. జట్టుకు మంచి శుభారంభాన్నిచ్చి.. వడివడిగా సెంచరీకి చేరువైన రోహిత్ శర్మ నిరాశ ఎదురైంది. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ రన్నౌట్ అయ్యాడు.
అప్పటివరకు కాస్తా దూకుడు మీద కనిపించిన రోహిత్ షాదబ్ ఖాన్ వేసిన బౌలింగ్‌లో అనూహ్యంగా రన్నౌట్ అయ్యాడు. 36వ ఓవర్ నాలుగో బంతిని కోహ్లి ఔట్‌సైడ్ ఆఫ్‌కు తరలించి.. పరుగు కోసం రోహిత్‌ను పిలిచాడు. అప్పటికే బంతిని అందుకున్న బాబజ్ వెంటనే కీపర్‌కు బంతిని విసిరాడు. కీపర్ సర్ఫరాజ్ బంతిని అందుకొని వికెట్లను కూల్చాడు. అంతగా స్పష్టత లేకపోవడంతో నిర్ణయం థర్డ్ ఎంపైర్ చేతుల్లోకి వెళ్లింది. అయినప్పటికీ అదృష్టం రోహిత్ వైపు ఉన్నట్టు టీవీ రీప్లేలో కనిపించింది.
రోహిత్ బ్యాటును లైనును దాటినట్టు కనిపించినా అది గాలిలో ఉండటంతో బెన్‌ఫిట్ ఆఫ్ డౌట్ రోహిత్‌కే దక్కవచ్చునని భావించారు. కానీ అనూహ్యంగా ఎంపైర్ రోహిత్ రన్నౌట్ అయినట్టు ప్రకటించాడు. దీంతో సెంచరీకి చేరువైన రోహిత్ నిరాశగా వెనుదిరిగాడు. నిలకడగా ఆడిన రోహిత్ 119 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 పరుగులు చేశాడు.