
మెరిసిన భారత ఓపెనర్లు
బర్మింగ్హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అర్ధ శతకాలతో మెరిశారు. తొలుత రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా, ఆపై కాసేపటికి శిఖర్ ధావన్ అర్ధ శతకం సాధించాడు. ఆదిలో కుదురుకోవడానికి సమయం తీసుకున్న ఈ జోడి.. ఆ తరువాత పాకిస్తాన్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగారు. ఆ క్రమంలోనే ముందు 72 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్సర్ తో రోహిత్ హాఫ్ సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ 48 బంతుల్లో ఐదు ఫోర్లుతో అర్ధ శతకం నమోదు చేశాడు. ఇక్కడ రోహిత్ సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేయడం ఒకటైతే, ఈ ఇన్నింగ్స్ తొలి సిక్సర్ కూడా అదే కావడం మరో విశేషం.
మరొకవైపు వహాబ్ రియాజ్ వేసిన 20 ఓవర్లో ధావన్ ఫోర్లతో చెలరేగిపోయాడు. హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి దూకుడును ప్రదర్శించాడు. అటు తరువాత రెండు పరుగులు చేసి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి నిలకడగా ఆడుతుండటంతో భారత్ జట్టు 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది.