
కరాచీ: తమ ఇష్టానుసారం క్రికెట్ జట్లను ఎంపిక చేస్తున్న పాకిస్తాన్ సెలక్టర్లపై ఆ దేశ క్రికెటర్లు సల్మాన్ భట్, కమ్రాన్ అక్మల్‌లు మండిపడ్డారు. టాప్ లెవిల్ క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్ల ఎంపిక విధానం సవ్యంగా లేదంటూ విమర్శించారు. ఇక్కడ మరింత నిలకడను తమ సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవాలంటూ క్లాస్ తీసుకున్నారు. ఇందుకు టీమిండియా సెలక్షన్ కమిటీ ఎంపిక విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
'ఉన్నత స్థాయి క్రికెట్ ఆడేటప్పుడు నిలకడగా అవకాశాలు ఇవ్వాలి. ఇందుకు టీమిండియా సెలక్టర్లనే ఉదాహరణగా తీసుకోండి. భారత క్రికెటర్లకు పదే పదే అవకాశాలు దక్కుతుండటంతో వారు మెరుగైన ఆటతో దూసుకుపోతున్నారు. అందుకు రోహిత్ శర్మనే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక దశలో రోహిత్ శర్మ యావరేజ్ 25 నుంచి 30 మధ్యలో ఉండేది. కాకపోతే అతనిపై భారత సెలక్టర్లు నమ్మకం ఉంచి నిలకడగా ఛాన్స్‌లు ఇచ్చారు. దాంతో ఈ రోజు రోహిత్ శర్మ ప్రపంచం గర్వించే ఆటగాడయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లకు ఛాన్స్‌లు ఇచ్చేటప్పుడు మన దాయాది జట్టును చూసి నేర్చుకుంటే మంచిది' అని సల్మాన్ భట్ పేర్కొన్నాడు.
అతనికి జతగా కమ్రాన్ అక్మల్ కూడా గళం కలిపాడు. భారత క్రికెట్ సెలక్టర్లు మాదిరిగా నాణ్యమైన ఆటగాళ్లును పాకిస్తాన్ సెలక్టర్లు ఎంపిక చేయాలన్నాడు. ఈ క‍్రమంలోనే తమ దేశంలో దేశవాళీ టోర్నీలు ఆడేటప్పుడు పిచ్‌లు రూపొందించే విధానాన్ని అక్మల్ తీవ‍్రంగా తప్పుబట్టాడు. దేశవాళీ టోర్నీలకు సహజసిద్ధమైన పిచ్‌లను తయారు చేయకుండా పేలవమైన పిచ్‌లను తయారు చేస్తున్నారని విమర్శించాడు. ఇందుకు ఇటీవల జరిగిన క్వైద్ ఈ అజాం ట్రోఫీని అక్మల్ గుర్తు చేశాడు. ఈ ట‍్రోఫీలో భాగంగా కనీసం 20సార్లు జట్లు 100లోపు స్కోర్లకు ఆలౌటైన విషయాన్ని ప్రస్తావించాడు.