
నాలుగు రోజుల వ్యవధిలో 537 మంది తిరుగుముఖం
పాక్ నుంచి 850 మంది భారతీయుల రాక
చండీగఢ్/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్ నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలనూ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దాంతో గత నాలుగు రోజుల్లో అటారీ–వాఘా సరిహద్దు గుండా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు.
అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. కొందరు పాకిస్తానీలు తిరిగి వెళ్లేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరుచేసిన 12 రకాల వీసాల గడువును భారత్ రద్దుచేయడం తెల్సిందే.
దాంతో కొద్ది రోజులుగా పాకిస్తానీలు అటారీ–వాఘా బోర్డర్ వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. ఆ దారంతా వాహనాలు కని్పంచాయి. వారిని సాగనంపేందుకు వచ్చిన భారత బంధువులు ఉద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి. మెడికల్ వీసాపై వచ్చిన వారికి మాత్రం భారత్ వీడేందుకు మంగళవారం దాకా గడువుంది. కాగా, గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్‌లోనే ఉన్న పాకిస్తానీలను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం పేర్కొంది.
ఢిల్లీలో 5,000 మంది
ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారమివ్వాలని ఢిల్లీ హోం మంత్రి ఆశిష్ సూద్ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బిహార్ ప్రకటించింది. కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాల వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది.