
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ 130కి పైగా అణు ఆయుధాలతో పాటు ఘోరి, షాహీన్, ఘజ్నవి మిసైళ్ళను సిద్ధం చేసినట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిన పహల్గాం ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధూ నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక దీనంగా చూస్తోంది.
ఈ క్రమంలో హనీఫ్ అబ్బాసీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు. భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. యుద్ధం చేసేందుకు తాము సన్నంద్ధంగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా అణు ఆయుధాల్ని సిద్ధం చేశామన్నారు. ఆ అణు ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని, భారత్‌పై దాడి చేసేందుకేనని చెప్పారు.
"Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6
— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025
స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి సరఫరాను ఆపితే మనతో యుద్ధం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మిసైళ్ళు ప్రదర్శన కోసం కాదు. మన అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ బాలిస్టిక్ మిసైళ్ళు, అవన్నీ భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

అంతకుముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించిందని ఒప్పుకున్నారు. దాని ఫలితమే ఈ దుర్భర పరిస్థితులకు కారణమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.